Sunday, March 29, 2026

 *తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు వాటి ప్రముఖ్యత - 9* 
🛕

*తూర్పు గోదావరి జిల్లా* 

*చీకటి కోణం*

భీమేశ్వరస్వామిని దర్శించవలెనన్నా, పూజాభిషే కాదులు చేయవలెనన్నా. స్వామివారి ప్రాసాదం ఎక్కాలి. అక్కడ భీమేశ్వర లింగం మూల పీఠం మీద ఎనిమిది అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. లింగాగ్రం చుట్టుకైవారం మూడు అడుగులు ఉంటుంది. స్పటికచ్ఛవులు మోర్చే భీమ లింగ మంతటా శ్యామరేఖల వంటివి గోచరిస్తాయి. అది ఈశ్వరుని వ్యాఘ్రాజినధారణాన్ని సూచిస్తున్న దంటారు. లింగాగ్రమున రెండు నొక్కులు ఉన్నట్లు కనిపిస్తాయి. ముందున్న నొక్కు పార్థ ప్రహారానికి, రెండవది -మీదికి పెరిగిపోకుండా నాటిన చీలకూ, తార్కాణములైన చిన్నెలుగా అభివర్ణిస్తారు. సాధము క్రింద ఉన్న లింగమూల పీఠస్థానం 'చీకటి కోణం'. అక్కడ ఒకప్పుడు మాణిక్య దీపాలు ఉండేవట. ఆ స్థానంలో ఇప్పుడు కనపించేని రాతి భూమికలు. ఆలయ ప్రాసాదం లోని ఒక స్తంభం వ్యాస విగ్రహాన్ని ఆవిష్కరించింది. భక్తులు దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు. 

కాశీలో తనకు, తన శిష్యులకు భిక్ష పుట్టని కారణంగా అలిగి శాపోద్యుక్తుడైన వ్యాసుణ్ణి విశ్వేశ్వరుడు వారణాసి విడిచి పొమ్మన్నాడు. అన్నపూర్ణ భర్తను శాంతపరిచింది. వ్యాసుడు పాప పరిహారార్థమై తీర్థ యాత్రలు చేస్తూ వచ్చి దక్షిణ కాశియైన దక్షారామంలో భీమేశ్వర సాన్నిధ్యం కలిగించుకొని చరితార్థుడైనట్లు పౌరాణిక గాథలో పాముద్రాసహితుడైన అగస్త్యుడు వ్యాసునకు దక్షారామక్షేత్ర మహత్యం భీమమండల వైభవము అభివర్ణించి చెప్పాడు.

నిరంతరమూ భక్త బృందం దక్షారామ క్షేత్రానికి వచ్చి స్వామికి అభిషేకాదులు జరుపుకొని జన్మ చరితార్థము అయిందని కలిదోష నిర్మూలనం చేసుకున్నామని ఆనందమగ్నులు అవుతూ ఉంటారు.

శ్రీ రామాయణమును ద
క్షా రామాయణము గలిమలాపహములు స
త్సారమతులు వాల్మీకికి
బారశర్యునకు వినుతి పాత్రములయ్యెన్
📖

*పశ్చిమ గోదావరి జిల్లా* 

*ద్వారకా తిరుమల : వేంకటేశ్వర స్వామి*

కృతయుగంలోని వృషశైలం తిరుమల. అదే పెద్ద తిరుపతి. త్రేతాయుగంలోని శేషశైలం ద్వారకా తిరుమల. అదే చిన్న తిరుపతి. పెద్ద తిరుపతి వెళ్ళి తీర్చుకోలేని మ్రొక్కులు చిన్న తిరుపతిలో తీర్చుకొన్న చాలును. ఇది అనూచానంగా వస్తున్న ఆచారం.

శేషుడు తన పడగల మీద భువన శ్రేణిని మోస్తున్నాడు. మహా విష్ణువునకు శయనంగా ఉండి సమస్తోచిత క్రియలు నిర్వహిస్తున్నాడు. ఆ శేషుడు ఇంద్రకీలాద్రికి పట్టిసాద్రికి మధ్యభాగంలో త్రేతాయుగమున హరిహరులను గూర్చి తపస్సు చేశాడు. హరిహరులు అతనికి సాక్షాత్కరించారు. శేషుడు తన శిరస్సునందు శ్రీమహావిష్ణువును దర్శించే భాగ్యాన్ని కల్పించమని ప్రార్ధించాడు. హరిహరులు వరాన్ని కరుణించారు.

శేషుడు త్రేతాయుగంలో విదర్భ దేశంలోని ద్వారకాపురి సమీపంలో పర్వతాకారం ధరించాడు. ఆ కొండపై కుంకుడు చెట్టు దగ్గర తొర్రలో శేషుడు నివసించాడు. శేషుని అనుగ్రహించుటకు శ్రీ వేంకటేశ్వరుడు అక్కడే పుట్టలో కాపురమున్నాడు. శివుడు మల్లిఖార్జును డై ఆ కొండపై నెలకొన్నాడు. శివకేశవులు ఈ విధంగా శేషుని అనుగ్రహించి శేషశైలంపై అధివసించారు.

ఆ శైలం త్రేతాయుగం నుండి 'శేషాద్రి'గా, 'శేషాచలం'గా 'శేషశైలం'గా, 'అనంతగిరి'గా ప్రఖ్యాతమైంది. అందుచేతనే అది 'త్రేతాయుగ శేషశైలం'. అప్పటి నుండి శ్రీ వేంకటేశ్వరుడు శేషునిచే ఆరాధింపబడి, శేషుని అనుగ్రహిస్తున్నాడు.

కృతయుగంనాటి తిరుమల, త్రేతాయుగం నాటి ద్వారకా తిరుమల సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలు.

బ్రహ్మ పురాణాంతర్గతమైన ద్వారకా తిరుమల క్షేత్రకథ ఒకటి ఉన్నది. ఇందుమతీ,అజమహారాజ దంపతులు ద్వారకా తిరుమలలోని పుణ్య పురాణ దంపతులైన పద్మావతీ శ్రీనివాసులను నవ వధూవరులను చేసి కళ్యాణ వేడుకలు జరిపించుట బ్రహ్మ పురాణ కధ.

ఈ విధంగా పురాణ ప్రసిద్ధమైన 'విదర్భదేశం' కృష్ణా గోదావరీ నదుల మధ్య దేశమని వ్యక్తమైంది. ఖండేరాయుని కైకలూరు శిలా శాసనం కూడ అదే విషయాన్ని నిరూపించింది. విదర్భ విశేషించి దర్భలు లభించే దేశం. తరువాత వెల్లనాడు, వేంగినాడు అని పేరు పెట్టారు. ద్వారకుడు గొప్ప తపస్వి. అతని ధర్మపత్ని సునంద. వేంకటేశ్వరుని పాదసేవకు ఆ దంపతులు తమ జీవితాలను అంకితం కావించారు. వెంకటేశ్వర దర్శనార్థము ప్రయాణించుచున్న వారికి వేంకటేశ్వర దర్శనం కలిగింది. 

త్రేతాయుగ శేషాచలముపై తన సేవ చేసికొమ్మ న్నాడు. ఆ స్వామి చెప్పిన కుంకుడు చెట్టు వద్ద ఒక వల్మీకం (చీమల పుట్ట) గోచరించింది. ఇది ఆ చెట్టుకు ఈశాన్య భాగంలో ఉన్నది. ఆ వల్మీకంలో స్వామి విగ్రహాన్ని కనుగొన్నారు. ఆ మూర్తిని ద్వారకుడు యథాశాస్త్రీయంగా ప్రతిష్ఠించి, విధి విధానంగా పూజించాడు. ద్వారకుని మూలంగా వేంకటేశ్వరుడు, ఆ కారణంగా ఇది 'ద్వారకా తిరుమల'.. పునర్వ్యక్తమయ్యాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ద్వారకా తిరుమల మధ్యభాగంలో పంపానది పశ్చిమ దిక్కు నుండి తూర్పు దిక్కుగా ప్రవహిస్తూ ఉత్తర వాహినిగా గోదావరిలో కలుస్తోంది. దేవాలయానికి ఆ పంపానది ఉత్తరవాహినియై ప్రవహిస్తోంది. అదే నేటి ఎర్రకాలువ. సప్తర్షుల కోసం శ్రీహరి సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సమీపంలో ఒక తీర్థాన్ని సృష్టించాడు. అదే సుదర్శన తీర్ధం. ఇది సుదర్శన క్షేత్రం. ద్వారకా తిరుమల చిత్కలా ప్రసార కేంద్రంగా కూడ ప్రసిద్ధి చెందింది.
📖

ద్వారకా తిరుమల క్షేత్రాభివృద్ధికి తన సర్వస్వం ధారపోసిన భక్తుడు శ్రీధర్మ అప్పారావుగారు. 18వ శతాబ్దంలో ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించి గోపుర, ప్రాకార, మంటపాలు, సోపానాలు నిర్మించారు.

ఇక్కడకు వచ్చే యాత్రీకులకు ముందు 'కుంకుళ్ళమ్మ' దర్శనమిస్తుంది. ఈమె అతిథి దేవత. కొండ మల్లేశ్వరుడు క్షేత్రపాలకుడు. భక్తాంజనేయులు క్షేత్ర రక్షకుడు. కొండపై మల్లిఖార్జున స్వామి ఆలయం వుంది. ఈ స్వామి దర్శనం చేయనిదే 'ద్వారకా తిరుమల' యాత్రా ఫలితం లభించదు.

ఈ దివ్యక్షేత్రంలో ఆంజనేయాలయము, సుబ్రహ్మణ్యా లయము, గంగానమ్మగుడి దర్శించవలసినవి. మధ్యగా 'పద్మ సరోవరం' ఉంది. ఇక్కడ సుద్దగనులు ద్వారా విదేశ మారక ద్రవ్యం లభిస్తోంది. ఈ మృత్తికను భక్తులు తీసికొని ధరిస్తారు. కళ్యాణాలలో వైశాఖమాస కళ్యాణం ప్రధానమైంది. పశ్చిమ గోదావరి వేంగీ దేశ భాగం క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి నాలుగున్నర శతాబ్దాలు ఈ ప్రాంతం శాతవాహన రాజ్యానికి చేరి ఉంది. తర్వాత ఇక్ష్వాకులు, కృష్ణా గోదావరీ మధ్యభాగం 'బృహత్పలాయనులు' పాలించారు. వారి కాలంలోనే వేంగీ నగర నిర్మాణం జరిగింది. తూర్పు చాళుక్యులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, కాకతీయులు, వెలనాటి చోళులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, గోలుకొండ నవాబులు, ఫ్రెంచివారు, ఇంగ్లీషువారు పరిపాలించిన ప్రదేశం పశ్చిమ గోదావరి.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వూరు భీమడోలుకు సుమారు 14 కిలోమీటర్ల దూరములో కలదు. భీమడోలు రైలు స్టేషన్లో దిగి బస్సుపై ద్వారకా తిరుమల చేరుకొనవచ్చును.
📖

*సోమారామం: గుణుపూడి భీమవరం*

"గౌతమీ తీరంబున దక్షిణ కూలంబున గుణుపూడి అనుగ్రామంబున సోమునిచేతం ప్రతిష్ఠితంబగుటచేసి సోమలింగంబన ప్రఖ్యాతంబై సోమారామంబును" అంటూ శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో సోమారామం గూర్చి వర్ణించాడు.

అగస్త్యుడు కాశీవియోగ దుఃఖాన్ని హరించుకోవ డానికై గోదావరీ తీరభ్రమణం చేస్తూ వివిధక్షేత్రాలు దర్శించిన పిమ్మట క్షీరారామం, సోమారామాలను దర్శించి సేవించినట్లుగా కాశీఖండంలో అభివర్ణించాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
క్షీరారామేశ్వరలింగం వలె సోమేశ్వర లింగం పీఠం నుండి రెండడుగుల ఎత్తుగల స్ఫటిక లింగం. చంద్రునిచేత ప్రతిష్ఠింపబడినది. ఈ లింగం చంద్రుని వృద్ధిక్షయను ప్రతిబింబిస్తుంది.

తూర్పు చాళుక్యరాజులలో భీమనామం ధరించిన రాజులు ఎందరో ఉన్నారు. మొదటి చాళుక్య భీమ. ఆదిగాగలవారు. వారిలో భీమప్రతావ. బిరుదాంక భీమ, ముమ్మిడిభీమ మొదలైన బిరుదులు ధరించిన చాళుక్య రాజులలో విమలా దిత్యుడు గొప్పవాడు. అట్టివారి పేరుమీద ఆలయాలు, గ్రామాలు వెలసాయి. పశ్చిమ గోదావరి భీమవరం చాళుక్య భీమరాజులలో ఒకరి పేర వెలసిన గ్రామం. జటాచోళభీముని పాలనలో ఆ పేరు స్థిరపడి ఉంది. దత్తనామాత్య సోముడు, సోమారాముని 'గుడిపూండి' శాసనములు వలన అనేక విషయాలు తెలియుచున్నవి.

'ఉండి' రాజులు వీరశైవులు. వారి కాలంలో నూజివీడు, జల్లిసీమలలో, భీమవర ప్రాంతం ఎంతో శోభాయమానంగా విరాజిల్లినది. క్రీ.శ. 1434 దేవయకుమారుడు శింగన అనే భక్తుడు గుణుపూడి భీమవరం సోమేశ్వరునికి ఎన్నో బహుమానాలు చేశాడని ఆలయానికి ఎదురుగా నున్న మండప స్తంభశాసన పద్యంవలన తెలుస్తోంది. 

భీమవరంలో ప్రాచీన భీమేశ్వరాలయం కూడ ఉంది. క్రీ.శ. 10వ శతాబ్దంలో సోమేశ్వర, భీమేశ్వర దేవాలయాలు తూర్పు చాణుక్యుల కాలంలో వర్ధిల్లాయి. సోమారామం పంచారామాలలో ఒకటి.
🛕
*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment