Saturday, March 28, 2026

 సరికొత్త ఆకాశవాణి

వ్యాసభారతాన్ని తెనుగు చేస్తూ తిక్కన చెప్పిన 'సారపు ధర్మమున్ విమల సత్యము...' అనే ఉద్యోగపర్వంలోని పద్యం పండితుల విశేష ప్రశంసలకు నోచుకుంది. 'అధర్మం చేతిలో ధర్మం, అసత్యం బలం ముందు సత్యం కృశిస్తున్న దుస్థితిని-సమర్థులు స్వయంగా పూనుకుని ఎదుర్కోకుంటే, సమాజం భ్రష్టుపడుతుంది. అది వారికి కూడా చేటు తెస్తుంది...' మూలభారతంలో ఉన్నది ఇంతవరకే. మరి నిస్సహాయుల సంగతి ఏమిటి? సమాజంలో అందరూ సమర్థులే ఉండరు కదా... అని ఆలోచించిన తిక్కన- ఆ భావాన్ని కొనసాగిస్తూ, దక్షులైనవారు ఉపేక్ష వహించినా, సత్యధర్మాలకు-దైవం రక్షణగా నిలుస్తాడని కృష్ణుడి నోట అభయం ఇప్పించాడు. అది బలహీనులకు భగవంతుడి భరోసా. తిక్కన కలిగించిన ఆశ. యుగధర్మాన్ని అనుసరిస్తూ, తిక్కన చేసిన ఈ జోడింపు, మార్పు-ఆ పద్యంలోని అఖండ ధర్మదీపం వత్తిని ఎగదోసింది. వెలుగులు పెంచింది. తిక్కన-అమాత్యుడు (మంత్రి) కాబట్టి సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకుని మూలభారతాన్ని దాటి మరో 
అడుగు ముందుకు వేశాడు. ప్రతి యుగంలోనూ మనిషి పాటించాల్సిన ధర్మ సూక్ష్మాన్ని నిర్దేశించాడు.

ధర్మ అధర్మాలకు, సత్య అసత్యాలకు మధ్య ఘర్షణ ఏర్పడిన సందర్భాల్లో దైవం ఆకాశవాణి రూపంలో పరిష్కారం చూపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భరతుడు- శకుంతలకు దుష్యంతుడితో కలిగిన సంతానమే. అదే సత్యం. దాన్ని కాదన్నాడు. దుష్యంతుడు. శంకించాడు శకుంతలను. 'ఆమె కందె డెందమున... ఆ ఇల్లాలి మనసు గాయపడింది' అన్నాడు నన్నయ. నిజానికి గాయమైంది- సత్యానికి. 'దివ్యవాణి వినిచె- వీడు నీకును శకుంతలకున్ ప్రియ నందనుండు, చేకొనుము' అని. సత్యానికి రక్షణ దొరికింది. సమస్య సమసిపోయింది. మృత్యుభీతి ఆవరించిన కంసుడు దేవకీదేవికి పుట్టిన పసికూనలను అడ్డంగా నరికేస్తున్నాడు. చివరికి యోగమాయ అడ్డుకుంది. 'నా సరసన్ జనించి నిన్ చంపెడి వీరుడొక్క దెస సత్కృతిన్ ఒందెడువాడు... మరోచోట క్షేమంగా గారాబంగా పెరుగుతున్నాడు' అంటూ కంసుడి భయాన్ని మరింతగా పెంచింది. చంపిన లేత దేహాల్లోంచే కంసుడి చావు జీవం పోసుకుందని హెచ్చరించింది. యోగమాయ ధైర్యం చెప్పింది దేవకికి కాదు- ధర్మానికి. భారత భాగవతాలను విశ్వసించే వారికి ఆకాశవాణి- ఒక సత్యం. కానివారికది- కల్పన!
ఈ ద్వంద్వాలు ప్రతియుగంలోనూ సర్వసహజం. ప్రతి పరిష్కారం అంచునా మరో సంక్షోభం వేలాడుతూనే ఉంటుంది. అద్దేపల్లి ప్రభు చెప్పినట్లు 'మనం ఎక్కడికీ పారిపోలేం.' పంజరాన్ని గుర్తించిన పావురమే- తన రెక్కల బలాన్ని గమనిస్తుంది. ఆశావాది విమానాన్ని కనుగొంటే- నిరాశావాది ఆశావాది విమానాన్ని కనుగొంటే- నిరాశావాది పారాచూట్ను ఊహిస్తాడు. ఇద్దరినీ కలుపుకొంటూ కాలం ముందుకు సాగిపోతూ ఉంటుంది.

మధ్యమధ్యలో సందేహాలకు శంకలకు భయాలకు నివారణ కావాలంటే- మనిషి ధర్మాన్ని, సత్యాన్ని ఆశ్రయించాలి. 'జాబిల్లీ! నువ్వు సముద్రం మీద చేసే సంతకాన్ని గాలి చెరిపేయకుండా కాలమే కాపలా కాస్తుందిలే!' అన్నారు శ్రీశ్రీ సత్యధర్మాలే జాబిల్లి వెలుగులు. సమర్థులు విస్మరించిన బాధ్యతను కాలం తన భుజాలకు ఎత్తుకుంటుంది. ఢిల్లీలో ఇటీవల జరిగిన కృత్రిమ మేధ(ఏఐ) ఇంపాక్ట్ సమిట్లో... ధర్మం అంటే ఏమిటి? మనిషికి అసలైన శత్రువు ఎవరు? సమస్యలను ఎదుర్కొనేదెలా.. వంటి ప్రేక్షకుల ప్రశ్నలకు- కృష్ణార్జునులు డిజిటల్ రూపాల్లో వచ్చి బదులిచ్చారు. సాంకేతికత రూపంలో కాలం జనానికి చేరువ అవుతోందంటున్నారు పరిశీలకులు.
కాకపోతే, ఆ ధర్మలిపి ఆకాశవాణిలా సత్యంలో ముంచి రాసింది అవ్వాలంతే!
ఈనాడు  సంపాదకీయం ఎర్రాప్రగడ రామకృష్ణ

No comments:

Post a Comment