Saturday, March 28, 2026

 మాంచాలి గారు నా కలీగ్. 
ఆమె తల్లిగారు శ్రీమతి రేవతి గారు రాసిన కన్నడ కథ ఇంగ్లీష్ కి అనువదించి పంపిస్తే, నేను తెలుగులో రాసాను. అనువాదం చేయడం నాకు ఇదే తొలి ప్రయత్నం. యదాతథంగా రాయాలన్న ఉద్దేశంతో వ్రాయడంవల్ల, నా శైలికంటే కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కానీ, కథ మీ అందరికీ నచ్చుతుందన్న ఉద్దేశంతో పోస్ట్ చేస్తున్నాను, అసలు రచయిత్రుల అనుమతితో..!
చదివి మీ స్పందన తెలియ చేయండి.
చిత్రం నేనే గీసాను
😊
----

కన్నడ మూలం : రేవతి రవీంద్ర
ఆంగ్లానువాదం : మాంచాలి పాటిల్
తెలుగు అనువాదం : *శ్రీనూ వాసా*
13-09-2020

----
నేను అదృష్టవంతురాలిననే చెప్పాలి. ఎందుకంటే నేను చిన్నిచిన్ని విషయాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చేరోజుల్లో పుట్టి పెరిగాను.
అవును, నేను ఉత్తర కర్ణాటకలో ఒక చిన్న వ్యవసాయమే ప్రథాన వృత్తిగా గల దుమ్ము కొట్టుకుపోయిన చిన్న ఊరిలో పెరిగాను. మేము తిన్నది అంతా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులే. కానీ చాలా చవకైనవి, ఇప్పటిలా కాదు.. ఇప్పుడైతే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తి (ఆర్గానిక్) పేరుతో రెండింతలకి అమ్ముతున్నారు. పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి, ఊరివారంతా ఉమ్మడి కుటుంబంలా..
అన్నిరకాల వర్గాల ప్రజలనీ కట్టకట్టుకున్న ఊరు. ఇక్కడి పెద్దవాళ్ళు పిల్లలకి చదువు ఎంత అవసరమో తెలిసిన ప్రగతిశీల, అభ్యుదయవాదులే కాబట్టి వాళ్ళ పిల్లలని చదివించుకున్నారు.
ఇక టెక్నాలజీ విషయానికోస్తే, మావూరు 1970-80 ల లోని భారతదేశపు ఇతర పల్లెటూళ్ళ లాగే... కరెంటు, నీటి కుళాయిలు, రేడియో వంటివి అప్పట్లో విలాసవంతమైన సౌకర్యాలు... కొంతమందికే ఉండేవి.
అలాంటి రోజుల్లో శంకరప్ప ఊరికి టేప్ రికార్డర్ పరిచయం చేసాడు. అదంటే అతనికి ఎంతో ఇష్టం. ఇల్లు కదిలితే అది అతనితో ఉండాల్సిందే!
ఎంతో సంతోషంగా ఊళ్లో ప్రతిఒక్కరికీ చూపించేవాడు. అలా చూపించడం అతనికి ఎంతో గర్వంగా ఉండేది. ఉళ్ళో చిన్న, పెద్ద అందరికీ కబుర్లు చెప్పే, పాటలు పాడే రేడియో గురించి తెలుసు కానీ, టేప్ రికార్డర్ వాళ్ళకి ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది.
ఎనభయ్యేళ్ళ గౌరమ్మ అతని నానమ్మ. ఊళ్ళో వాళ్ళు ఎన్నో సమస్యలతో ఆమె దగ్గరకి వచ్చేవాళ్ళు. వాటన్నింటికీ పరిష్కారాలు చూపించేది. ఆరోజుల్లో ఏ సమస్య వచ్చినా పెద్దవాళ్ళను సంప్రదించేవారు. వాళ్ళు చెప్పేది నమ్మకంతో పాటించి సమస్యల నుండి బయటపడేవారు. ఈరోజుల్లో ప్రతీదీ గూగుల్‌లో వెదకడమే! ఇంకా సమస్య పెద్దదైతే మానసిక వైద్యులని సంప్రదిస్తున్నారు. సైకియాట్రిస్ట్ లని సంప్రదించడం తప్పుకాదు, కానీ అంతకంటే ముందు వాళ్ళ తల్లిదండ్రులనో లేక ఎవరైనా పెద్దవాళ్ళని సంప్రదించాలి కదా!
ఒకరోజు - రోజంతా పనిచేసి శంకరప్ప ఇంటికి చేరుకున్నాడు. చీకటిపడి అప్పటికే సుమారు గంటయ్యింది. మసక చీకటి పోయి వెన్నెల పరచుకుంది.
ఇంతలో గౌరమ్మ తన పక్కమీది నుంచి లేచి కూర్చుని శంకరప్పని పిలిచింది. "అబ్బాయ్, నువ్వు పట్నం నుంచి తెచ్చిన డబ్బా తీసుకుని ఇలా రా" అంటూ.
టేప్ రికార్డర్ తో వచ్చాడు శంకరప్ప.
"అబ్బాయ్, ఇది నేను దానికి ఏదైనా చెప్తే ఆ విషయాలన్నీ గుర్తుంచుకుంటుందా ?" అడిగింది గౌరమ్మ.
"అవును బామ్మా.." అన్నాడు శంకరప్ప.
"నేను దీనితో మాట్లాడాలనుకుంటున్నాను" అన్నది బామ్మ. శంకరప్ప రికార్డర్ ఆన్ చేసి ఆమె చెప్పేది రికార్డ్ చేస్తున్నాడు... ఇంత రాత్రివేళ ఈ ముసలమ్మ ఏం చెప్పాలనుకుంటోందో అని బుర్ర గోక్కుంటూ.
"అబ్బాయ్.. నేను ఈ ఊళ్ళో చాలామందికి వడ్డీకి డబ్బులిచ్చానురా.. ఆ విషయాలు నీకు తెలీదు. ఇప్పుడు ఎవరికి ఎంత ఇచ్చానో, వడ్డీ ఎంతొస్తుందో చెప్తాను" అని చెప్పడం మొదలెట్టింది బామ్మ.
పేరు, వాళ్ళు ఎంతివ్వాలి ? వడ్డీ ఎంత ? లిస్టు చెప్పడం మొదలెట్టి అనర్గళంగా 15-20 నిమిషాలు మాట్లాడింది బామ్మ! మొత్తం అంతా కలిపి పదివేల రూపాయలకు పై చిలుకు! ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం!
శంకరప్ప అవాక్కై వింటున్నాడు. చాలా ఆశ్చర్యం కలిగింది అతనికి. "ఇప్పుడు ఇంత రాత్రివేళ ఎందుకు చెప్తున్నావ్ ఇవన్నీ ?" అడిగాడు చిరుకోపంగా.
"ఏం లేదురా, ఊరికే. ఏదో చిన్న నొప్పిగా అనిపిస్తుంది ఛాతీలో" అంది గౌరమ్మ.
"చాలా సేపట్నుంచి మాట్లాడుతున్నావ్, చాలా అలిసిపోయావులే కాని, ఇక పడుకో.. అదే సర్దుకుంటుంది" అని చెప్పేసి టేప్ రికార్డర్ పట్టుకుని వెళ్ళిపోయాడు పడుకోవడానికి, ముసలమ్మ నిద్ర చెడగొట్టింది అని తిట్టుకుంటూ.
తెల్లవారి ఆరయ్యింది. "టీ పెట్టాను, వెళ్ళి బామ్మని లేపు అని చెప్పింది" శంకరప్పకి వాళ్ళమ్మ.
పొద్దున్నే లేచి వాకిలి శుభ్రం చేసి, కళ్ళాపు చల్లి, ముగ్గులు పెట్టి, రాత్రి వదిలిన గిన్నెలు తోమి, స్నానం చేసి వచ్చింది. ఇప్పుడు టీ టైం.
చిన్ని స్టీల్ గ్లాసులో వేడివేడి టీ, దాని అంచులని జాగ్రత్తగా పట్టుకుని గాఢంగా నిద్రపోతున్న బామ్మ గదిలోకి నడిచాడు శంకరప్ప.. "బామ్మా.. లే..టీ తాగుదువు గాని" అని పిలుస్తూ.
ఉలుకు పలుకు లేదు. ముఖం ప్రశాంతంగా.. నిశ్చలంగా.. బాధలు, చింతలు, రహస్యాలు అన్నీ విడిచిపెట్టి, నిర్మలంగా ఉంది!
శంకరప్పకి తెలీదు... తన టేప్ రికార్డర్ బామ్మ చివరి మాటల్ని శాశ్వతంగా పదిల పరుస్తుందని.
ఆ టేప్ రికార్డర్ విలువ 110 రూపయలనుంచి ఒక్కసారిగా పదివేలు, తరవాత వెల కట్టలేనంత విలువైనది అయిపోయింది!
మిత్రులారా.. ఇది కథ కాదు. యదార్థ సంఘటన.
ఊరు గుర్తొచ్చిన ప్రతిసారి నాకనిపిస్తుంది.. జీవితంలో అనేక మంది మనుషులు తారసపడతారు. కొన్ని సంఘటనలు, యాదృచ్ఛిక ఘటనలు, మనసులో చెరగని ముద్ర వేస్తాయి.
నాకు గౌరమ్మ ఒక పెద్దావిడలా మాత్రమేకాదు.. అందుబాటులో ఉన్న వనరుని ఎంతో నేర్పుగా తన లావాదేవీలని రికార్డు చేయడానికి ఉపయోగించుకున్న తెలివైన బామ్మగా గుర్తుండిపోయింది.

తెలివి అనేది డిగ్రీలు చదివితే రాదు. వివేకంతో గౌరమ్మ లాంటివాళ్ళు ప్రతిదినం నేర్చుకుంటూ, ఆ విజ్ఞానాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకుంటూ ఉంటారు!

-- by రేవతి రవీంద్ర

No comments:

Post a Comment