శ్రీకృష్ణదేవరాయలు సాక్షాత్తూ మహావైభవోపేతమైన సామ్రాజ్యానికి చక్రవర్తి అయినా "ఆముక్తమాల్యద"లో సామాన్య రైతులు, నిరుపేదల జీవితాలను చాలా సూక్ష్మంగా వర్ణించగలిగాడు. యుద్ధాలు, పరిపాలన, కావ్య రచన వంటివాటిలో మునిగితేలిన ఆయనకు ఈ పరిశీలనకు వీలు ఎలా దొరికింది?
శ్రీకృష్ణదేవరాయల వ్యక్తిత్వం గురించీ, ఆయన దినచర్య గురించీ తెలుసుకోవడానికి ఉపయుక్తమైన గ్రంథాలుగా రెండింటిని చెప్పుకోవచ్చును. ఒకటి ఆయన స్వయంగా రచించిన ఆముక్తమాల్యద. రెండవది విశ్వనాథనాయనయ్యవారి స్థానాపతి రచించిన రాయవాచకం. రాయవాచకం రచనా కాలం గురించి విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈ పుస్తకం శ్రీకృష్ణదేవరాయల గురించి చాలా విషయాలు తెలుసుకునేటందుకు ఉపయోగపడుతుంది.
శ్రీకృష్ణరాయలకి రాత్రి పట్టణసంచారం చేసే అలవాటు ఉన్నట్టుగా గ్రంథం తెలుపుతుంది. రాత్రి గస్తీ తిరగడానికీ, అల్లర్లు కానీ దోపిడీలు కానీ దొంగతనాలు కానీ జరగకుండా చూడడానికి తలారులు ఉండేవారు. ఆ తలారుల అధ్యక్షుడు జంగమయ్య. తాను స్వయంగా పట్టణ సంచారం చేసిన రాత్రి గడిచాక మరునాడు రాయలవారు జంగమయ్యని పిలిచి ప్రశ్నలు వేసేవాడు. ఫలానా వీధిలో ఫలానా ఇంటి ఎదుట ఏమి జరిగింది అని అడిగేవాడు. తాను చూసినది జంగమయ్య చెప్పినది ఒకటే అయితే సరే. లేనిపక్షంలో హెచ్చరించే వాడు. స్వయంగా ప్రజల జీవితాలను వారి కష్టసుఖాలను రాయలు పరిశీలించేవారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ.
పట్టణ సంచారమే కాక గ్రామాలలో కూడా రాయల వారు తిరిగి ఉండే అవకాశం ఎక్కువ. దండయాత్ర సందర్భంలో కూడా ఎక్కడెక్కడ ఆగితే అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలనూ, సామాన్య ప్రజల జీవితాలనూ వారు పరిశీలించేవారు అని దృఢంగా నమ్మవచ్చు. ఆ కారణంగానే శ్రీకృష్ణదేవరాయలకి సామాన్య ప్రజల, రైతుల జీవన విధానము, వారి ఆహారము మొదలైనవన్నీ తెలిసి ఉంటాయి.
ఇక ప్రశ్నతో అంతగా సంబంధం లేని విషయం. ఆముక్తమాల్యదలో విష్ణుచిత్తుడు చేసిన సమారాధనకు సంబంధించిన ఆహారం గురించిన పద్యాలు నాకు చాలా ఇష్టం. వాటిని నేను చదువుకుంటూ ఉంటే మా పిల్లలు శ్రీకృష్ణరాయలు రాజ్యం చేసాడా వంటలు చేశాడా అని నన్ను వెక్కిరించేవారు. మహారాజు అయేవాడికి చతుష్షష్టి కళలలో ప్రవేశం ఉండాలన్నది ప్రాచీన భారత రాజనీతి.సూర్యుని వద్ద వరంగా అక్షయపాత్రను పొందిన ధర్మరాజు అడవిలో మొదటి వంట తనే చేసేడట.
కాబోయే రాజుగా అన్ని విద్యలూ నేర్చిన శ్రీకృష్ణరాయలకు అన్ని వర్గాల ప్రజల ఆహారంతోనూ వండే విధానంతోనూ కూడా పరిచయం ఉండే ఉంటుంది. నాలుగైదు పొగపిన కూరలతో చేసిన వైష్ణవుల సమారాధన అయితేనేమి, లెక్కపెట్టలేనన్ని పళ్ళతో రాజ పురోహితుడు ఇంటిలో ఇవ్వబడిన (నేటి భాషలో) ఫ్రూట్స్ సలాడ్ అయితేనేమి, మామిడికాయలతో కలిపి వండిన చేపల కూర అయితేనేమి, బీద రైతు ఇంట్లో గురుగు, చెంచలి, తుమ్మి మొదలైన ఆకులతో వండిన ఆహారమైతేనేమి ఆయనకు తెలియకుండా ఉండదు.
ఆముక్తమాల్యద వంటి విజ్ఞాన సర్వస్వం తెలుగు కావ్యాలలో మరియొకటి లేదేమో
No comments:
Post a Comment