Monday, April 3, 2023

🪔🪔 పలాయన మంత్రం తగదు🪔🪔

🪔🪔 పలాయన మంత్రం తగదు🪔🪔

🍁ప్రతి మనిషికీ జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదురవుతాయి. ఊహించని బాధలు, భయాలు చుట్టుముట్టి మనసుకు స్థిమితం లేకుండా చేస్తాయి. ఈ కష్టనష్టాలను భరించడంకన్నా ఏ అరణ్యాలకో వెళ్ళి స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, తీయని ఫలాలు ఆరగిస్తూ, చెట్టునీడలో హాయిగా జపధ్యానాలు చేసుకుంటే జీవితం సంతోషంగా సాగిపోతుందనే ఆలోచన- బాధ్యతలతో సతమతమవుతున్న మనిషి మెదడులో మొదలవుతుంది.

🍁బాధ్యతలను విస్మరించి, కర్తవ్యాన్ని మరచి మనశ్శాంతి కోసమో ముక్తి కోసమో జపతప సాధనల పేరుతో ఆశ్రమాలతో అరణ్యాలకో వెళ్ళారనుకుందాం. అక్కడ స్వచ్ఛమైన వాయువులు పీలుస్తున్నా ఆలోచనలు మాత్రం మనసును కుదురుగా ఉండనివ్వవు. మధురఫలాలు లభించినా బాధ్యతలు కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. చల్లని చెట్టునీడలో ఉన్నా మనసు అల్లకల్లోలంగానే ఉంటుంది. బాధ్యతల నుంచి తప్పించుకొని తిరగడంవల్ల మానవ జన్మకు సార్ధకత చేకూరదు.

🍁 మనసులో కామక్రోధాలు, రాగద్వేషాలు ఉన్నంతవరకు అరణ్యమైనా ఆశ్రమమైనా రణరంగమే. అవి లేనినాడు గృహమైనా తపోవనమే. అందువల్ల జీవితంలోని సవాళ్ల నుంచి తప్పుకోవడంకన్నా వాటిని | ధైర్యంగా ఎదుర్కొంటేనే మనిషిలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతాయి.

🍁చిన్న కష్టం వచ్చిందని, ఓటమి ఎదురైందని ఎక్కడికో పారిపోవాలనుకోవడం పిరికితనం. ఎప్పుడైనా ఎదురొడ్డి పోరాడినవారే అనుకున్నది. సాధిస్తారు. సమస్యల వలయం నుంచి బయటపడతారు. మానసిక బలహీనత చాలా హీనమైంది. అది మనిషికి కీడు చేస్తుంది. అటువంటి బలహీనత ఆవహించినప్పుడు ఎవరైనా వచ్చి ధైర్యం చెప్పడం వల్ల మనలో కొత్త శక్తి వచ్చినట్లు ఉంటుంది. ఆ వ్యక్తిలోని మంచి లక్షణాలను గుర్తు చేయడంవల్ల ఆ వ్యక్తి మళ్ళీ పుంజుకొని శక్తిమంతుడు కాగలుగుతాడు. అపహరణకు గురైన సీతను వెతికే బాధ్యతను హనుమంతుడికి అప్పగించాడు శ్రీరాముడు. 'నీవు మహా శక్తిమంతుడివి... బలశాలివి' అని రాముడు చెప్పడం వల్ల హనుమంతుడు మరింత శక్తిని పొందాడు.

🍁భగవంతుడు మనిషికి ప్రజ్ఞను ప్రసాదించాడు. శక్తిని, ఆలోచనా సామర్ధ్యాన్ని ఇచ్చాడు. సమస్యలు ఎదురైనప్పుడు ఆ భగవంతుడు ప్రసాదించిన శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. కొమ్మలు నరికినా సరే చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. సమస్యలకు భయపడి పారిపోకుండా ముందుకు సాగిపోవాలనే స్ఫూర్తినిస్తుంది.

🍁నిజానికి పరిష్కరించలేని సమస్యంటూ ఏదీ ఉండదు. ఉండాల్సింది సరైన ఆలోచన. పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకుసాగితే మనిషికి ఏదీ కష్టంగా అనిపించదు. మనిషికి కష్టనష్టాలు, మానసిక, శారీరక బాధలు ఎదురైనప్పుడు దైవం ప్రసాదించిన తత్వజ్ఞానాన్ని అలవరచుకోవాలి. ఆ జ్ఞానం వల్ల సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. అప్పుడు మనిషికి ఏదీ సమస్యగా అనిపించదు. అతడు అన్నివేళలా స్థిమితంగా ముందుకు సాగుతాడు.

🍁దైవానుగ్రహంవల్ల ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎలాంటి అవాంతరాలనైనా అధిగమిస్తాడు.🙏

- ✍️విశ్వనాథ రమ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment