రాముడు నడిచిన దారి...
చెప్పిన రాముడి గురించే ఎన్నిసార్లు చెబుతారన్న ప్రశ్న ఎదురైంది- మురారి భట్టుకు! 'జగ తినట్టి గుణోజ్జ్వలుడైన నాయకుడు- మరొకరు దొరికేంతవరకు! అని బదులిచ్చాడాయన. అది అసంభవమని తేలిపోయింది. రాముడికి సాటి మరొకరు లేరనే విషయాన్ని 'గడకట్టి మత్త వేదండమునెక్కి... మరీ చాటింపు వేశాడు కంచర్ల గోపన్న. కొడుకుగా సోదరుడిగా పతిగా ప్రభువుగానే కాదు, మనిషిగా తోటివారిపట్ల చూపాల్సిన మానవీయతను, మహో న్నత సంస్కారాన్ని రాముడీ జాతికి నేర్పించాడు. మనుగడకు విలువలను నిర్దేశించాడు. రాముడి కారణంగా 'చట్రాతికి కల్గెపావనము... శిలగా పడి ఉన్న అహల్యకు అఖండ మైన పవిత్రత చేకూరింది. శత్రుకూటమిలోని విభీషణుడికి మహారాజయోగం పట్టింది. జటాయువుకు పుణ్యలోకాలు సిద్ధించాయి. వానరజాతి మొత్తానికి గౌరవం దక్కింది. తన కారణంగా పదిమందికి మేలు జరగడంకన్నా మనిషి జన్మకు ధన్యత మరొకటి ఉండదు. వీధి గడప దీపమనే మాటకు నిలువెత్తు రూపం- రాముడు. జీవుడు దేవుడెలా అవు తాడో రామాయణం నిరూపించింది-రామగాథ ద్వారా!
ప్రశంసించేవారికి ప్రశ్నించేవారికీ సైతం ప్రాచుర్యాన్ని ప్రసాదించిన వాల్మీకి రచన లోకానికొక లోకోత్తర మర్యాదా పురుషోత్త ముణ్ని పరిచయం చేసింది. 'ఎవని తలంపు కష్టకాలాల్లోనూ సుఖంగా తోస్తుందో- అతడే మనకు నిజమైన స్నేహితుడు' అన్నాడు భర్తృహరి. రాముడు సరిగ్గా అలాంటి స్నేహితుడు. అందుకే మన ఇంట్లో మనిషై పోయాడు. పానుగంటి మాటల్లో చెప్పా లంటే- 'వీధి పురాణంపు వేదికపై నీవు! యక్షగానపు చిందులందు నీవు! దృశ్యప్రబం ధాల తెరల సందుల నీవు, మృతి వార్త శ్రుతి బడ్డ మరల నీవె...' అన్నింటా ఆయనే, అన్నింటికీ ఆయనే. ఆత్మసఖుడన్న మాటకు అర్థమూ ఆయనే! చరిత్రలో నిలిచేపోయే వారెందరో ఉండవచ్చు, కానీ శీలసంపదతో, మానవత్వపు విలువలతో జాతి గుండెల్లో గుడి కట్టించుకున్న ఒకే ఒక్కడు- రామభద్రుడు!
'అయనం' అంటే గమనం. రామాయణం- రాముడు నడిచిన దారి! ఆ దారిలో రామచ ర్యలను అనుసరించేవారంతా రాముడికి దగ్గరవుతారు. 'రాముడు నీకు తెలియకపోయినా, నువ్వు రాముడికి తెలియకపోయినా- నీ జన్మ వ్యర్థం' అన్నారు వాల్మీకి. 'రామ శబ్దజ్యో తిని వెలిగించు నీ నోటి చివర... నీ దేహం దేహళీ (వీధిగడప) దత్తదీపం అవుతుంది నీ కళ్లముందర అన్నాడు తులసీదాసు. 'సల్లలిత ప్రతాప గుణసాగరుడై విలసిల్లిన రామ నర పాలకునిన్ స్తుతి చేతును' అంది మొల్లమాంబ. రాముడి స్వరాజ్యపాలన- సురాజ్యపాల నకు ఉజ్జ్వలమైన నమూనా. అందుకే పరిపాలన గురించి ప్రస్తావన. ఎన్ని కథలు... ఎలాంటి అమోఘ కృతులు... ఎంతటి మహత్తరమైన సారస్వతం... సృష్టిలోని సమస్త కళారూపాలను తనవైపు ఆకర్షించుకుని ఇందుగలడందు లేడన్నట్లుగా లోకంలో రాముడు త్రివిక్రముడైపోయాడు. ఆయన ప్రభావానికి అవధులు లేకుండా పోయాయి. ఆ విస్తృతిని గమనించి విస్తుపోయిన ఆరుద్రకు 'రామాయణ కవుల సంఖ్యను తేల్చడం కన్నా ఆకాశంలో నక్షత్రాలను లెక్కించడం తేలిక అనిపించింది. అలాంటి రాముడి పుట్టినరోజు, ఆయన సీతమ్మను చేపట్టిన రోజూ- ఈరోజే!
ఎర్రాప్రగడ రామకృష్ణ
No comments:
Post a Comment