*వేసవి_జ్ఞాపకాలు*
వేసవి అంటే కొంతమందికి ఒక సీజన్
వేసవి అంటే మరికొందరికి ఎండల భయం
కానీ ఒకతరం, అంతకు ముందువారికదో జ్ఞాపకాల దొంతర..ఆనందాల జాతర
మార్చి చివరి వారం వచ్చేసరికి సిలబస్ అయిందని చప్పట్లు కొట్టినప్పుడు వేసవి సెలవుల చిత్రానికి ఫస్ట్ లుక్ పోస్టర్ పడేది. ఇక ఒంటిపూట బడులు అదే చిత్రానికి ట్రైలర్ లాంటివి. ఒంటిపూట బడి ఉదయం 8 గంటలకే మొదలయ్యి 2 గంటలకి అయిపొయేది.తీక్షణ ఎండల నుండి రక్షణ కోసమన్నమాట.
ఐసోపాఖ్యానం (మొదటి-ఆఖరి అధ్యాయం)
స్కూల్ ఇంటర్వెల్లో అమ్మే పుల్లఐస్, ఐస్ క్రీం కోసమైనా వేసవి వస్తే బావుండుననిపించేది. ఎందుకంటే మిగతా సీజన్లో జలుబు చేస్తుందనో, గవదబిళ్ళలు వస్తాయనో ఐసులు తిననిచ్చే వారు కాదు మరి. పుల్ల ఐసులు సైకిల్ వెనకాల క్యారియర్ కి కట్టిన రేకు డబ్బాలో పొందికగా, దొంతరగా పేర్చి ఉండేవి అందులో ద్రాక్ష ఐస్, మేంగో, సేమ్యా, పాల ఐస్ అని రకరకాల తేడాలు ఉండేవి. మేంగో, ద్రాక్ష ప్రీమియం రకం అంటే అర్ధ రూపాయి అన్నమాట. అవి క్రికెట్ బ్యాట్ ఆకారంలో ఉండేవి. సేమ్యా ఐస్ మరియు పాల ఐస్ స్థూపాకారంలో ఉండేవి. ఇవి పావలా. సేమ్యా ఐస్ కి పై భాగంలో సేమ్యా, సబ్జా గింజలు కలిపి ఉండేవి తలమీద జుట్టులా.
పాల ఐస్ మాత్రం విష్ణు మూర్తి ఉండే పాల సముద్రంలోని పాలతోనే చేసారేమో అన్నట్టుగా తెల్లగా మెరిసిపోతూ (మిడిసిపడుతూ కూడా) ఉండేది. పాల ఐసుతో వచ్చిన చిక్కేమిటంటే రుచిలో రారాజయినా తొందరగా తినకపోతే కరిగిపోయి కన్నీరు తెప్పించేది. ఏమాటకామాటే చెప్పుకోవాలి..పుల్ల ఐస్ తినటం కూడా ఒక ఆర్టు(64 కళలు కాన్సిస్ట్యూట్ చేసే టైంకి పుల్ల ఐస్ కనిపెట్టలేదు కాబట్టి లిస్టులో లేదంతే)..ఐసుని తలకిందులుగా పట్టుకుని తలని ఊర్ధ్వ ముఖంగా పెట్టి జుర్రుకుంటూ తినాలి. లేకపోతే చేతుల నిండా కారిపోతుంది.
(చేతులు పాడవుతాయని కాదు..ఐసు వేస్టవుతుందని 😂)
జీవితం క్షణ భంగురం నాయనా అని ప్రవచనాలు వింటుంటే అదేదో జీవితం పుల్ల ఐస్ నాయనా. ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్.. అనుభవించినా కరిగిపోతుంది..
వించకపోయినా కరిగిపోతుంది అని చెప్తే సరిపోతుంది కదా అనుకునేవాడిని.
పుల్లైసు పురాణంకి ఫుల్ స్టాప్ పెట్టి ఐస్ క్రీంకి వస్తే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.(అసలు ఈ ఐస్ క్రీంని చూసే రిజర్వేషన్లలో డబ్బున్న వాళ్లను క్రీమీలేయర్ అన్నారేమో అని నా డౌటనుమానం)
అసలు ఆ ఐస్ క్రీం బండే ఒక రథంలా ఉండేది. సన్ గ్లాస్ అతికించిన పెద్ద చెక్క పెట్టెకి 3 లేదా 4 చక్రాలు ఉండి.. అది వెళ్తుంటే రాజు వెడలె రవితేజములలరగ అన్నట్టు మట్టిరోడ్ల మీద మెత్తగా పోతుండేది. దానికి మళ్ళీ రెండు లేదా మూడు అరలుండేవి. ఆ అరల్లో ఈ కోనులు పెట్టి ఉండేవి. నారింజ రంగు కోనుల సైజుల బట్టి ధర ఉండేది. స్టీలు గరిటతో ఆ క్రీముని తీసి కోనులో పెట్టి గరిటను తిప్పి కోనులో కూరి మరలా కొంచెం తీసి కోను తలకట్టు కన్నా కొంచెం పైకి పెట్టేవాడు. దాన్ని చేతిలోకి తీసుకోగానే ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఒళ్ళు పులకరించేది (అది చూడటానికి కూడా ఒలింపిక్ జ్యోతిలా ఉండటం కాకతాళీయం మాత్రమే.. ఎగతాళీయమే మాత్రమూ కాదు). *ఐస్ క్రీం ని తలకట్టు వరకూ చాలా హుందాగా తిని..ఆ తర్వాత కోన్ ని కింద కొరికి తినని వాడు దున్నపోతై పుట్టున్ అని కన్యాశుల్కం కొత్త ఎడిషన్లో రాయొచ్చు*.
అలా రకరకాల కోణాల్లో కోన్ ని తినటం ఈ కొననున్న కన్యాకుమారి నుండి ఆ కొననున్న కాశ్మీర్ వరకు కామన్ అని ఈ మధ్యనే తెలిసింది. స్కూల్ దగ్గర డబ్బులతో కొనాల్సొచ్చినా ఇళ్ల దగ్గర మాత్రం బియ్యం తీసుకుని ఇచ్చే బార్టర్ సిస్టమ్ కూడా ఉండేది. ఇప్పటిలా మినరల్ వాటర్లు లేకపోయినా..వాళ్ళు కాలవలో నీళ్ళతోనే ఆ ఐసులు చేసినా వాటివల్ల ఎవరికీ అనారోగ్యం కలిగినట్లు విన్నది లేదు. అందుకే ఇప్పటి తో పోలిస్తే అప్పటి మేము ఐస్_వర్యవంతులం.
ఇతి ఐసోపాఖ్యాన సమాప్తః
😊
AdminPost
మహానుభావులు
No comments:
Post a Comment