*తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు వాటి ప్రముఖ్యత -8*
🛕
*తూర్పు గోదావరి జిల్లా*
*కోటిపల్లి: సోమేశ్వరాలయం*
కోటిపల్లికి, కోటిఫల్లి నామాంతరము. ఇక్కడి సోమేశ్వరాలయము దక్షారామములోని భీమేశ్వరునకు దక్షిణముగానున్న ప్రసిద్ధ ఆలయము దక్షారామమునకు 12 కి.మీ దూరములో కలదు.
ఇంద్రుడు అహల్య సంగమ దోషాన్ని పరిహారము చేసికొనుటకు ఒక లింగమును ప్రతిష్ఠించి కోటి తీర్థ జలములతో అభిషిక్తము చేసెను. కావున ఈయన కోటీశ్వరుడు. ఈ లింగము పాతాళము నుండి యున్నదని ప్రతీతి. ఇది యోగలింగము. ఉత్సవములు జరుగవు. ఈ క్షేత్రమున చేసిన దానములు కోటి గుణముల ఫలమునిచ్చును.
తారాచంద్రుల ప్రణయకేళీవిలాసము వలన బుద్ధుడు జన్మించాడు. బృహస్పతి శాపంతో చంద్రుడు కళావిహీనత్వాన్ని పొందాడు. బృహస్పతిని ప్రార్థించగా కోటి తీర్థంలో నిత్యం స్నానం కావిస్తే ఆ ప్రభావంగా క్షీణసాపుడవగుదు వని శాపవిముక్తిని తెలిపాడు. చంద్రుడు శాప విముక్తికి నిత్యస్నానాన్ని ఆచరించి కోటీశ్వరునికి దక్షిణ దిశగా సోమశేఖరుని ప్రతిష్ఠించి ఆరాధించాడు. ఛాయలను సిద్ధింపచేసిన ఈశ్వరుడగుటచే ఈయన ఛాయాసోమేశ్వరు డైనాడు.
ఈ ఆలయములో నంది చాల ఆకర్షణీయముగా నుండును. సోమేశ్వరాలయములోని శ్రీదేవి - భూదేవి సహిత జనార్ధన స్వామిని కశ్యప మహర్షి ప్రతిష్ఠించినట్లు కలదు.
కోటిపల్లి పెద్దాపుర సంస్థానములోనిది. పూసపాటి విజయరామరాజు గారి కాలంలో విజయనగరం సంస్థానంలో చేరింది. పుష్కర సమయమున ఇక్కడ గోదావరీ సముద్ర సంగమ స్నానము సర్వపాపహరము.
📖
*ద్రాక్షారామం: భీమేశ్వరాలయం*
ప్రతాపరుద్రయశోభూషణమనే అలంకార గ్రంథం వ్రాసిన విద్యానాధుడు “శ్రీశైల కాశీశ్వర ద్రాక్షారామ నివాసినః ప్రతిదినం త్వచ్ఛేయసే జాగ్రత!" అని అన్నాడు. మనదేశానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి హేతువైన క్షేత్రత్రయంలో ద్రాక్షారామం ఒకటి.
ఉత్తర భారతదేశంలో వారణాసి ఎట్టిదో, దక్షిణా పధంలో ద్రాక్షారామం అట్టిది. అందుకే “దక్షిణకాశి" అనే వ్యవహార రూఢి ఏర్పడింది. 'దక్షుని నవనాగారము దక్షారామంబు” అని శ్రీనాధుడు అనడం "దక్షారామం”, అని మాత్రమే శాసనాలలో ఉండడం చూస్తే బహుశః రేఫయుక్తంగా “ద్రాక్షారామం'' అనేక్వచిద్వ్య వహారినికి హేతువు. ఒకప్పుడు ఆ గ్రామంలో ద్రాక్ష తోటలు విరివిగా ఉండేవి అని భావించవచ్చు. ఇప్పటికి తమల పాకులకు ద్రాక్షారామం పేరుపడ్డది. తములపు తీగలు, ద్రాక్షలతలు ఒకే చోట పెరగటం సామాన్యం, 'దక్షారామం' సంస్కృత పదం. కొన్ని శాసనాలలో పర్యాయంగా 'డాకరేమి' పెద డాకరే అని తెలుగు వ్యవహారం ఉన్నది.
ఆంధ్ర దేశములో పంచారామములుగా సుప్రతీ తములైన పుణ్యక్షేత్రాలలో ఇదీ ఒకటి. మిగిలిన నాలుగు కుమారారామం, క్షీరారామం, సోమారామం, అమరారామం అనేవి. ఈ అయిదింటిలో అమరారామం కృష్ణా తీరస్థము. తక్కిసన నాల్గు గోదావరీ తీరస్థములు. కుమారా రామం సామర్లకోట భీమవరం. దీనికి స్కందా రామమని కూడా వ్యవహారము. క్షీరారామం పశ్చిమ గోదావరి మండలములోని పాలకొల్లు. ఇక్కడ రామలింగేశ్వరుడు. సోమారామం గుణుపూడి భీమవరం, గుణుపూడిలో సోమేశ్వరుడు. అమరారామం అమరావతి. ఇక్కడ అమరేశ్వరుడు.
దక్షారామ భీమేశ్వరుని పేరుతో "భీమమండలం" ఏర్పాటయినది. శ్రీనాధుని భీమేశ్వర పురాణము భీమఖండ వైశిష్ట్యమునకు, భీమనాధుని మహిమకు వైభవానికి దర్పణం పట్టిన గ్రంథం. స్కంద పురాణంలోని గోదావరీ ఖండం దానికి మూలం. భీమ మండల సీమా విభాగం తెలిసికో దగినది. దక్షారామానికి అన్ని దిక్కులందు మూడేసి యోజనాల మేరలో ఉన్న భూమిని భీమ మండలం అంటారు.
"అంబుధి మేర తూర్పునకు, సబ్దియ సీమటుయాయ్యదిగ్విభా గంబునకుం;
బ్రతీచికిని గౌతమి సీమ యుదీచికం,
బ్రమాణంబుత్రి యోజనంబు; సురనాధుడు
దక్షిణ కాశి భీమలిం గంబునకీకభోగముగ గట్టడజేసె వసుంధరాస్థలిన్
శ్రీనాధుని ఈ పద్యం భీమమండలపు సరిహద్దులు స్పష్టంగా చెప్పింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
తూర్పున సముద్రపు సరిహద్దు; అనగా గౌతమి సాగర సంగమం చేసిన ప్రదేశం. భైరవపాలెం. ఇక్కడ భైరవేశ్వరుడు. వశిష్ఠాసాగర సంగమ స్థలియైన అంతర్వేది దక్షిణాబ్ది సీమ. నీలకంఠేశ్వరుడు నృసింహస్వామి అంతర్వేది తీర్థాతి దైవతాలు. భీమమండలపు పశ్చిమ సీమ అఖండగౌతమి. రాజమహేంద్రవరమున గల మార్కండేయేశ్వరుడు అక్కడి దైవతం. ఇక ఉత్తరాన సరిహద్దు మూడు యోజనాల దూరము పిఠాపురం పాదగయాక్షేత్రం. కుక్కుటేశ్వరుడు, కుంతి మాధవస్వామి ఇక్కడి దైవతములు. కుమారారామ భీమేశ్వర క్షేత్రం కూడ ఈ నడుమనే ఉన్నది.
దక్షారామ భీమనాధుడు ఇంతటి విశాలమైన మండలమునకు అధిపత్యం వహించిన దేవతా సార్వభౌముడు. ఈ మండలంలో ఉన్న అనేక దేవతలు భీమేశ్వరునకు సామంతులు. ఉప కంఠ బాంధవులు. ఆంధ్రభూమి మధ్యస్థలమైన భీమ మండలాన్ని ఒక “పుండరీకం” భావన చేసిన శ్రీనాధుని పద్యం చూడండి.
ఆంధ్ర భూభువసమధ్యము పుండరీకము సప్త గోదావర జలము తేనె బ్రహ్మ సంవేద్యాది బహుతీర్థములు రేకు లకరులు చారు దివ్య స్థలములు నాళంబులవణాబ్ధి వేలా విభాగంబు కళ్యాణ భోగ మోక్షములు తాలి దక్షవాటి మహాస్థానంబు కర్ణిక హంసంబు భీమ నాయకుడు శివుడు
గౌతమీ సింధు కౌంతేయ కణ్వనదులు తుల్యభాగయు నేతీరుద్రుమ్మికొనలు భువన సంభావ్యమైన యీ పుణ్యభూమి
యనఘ! సంసార తాపశాం త్యౌషధంబు.
భీమనాధుని కంటె పెద్ద వేల్పు, దక్షవాటి కంటె ఉత్తమ ధామం, సప్త గోదావరం కంటె తీర్థ రాజం జగత్తులో లేదని స్కంద పురాణోక్తి. తెలుగులో శ్రీనాధుని భీమేశ్వర పురాణం భీమ ఖండానికి భౌగోళికమైన రేఖాచిత్రం రసభావ సమ్మిళితం చేసి చూపించింది.
📖
దక్షారామం ఒకప్పుడు బౌద్ధారామమని, విష్ణు కుండినుల కాలంలో శైవ క్షేత్రంగా వెలసినదని, చాళుక్యుల పలుకుబడిలో బహువిధ ప్రశస్తి పొందిందని అంటారు. చాళుక్య భీమేశ్వరుని పేరే భీమేశ్వరుడని చెపుతారు.
పౌరాణికమైన గాధ యిలా ఉంది. పూర్వం తారకాసురుని కంఠంలోని అమృత లింగాన్ని కుమారస్వామి పంచ ఖండాలుగా భేదించాడు. వానిలో రెండవ ఖండం దీక్ష వాటికలో వచ్చిపడి స్వయం ప్రతిష్ఠితమైనది. భరద్వాజాదులు సప్తర్షులు భీమలింగ ప్రతిష్ఠ చేయాలని సుముహూర్తం పెట్టుకొని తెల్లవారేలోగా గోదావరిని దక్షారామానికి తీసుకువెళ్ళాలని సంకల్పించారు.
స్నానధ్యానాదులు నిర్వర్తించుకొని శుచులై మంత్ర పుష్పార్చనపురస్సరంగా గోదావరిని ఆహ్వానించారు. ఇంద్రుని సహాయంతో ఈ ఆహ్వానం ధవళేశ్వరం వద్ద జరిగింది. సప్తర్షులు గోదావరిని తీసుకువెడుతున్నారు. గంగమ్మ పొంగి పొరలుతూ దారిలో తనకు అడ్డు వచ్చిన ఒక ఆశ్రమాన్ని ముంచివేసింది. అది తుల్యుడనే ఒక అసుర ఋషియాగం చేస్తున్న స్థానం.
యాగభంగం జరపడంతో కుపితులై రాక్షస మునులు తమ మంత్రశక్తిచే ప్రవాహాన్ని ఆపి వేశారు. సప్త ఋషులకు, వాళ్ళకి వాదాలు పెరిగాయి. గోదావరి "శుష్కతోయ" అవుతుందని దానవులు శపించారు. శాపప్రతిశాపాలు అయిన తర్వాత చివరికి పరమార్థవేత్త అయిన తుల్య భాగుని పక్షపాత రహితమైన మధ్యవర్తిత్వము తో వ్యాసానుగ్రహంతో అంతర్వాహినియై సప్తసింధువు భీమేశ్వర క్షేత్రానికి చేరుకొంది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
సప్తర్షులు దక్షారామం సుముహూర్తానికి చేరుకోలేదు. దారిలో వచ్చిన అంతరాయం కారణంగా ఆలసించి వచ్చారు. ఈలోగా శుభవేళ తప్పకుండా అమృత లింగమైన భీమనాయకుడు దక్షవాటికలో ఆత్మ సంస్థాపితుడై ఉండడం చూసి వారు అబ్బురపడ్డారు. తాము నిశ్చయించిన ప్రధాన ముహూర్తానికే భీమనాధుడు సంప్రతిష్ఠి తుడైనందుకు సంతోషం కలిగినా తాము తలపెట్టిన సంస్కారాన్ని అన్యధాకరించినందుకు సప్తర్షులు రోషావిష్ణులయ్యారు.
అది సూర్యభగవానుడు కనిపెట్టి వారికి అభివాదం చేసి "మునీంద్రులారా! మీకు కాల విలంబనం జరిగింది. మేలు కలిగించే శోభన కాలం సరిగడవ రాదని భీమేశ్వరుడు తనకు తానే ప్రతిష్ఠితుడయ్యాడు. కారుణ్యసమున్నీ వితయతి దక్షారామ విభునకు ప్రథమారాధనం చేసే భాగథేయం నాకు కలిగింది. ఇంతే కాని మీ ప్రతిష్ఠా భంగానికి అడ్డురావడం కాదు. నా తరువాత భీమనాధుణ్ణి హరి, పరమేష్ఠి ఇద్దరూ అర్చించారు. వారి వెంబడి దేవతలు, గంధర్వులు సేవించారు. కాలయాపన చేయకుండా మీరు కూడా మీ ఆరాధనలు జరుపుకోండి."
ఇలా అనగానే, సప్తర్షులు శివసంప్రతిష్ఠాపన యోగం తమకు సిద్ధించనందుకు సంతాపపడ్డారు. అపుడు ఆకాశవాణి అన్నది "మీరు చేసిన భక్తి అల్పంకాదు. గౌతమీ మహాతరంగిణిని భీమేశ్వరుని మూర్థాభిషేకార్థమై ఇక్కడకు తెచ్చారు. అంతకంటే ఏమి కావాలి. మీరు ఏడుగురు, ప్రతిష్టారంభాభిషేకం చేసిన సూర్యుని తో మీరె నమండుగురు. దక్షారామ భీమేశ్వరుని సన్నిధిని పాశుపతులను నెలకొల్పండి. మీరు అష్టమూర్తులుగా శివుణ్ణి పూజిస్తూ ఉంటారు"
ఈ అశరీరవాణి పలుకులు సప్తర్షులు, సూర్యుడు విన్నారు. సప్త గోదావరీ తీర్థ జలంతో భీమేశ్వరు నకు మహాన్యసాభిషేకపురస్సరంగా అర్చనలు చేశారు. సప్తర్షులచే సమాన్వితమైన నదికి సప్త గోదావరి అని పేరు. సప్త గోదావరి భీమేశ్వరుని ఆలయ ప్రాకారాన్ని ఆనుకొని ఉంటుంది.
నేటికి అష్టమూర్తులగోత్రాల వారే ఇచ్చట అర్చకులుగా ఉంటారు. ఆలయంలో నవగ్రహాలు, అష్ట దిక్పాలకులు వెలసినారు. భీమ లింగ ప్రతిష్ఠానంతరం సూర్యుడు పార్వతీపరమేశ్వరుల నాహ్వానించాడుట. మార్గశిర శుద్ధ చతుర్దశినాడు రోహిణి నక్షత్రంలో ఆది దేవుడు గౌరీ సహితుడై భీమ లింగంలో లీనమైనట్లు చెబుతారు. ఈ క్షేత్రంలో మాఘ శుద్ధ ఏకాదశికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ పూర్ణిమనాడు రధోత్సవము.
దక్షారామ క్షేత్రంలో మాణిక్యాంబికా సహితుడైన భీమేశ్వరుణ్ణి కొలుస్తారు. భారతదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో మాణిక్యాంబ శక్తి పీఠం ఒకటి. ఈమె భీమేశ్వరునకు ఉత్తర దిక్కున ఉన్న తిరుచుట్టు మాలెలో వెలసి ఉంది.
భీమలింగ సన్నిధిని ఈనాడు పార్వతీదేవి విగ్రహంకి కొంచెమివతల సతీ విగ్రహం ఉన్నవి. కళ్యాణోత్సవం మాత్రం మాణిక్యాంబికాసమేతు డైన భీమేశ్వరునికే జరుగుతూ ఉంటుంది.
🛕
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment