Friday, June 28, 2024

 మంత్రసిద్ధి ఎప్పుడు?

”చాలా సంవత్సరాల క్రితం దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి పీఠానికి మహాత్ముడైన శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారు పీఠాధిపతిగా ఉండేవారు. ఒకరోజు ఆ ప్రాంతం వాడైన ఒక శిష్యుడు వారి దర్శనార్థం వచ్చాడు.”

“వారికి సాష్టాంగం చేసి, తను తెచ్చిన జామ పళ్ళను వారికిచ్చాడు.”

“రా ఎలా ఉన్నావు? చెప్పు నీకేం కావాలి?” అని ప్రేమతో పలకరించారు. 

”స్వామి, నాకు మా గురువు గారు ఉపదేశించిన మంత్రాన్ని నేను చాలా సంవత్సరాలుగా జపిస్తున్నాను. కాని నాకు మంత్ర సిద్ధి కలిగిందో లేదో తెలియడం లేదు. అది తెలుసుకోవడం ఎలా?” అని వినయంగా అడిగాడు. 

స్వామి వారు వెంటనే “ఆత్మార్థం కోసం నువ్వు చేస్తున్న జపం కొనసాగించు. ఆ మంత్ర అధిష్టాన దేవత నీకు ఫలితాన్ని కచ్చితంగా ఇస్తుంది”

ఆ శిష్యుడు స్వామి వారి మాటలకి తృప్తి పడలేదు. “లేదు స్వామి నేను నాకు కలిగిన ఫల సిద్ధి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరే ఒక దారి చూపించాలి మిమ్మల్ని వేడుకుంటున్నాను.” అని అన్నాడు. 

స్వామి వారు ఆ శిష్యుడి మనస్థితిని అర్థం చేసుకుని దగ్గరకు పిలిచి “దిగులు పడకు. దానికి ఒక మార్గం ఉన్నది” అన్నారు. 

”ఉన్నదా? ఐతే నాకు ఆ విషయం దయచేసి తెలియపరచండి స్వామి” అని అడిగాడు. 

నృసింహ భారతీ స్వామి వారు నవ్వుతూ “ప్రతి రోజూ నువ్వు జపం చేసుకునే ముందు చక్క పీట పైన వడ్లు పరిచి దాని పైన ఒక వస్త్రం కప్పి, దాని పైన కూర్చొని జపం చెయ్యి. రోజూ ఇలాగే చెయ్యి. ఏరోజైతే ఆ పీట పైనున్న వడ్లు వేయించినట్లు పేలాలుగా మారతాయో ఆ రోజు నీకు మంత్ర సిద్ధి కలిగినట్టు. అర్థం అయ్యిందా?” అని చెప్పారు.

శిష్యుడు అర్థం చెసుకున్నాడు కాని తనను సముదాయించడానికే ఇలా చెప్తున్నారేమో అని కాస్త గందరగోళ పడ్డాడు. 

”స్వామి వారు నన్ను క్షమించాలి. కేవలం తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. జగద్గురు స్థానంలో ఉన్నవారిని పరీక్షిస్తున్నానని తప్పుగా భావింపవలదు. పీట పైన వడ్లు చల్లడం.. వాటిని వస్త్రంతో కప్పడం.. అవి వేగడం.. ”

అతను పూర్తి చెయ్యకమునుపే స్వామి వారు నవ్వుతూ “నాకు అలాంటి అనుభవం కలిగిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నావు కదూ?“ అని ఒక చెక్క పీట తెప్పించి తూర్పు అభిముఖంగా వేయించారు. దాని పైన వడ్లు పోయమని చెప్పారు. తరువాత స్వామి వారు దాని పై వారి వస్త్రాన్ని కప్పి పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకున్నారు. ఈపాటికి అక్కడకు చాలా మంది వచ్చారు. 

”కేవలం కొన్ని క్షణాల తరువాత వడ్లు టప్ టప మని పగులుతూ పేలాలుగా మారటం వినిపించింది. కొద్దిగా పొగ కూడా కనిపించింది. స్వామి వారు పైకిలేచి ధాన్యం పై పరచిన వస్త్రం తీయగానే పీట పైన తెల్లని మల్లెపూలవలే ఉన్న పేలాలు కనపడ్డాయి. అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు.“ 

శృంగేరిజగద్గురువైభవం

No comments:

Post a Comment