Sunday, March 29, 2026

 ఏడుపు రాగం - తద్దినపు తాళం 

*****************************

"నాన్నా, ఒకసారి ఫోన్ అమ్మకి ఇవ్వండి, త్వరగా."
"మీ అమ్మ ఫోనుకే చెయ్యమ్మా."
"ఇప్పటికి మూడుసార్లు చేశా నాన్నా, వంట మధ్యలో  అనుమానం వచ్చి.
త్వరగా అమ్మను పిలవండి, పదార్థం మాడిపోతుంది."
"అబ్బా, మీ అమ్మ ఇంట్లో లేదు అపర్ణా."
"ఎక్కడికి వెళ్లింది?"
"ఏమో, నాకు చెప్పి వెళ్తుందా?"
"అదేంటి?"
"నన్నడుగుతావే? మీ అమ్మకే చేసి కనుక్కో."

"....ఇద్దరీ మధ్య ఏదో డిష్యుం డిష్యుం అయినట్లుంది. కొంచెం ఆగితే వాళ్ళిద్దరే సర్దుకుంటారు. ఇప్పుడు నేను కదిలిస్తే తేనెతుట్టె రేపినట్లే. వామ్మో నా పదార్థం!!!"
ఓ గంట తర్వాత.....
"హలో అపర్ణా, మాట్లాడావా మీ అమ్మతో?"
"లేదు నాన్నా."
"అప్పుడనగా ఎటో పోయింది, ఇంతవరకూ అయిపూ అజా లేదు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు."

"ఈపాటికి వచ్చేసి ఉంటుందనుకున్నా నాన్నా. అసలెక్కడికి వెళ్ళింది? ఫోన్ ఎత్తకపోవడం ఏమిటీ? మీ ఇద్దరూ పోట్లాడుకున్నారా?"
"మీ అమ్మతో పోట్లాడడం తప్ప నాకేం పనీ పాటా లేదా? 'వంక లేనమ్మ డొంక పట్టుకు పోయిందని' ఆవిడకే నా పాటా, నేనూ నచ్చక గొడవపడి వెళ్ళి పోయింది."

"అదేంటి?"

"రిటైర్ అయ్యిన మొగుడు అన్నిట్లో తల దూర్చి తలనొప్పి తెప్పిస్తాడని  అందరూ అనుకుంటుంటే  నేను అట్లా అనిపించుకోకూడదనుకున్నా. అందుకే నా వ్యాపకాలేవో నేను పెట్టుకున్నా. అదీ ఇంటికీ, మీ అమ్మకూ కావాల్సినవన్నీ చూసుకున్న తర్వాతే. అయినా మీ అమ్మకి అక్కడ కూడా తన పెత్తనమే సాగాలట. ఆవిడకు ఇష్టమైన పాటలే పాడాలట.
 మొగుడిననుకుంటుందా లేక ములక్కాడ చెట్టుననుకుంటుందా, ఎటు వంచితే అటు వంగటానికి?"

"ఏంటీ, పాటల విషయంలో పోట్లాడుకున్నారా? మీ ఇద్దరికీ భలే సృజనాత్మకత ఉంది నాన్నా, లోకంలో ఏ భార్యా భర్తా ఇంతవరకూ ఈ విషయం మీద పోట్లాడుకుని ఉండరు."
"చాల్లే నీ వెటకారం, చప్పట్లు కొట్టాలంటే మీ అమ్మకి కొట్టుకో. నాకిష్టమైన పాటలు వినడం, పాడడం మానేవరకూ ఇంటికి రానని అరుచుకుంటూ  పోయింది."
"హా! అంత జరిగిందా. సరే, అమ్మతో నేను మాట్లాడతా ఉండండి."

*********************

"హలో అమ్మా!"
"ఆ,అపర్ణా చెప్పు" నీరసంగా పలికింది తల్లి జానకి స్వరం.
"ఎక్కడికి వెళ్ళావమ్మా?"
"ఓహో! మీ నాన్న నీ చెవిలో పాడేసారా అప్పుడే!"

"పాడేసారానా, ఇలాంటి సందర్భంలో ఎవరైనా ఊదేసారా అంటారు కదా? ఈ పాటల గోలేంటి ?
అయినా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా? ఫోన్ కూడా ఎత్తలేదని నాన్న కంగారు పడుతున్నారు. ఏదైనా ఉంటే మెల్లిగా మాట్లాడుకోవచ్చుగా?"
"ఆహా, 'చేసిన చేష్ట లెవరూ ఎరుగరు గాని కోసిన ముక్కు మాత్రం అందరూ చూసారట', అట్లా ఉంది వ్యవహారం.
 ఏం మాట్లాడుకోవాలీ? ఆ నిరంతర గాన స్రవంతి కార్యక్రమం మధ్యలో అసలు మాట్లాడుకునే సందు ఉందా? మీ నాన్న ఆ పాటలతో నన్ను పెట్టే క్షోభ ఏంటో  మీకెవరికైనా తెలుసా?" 

"అంత ఏం జరుగుతోందమ్మా?"

"ఏమిటా, చెప్తా విను.
పొద్దున్నే కళ్ళు తెరవగానే 'సర్వ మంగళ మాంగళ్యే' అంటూ  అందరికీ శుభాలు జరగాలని అమ్మవారికి దణ్ణం పెట్టుకుంటూ  లేస్తూ ఉంటానా..
ఎప్పుడు లేచి కూర్చుంటారో ఏం పాడో, 
'తలచినదే జరిగినదా దైవం ఎందులకూ, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు' అంటూ ఇల్లెగిరిపోయేలా పాడుతూ ఉంటారు.

 ఆ దెబ్బకు గుండెల్లో ఠారు పుట్టి మళ్ళీ ముసుగు పెట్టి పడుకుంటూ ఉంటా.
ఎంత సేపు పడుకుంటే మాత్రం ఆ ఏడుపుగొట్టు చిత్రలహరి ఆగితేగా?"     
"అవునా! ఇదేంటమ్మా కొత్తగా? "
"కొత్తేం కాదు. ఉద్యోగం, ఇంటి బాధ్యతల్లో పడ్డాక  కొంచెం తగ్గింది కానీ మీ నాన్నకి ఈ ఏడుపుగొట్టు పాటల పిచ్చి మొదటి నుండీ ఉన్నదే.

చెప్పటానికి సిగ్గు చేటు కానీ మా పెళ్ళయ్యాక మూణ్ణిద్రలకని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామా, మా వాళ్ళు గదంతా పూలతో చక్కగా అలంకరించి, అన్ని ఏర్పాట్లూ చేస్తే... నేను వెళ్ళేటప్పటికి టేప్ రికార్డర్లో  'మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథనే విన్నారా' అంటూ ఘంటసాల గుండెలు పిండేసేలా పాడిన విషాద గీతాన్ని తన్మయత్వంతో  వింటున్నారు .
అప్పటికీ నేను ధైర్యం తెచ్చుకుని 'ఇప్పుడు ఆ పాట పెట్టారేం'టని అడిగితే.. 
'అది కూడా తొలి రేయి పాటే, అందులో కూడా గది అలంకరణ ఇలాగే ఉంటుంది' అంటూ అర్ధం పర్థం లేని సామ్యం చెప్పారు. అంతేకానీ ఆ పాటలో సాహిత్యానికి అర్థం ఏమిటి, సినిమాలో ఆ పాట సందర్భం ఏమిటి? ఇవేవీ అక్కర్లేదు మీ నాన్నకి.  
అక్కడితో ఆగకుండా పొద్దున్నే  పరీక్ష రాయాలన్నంత శ్రద్ధగా  క్యాసెట్ రెండువైపులా ఒకదాన్ని మించినవి ఒకటి విషాద గీతాలు  మ్రోగించారు. ఆ దెబ్బకి నా కడుపంతా గుబులుగా అయిపోయి గంట సేపు గుక్కపెట్టి ఏడిస్తే గానీ తగ్గనంత దుఃఖం వచ్చింది. దానితో అప్పగింతల్లో కూడా ఏడవని నేను ఆ క్షణాన ఎందుకు ఏడవాలో కారణమైనా కనబడక, మూడేళ్ల క్రితం చచ్చిపోయిన మా అమ్మమ్మని, ఆవిడ చేతి మజ్జిగ పులుసునీ గుర్తు చేసుకుని మరీ ఏడ్చి నిద్రపోయా. పొద్దున్నే లేచాక ఉబ్బిన నా ముఖం, కళ్ళు చూసి  కంగారు పడి, విషయం తెలుసుకున్న మా వాళ్ళంతా ఒకటే  నవ్వటం.  
ఆ తర్వాత మీ నాన్నను వాళ్ళ బామ్మ పక్కకు తీసుకెళ్ళి 'అవలక్షణాలున్న వాడికి అక్షంతలిస్తే అవతలికిపోయి నోట్లో వేసుకున్నాడట' అట్లా ఉంది నీ వ్యవహారం! లక్షణంగా శుభకార్యం కోసం వస్తే నీ తింగరి వేషాలతో పిల్లని బెదరగొడతావా?" అని తలంటి పోసి మీ నాన్న  తెచ్చుకున్న టేప్ రికార్డర్, క్యాసెట్లు ఊడబెరుక్కుని ఆవిడ పెట్టెలో పెట్టుకుని తాళం వేసేసుకుంది.
దానితో ఆ ఏడుపు పాటల బెడద తీరింది కానీ మీ నాన్న మాత్రం మిగిలిన రెండు రోజులూ నా మీద అలిగి కూర్చున్నారు. 

'పెళ్ళి చూపుల్లో 'నాకు కూడా సంగీతం అంటే ప్రాణం, పాటలు వింటూ పడుకోవటం ఎంత ఇష్టమో' అని అబద్ధాలు చెప్పి, ఇప్పుడు పాటలు పెట్టానని మా బామ్మతో తిట్టిస్తావా?' అని. 

ఆ దెబ్బతో ఆయన ఏడుపు పాటలు పెడితే వద్దనటానికి , ఏడుపొస్తే ఎవరికైనా చెప్పుకోవటానికి కూడా ధైర్యం లేకుండా పోయింది నాకు.
  అయినా ఆ దేవుడు చేసే గమ్మత్తులు చూడు! ఇద్దరికీ సంగీతం ఇష్టం అంటే జీవితం అంతా పాటలా సాగుతుంది అని అనుకుంటాం. కానీ భగవంతుడు అందులోనూ ఎంత కొంటెతనం చూపాలో అంతా చూపాడు. నేను ఓ పాట విన్నానంటే ఆ సాహిత్య అర్థాన్ని, రాగ భావాన్ని మనసుకు పట్టించుకునే రకాన్ని. రఫీ పాటలు ఇష్టమని ఓసారి దిల్ ఏక్ మందిర్ సినిమాలోని  'యాద్ న జాయే ' అనే విషాద గీతం విని ఆ తర్వాత నాలుగు రోజులు మనిషిని కాలేకపోయాననుకో. పాట నాపై అంత ప్రభావం చూపిస్తుంది. అందుకే  విషాద గీతాల జోలికి త్వరగా పోకుండా జాగ్రత్తగా  ఉంటాను. అలాంటి నన్ను మీ నాన్నకు జతచేసాడు దేవుడు. ఆయనకేమో పాటలంటేనే ఏడుపు. 'వద్దండీ నేను వినలేను'  అని మొత్తుకున్నా పట్టించుకోకుండా ఘంటసాల గుండె గాయం చేసే గీతాలు, బాల సుబ్రహ్మణ్యం బాధా భరిత గీతాలు, మహమ్మద్ రఫీ మనసు కరిగించే గీతాలు, కిషోర్ కుమార్  కృంగదీసే గీతాలు... నా పిండాకూడు గీతాలు, నా శ్రాద్ధం  గీతాలు. ఇవీ ఆయన ప్రొద్దుగూకులూ ఇంట్లో మోగించే పాటలు.

ఇంకా విడ్డూరం చెప్పనా? పిల్లలకి జోలపాటగా ఎవరైనా ఏ 'జో అచ్యుతానంద' అనో ఏ 'లాలీ లాలీ' అనో పాడతారు. నీకు మీ నాన్న ఏం పాట పాడేవాళ్ళో తెలుసా? 'పాడుతా తీయగా చల్లగా' పాట! అందులో 'పసి పాపలా నిదుర పో తల్లిగా' అని ఉందని దాన్నో జోల పాట చేసేసారు. అప్పటికీ నేను ఉండబట్టలేక 'ఆ పాట పసిపిల్లకి తండ్రి పాడే జోలపాట కాదండీ, భర్త పోయి పుట్టింటికి వచ్చిన హీరోయిన్ను ఓదారుస్తూ వాళ్ళింటి పాలేరు పాడే ఏడుపు పాట', అని చెప్పినా వింటేగా!   
 బాధ్యతలలో పడి మీ నాన్న  ఆ పాటల గోల తగ్గిస్తే కాస్త ప్రశాంతంగా ఉన్నాను. కానీ 'ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు' ఆ మధ్య ఒకసారి అపార్ట్మెంట్ ఫంక్షన్లో ఈయనో ఏడుపు పాట పాడితే అందరూ మెచ్చుకుని ఏడ్చారు. అంతే! రిటైర్ అయ్యీ అవ్వగానే పాత పాటల డైరీలు బయటకు తీసారు మీ నాన్న.
దానికి తోడు ఈ మధ్య అదేదో హిందీ పాటల సంఘంలో చేరారు నా ప్రాణానికి.

ఘం భరే గీతో గార్ధభాండమో ఏదో చచ్చింది దాని పేరు. ఆ సంఘంలో సభ్యులంతా తిన్నదరక్కన్నట్లు ఆన్లైన్, ఆఫ్లైన్ మీటింగ్లు పెట్టుకుని, కమ్మగా పెళ్ళాలు చేసి పెట్టిన పకోడీలు హాయిగా తింటూ మరీ  ఏడుపు పాటలు పాడుకుంటారు. 
దాని కోసం మీ నాన్న వందేళ్ళ వ్యవధిలోని వ్యధా భరిత గీతాలన్నీ సేకరించి సాధన చేస్తున్నారు.  
ఇల్లంతా రకరకాల ఏడ్పు గొంతులతో దద్దరిల్లిపోతోందనుకో! 
అందరూ ఒక ఎత్తైతే ఆ కొత్త అబ్బాయి అర్చేతి సింగో అరికాలి సింగో ఎవడో ఉన్నాడు." 

"హాహా! భలే పేరు పెట్టావమ్మా. అతను ఇప్పుడు నంబర్ వన్ సింగర్, తెలుసా?"

"తెలుసులే. నిజానికి ఆ అబ్బాయి మంచి గాయకుడే.
కానీ ఏడుపు పాటల్లో ఎంత జీవిస్తాడంటే మిగిలిన గాయకులు గొంతులో దుఃఖాన్ని మాత్రమే పలికిస్తారు కానీ అతను మాత్రం దుఃఖాన్ని, దాని వల్ల వచ్చే ఏడుపునీ, తద్వారా ఉద్భవించే చీమిడినీ, అందువల్ల మూసుకుపోయిన ముక్కు యొక్క దిబ్బడనీ, చివరకు మిగిలే గొంతు గరగరనీ మొత్తం అన్నిటినీ ఒకేసారి, ఒకే పాటలో ప్రదర్శిస్తాడు. అంత భావ గర్భితంగా ఆ గాయకుడు పెట్టే శోకాలకి అతని పాట ఒక్క చరణం విన్నా చాలు, నాకు ద్రౌపదీ వస్త్రాపహరణం నుంచి జలియన్ వాలా బాగ్ ఉదంతం వరకూ జరిగిన ఎక్కడెక్కడి విషాద సంఘటనలన్నీ గుర్తొచ్చి కడుపు లుంగ చుట్టుకుపోతుంది. అలాంటిది రోజంతా ఆ పాటలే వినబడుతుంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా అపర్ణా."

"అయ్యయ్యో, నీ బాధ అర్థం అవుతోంది అమ్మా, 
ఎలాగూ ఇవ్వాళ అందరం అక్కడికి వస్తున్నాంగా, మాకు చెప్తే మేమే నాన్నకు అర్థమయ్యేట్లు  చెప్పేవాళ్ళం కదమ్మా. నువ్విలా ప్రొద్దున్నే ఏమీ తినకుండా  వెళ్ళిపోతే  కష్టం కాదూ? "
"ఏం చెయ్యమంటావు? ఇవ్వాళ ప్రొద్దున జరిగింది గుర్తొస్తేనే నాకు ఒళ్ళు మండి పోతోంది."

"ఏమయ్యిందీ?"

"పండక్కి మిమ్మల్ని అందర్నీ ఇక్కడకు రమ్మన్నానా, మీరంతా వస్తే ఎంత ఆనందంగా గడపొచ్చో, పిల్లలతో ఇల్లెంత కళకళలాడుతుందో అనుకుంటూ  సంతోషంగా నేను వంట చేస్తూ ఉన్నాను. 
అంతలోనే  మీ నాన్న పెద్దగా ఇంటినబడి పాడటం మొదలుపెట్టారు .

'ఒక నాటి ఉద్యాన వనమూ..
నేడు కనమూ...
అదియే మరుభూమిగా నేడు మారేనులే....
ఆనంద నౌకా పయనించు వేళ శోకాల సంద్రాల ముంచేవులే.' 
పండగ పూట పొద్దున్నే  ఆయన కొంపలో పెట్టే కేకలు అవీ. వింటుంటేనే నాకు భయంతో  ఒళ్ళు జలదరించిపోయిందనుకో " 
ఆపుకోలేక పొట్ట పట్టుకుని నవ్వడం మొదలు పెట్టింది అపర్ణ.
"నీకు నవ్వులాటగానే ఉంటుంది. కానీ నా స్థానంలో ఉండి ఆలోచిస్తే అర్థమౌతుంది.
అదేమంటే వాళ్ళ పాటల సంఘంలో రేపు స్వభాషా శోక సంగీత కార్యక్రమమటా, అందుకని ఈ రోజంతా ఈయన గారు ఆ పాట సాధన చేసి చావగొడతారట. నేను పండగ పూట నట్టింట్లో ఆ అపశకునపు కేకలు వినలేక గబగబా వంట ముగించి ప్రశాంతంగా ఉంటుందని గుడికి వచ్చేసా. మీరు వచ్చాకే ఇంటికి వస్తా." గట్టిగా అంది జానకి.
"ఇదిగో, నీతో మాట్లాడుతుండగానే మన కాలనీకి వచ్చేసాము. నువ్వేం దిగులుపడకు, నాన్నకు అర్థమయ్యేట్లు నేను చెప్తాను" భరోసా ఇచ్చింది అపర్ణ.

  *************************

ఆ రోజు రాత్రి మిగిలిన వాళ్ళు పడుకున్నాక 
"నాన్నా, మీరు అమ్మ బాధ అర్థం చేసుకోవడం లేదు. ఈ వయసులో హార్మోన్ల మార్పులు, శారీరిక సమస్యలతో యుద్ధం చేయవలసిన సమయంలో మనమంతా అమ్మకి మానసికంగా చేయూతనివ్వాలి, ముఖ్యంగా మీరు"అంటూ తండ్రికి నచ్చచెప్పబోయింది అపర్ణ.
"ఇది మరీ బాగుంది. నాకిష్టమైన పాటలు నేను వింటానంటే నేనేదో చెయ్యరాని ఘోరం చేస్తున్నట్లు మాట్లాడతారేంటి మీరంతా? అసలు ఆ పాటల గొప్పతనం తెలుసా మీకు?"

"చూడండీ..   ఆ పాటలని  నేను తక్కువ చేయట్లేదు, నేను బాధ పడేది కేవలం ఆ పాటల ప్రభావంతో నాకు కలిగే మానసిక స్థితి వల్ల, దానితో నాలో ఏర్పడే ఉద్వేగాల వల్లా. మీరన్నట్లు అవి అంత గొప్ప పాటలు కనుకనే వాటి భావాలు అంత బలంగా మనసులో వెల్లువెత్తుతాయి.
కానీ మీరు నవరసాల్లో ఆ శోకరసాన్ని ఒక్క దాన్నే తీసుకుని  సమయం సందర్భం లేకుండా నిరంతరం దానిలోనే  ముంచుతుంటే నావల్ల కావట్లేదు. పైగా సౌకర్యంగా లేదంటూ ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు కూడా పెట్టుకోరు మీరు. 
సినిమాలో అయినా ఆ ఏడుపు పాటలు ఏడుపు సందర్భంలోనే ఉంటాయి కానీ సినిమా మొత్తం విషాద గీతాలే ఉండవు కదా .
 మీరు కూడా ఇంట్లో అన్ని రకాల పాటలూ పెట్టండి, ఇద్దరం కలిసి ఆస్వాదిద్దాం" అభ్యర్థిస్తూ అంది జానకి.
"చూడూ, ఎన్ని రసాలున్నా నాకు చిన్నప్పట్నుంచీ  కరుణ రసమే ఇష్టం. ఏడుపు పాటలే ఇష్టం. 
ఇంకో రకం నాకు వద్దు.  నాకిష్టమైనవి నా ఇంట్లో నేను ఆస్వాదించడానికి కూడా సమయం, సందర్భం ఏమిటి?  సర్వకాల సర్వావస్థల్లోనూ నేను నాకిష్టమైన పాటలే వింటా. ఈ విషయంలో నా మీద నీ అజమాయిషీ కుదరదు.  
అందరికీ గుడ్ నైట్ " 
మొండిగా మాట్లాడి వెళ్ళి పడుకున్నాడు మోహన రావు..
జానకి, అపర్ణ మొహమొహాలు చూసుకున్నారు. 
ఆ చూపుల్లో  మోహన రావు ప్రవర్తనపై  నిరసనే కాక ఒక స్థిర నిర్ణయం కూడా ప్రతిబింబించింది.
***************************

మరుసటి రోజు ఉదయం జానకి వంటింట్లో పని చేసుకుంటుంటే, 
అసలు ముందు రోజు రాత్రి ఏ వాదనా జరగనట్లు మొహం పెట్టి వంటింట్లోకి వెళ్ళాడు మోహన రావు.
"జానకీ! గుర్తుందిగా, మా సంగీత సంఘం వాళ్ళ ఈ నెల సమావేశం ఇవ్వాళ మన ఇంట్లోనే అనీ."

"ఆ " 
"మధ్యాహ్నం నాలుగు గంటలకల్లా వచ్చేస్తారు. మొత్తం పది మంది.   ఏమైనా స్నాక్స్, టీ చెయ్యి" ఉల్లాసంగా చెప్పి పాటల సాధనకు పక్క గదిలోకి వెళ్ళి పోయాడు మోహన్ రావు.
  ************************
అనుకున్న సమయానికి  సంఘ సభ్యులంతా మోహన రావు ఇంట్లో చేరారు. ఆలస్యం చేయకుండా ఆందోళనా రాగంలో ఆలాపనలు మొదలు పెట్టారు. ఒకరిద్దరు బాగానే పాడారు. మిగిలిన వాళ్ళు పాడుతుంటే వివిధ జంతువుల ఏడుపులు గుర్తొచ్చాయి జానకికి. 
మధ్య మధ్యలో ఆవేశం ఆపుకోలేక అందరూ కలిసి పాడుతుంటే  అర్ధ రాత్రి  ఓ కుక్క ఏడిస్తే మిగిలినవన్నీ గొంతు కలపటం గుర్తొచ్చి పరుగెత్తుకెళ్ళి వాకిలి తలుపు మూసేసింది జానకి.
 కొంత సేపు అరచి అరచి, అలసిపోయి  విరామం ప్రకటించుకున్నారు గాయకులు. 
మోహన రావు జానకి వద్దకొచ్చి స్నాక్స్ వడ్డించమని సైగ చేసాడు. 
సరేనని తల ఊపింది జానకి.
ఆకలి గొన్న గాయకులు ఆవురావురుమని ఎదురు చూస్తూండగా వంటింట్లో నుండి విస్తరాకుల కట్టతో బయటకు వచ్చి, కుర్చీలలో కూర్చున్న వాళ్ళ చేతుల్లో ఒక్కో ఆకు పెట్టింది జానకి.
అయోమయంగా చూసాడు  మోహన రావు. 
అంతలోనే అందరి విస్తర్లలో ధబ్బుమని ఓ పచ్చటి పదార్థం పడింది. ఏమిటా అని చూస్తే పెసరపప్పుతో  చేసిన ముద్దపప్పు.
"జానకీ, ఏంటిది?" మెల్లిగా అన్నాడు మోహన రావు, భార్యను కొత్త స్నేహితుల ముందు ఎలా గదమాలో అర్ధం కాక. 
"ఆగండి", అన్నట్లు తీక్షణంగా చూసింది జానకి.

మ్రాన్పడిన మోహన రావు కళ్ళ ముందే అందరి విస్తర్లలో అన్నం , నువ్వుల పొడి, అల్లం పచ్చడి,  ఆవ పచ్చడి, ఇంకొన్ని తద్దినం  వంటలు, చివరకు చప్పటి చారు పోసి" ఇంక తినండి" అంది. 
అవేంటో తెలిసిన కొంత మంది ఇప్పుడివేంటన్నట్లు చికాకుగా మొహం పెట్టారు. 
అసలిలాంటి వంటలు, వడ్డనలు ఎరుగని నలుగురు ఉత్తరాది వాళ్ళు  ఈ సమయంలో అన్నమేమిటని అన్నంలా తెల్లబోయారు.
అందులో ఒకతను విస్తరి పట్టుకోవటం చేతకాక చారు, అల్లం పచ్చడి ప్యాంట్ మీద పోసుకున్నాడు. ఆ గందరగోళంలో అతడి విస్తరిలోని నువ్వుల పొడి ఫ్యాన్ గాలికి ఎగిరి పక్కావిడ కళ్ళలో పడింది. దాంతో ఆవిడ అంతకుముందు తను పాట పాడినదానికన్నా భీకరంగా అరిచింది. 
ఈ ఘోరకలి అంతా కళ్ళతో చూస్తున్న  మోహనరావు శిలా ప్రతిమలా బిగుసుకుపోయాడు. 
"ఏంటండీ, ఇవ్వాళ మీ ఇంట్లో ఎవరిదైనా తద్దినమా?"  అడిగాడు ఒక తెలుగాయన తేరుకుని.
"అబ్బే, కాదండి." నసిగాడు మోహన రావు. 
"మరిదేంటి? ఇష్టం లేకపోతే కుదరదని చెప్పాలి కానీ ఎప్పటివో  మిగిలిపోయిన తద్దినం వంటల్ని స్నాక్ టైంలో పెట్టడమేమిటోయ్?" కోపంగా అడిగాడింకో ఆయన.
అప్పటికి తెలివిలోకి వచ్చిన మోహన రావు
" జానకీ! ఏంటిది?" గద్దించాడు.
"అబ్బే, ఇవి ఈ రోజు వండిన తాజా వంటలేనండి. ఇందాకే చేసాను."అణకువగా చెప్పింది జానకి.
"నీకేమన్నా మతి పోయిందా?  స్నేహితులు వస్తున్నారని స్నాక్స్ చెయ్యమంటే తద్దినం వంట చేస్తావా?"
"మరి మొన్న మీ అమ్మగారి తద్దినానికి ఇవే వంటలు చేస్తే చాలా బాగున్నాయని రెండేసి సార్లు వేయించుకుని తిన్నారు కదండీ మీరు, మీకు అంత నచ్చాయని ఈ రోజు కూడా అవే చేసా."

"నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇలాంటప్పుడు ఏ సమోసాలో, మంచూరియాలో, మిర్చి బజ్జీలో ఇవ్వాలని కూడా తెలియదా?తద్దినం వంట తద్దినం రోజు బాగుందని తిన్నానని ఎప్పుడు పడితే అప్పుడు అవే చేసి వడ్డిస్తావా? ఓ సమయం సందర్భం ఉండదా దేనికైనా?"
"ఏమోనండీ, నిన్న మీరేగా అన్నారు "నా ఇంట్లో నాకు నచ్చినవి నేను ఆస్వాదించడానికి సమయం సందర్భం ఎందుక"నీ?.
"నాకు ఏది నచ్చితే అదే సర్వకాల సర్వావస్థలలోనూ ఆస్వాదిస్తాను" అని కూడా అన్నారు. అందుకే !"
అమాయక వదనం పెట్టి అన్నది జానకి.
జానకి అంతరార్థం గ్రహించి అంతర్మథనంతో తల దించేసుకున్నాడు మోహన రావు.
మిత్రులంతా మెల్లగా నిష్క్రమించారు. 
**************************
కొన్ని నెలల తర్వాత ఓ ఆదివారం...  
"జగమే మారినది మధురముగా ఈ వేళ.... "
మధ్యాహ్నం జరగబోయే గాయకుల సమావేశంలో పాడటం కోసం పాట సాధన చేస్తున్నాడు మోహన రావు.
'నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండు' పాట వింటూ, ఆ జానకితో గొంతు కలిపి తానూ కిలకిలా నవ్వుకుంది, పాటల కార్యక్రమం కోసం మసాలా వడలు చేస్తున్న జానకి.
   ************************

No comments:

Post a Comment