*మాతృప్రేమ*
(నేటి శుక్రవారం స్పెషల్ స్టొరీ)
*మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు..!*
*శివాజీ రాయగఢ్ కోట శత్రువులకు అభేద్యంగా కట్టుదిట్టంగా ఉండేది.*
*ప్రొద్దున ఆఱింటికి తెఱిచిన కోట తలుపులు రాత్రి తొమ్మిదిగంటలకు మూయబడుతాయి.*
*ద్వారం మూసి ఉన్న సమయంలో చీమకూడా లోనినుండి బైటికి వెలుపల నుండీ లోనికి రాకూడదు.*
*ఇది ఛత్రపతి శివాజీ ఆజ్ఞ!*
*రాజ్య రక్షణార్థం ఇట్టి కట్టుదిట్టాలు తప్పలేదు.*
*ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి తొమ్మిది తరువాత కోట ద్వారం తెఱవబడదు.*
*’హీరాకానీ’ అనే గ్రామవాసి రోజూ కోటలో ఉన్న అధికారులకు, సైనికులకు పాలుపోయటానికి వచ్చేది.*
*అందఱికీ తనకు చేతనైన సహాయం చేసేది.*
*ఇలా ఉండగా ఒక రోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకానీ. ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది. ఇంటికి వెళదామని సమయంచూస్తే తొమ్మిది దాటిపోయింది.*
*పరుగులుతీసి కోటగుమ్మం చేరింది హీరాకానీ.*
*కావలి వాళ్ళు హీరాకానీ చాలా మంచిది అని అభిమానం ఉన్నా రాజాజ్ఞ ధిక్కరించలేక తలుపులు తీయలేదు.*
*“అయ్యో! ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలివేస్తుంది. వాడికి పాలివ్వాలి” అని ప్రాధేయపడింది.*
*హీరాకానీ మీద జాలి పడిన కావలి వాళ్ళు “తల్లీ రాజాజ్ఞ మేము మీఱలేము. ఈ ఒక్క పూటకి ఈ సైనికుని ఇంట్లోనే పడుకో. ఉదయం అవ్వంగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము” అని ఊఱడించినారు.*
*మఱునాడు ప్రొద్దురాగానే కావలివాళ్ళు హీరాకానీని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమఱచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు.*
*అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్ద హీరాకానీ పాల పెరుగు కుండ కనిపించింది.*
*పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోటమీద రాయికి వ్రేలాడుతూ కనిపించింది.*
*ఆశ్చర్యపోయిన కావలివాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు.*
*ఒక స్త్రీ అభేద్యమైన కోట అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా? అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ.*
*ఇంతలో ‘హీరాకానీ’ రానేవచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడి “అయ్యా! రాత్రి పాలకై ఏడుస్తున్న నా బిడ్డడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారీ తోచలేదు. కోటగోడలెలా దాటానో నాకే తెలియదు. కొండలూ గుట్టలూ తుప్పలూ ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్డ ఒక్కడే నాకు జ్ఞప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభూ!” అని ప్రార్థించింది హీరాకానీ.*
*శత్రువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. ‘హీరాకానీ’కి అందఱూ చూస్తుండగా సాష్టాంగ వందనం చేశాడు! “అమ్మా! మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోటగోడలెంత? ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను” అని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ.*
*ఇప్పటికీ ఈ బురుజు ‘హీరాకానీబురుజు’ అనే పిలవబడుతోంది.*
No comments:
Post a Comment