Saturday, March 28, 2026

 నేను రాసిన
*తోరపు దారాలు* అనే కథల పుస్తకం నుండి ఒక కథ...

క్రిందటి సంవత్సరం ఇదేరోజు రాసిన ఈ కథ మీకోసం..

*తరవాణీ*

తరవాణీ అంటే ఏంటో తెలియకపోయినా, మండపేట ఇంకా దాని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఆ పదం మాత్రం చాలా సుపరిచితమే. ఎందుకంటే మండపేటలో ఒక పెద్ద కాలనీ పేరు తరవాణీ పేట కాబట్టి.

జనాలు టీవీలకి ఇంకా పూర్తిగా అలవాటు పడని రోజులు. కాలనీలో చాలావరకూ పెంకుటిళ్ళే. కానీ అప్పటికే తరవాణీ, చద్దన్నం లాంటి అలవాట్లు పోయి ఇడ్లీ, దోశా, పూరీ లాంటి టిఫిన్, తరవాత కాఫీయో టీ...యో తాగే అలవాట్లు వచ్చేసాయి జనాలకి.

సుబ్బమ్మగారు మాత్రం ఇంకా తరవాణీ చద్దన్నాలకే పరిమితం అయిపోయారు! నలభయ్యేళ్ళ వయసప్పుడు సైకిల్ మీద రామచంద్రపురం వెళ్ళిన ఆమె భర్త ఇక తిరిగి రాలేదు. అచూకీకూడా దొరకలేదు. పిల్లలు లేరు. అస్థిలోవాటా వచ్చినా ఎవరి బాధ్యతల్లో వాళ్ళు చిక్కుకుని అమె ఆలనా పాలనా చూసే తీరిక ఎవరికీ లేకపోయింది. అప్పట్నుంచీ రోజూ పొద్దున్నే పూజానంతరం తరవాణీతో అన్నం తినడం, తరవాత రోజంతా మంచినీళ్ళు తప్ప ఎటువంటి ఆహారం ముట్టదు. పక్కింట్లో ఉండే శివాలయం పూజారిగారు సాయంత్రం పూట ఏ పండో ఫలమో ప్రసాదంగా ఇస్తే తినడం, లేకపోతే మంచినీళ్ళు తాగేసి పడుకుంటుంది. గత పదేళ్ళుగా రాత్రి వంట ఉదయం భోజనంతో గడిపేస్తోంది సుబ్బమ్మ.

పూజ ముగించుకుని, తినడానికి సిద్ధమవుతున్న సుబ్బమ్మకి, వీథి తలుపు దగ్గర ఎవరో తచ్చాడుతున్నట్లనిపిస్తే తలుపు తీసి చూసింది.

తెల్ల కుక్కపిల్ల! ఏదైనా పెడతారేమోనని ఆశగా చూస్తోంది. "అయ్యో రామ, నా దగ్గరేముంటుందే పిచ్చి మొహమా.. ఏదో తరవాణీ మీద బతికేదాన్ని.. నీకేం పెట్టగలను అని తలుపు వేసేసి లోపలికొచ్చేసింది సుబ్బమ్మ. తరవాణీ గిన్నె తీసి తినబోతుంటే ఎందుకో మనసొప్పలేదు. గిన్నె అక్కడే పెట్టి మళ్ళీవెళ్లి తలుపు తీసింది. కుక్క అక్కడే ఉంది. 

సరేనని సగం అన్నం విస్తరాకులో కట్టి, పట్టుకెళ్ళి కుక్కకి పెట్టేసింది. తిరిగొచ్చి మిగిలింది తను తింది.

ఆరోజు సాయంత్రం కాస్త అన్నం ఎక్కువ వండింది. రోజూ ఇదేతంతు.. కుక్కకి, తనకూ తరవాణీ సగం - సగం.

సంవత్సరం గడిచిపోయింది. తోడులేని సుబ్బమ్మకి కుక్కే తోడయ్యింది. భర్త తరఫు వచ్చిన ఆస్థి ఎకరం పొలం. చిన్న పెంకుటిల్లు. నమ్మకస్తుడైన రైతుకి కౌలుకిచ్చి, దానిమీద వచ్చే పంటతో అలా కాలక్షేపం చేస్తోంది సుబ్బమ్మ.

రోజూలానే విస్తరిలో తరవాణీ పెట్టుకొని వీథి తలుపు తీసిన సుబ్బమ్మకి కుక్కతో పాటు ఒక ఏడేళ్ళ పిల్లాడు కనిపించి, నాకూ పెట్టండి అనేసరికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు.

కుక్కకి పెట్టాలా ? ఆ పిల్లాడికి పెట్టాలా ? గత సంవత్సర కాలంగా తననే నమ్ముకుంది కుక్క. అలాగని పిల్లాణ్ణి కాదని వాడి ఎదురుగానే కుక్కకి అన్నం పెట్టగలదా ? పోనీ తన వాటా అన్నాన్ని కూడా ఇచ్చే రంతి దేవుడంతటి గొప్పది కాదే తను! తను బతికేదే ఒకపూట తినే తరవాణీ అన్నమ్మీదాయె!

ఒక్కక్షణం అలోచించి, తెచ్చిన అన్నాన్ని కూడా లోపలికి తీసుకుపోయి మొత్తం అన్నాన్ని మూడు వాటాలేసి, రెండువాటాలు తెచ్చి ఒకటి కుక్కకి, ఒకటి పిల్లాడికి ఇచ్చేసింది.

అప్పట్నుంచీ ఇద్దరు కాస్తా ముగ్గురయ్యారు! 

ఇంకో ఏడాది కూడా అలాగే గడిచిపోయింది. ఒకరోజు ఆ పిల్లాడు రాలేదు. మళ్లీ ఎప్పుడూ రాలేదు. జీవితంలో రెండోసారి ఒంటరైనట్టనిపించింది సుబ్బమ్మకి. మనుషులకంటే నువ్వే నయం రా.. ఏరోజూ విడిచిపెట్టలేదు నన్ను అంటూ కుక్కతో మాట్లాడేది రోజూ!

పాతిక సంవత్సరాల తరవాత.. 

తరవాణీ పేటలో అన్నీ మేడలు బంగ్లాలు అయిపోయాయి, ఒక్క సుబ్బమ్మ పెంకుటిల్లు తప్ప. దాదాపు శిథిలావస్థకు చేరుకుంది.. సుబ్బమ్మలాగే. కుక్క కూడా కాలం చేసిన తరవాత సుబ్బమ్మ ఎవ్వరినీ చేరదీయలేదు. పూర్తిగా ఒంటరిదైపోయింది. చూపు తగ్గింది. ఒక్క చూపేంటి.. వినికిడి, ఓపిక అన్నీ.. ఎలాగో నెట్టుకొస్తోంది.

ఒకరోజు సుబ్బమ్మ ఇంటిముందు ఆగింది పడవంత కారు! ఎవరో యువ దంపతులు దిగారు కారులోంచి. సుబ్బమ్మ ఇంట్లోకి వెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళు తొంగితొంగి చూస్తున్నారు ఎవరా అని. గంట తరవాత ఇంటికి తాళం పడింది. సుబ్బమ్మని ఎక్కించుకుని కారు వెళ్ళిపోయింది. 

*

విశాఖపట్నంలో ఒక బంగ్లాలో ఆహ్లాదకరమైన ఏసీ రూంలో సోఫాలో కూర్చుని అరవై ఇంచీల టీవీలో ఉదయం భక్తి కార్యక్రమాలు చూస్తున్న సుబ్బమ్మ పక్కన కూర్చుని ఉన్నాడు, ఉదయ్, ఒక పేరు మోసిన హాస్పిటల్ లో డాక్టర్. అతను ఒక అనాథ. చిన్నప్పుడు సుబ్బమ్మ పెట్టిన తరవాణీ అన్నం మీద బతికిన పిల్లాడు.. ఒక స్వచ్చంద సంస్థకి చెందిన అనాథ శరణాలయంలో పెరిగి పెద్ద డాక్టర్ అయ్యాడు. తనలాగే అనాథగా పెరిగిన సంధ్యని వివాహం చేసుకున్నాడు. తను సుబ్బమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోయినా.. ఏనాడు ఆమెని మరచిపోలేదు. పరోక్షంగా కనిపెట్టుకునే ఉన్నాడు. చివరికి ఆసరా అయ్యాడు!
టీవీ చూస్తున్న ఇద్దరినీ పిలిచింది సంధ్య, డైనింగ్ టేబుల్ దగ్గరకి రమ్మని, ఇద్దరికీ ప్లేటుల్లో తరవాణీ అన్నం వడ్డించి!

-- శ్రీను వాసా

No comments:

Post a Comment