కథ పేరు: *రెండో ఛాన్స్*
రచన: కోడూరి తిరుమల మాధవి
స్వీయ రచన ( 7-8-25)
మధ్యాహ్నం
పన్నెండున్నర కావస్తోంది,
నా ముందు కూర్చున్న పేషెంట్ బయటకు వెళ్లగానే, టేబుల్ మీద వున్న బెల్ నొక్కాను.
తలుపు తెరిచి ఎస్ మేడం అంటూ కమల లోపలికి వచ్చింది,
ఇంకా ఎంత మంది పేషంట్లు వున్నారు ? అని అడిగాను, ఇంకా ఇద్దరు వున్నారు మేడం ఒకరు బయట వెయిట్ చేస్తున్నారు ఇంకొకరు అరగంటలో వస్తున్నట్టు ఫోన్ చేశారు అని చెప్పింది.
సరే అయితే ఆ వెయిట్ చేస్తున్న వారిని లోనికి పంపించు అనగానే అలాగే మేడం అని కమల తలుపు మూసి వెళ్ళిపోయింది.
వెంటనే ఆ పేషెంట్ లోనికి వచ్చారు, వారిని చూసి మాట్లాడి పంపించాక కాస్త రిలాక్స్ గా కుర్చీలో వెనక్కి వాలాను.
నా పేరు భార్గవి, నేను సైక్రియాటిస్ట్ ని నేను ప్రాక్టీస్ మొదలుపెట్టి పదిహేను ఏండ్ల పైనే అయింది, మొదట పెద్దగా పేషంట్లు వచ్చేవారు కాదు.
మించిపోతే రోజుకు ఒకరో ఇద్దరో అంతే,
మన దేశంలో సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం అంటే అదేదో చాలా తప్పు అన్నట్టు భావిస్తారు.
ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి వస్తే చాలు ఏమైంది నీకు సైక్రియాటిస్టు దగ్గరికి వెళ్ళవలసినంత అవసరం ఏమొచ్చింది అంటూ ఆరాలు తీస్తారు.
అలా వెళ్ళిన వాళ్ళకు పిచ్చో మరేదో వున్నట్టుగా భావిస్తారు.
కానీ ఇప్పుడిప్పుడే ప్రజల ఆలోచనల్లో కాస్త మార్పు వస్తోంది.
శరీరానికి రుగ్మతలు వున్నట్టే మానసిక రుగ్మతలు వుంటాయని వాటిని నిర్లక్ష్యం చేయకూడదు అని తెలుసుకుంటున్నారు.
ఇది నిజంగా మంచి మార్పు.
ఇలా ఆలోచిస్తున్న నాకు "మేడం ఆ ఫోన్ చేసిన పేషెంట్ వచ్చారు లోనికి పంపమంటారా ? అన్న పిలుపుతో ఆలోచనల్లోనుండి బయటకు వచ్చి
"ఆ...ఆ....పంపించు" అన్నాను.
తలుపు తీసుకుని నా వయసే వున్న ఒక ఆవిడ లోపలికి వచ్చి నమస్తే మేడం అంటూ నా ముందు వున్న కుర్చీలో కూర్చుంది.
తనని చూసిన నా ఆనందానికి, ఆశ్చర్యానికి అవధులు లేవు నువ్వూ....నువ్వు మాలతి కదూ అన్నాను ఆనందంతో తను కూడా ఆశ్చర్య పోయి నువ్వు భా....భార్గవి కదూ అనింది, ఇద్దరం ఆనందంతో కౌగిలించు కున్నాము.
ఇలా ఇన్ని ఏండ్ల తరువాత అనుకోకుండా కలుసుకోవడం ఇద్దరికీ చెప్పలేని ఆనందంగా వుంది.
మేము పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నాము. తరవాత ఇంటర్ లో నేను సైన్స్ గ్రూప్ తను ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంది మా ఇద్దరి కాలేజీలు కూడా వేరు వేరు కావడంతో మా దారులు వేరు అయ్యాయి.
స్కూల్ లో చదివేటప్పుడే తను అన్ని యాక్టివిటీస్ లో చాలా చురుగ్గా పాల్గొనేది, చాలా ధైర్యవంతురాలు.
మా అందరికీ తను చాలా ఇస్పిరేషన్ గా వుండేది. ఏదైనా అన్యాయం జరిగితే అస్సలు ఊరుకునేది కాదు మేమందరం తనని లా చదివి లాయర్ అవవే నీకు బాగా సూట్ అవుతుంది అనేవాళ్ళం.
ఇలా సాగిపోతున్న ఆలోచనల నుండి బయటకు వచ్చి అది సరేగానీ మాలతి ఇప్పుడు నువ్వు ఎక్కడ వున్నావు ? ఏం చేస్తున్నావు ? ఇలా ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను,
తను నవ్వుతూ "ఆగవమ్మా... డాక్టరమ్మా... అన్నీ చెప్తాను అంటూ ఒక చిన్న నిట్టూర్పు విడిచి తన గురించి చెప్పసాగింది.
డిగ్రీ అయ్యాక మీరందరూ అన్నట్లు గానే B.A B.L చదివాను "లా" ప్రాక్టీస్ కూడా చేసాను.
తరవాత పెళ్ళి అయింది. పెళ్ళయ్యాక కూడా నా లాయర్ గా కొనసాగాలి అన్నదే నా కోరిక, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అత్తగారి ఇంటికి అలవాటు పడాలి కదా అని కొన్ని రోజులు, పిల్లలు అని కొన్ని రోజులు, వారి చదువులు అని కొన్ని రోజులు ఇలా రోజులు సంవత్సరాలు గడిచి పోయాయి.
మా వారు పెద్ద బిజినెస్ మాగ్నెట్. ఆయన వ్యాపారాల నిమిత్తం ఎప్పుడూ బిజినెస్ టూర్ ల మీద వేరే ఊర్లలో వుండటం వల్ల ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత మొత్తం నేనే చూసుకోవలసి వచ్చింది. ఈ బాధ్యతల్లో పడి నేను ఒక లాయర్ అన్న సంగతే మరిచి పోయాను.
పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్ళిళ్ళు అయ్యాయి ఇద్దరూ వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు, వారి జీవితాలు వారి హడావుడిలో వాళ్ళు వున్నారు,
ఇప్పుడు నాకు ఒంటరి తనం ఎక్కువగా బాధిస్తోంది. ఆరోగ్యం కూడా కాస్త దెబ్బతినింది, ఎప్పుడూ ఏదో దిగులు, భయం గా వుంటుంది.
ఎవరితోనూ కలవలేక పోతున్నాను, మాట్లాడలేక పోతున్నాను. చాలా డిప్రెషన్ గా వుంటుంది. ఈయనతో నా బాధ చెప్పుకుందాం అంటే నేను చెప్పేవి ఏవీ ఆయనకు పెద్ద విషయాలుగానే తోచవు. నాకు ఏం చేయాలో తెలియడం లేదు ఒక్కోసారి చాలా దిగులుగా వుంటుంది, కారణం లేకుండా ఏడుపు వస్తుంది, అందుకే ఎవరినైనా ఎవరినైనా మానసిక డాక్టర్ ని కలుద్దాము అని వచ్చాను తీరా ఇక్కడికి వచ్చాక నా ప్రియ మిత్రురాలే డాక్టర్ అవడం చెప్పలేని సంతోషంగా వుంది అనగానే
నేను చిన్నగా నవ్వుతూ ఓస్ ఇంతేనా నేను ఇంకేదో పెద్ద సమస్య అనుకున్నాను. ఈ పరిస్థితి నూటికి ఎనభై మంది ఆడవాళ్ళకు వున్నదే ఇల్లు సంసారం పిల్లలు అని బాధ్యతలు వున్నంత వరకూ వాటిలో మునిగి పోతారు, పిల్లలు పెరిగి వారి వారి జీవితాలు చూసుకునే స్థాయికి వచ్చాక మనల్ని ఒంటరి తనం పీడిస్తుంది, ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళ పరిస్థితి కాస్త బాగున్నా ఇంట్లోనే వుండే ఆడవాళ్ళు మాత్రం ఈ సమస్యను ఎక్కువగానే ఎదుర్కొంటున్నారు.
మగవాళ్ళు ఇంటి కన్నా బయట ప్రపంచంతో ఎక్కువగా సంబంధం కలిగి వుంటారు కాబట్టి వారిని ఈ సమస్య పెద్దగా బాధించదు.
అయినా ఇందులో నీదే తప్పు అంటాను.
లాయర్ చదివావు, ఇంటి బాధ్యతల వల్ల కొంతకాలం నీ ప్రాక్టీస్ కి దూరంగా వున్నా తరవాత అయినా నీ కెరీర్ ని నువ్వు తిరిగి ప్రారంభించి వుండవలసింది,
ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబాలు వుండేవి ఒకే ఇంట్లో అన్నదమ్ములు, తోడి కోడళ్ళు వాళ్ళ పిల్లలు ఇలా పది పదిహేను మందికి తక్కువ కాకుండా ఉండేవాళ్ళు ఇంట్లో కూడా పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు, పురుళ్ళు పుణ్యాలు అని ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూ వుండేది.
ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బంధువులు చుట్టాలు అంటూ ఆడవాళ్ళకు క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ పది మంది మధ్యలో వుండేవారు.
కానీ కాలం మారింది.
ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలు అయిపోయాయి.
జీవితంలో ఒక స్టేజ్ కి వచ్చాక ఒంటరితనం తప్పడం లేదు. కాబట్టి ఆ సమస్యను మనమే ఎదుర్కోవాలి.
శరీరంతో పాటు మనసుకి కూడా మంచి వ్యాయామం కావాలి అప్పుడే ఇటువంటి నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ మన దరికి రాకుండా వుంటాయి.
ఒంటరిగా కూర్చుని వుంటే ఏవో ఒక పనికి మాలిన ఆలోచనలు వస్తుంటాయి,
నువ్వు ఎలాగూ "లా " చేశావు కాబట్టి కోర్టు కి వెళ్ళి ప్రాక్టీస్ చేయక పోయినా నీకు వున్న జ్ఞానంతో ఒక కన్సల్టెన్సీ ప్రారంభించవచ్చు న్యాయపరమైన సమస్యలకు నీ సలహా సూచనలు ఇవ్వవచ్చు.
ఇప్పుడు సోషల్ మీడియా కూడా బాగా డెవలప్ అయింది దాని ద్వారా కూడా నువ్వు ఎంతో తెలుసుకోవచ్చు ఏదైనా చేయవచ్చు. లేదా నీకు ఇంట్రెస్ట్ వున్న ఏ విషయాన్నైనా తిరిగి మళ్ళీ మొదలుపెట్టు.
ముందు కొంచెం తడబడినా క్రమేణా పుంజుకుంటావు.
మన గురించి మనమే ఆలోచించుకోవాలి అంతే తప్ప నాకు ఎవరూ లేరు, నా అవసరం ఎవరికీ లేదు అనుకుంటూ కూర్చోవడం తప్పు.
అయినా నేను ఒంటరిని అనుకుంటూ కూర్చోవడం కంటే ఏదైనా సాధించడానికి జీవితం మనకు రెండో ఛాన్స్ ఇచ్చింది అని ఎందుకు అనుకోకూడదు ?
ఇప్పటిదాకా అందరి కోసం బ్రతికావు. ఇప్పుడు నీ కోసం నీవు బ్రతుకు, అనగానే నా మాటలు శ్రద్ధగా విన్న మాలతి "నిజమే భార్గవి నువ్వు చెప్పిన మాటలు వింటుంటే నాలో ఏదో కొత్త ఉత్సాహం కలుగుతోంది" అని మళ్ళీ అంతలో ఇప్పుడు ఇవన్నీ నా వల్ల అవుతాయి అంటావా! అని బేలగా నావైపు చూసింది.
"అరె భలే దానివే మనసుంటే మార్గం ఉంటుంది" నువ్వు తప్పకుండా చేయగలుగుతావు.
నాకు తెలిసి ఇప్పుడు మీవారి నుండి కూడా నీకు పెద్దగా అభ్యంతరం వుండదు అనుకుంటున్నాను, ఒక వేళ చెప్పినా ఇప్పుడు ఇంక నువ్వు నీ ప్రయత్నం ఆపవలసిన అవసరం ఏమాత్రం లేదు.
నిజం చెప్పాలి అంటే చిన్నప్పటి నుండీ మా అందరిలోకి నువ్వే ధైర్యవంతురాలివి
అనగానే "థాంక్స్ భార్గవి" తప్పుకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను జీవితం నాకు ఇచ్చిన రెండో ఛాన్స్ ని సద్వినియోగం చేసుకుంటాను అని చెప్పి బయటకు వెళుతున్న మాలతి వైపు అలాగే చూస్తూ వుండిపోయాను.
నిజమే ఒక్క మాలతి మాత్రమే కాదు సమాజంలో ఎంతో మంది ఇలాంటి మాలతిలు వున్నారు.
ఏ వ్యవస్థలో అయినా కుటుంబం, పిల్లల విషయం లో పురుషుడి కంటే స్త్రీకే ఎక్కువ బాధ్యత వుంటుంది. వుండాలి కూడా అప్పుడే కుటుంబం, సమాజం బాగుంటుంది. అదే సమయంలో కుటుంబ బాధ్యతల్లో పడి స్త్రీ తన ఉనికిని కోల్పోకూడదు.
తన చదువుని, తనలో వున్న అభిరుచులను, ఆశలను వదులుకోకూడదు. తనకంటూ ఒక వ్యక్తిత్వం కలిగివుండాలి.
ఫలానా వారి కూతురు గానో, ఫలానా వారి భార్యగానో, ఫలానా వారి తల్లిగానో కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి.
లేదంటే జీవితంలో ఏదో ఒక సమయంలో నా కంటూ ఏమీ లేదా! అన్న నిరాశ, నిస్పృహ, ఒంటరినం వెంటాడి వేధిస్తాయి.
ఇలా ఆలోచిస్తున్న నేను నా ఆలోచనల నుండి బయట పడి ఇంక పేషెంట్ లు ఎవరూ లేక పోవడంతో కమలతో చెప్పి ఇంటి దారి పట్టాను
సరిగ్గా ఆరు నెలల తరువాత మళ్ళీ మాలతి నన్ను కలవడానికి క్లినిక్ కి వచ్చింది, తనలో ఇప్పుడు ఒక కొత్త మార్పు కనపడింది, ఇంతకు ముందు వున్న దిగులు నిరాశ మాలతిలో ఇప్పుడు మచ్చుకు కూడా లేవు, ఒక కొత్త ఉత్సాహం తనలో కనపడింది.
నన్ను చూడగానే గట్టిగా కౌగిలించుకుని థాంక్స్ భార్గవి నీ స్పూర్తి, స్నేహం నా జీవితాన్ని మార్చి వేశాయి. నువ్వు చెప్పినట్టే "లా" కన్సల్టెన్సీ పెట్టాను.
మొదట కాస్త భయపడ్డాను కానీ, ఇప్పుడు నిలదొక్కుకున్నాను. నేను చదివిన చదువును సార్థకం చేసుకున్నాను, న్యాయపరమైన ఎన్నో సమస్యల కోసం నా దగ్గరికి వచ్చే వారికి నా సహాయ సహకారాలు, సలహాలు అందిస్తున్నాను, అంతో ఇంతో సమాజానికి ఉపయోగ పడుతున్నాను అనేసరికి "వెరీ గుడ్ మాలతీ" ఇది కదా మా డేర్ అండ్ డాషింగ్ మాలతి" అంటే అనగానే ఇద్దరం సంతోషంగా నవ్వుకున్నాము.
*** శుభం***
No comments:
Post a Comment