(562) (05.03.2026)
పుట్టగానే జాతకం
చనిపోతే సూతకం
మధ్యలో జగన్నాటకం
మోహాపాశాల నాటకం //
ఊపిరి ఉన్నంత వరకు అంతా నాది-నాది అని అనుకునేవు
ఒక్కసారి ఊపిరి ఆగిపోతే నీవు ఎవరికి ఏమి కావు అని తెలుసుకోవు
బంధాలు – బంధుత్వాలు అంటూ తిరిగేవు
చివరి వరకు బంధుత్వం నిలుపుకోవాలని చూచేవు //
పైసల కోసం వెంపర్లాడుతూ
ప్రతి పైసా కూడబెడుతూ
సరైన తిండి తినక
వంటిపై మంచి బట్ట ధరించక //
చివరి వరకు జీవితాన్ని నెట్టుకుని వచ్చేవు
నీతో పాటు నిను నమ్మిన వాళ్ళను బాధలు పెట్టేవు
ఇన్ని సంవత్సరాలు బ్రతికి నీవు సాధించింది ఏమిటి
నీవు కనుమూసినాక నీ వెంట వచ్చేది ఏమిటి //
నీవు తాళి కట్టిన ఇల్లాలైనా
నీ కడుపున పుట్టిన బిడ్డలైనా
నీవు కనుమూస్తే ఒక్కరైనా నీకు తోడుగా వచ్చేరా
నీ వెంట మేము ఉన్నామని నీకు చెప్పేరా //
ఇంతోటి జీవితానికి ఇంత తాపత్రయం ఎందుకో
రాతిరనక – పగలనక కష్టపడటం ఎందులకో
తిని-తినక అనారోగ్యం తెచ్చుకోవడం ఎందుకో
ఆరు అడుగుల నేల కోసం ఇదంతా ఎందులకో //
కను మూస్తే నలుగురు మోసే దేహానికి ఇంత అవసరమా
చితిలో కాలిపోయే శరీరానికి ఇంత హాంగామా అవసరమా
ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టినా చివరకు స్మశానానికి చేరవలసిందే
ఎంతటి వాడైనా ఆ కట్టెల్లో కాలిపోవలసిందే //
సూతకం ఉన్నంత వరకే నీవు జ్ఞాపకం ఉండేది
కార్యక్రమాలు అయినాక నిను తలచుకోను సమయమేది
ఏడాది దాటిందంటే నీ వాళ్ళ మనసులోనుంచే నీవు వెళ్లిపోతావు
ఇంత దానికి బ్రతికి ఉన్నంత కాలం గొప్ప నాటకం ఆడేవు //
ఇది అంతా ఆ జగన్నాటక సూత్రధారి ఆడిస్తున్నాడని తెలుసుకోవు
నాడు కురుక్షేత్రంలో ఆయన చెప్పిన భగవద్గీత అని అనుకోవు
ఊపిరి ఆగిపోయే చివరి క్షణం వరకు బాధ్యతలు విస్మరించవు
అలా అని చివరి క్షణంలోనైనా ఆ దేవుని స్మరించవు //
ఎంత కాలం బ్రతికినా ఇంకా ఆయిష్షు ఇమ్మని ఆ దేవుని కోరేవు
బాధ్యతలు తీరలేదని బంధువుల దగ్గర వగచేవు
అడుగులే వేయలేని వాడివి బాధ్యతలు ఏమి పంచుకుంటావు
చివరకు కడుపున పుట్టిన బిడ్డలకు కూడా దూరం అవుతావు //
అందుకే ఇన్నాళ్ళు ఆడిన నాటకానికి ఇకనైనా తెర దించు
నాది-నాది అనకుండా అంతా భగవంతుడిది అనడం ఆరంభించు
కను మూసినాక ఏమి చేస్తే స్వర్గ ప్రాప్తి లభిస్తుందో అని ఆలోచించు
దానికై దైవత్వం వైపు అడుగులు వేయడానికి ప్రయత్నించు //
మధిర వెంకట రమణ, హైదరాబాద్
No comments:
Post a Comment