*తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు వాటి ప్రముఖ్యత -7*
🛕
*తూర్పు గోదావరి జిల్లా*
*మందపల్లి: మందేశ్వరుడు*
పూర్వము దధీచి మహర్షి వృత్రాసురుని సంహరించుటకు ఇంద్రునకు ఆయుధముగా తన వెన్నెముక నిచ్చెను. అదే వజ్రాయుధము. అశ్వతుడు, పిప్పలుడు అను దానవులు ఇంద్రునకు ఆయుధము నిచ్చినందుకు కోపగించి, దధీచిని హింసించిరి. ఆ ప్రాంతమున నున్న ప్రజలను, మునులను కూడ బాధించిరి. ప్రజలు అగస్త్యుని వద్దకు వెడలి తరుణోపాయమును వేడిరి, తన శిష్యుడైన శనిని ప్రార్థించమని వారికి బోధించెను. శని కరుణించి రాక్షసులను సంహరించెను. ఆ ప్రదేశమున ఈశ్వరలింగము ను ప్రతిష్ఠించెను. ఆ ఈశ్వరుడే మందేశ్వరుడు. ఈ మందేశ్వరుని అర్చించిన ప్రజలందరి పాపములు నశించి కాపాడబడునట్లు ఈశ్వరుని చే శని వరమును పొందెను.
దేశము నలుమూలల నుండి వేలాది ప్రజలు ఎన్నో వత్సరముల నుండి ఇచ్చటికి వచ్చి మందేశ్వరుని అర్చించున్నారు. తైలాభిషేకమన్న మందేశ్వరునకు ప్రీతి. మాఘ బహుళ ఏకాదశికి మందేశ్వరుని కళ్యాణము జరుగును. శనిత్రయోదశినాడు తైలాభిషేకపూజలు ఎన్నో జరుగును.
మందేశ్వరుని ఆలయ ఆవరణలో పార్వతీదేవి, బ్రహ్మేశ్వరస్వామి, నాగేశ్వరస్వామి, వేణుగోపాలు ని ఆలయములు కలవు. గౌతమీ తీరమున, రావుల పాలెమునకు 5 మైళ్ల దూరమున ఈ గ్రామము కలదు..
📖
*అంతర్వేది: లక్ష్మీనరసింహస్వామి*
ఇచ్చట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము ప్రధానమైనది. అంతర్వేది నరసింహక్షేత్రము.
నీల కంఠేశ్వరుడు క్షేత్రపాలకుడు. ఈ తీరమున బ్రహ్మ, రుద్రయాగము చేసి నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్ఠ కావించెను. విరించి చేత యజ్ఞశాలగ యీ ప్రదేశము ఉపయోగించబడినది కావున దీనికి 'అంతర్వేది' అను పేరు వచ్చినది.
ఇచటనే వశిష్ఠమహర్షి గోదావరిని సముద్రునితో కలిపి, సాగరసంగమమునకు సమీపమున ఒక ఆశ్రమము నిర్మించుకొని శ్రీహరిని గురించి తపస్సు చేసెను.
పూర్వము విరోచనుడను రాక్షసుడు వసిష్ఠుని నూర్గురు కొడుకులను సంహరించెను. అతనిని తుదముట్టించుటకు వసిష్ఠు శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు చేసెను. శ్రీహరి తన సోదరి అళ్వారూఢాంబ సహాయముతో విలోచనుని సంహరించెను. ఆ సందర్భములో శ్రీహరి నారసింహావతారము ఎత్తైను. వసిష్ఠుని ప్రార్థనపై శ్రీహరి లక్ష్మీనృసింహరూపమున అంతర్వేదిలో డమర ముఖముగా సాక్షాత్కరించెను. రాక్షసుని -కళేబరము అంతర్వేది పై కెగిరి ముక్కలయ్యెను. అందువలన అంతర్వేది అనుపేరు ఆస్థలమునకు వచ్చెను.
శ్రీ రాముడు రావణ సంహారానంతరము ఈ స్థలమునకు వచ్చి శివపూజ చేసెను. మాఘ శుద్ధ దశమికి లక్ష్మినరసింహ కల్యాణము. నృసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి ముఖ్యఉత్సవములు. ఉత్సవము సమయములలో వచ్చు యాత్రికుల కు ఉచిత భోజన సౌకర్యము కలదు. లక్ష్మీ నరసింహుని ఆలయములో వేణుగోపాలస్వామి, సీతారామలక్ష్మణులు, రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయములు కలవు.
శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము అశ్వారూఢాంబిక ఆలయము అంతర్వేదిలోని ఇతర ఆలయములు.
📖
*సర్పవరం: భావనారాయణస్వామి*
"పరమగీర్వాణ యాగ వైభవము నెలవు నిఖిల కళ్యాణ గుణకేలి నిలయ మనఘ దివ్యములు నూట ఎనిమిది తిరుపతులకు పరపు పదమైన శ్రీ సర్పపురమునందు"
- భీమేశ్వరపురాణం: శ్రీనాధుడు
ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో సర్పవరమొకటి. ఇది కాకినాడకు 6 కిలోమీటర్ల దూరంలో వున్నది. గోదావరికి తూర్పున, తుల్యభాగకు ఉత్తరమున సముద్రతీరము గలదు.
నాగమాత కద్రువ తన కుమారులను జనమేజయుని సర్పయాగమున అగ్నికాహుతి యగుడని శపించినది. వారిలో సర్పరాజు అనంతడు ఈ ప్రదేశమునందు తపస్సు చేసి విష్ణువుని మెప్పించి ఆయనకు శయ్యగా మారెను. సర్పము తపస్సు చేసిన స్థలమగుటచే ఇది సర్పపురము- అదే సర్పవరమైనది.
నారదుని భావమాలిన్యమును తొలగించి అతని కోరికచే ఇచట భావనారాయణ స్వామి వేద విధానమున నారదునిచే ప్రతిష్ఠింపబడినాడు. భావమున తలచుకొన్న వారికి ముక్తి లభింప జేయు దేవుడగుటచే భారనారాయణుడైనాడు. నారద గుండము ముక్తికుండము నేటికినీ గలవు.
కూచిమంచి తిమ్మకవి సర్పవర మాహాత్మ్యమును గ్రంధముగా రచించెను. కలోత్తుంగ దేవుని తమిళ శాసనము, విష్ణువర్ధనుని శాసనము, కాటయ వేమారెడ్డి శాసనము దేవాలయమున గలవు. కాటయవేముని విగ్రహం ఆలయమునందు కలదు. పిఠాపురం మహారాజుల కాలమున దేవాలయము మహావైభవంతో విలసిల్లింది. నంబూద్రి బ్రాహ్మలు ఈ ప్రాంతమునుండే వలసి వెళ్లినట్లుగా చారిత్రికాధారములు గలవు.
📖
*ముక్తేశ్వరం : క్షణముక్తేశ్వరాలయం*
శ్లో|| ముక్తేశ్వరం తతస్తీర్థం శృణుష్వ సుసమాహితః యస్మిన్ తీర్థేనరా
ముక్తిం క్షణా ద్యాంతి శివాజ్ఞయా!!
ముక్తేశ్వరము అమలాపురమునకు 12 కిలోమీటర్ల దూరంలో గౌతమీ నదీ తీరమున ఉంది.
రావణ సంహారానంతరము తనకు కలిగిన బ్రహ్మహత్యాపాపం నశించుటకు శ్రీరాముడు శివలింగములను ఎన్నిటినో పలుచోట్ల ప్రతిష్ఠించెను. ఎన్నో పుణ్య క్షేత్రములు దర్శించెను. ఒకనాడు ఈ ముక్తేశ్వర ప్రదేశముపై విమానంలో వెళ్ళుచుండగా హఠాత్తుగా విమానము ఆగిపోయింది. శ్రీరాముడు విమానం దిగి ఆ ప్రదేశమును పరిశీలించెను. ఆ అరణ్య ప్రదేశములో ఒక పుట్ట కనిపించింది. శ్రీరాముని పరివారము పుట్టను పరిశీలించారు. ఆ పుట్టలో ఒక ఆలయము ఒక జ్యోతిర్లింగము కలవు. ఆ సమీపమున జటాధారిణియైన 'శ్రమణి' యను స్త్రీ ధ్యాన నిమగ్నయై కనిపించెను. శ్రీరాముడు ఆ ఆలయమును, తపస్వినిని సందర్శించెను. ఆమె కనులుతెరచి తన శాప వృత్తాంతమును వివరించెను. శ్రీరామ దర్శనముచే శాపవిముక్తి జరిగినది.
శ్రీరాముడు జ్యోతిర్లింగమును స్తోత్రము చేసెను. పరమశివుడు ఆ లింగము నుండి ప్రత్యక్షమ య్యెను. శ్రీ రాముని కోరికపై సదాశివుడు లింగములో ఐక్యమయ్యెను. ఈశ్వర కృపచే శ్రమణి కూడా శివలింగములో ఐక్యమయ్యెను. ఆమెకి ఇచ్చట క్షణములో మోక్షము ప్రాప్తించింది. ఆ కారణమున ఈశ్వరుడు "క్షణముక్తేశ్వరుడు”.
గా పిలవబచుండెను.
ఈ క్షేత్రమున కేశవస్వామి క్షేత్రపాలకుడు. విజయదశమి, కార్తికమాసము, ధనుర్మాసము లలో ముఖ్య ఉత్సవములు జరుగతాయి. మహాశివరాత్రికి కళ్యాణము జరుగతాయి.
📖
*మురమళ్ళ: శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి*
మురమళ్ళకు పూర్వనామం మునుపల్లె. ఎందరో మునులు ఇచ్చట ప్రశాంతముగా తపస్సు చేసికొనెడివారు. గౌతమీ తీరమున నిర్మలమైన ప్రదేశమిది. దక్షుని యాగధ్వంసము చేయుటకు అవతరించిన వీరభద్రుడు, ఆ యాగ విధ్వంసా నంతరము శివసంకల్పమున భద్రకాళీ సహితుడై మునిపల్లె వద్దకు వచ్చి వెలసెను. మురమళ్ళకు దగ్గరగానున్న కొమరిగిరి గ్రామ నివాసి వీరశరభ రాజు ప్రస్తుతమున్న ఆలయమును నిర్మించెను. రాజాదంతూరి జగన్నాధరాజు, శ్రీవారి నిత్య కళ్యాణం నిమిత్తము ఏబది ఎకరముల భూమిని దాన మిచ్చారు. ఇదిగాక వారి బంధువులు సుమారు 200 ఎకరములు వరకూ దానము చేసిరి.
ఆంధ్రదేశమున మరి ఏ స్వామికి నిత్యకళ్యాణము లేదు. ఈ వీరేశ్వరస్వామి వారికి నిత్య కళ్యాణము జరుగును.
📖
*పలివెల : కొప్పు లింగేశ్వరస్వామి*
వాడె మా యింటి వేల్పు పల్వల పురమున గొప్పులింగంబు ఫణిరాజు కుండలుండు-
అని కొప్పు లింగేశ్వరస్వామిని శ్రీనాధుడు భీమేశ్వర పురాణమున వర్ణించెను. కూచిమంచి సోమసుందరకవి కొప్పు లింగేశ్వర శతకము ప్రసిద్ధిమైనది. ఆ స్వామి నిలయమే పలివెల. ఇది గోదావరీ మండలమునందలి ప్రాచీన శైవక్షేత్రాల లో కొత్తపేటకు మూడు కిలొమీటర్ల దూరములో కౌశికీ తీరమునందు ఉన్నది. కోనసీమలోని అతి ప్రాచీన దేవాలయములలో నిది యొకటి. ఈ స్వామి అగస్త్వేశ్వరుడు. అగస్త్య ప్రతిష్ఠయగుటచే లింగముపై కొప్పు ఉండును.
వేశ్యాలోలుడైన అర్చకునకు స్వామికి అలంకరించవలసిన పూలమాలలు తన ప్రియురాలికి సమర్పించుట అలవాటు. ఒకనాడు మహారాజు ఆ స్వామి దర్శనమునకు వచ్చెనని తెలిసికొని, వేశ్య ధరించిన మాలను రాజునకు ప్రసాదముగా సమర్పించెను. దానిలో ఒక శిరోజమును చూసిన రాజు ఈతని వేశ్యాలోలత్వ మును గూర్చి విని ప్రశ్నించెను.
ఈ శిరోజము స్వామిదే. ఆ స్వామి శిరస్సుపై కొప్పు కలదని చెప్పి తప్పించుకొనెను. నేడు అలంకారము పూర్తి అయినది రేపు ఉదయము వచ్చిన చూపించెదనని పల్కెను.
నాటి రాత్రి అర్చకుడు తనకు సంభవించిన క్లిష్ట పరిస్థితిని స్వామికి వివరించి వేడుకొనగా మరునాడు వచ్చిన రాజునకు కొప్పుతో అగుపించి భక్తుని రక్షించెనని కథ గలదు. ఆ పూజారికి రాజు ఇచ్చిన మాన్యములే "జాత్తుగ పాడు" మాన్యములు. ఇట్లు ఆగస్త్యేశ్వరుడు కొప్పు లింగేశ్వరుడుగా మారెను. మహాశివరాత్రికి రధోత్సవము మహా వైభవముగా జరుగును.
స్వామి ఎడమ ప్రక్క పాను వట్టము మీదనే అమ్మవారు ఉమాదేవి కలదు. మండపములో ఒక పెద్ద నంది కలదు. స్తంభ మండపములు, ఉయ్యాల మండపము, ధ్వజద్వార మండపము వివిధ శిల్పరీతులతో ప్రకాశించుచున్నవి. 12 వ శతాబ్దమునాటి నుండి రాజశాసనాలు ఈ ఆలయ స్తంభములపై గలవు.
🛕
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment