_*"గరుడ పురాణం లోని... "*_
_*బృహస్పతి ప్రోక్త నీతిసారం*_
ఈ ప్రపంచంలో దోషం లేని వంశం, రోగ పీడితులు కాని మనుషులు, దుఃఖితులు కాని వారు, అహంకారాన్ని గెలువగలిగిన ధనవంతులు, దుర్జనుల వల్ల దెబ్బతిననివారు ఉండరు.
ఎచ్చోటనైతే వ్యక్తికి గౌరవం లభించదో, ఆదరించేవారుండరో, బంధుబాంధవులు లేరో, విద్యా లాభ అవకాశమే వుండదో అచ్చోటును వీలైనంత వేగం వదలిపోవాలి.
ధనసంచయం చేసేవాడు దానినెంత వఱకు రక్షించగలడో కూడా ఆలోచించుకోవాలి. రాజులు, చోరులు దాని జోలికి రాకుండా కాపాడుకోగలగాలి. అప్పుడైనా ప్రాణాలను పణంగా పెట్టి కొండొకచో అన్యాయానికి ఒడిగట్టి సంపాదించిన సొమ్ము వానితో పరలోకానికి వెళ్ళదు కానీ తత్సంపాదనకై వాడుచేసిన పాపాలు వానిని నరకం దాకానూ మరుజన్మల లోనూ కూడా అనుసరిస్తాయి. కాబట్టి అధర్మం, లోభం పనికిరావు. సాధారణంగా ఇటువంటి అధార్మికులూ, లోభులే మరుజన్మలో కడుపారగ కూడుగానీ తలదాచగ గూడు కానీ చలినాపగవలువలుగానీ లేని దరిద్రులుగా, రోగులుగా జీవనాన్ని గడుపుతుంటారు. వీరంతా దానం, ధర్మం లేని ఒకనాటి శ్రీమంతులే.
మనం ఇటువంటి వారు మనను యాచిస్తున్నపుడు మనకొక హెచ్చరిక చేస్తున్నారని అర్ధం చేసుకోవాలి. 'ఓయి మానవులారా. మీరు అన్యాయాలు చేసి, దానాలు చేయకుండా బతికేస్తే వచ్చే జన్మలో మాలాగే అడుక్కుతినాలి'
_*శిక్షాయంతి చయాచంతే దేహీతి కృపణా జనాః । అవస్థేయమదానస్యః మా భూదేవం భవానపి ॥*_
పీనాసివాని ధనం యజ్ఞాలకు ఉపయోగపడదు (వాడు చేయడు కాబట్టి) బ్రాహ్మణులను చేరదు (వాడివ్వడు కాబట్టి) చివరికది చేరేది రాజును (లాక్కుంటాడు కాబట్టి) లేదా దొంగను. (దోచుకుంటాడు కాబట్టి).
విద్యను నిరంతరం అధ్యయనమో, అభ్యాసమో చేసుకుంటూ వుండకపోతే దానిని మరిచిపోతాం. శక్తి కూడా అంతే.
దొంగని క్షమించడంగాని చిన్న శిక్ష వేసి ఊరి మీదికి వదలి వేయడంగాని కూడదు. వానికి సరైన శిక్ష మరణదండనే. దుష్టుడైన మిత్రుని దూరంగా వుంచాలి. ఎదురైతే పలకరించి ఎలాగో పారిపోవాలి. అదే వానికి శిక్ష. స్త్రీకి సరైన శిక్ష ఆమెను తన శయ్యపై కాకుండా వేరే ఒంటరిగా పడుకోబెట్టడం. బ్రాహ్మణునికి శిక్ష వానిని దేనికీ పిలవక పోవడమే.
పనిని పెంచడం ద్వారా భృత్యునీ, దుఃఖం కలిగించే సంఘటన వచ్చినపుడు బంధు బాంధవులనూ, విపత్కాలంలో మిత్రునీ, ఐశ్వర్యం నష్టమైపోయినపుడు స్త్రీనీ జాగ్రత్తగా గమనించక్కరలేకుండానే వారి రంగులు బైటపడతాయి.
_*జానీయాత్ ప్రేషణే భృత్యాన్ బాంధవాన్ వ్యసనాగమే । మిత్రమాపది కాలే చ భార్యాంచ విభవక్షయే ॥*_
స్త్రీకి పురుషుని కన్నా రెండింతలు ఆహారమూ, నాల్గింతలు బుద్ధీ, ఆరింతలు ఓపికా, ఎనిమిది రెట్లు కామ వాంఛా వుండాలనీ, వుంటాయనీ పెద్దలంటారు.
స్వప్నం వల్ల నిద్రపై విజయం లభింపదు. అనగా కలల వల్ల నిద్ర చెడుతుందే గానీ తీరదు. కామంతో స్త్రీని గెలుచుకొనుట అసాధ్యం. ఇంధనంతో అగ్నిని తృప్తిపఱచలేము. మద్యంతో దాహాన్నీ తీర్చలేము. స్త్రీకి సౌకర్యాలను కలిగిస్తున్నకొద్దీ ఆమెకు కోరికలు పెరిగిపోతుంటాయి. కఱ్ఱముక్కలను వేస్తున్న కొద్దీ అగ్ని మరింత రాజుకుంటుంది కదా! నదులు తనలో కలుస్తున్న కొద్దీ సముద్రునికి దాహమూ అలాగే పెరిగిపోతుంటుంది.
ప్రియవచనాలు, కోరికల సిద్ధి, సుఖాలు, పుత్రులు - ఇలాంటివన్నీ వస్తున్నకొద్దీ ఇంకా కావాలనే అనేవారే తప్ప ఇక చాలు అనేవారుండరు.
మోక్షమనేది వనాలలోనో పర్వతాలపైననో మాత్రమే దొరకదు. తనకు ధర్మశాస్త్రాలు విధించిన కర్మను తత్పరతతో దైవార్పణంగా చేస్తూ, గౌరవంగా బతకడానికి చాలినంత మాత్రమే ధనాన్నార్జిస్తూ, శాస్త్ర చింతనపై రక్తినీ, తన భార్యపై మాత్రమే అనురక్తినీ పెంచుకుంటూ జితేంద్రియుడై, అతిథి సేవానిరతుడై జీవనాన్ని గడిపే సత్పురుషుడు ఆయువు తీరినంతనే స్వంత ఇంటి నుండే మోక్షపదాన్ని చేరుకోగలడు.
స్వర్గం ఎక్కడో ఆకాశంలో మాత్రమే ఉందనుకోడానికి లేదు. సత్కర్మ నిరతుడైన పురుషునికి తన లోగిట్లోనే అనుకూలవతి, సుందరి, సముచితాలంకార భూషిత, ఆరోగ్యవంతురాలు అయిన భార్యా, ఎవరినీ యాచించకుండా పీడించకుండా బతుకు జరిగే వెసులుబాటూ వుంటే అదే భాగ్యము, అదే స్వర్గము.
స్వభావసిద్ధంగానే ధర్మ విరుద్ధంగా పతికి ప్రతికూలంగా వుండే స్త్రీలు దానానికీ మానానికీ శాస్త్రాలకీ శస్త్రాలకీ లొంగరు. (వారితో బ్రతకవలసిరావడమే నరకం)
_*న దానేన న మానేన నార్జవనే న సేవయా । న శస్త్రేణ న శాస్త్రేణ సర్వథా విషమాః స్త్రియః |*_
విద్యార్జన, ధనసంగ్రహం, పర్వతారోహణం, అభీష్టసిద్ధి, ధర్మాచరణం, అయిదింటినీ ఓపికగా క్రమక్రమంగా సాధించుకోవలసి వుంటుంది. ఈ
.....
దేవపూజనాదిక కర్మలూ, బ్రాహ్మణులకిచ్చే దానమూ, సద్విద్య మంచిమిత్రుడూ ఇవి మానవునికి జీవిత పర్యంతమూ సహాయకారులవుతాయి.
బాల్యకాలంలో విద్యనీ, యువావస్థలో ధనాన్నీ అనుకూలవతియైన పత్నినీ సంపాదించుకోలేని వారు సుఖవంతమైన జీవితాన్ని గడపలేరు.
విద్యార్జన ఒక ఉపాసన. ఆ ఉపాసనా కాలంలో మనిషికి భోజనాన్ని గురించిన ఆలోచనరాకూడదు. విద్య కోసం, అవసరమైతే, గరుత్మంతుని వలె, ఎంత దూరమైనా పోవాలి. వీలైనంత వేగంగా పోవాలి.
శుష్కతర్కం వల్ల ఎవరికీ ప్రయోజనముండదు. సిద్ధాంత స్థాపనము కేవలం తర్కమాత్రాన జరగదు. ధర్మం కూడా తర్కము ననుసరించి వుండదు. పరిస్థితులను బట్టి ధర్మం మహర్షులచే ఆదేశింపబడుతుంది.
_*తర్కే ప్రతిష్ఠాశ్రుతయో విభిన్నాః నాసావృషిర్యస్య మతం న భిన్నం । ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం మహాజనోయేన గతః సపంథాః ॥*_
ఆకారం, సంకేతం, గతి, చేష్ట, మాట, కనులు, ముఖము - మనిషి యొక్క అంతః కరణ వీటి ద్వారా బయటపడిపోతూనే వుంటుంది. వీటిని బట్టి అవతలివాని అసలు రంగుని కనుగొని అవగతం చేసుకోగలిగిన వాడే నిజమైన విద్వాంసుడు. జంతువులలో గుఱ్ఱానికీ, ఏనుగుకీ ఈ శక్తి కొంత వఱకూ వుంటుంది."
(అధ్యాయాలు-108,109)
No comments:
Post a Comment