Sunday, March 29, 2026

 *గర్వం వద్దు🙏:*

💗✨*ఎన్నో కోట్ల జన్మల తర్వాత జీవునికి మానవ జన్మ ప్రాప్తిస్తుంది*

ఓ చిన్న కథ 👇

అనగనగా ఒక తూనీగ.. చెట్టుకొమ్మపై వాలి ఉన్నది. బాగా రాత్రి అయ్యింది. రెండు మిణుగురు పురుగులు ఎంతో ఆనందంతో తిరుగుతూ తూనీగను చూసి, గర్వంతో 'ఓహో నీవా! తూనీగా! దారి తెలియక ఇక్కడ పడి ఉన్నావా? మేము వెలుగులు విరజిమ్ముతాము. ఆ వెలుగులో వెళ్తావా?' అని హేళనగా మాట్లాడేయి.

ఆ మాటలకు తూనీగ 'మిత్రమా! నేను వెలుగు లేకపోయినా, ఎక్కడికైనా వెళ్ళగలను. కానీ మీరు మాత్రం పగలు బయట కనపడలేరు. నన్ను హేళన చేసే ముందు మీరు ఏమిటో తెలుసుకోండి!' అన్నది. 

కానీ మిణుగురు పురుగులు ఇంకా హేళనగా నవ్వుతూ 'ఈ ప్రపంచానికి మేమే వెలుగు చూపుతున్నాము. మా వల్లే ఈ ప్రపంచం వృద్ధి చెందుతుందని తెలుసుకో' అని చెప్పాయి. 

ఆ మాటలకు తూనీగ 'నేను గొప్పవాడినని ఎవరికి వారు గర్వపడకూడదు. ఎదుటివారిని కించపరచకూడదు. మేమే గొప్పవారమని ఎప్పుడూ అనుకోకూడదు. మనకన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. సాయంకాలం వేళ మీరు బయటికొచ్చి, నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నానని అనుకుంటున్నారు. కానీ నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతో మీ గర్వo పటాపంచలవుతుంది. తళతళ మెరిసే ఆ తారలూ ప్రపంచానికి మేమే వెలుగునిస్తున్నామని అనుకుంటాయి. కానీ చంద్రుని రాకతో తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తనవల్లే ప్రపంచమంతా సంతోషంగా
ఉందని మొత్తం భూమిని తన వెలుగుతోనే నింపుతున్నాననుకుంటాడు. కానీ తరువాత తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం కాగానే ఆ వెలుగులో చంద్రుడు ఉన్నచోటే తెలియకుండాపోతాడు. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడు చెప్పుకోకూడదు. ఎవరి విలువ వారికుంటుంది..' అన్నది తూనీగ.

*నీతి:మేమే గొప్ప అనే అహంకారంతో పక్కన వాళ్ళను చులకన చేయరాదు.*
*ఎవరి గొప్పతనం వారికుంటుంది*

No comments:

Post a Comment