💐10శ్రీ లింగ మహాపురాణం💐
🌼నియమం,జపము,స్వాధ్యా
యము, ప్రాణాయామము - యోగ వివరాలు🌼
#పదవ భాగం#
అష్టాంగ యోగంలో యమము గురించినిన్నచదువుకున్నాము. మిగిలిన వాటి గురించి తెలుసుకుందాం.
నియమం: శౌచం, దానం, యజ్ఞం, తపస్సు, స్వాధ్యాయం, ఇంద్రియ నిగ్రహం, వ్రతం, ఉపవాసం, మౌనం, స్నానం అనేవి పది నియమాలు. అలాగే వేటి మీద ప్రత్యేకంగా అభిమానం పెంచుకోకపోవడం కూడా నియమం అవుతుంది.
శౌచం అనేది బాహ్యశౌచం, అంతర శౌచం రెంఢు విధాలుగా ఉంటుంది. బాహ్య శౌచం ఎంత ముఖ్యమో అంతర శౌచం కూడా అంత ముఖ్యమైనది. కనుక శివోపాసన చేసేవారు బాహ్య స్నానాలతో పాటు అంతర (మానసిక) స్నానాలు కూడా ఆచరించాలి. బాహ్య శౌచం ఆగ్నేయం, వారుణం, బ్రాహ్మం అని మూడు రకాలుగా ఉంటుంది.
ఆగ్నేయం అంటే అగ్నితో చేసేది. వారుణం అంటే నీటితో చేసేది. బ్రాహ్మం అంటే బ్రహ్మ స్నానము. ఈ బాహ్య స్నానములు చేసిన తరువాత ఆంతరిక స్నానము ఆభ్యాసము చేయాలి. పవిత్రమైన పుణ్యతీర్థాలలో స్నానాలు చేసినా అంతశౌచాన్ని ఆచరించకపోతే పవిత్రుడు కాలేదు.
అంతర శౌచము అంటే ఆత్మజ్ఞానం అనే నీటితో మనస్సుని స్నానము చేయించాలి. పిదప స్థిరమైన వైరాగ్యం అనే మట్టిని సూక్ష్మ శరీరానికి (మనస్సుకి/చిత్తానికి) పూసుకోవాలి. మానసికంగా పరిశుద్దముగా ఉన్న వ్యక్తికే సిద్ది ప్రాప్తి కలుగుతుంది.
చాంద్రాయణ వ్రతము వంటి పవిత్ర వ్రతములను విధివిధానాలతో చేయడమే తపము అవుతుంది.
స్వాధ్యాయము అంటే ఓంకార మంత్ర జపం. ఇది మూడు విధాలుగా ఉంటుంది. మొదటిది వాచికం మౌఖికంగా అంటే నోటి ద్వారా బయటకు వినపడేలా జపించటం. రెండవది ఉంపాశువు అంటే పెదవులను కదిలిస్తూ బయటకు వినపడకుండా మంత్రజపం చేయడం. మూడవది మానసికం అంటే మంత్రాన్ని మనస్సులో జపించడం. మూడింటిలో మానసికం శ్రేష్టమైనది కనుక మనస్సులో పంచాక్షరి జపము చేయాలి.
మానసిక శారీరక వాచికముల ద్వారా శివ ప్రణవ ధ్యానము,, గురువు పై అచంచలమైన భక్తి, విషయసుఖాల పై ఆకర్షితమయ్యే ఇంద్రియాలను నిగ్రహించడాన్ని ప్రత్యాహారం అంటారు. శివానుగ్రహం కోరుకునేవారు దీనిని అభ్యాసం చేయాలి.
మనస్సుని స్థిరపరచి ఒకే విషయం పై ఏకాగ్రతతో ఉంచడం ధారణ అవుతుంది. ధారణ వలన ధ్యానం, ధ్యానం వలన సమాధి సిద్థిస్తాయి. అన్యోన్యమైన ఏకాగ్రతతో పరమేశ్వరుని దివ్య రూపాన్ని తలచడమే ధ్యానం అవుతుంది.
ధ్యానము సమాధి మొదలైన వాటికి ప్రాణాయామం మూలము. శరీరం లోపల ఉండే వాయువు ప్రాణము అవుతుంది. అటువంటి వాయువుని నిరోధించుట యమము అవుతుంది. శరీరంలోని వాయువులను నియంత్రించుటకు, నిరోధించుటకు చేసే అభ్యాసం ప్రాణాయామము అవుతుంది.
ప్రాణాయామము మందము, మధ్యమము, ఉత్తమము అని మూడు విధాలుగా ఉంటుంది. ప్రాణ అపాన వాయువుల నిరోధమే ప్రాణాయామం. ఒక రెప్పపాటు కాలాన్ని మాత్ర అంటారు. పన్నెండు మాత్రల కాలం పాటు చేసే వాయు నిరోధం మంద ప్రాణాయామం అవుతుంది. ఇరవై నాలుగు మాత్రల కాలం చేసే వాయు నిరోధం మధ్యమం అవుతుంది. ముఫైఆరు మాత్రల కాలం చేసే వాయు నిరోధం ఉత్తమం అవుతుంది.
కనిష్ట (మంద) ప్రాణాయామం చేయడం వలన చెమట పడుతుంది. మధ్యమ ప్రాణాయామం చేయడం వలన శరిరం వణుకుతుంది. ఉత్తమ ప్రాణాయామం చేయడం వలన శరీరం తేలికపడి పైకి లేస్తునట్టు ఉంటుంది.
ప్రాణాయామం చేస్తుంటే నిద్ర, కళ్ళు వాలిపోయి మైకం కమ్ముట, వివిధ రకాల ధ్వనులు వినిపించడం వలన రోమాంచము (ఉత్తేజము) కలుగుట, శరీర చలనం, చెమట పట్టి సృహ తప్పుతున్నట్టు అయితే అది ఉత్తమ ప్రాణాయామం అవుతుంది.
https://chat.whatsapp.com/CW3KU11WsA46NEQ246bxJc?mode=ems_copy_t
ప్రాణాయామము రెండు రకాలుగా ఉంటుంది. జపముతో కలిపి చేసే ప్రాణాయామము సగర్భము అవుతుంది. జపము లేకుండా చేసిన ప్రాణాయామం అగర్భము అవుతుంది. సరైన అభ్యాసం చేత ప్రాణము (వాయువు), చిత్తము (మనస్సు), వాక్కు నియంత్రించబడి, శరీరములోని దోషాలు పోయి సాధకుని శరీరము నిర్మలం అవుతుంది. శ్వాస పై నియంత్రణ పొందిన సాధకుడు దివ్య శక్తులు పొందగలుగుతాడు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
లోకా:సమస్తాః
సుఖినోభవన్తు
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
No comments:
Post a Comment