Saturday, March 28, 2026

 (560) (03.03.2026)

అమ్మ అవుతున్నానని తెలిసి చేసుకోలేనని పుట్టింటికి పంపినారు
పెళ్ళై నప్పటి నుంచి 24 గంటలు నా గురించే ఆలోచిస్తున్నారు
ఎందుకండి నేనంటే మీకు అంత ఇష్టము 
ఈ రోజు వరకు నాకు రానివ్వకున్నారు ఎటువంటి కష్టము //

ఉదయానే లేవాల్సి వస్తుందని
ఇంటి పనిలో అలిసి పోతానని
ఇపుడు సుఖపడితే పురుటి తరువాత కష్టపడవచ్చని
అపుడు నిదుర లేని రాతిరులు గడపాల్సి వస్తుందని //

నా గురించి ఎంత చక్కగా ఆలోచించినారు
ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు
ఇంతకు మించిన అదృష్టం ఏమున్నది
ఆ దేవుని ఇంతకన్నా కోరేది ఏమున్నది //

వేవిళ్ళ వేళ మామిళ్ళు తినాలనిపిస్తే
పుట్టినింటి వారు గుర్తుకు వస్తే
ప్రతి చిన్న కోరిక తీర్చినారు
నను కనుపాపలా చూచుకున్నారు //

ఏదో ఒక సమయంలో చరవాణిలో నను పలకరిస్తూనే ఉన్నారు
నా ఆరోగ్యం గురించి అడుగుతూనే ఉన్నారు
పెళ్ళికి ముందు నేను ఇంతలా ఊహించలేదు
ఇంత ప్రేమగా చూచుకునే భర్త దొరుకుతాడని కల గనలేదు //

నేను ఏనాడు నగ-నట్రా మీ నుంచి కోరుకోను
ఆస్తులు-అంతస్తులు కొనమని అడగను
నా ఊపిరి ఉన్నంత వరకు మీ ప్రేమనే కోరుకుంటాను
మీ హృదయంలో కొంత చోటు మాత్రం అడుగుతాను //

ఆ దేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమంటే
మరుజన్మలో కూడా మిమ్మల్ని భర్తగా కోరుకుంటా
మీరు నా ఎదురుగా నిలబడి మనసులోని మాట చెప్పమంటే
మీ ఊపిరి ఉన్నంత వరకు మీ ప్రేమను నాకే పంచమంటా //

మధిర వెంకట రమణ, హైదరాబాద్

No comments:

Post a Comment