*_స్థానాల పెంపు..ఆస్థానాల భారం!_*
*(ఎలిశెట్టి సురేష్ కుమార్)*
ఎవరి కోసం ఈ నిర్ణయం..
ఏం సాధించాలని..
ఇప్పటికి ఉన్నవి చాలవా..
ఇంకా పెంచాలా..
పెంచుకుంటూ పోవాలా..
దేశంలో పార్లమెంట్,అసెంబ్లీ స్థానాలు పెంచబోతున్నారట..
మామూలుగా కాదు..
సుమారుగా రెట్టింపు చేయబోతున్నట్టు సమాచారం..
ఇప్పుడున్న పార్లమెంట్
స్థానాలు 543..అంతకు అంత
పెరిగి 816 లేదా 817
స్థానాలుగా పెరిగి
మన పార్లమెంట్
ఒక మహాసభగా అవతరించబోతున్నదన్న మాట..అంటే..చూడడానికి
ఇంచుమించు ఒక బహిరంగ
సభ మాదిరి రూపుదిద్దుకోబోతోంది..
ఏం సాధించడానికి ఈ పెంపు..
మహిళా రిజర్వేషన్ నిక్కచ్చిగా అమలుచేయడానికి
ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు
చెబుతున్నారు.
ఈ లెక్కన పార్లమెంటులో
ఖచ్చితంగా 273 మంది
మహిళలు ఉంటారు.
ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది కూడా..ఎందుకంటే జనరల్
స్థానాల్లో కూడా మహిళలు
గెలుస్తారు కదా..
ఇది మంచి నిర్ణయమే అనుకున్నా..కొన్ని ప్రశ్నలు
తలెత్తక మానవు.. ఇప్పుడున్న
543 స్దానాల్లోనే మహిళా రిజర్వేషన్ 33 శాతం అమలు చేయడంలో చిక్కేమిటో..
పురుషుల సంఖ్య తగ్గిపోతుందనా..
పురుషాధిపత్యానికి లోటు ఏర్పడుతుందనా..?
స్థానాలు పెంచాలన్న
నిర్ణయం..అందుకు చెబుతున్న కారణం ఎందుకో గాని
అంత సహేతుకం అనిపించడం లేదు.అలాగని మహిళా రిజర్వేషన్ కు మేమేమీ వ్యతిరేకం కాదు.ఉన్న సంఖ్యలోనే మహిళా రిజర్వేషన్ అమలు చెయ్యడంలో ఇబ్బంది ఏంటన్నది ప్రశ్న..?
ఇప్పుడు అసలు విషయం..
ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో..ప్రజాప్రతినిధులకు చెల్లిస్తున్న వేతనాలను
పరిగణనలోకి తీసుకుంటే
సీట్ల పెంపు
దేశం మీద ఎంత భారం..
ఎంపీలు...ఎమ్మెల్యేల వేతనాలు..అలవెన్సులపై
ప్రజల్లో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది.
అందునా..వేతనాల పెంపు బిల్లుని ప్రతినిధుల సభలు
ఎంత త్వరగా హర్షధ్వానాల మధ్య ఆమోదిస్తాయో
అందరికీ తెలిసిందే.
లక్షల్లో వేతనాలు.. అలవెన్సులు అందుకుంటూ
ఎప్పటికపుడు పెంచుకుంటూ
పోవడమే ఎంపీలకు..
ఇతర ప్రజాప్రతినిధులకు
అత్యంత సులువైన..
సంబరమైన విషయం..
ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా
పెరుగుతున్న వేతనాలు
దేశంపై ఎనలేని భారంగా
పరిణమించాయి.ఈ దశలో
ప్రజాప్రతినిధుల సంఖ్య
ఇంతకు ఇంతా పెరిగితే
దేశంపై పడే అదనపు భారం
సంగతేంటి..రేపు మళ్ళీ వేతనాలు పెంచుకుంటే
ఆ బరువు దేశంపై ఎంత మేర
పడుతుంది..ఎన్నికల్లో
ఖర్చు ఎన్ని రెట్లు ఎక్కువ
అవుతుంది..ఇంకా.. ఇంకా..
కనిపించని ఖర్చులు ఎన్ని కోట్ల రూపాయలు ఉంటాయి.
కథ ఇక్కడితో ఆగేదా...
రాష్ట్రాల అసెంబ్లీలలో
స్థానాలను కూడా పెంచుతారట..ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ స్థానాలు 4123 నుంచి
6185 కి పెరుగుతాయట..
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నవ్యాంధ్రలో 263..
తెలంగాణలో 179 స్థానాలు ఉండబోతున్నాయి.
నిజంగా ఇదంతా ప్రజల
ప్రయోజనానికేనా..
వాస్తవ పరిస్థితి ఏమిటి?
ఇప్పటికే దేశంలో ఉన్న ఎంపీలు,ఎమ్మెల్యేల కోసం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
వారి జీతాలు,అలవెన్సులు,
ఉచిత ప్రయాణాలు,
గన్‌మెన్‌లు,
కార్యాలయ సిబ్బంది,
నివాస సౌకర్యాలు,
ఇంకా పదవీ విరమణ
తర్వాత జీవితాంతం
పెన్షన్లు..!
ఇవన్నీ ప్రజల పన్ను డబ్బుతోనే సాగుతున్నాయన్నది అందరికీ తెలిసిన సంగతే.
ఇప్పుడు ప్రతినిధులు సంఖ్యను యాభై శాతం వరకు పెంచితే ఖర్చులు కూడా అదే రీతిలో
భారీగా పెరుగుతాయి..
అంతేనా..పరిపాలనా వ్యవస్థ మరింత భారంగా మారుతుంది..ప్రజలపై పరోక్షంగా పన్నుల భారం పెరిగే అవకాశముంది..
మరి జనాభా పెరిగింది కదాని అనేవారు కూడా ఉండకపోరు..అందుకే ప్రతినిధుల సంఖ్య పెరగాలన్నది సన్నాయి నొక్కు..
ప్రజాప్రతినిధుల సంఖ్య పెంచడం వల్ల పరిపాలన నాణ్యత పెరుగుతుందా?
అసలు ఇప్పుడు
ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారా?
అభివృద్ధి, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనలో మెరుగుదల వచ్చిందా?
వ్యవస్థలో లోపాల మాటేమిటి..వీటికి కారణం ఎవరు..
నిక్కచిగా మాటాడుకోవాలంటే సంఖ్య కంటే నాణ్యత..రాశి కన్నా
వాసి ముఖ్యం..
అదే ప్రజలకు, దేశానికి అవసరం..
దేశానికి మంచి నాయకులు, బాధ్యతాయుత పాలన,
పారదర్శక వ్యవస్థ
కావాలి..
ఇవన్నీ సీట్ల పెంపు ద్వారా
సాధ్యపడతాయా..
ప్రజల డబ్బు విలువైనది.
ప్రతి రూపాయి జాగ్రత్తగా
వినియోగించాలి.
ప్రతినిధుల సంఖ్య పెంపు వంటి నిర్ణయం తీసుకునే ముందు...
అది దేశానికి నిజంగా
లాభమా?
లేక భారం పెంచే
చర్య మాత్రమేనా?
అయితే ఇలాంటి నిర్ణయాలు
సభ ఆమోదంతో జరిగిపోతాయి..అధ్యయనం..
విశ్లేషణ చేశామని చెబుతారు.
వాస్తవానికి ఇలాంటి నిర్ణయాల వెనక ప్రధానంగా
రాజకీయ కారణాలే ఉంటాయి.
రాజకీయ నిరుద్యోగం
తగ్గించడానికి..
మరింత మందికి
రాజకీయంగా ఉపాధి కల్పించడానికే ఇటువంటి నిర్ణయాలు ప్రధానంగా ఉపయోగపడతాయి.
అంతేకాదు..ఇంకా అనేక రాజకీయ కా"రణాలు"..ప్రయోజనాలు కూడా దాగి ఉంటాయి.
అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి..తమకు బలం ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలు
పెరిగితే వచ్చే ఎన్నికల్లో మరిన్ని స్థానాలు తమ ఖాతాలో జమ అవుతాయని
లెక్కలు కట్టుకుంటారు.
ఉదాహరణకు
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్..అక్కడ స్థానాలు
పెరిగితే ఎవరికి లాభం..
ఇలాంటి ఎన్నో సమీకరణలు
ప్రధాన కారణాలు..
ప్రజలకు మాత్రం పన్నుల తోరణాలు..!
ఉద్యోగాల సంఖ్య పెంచడానికి
జరగని ప్రయత్నాలు..
ప్రజాప్రతినిధులు సంఖ్య పెంచడంలో మాత్రం
యుద్ధప్రాతిపదికన జరిగిపోతాయి..
వచ్చే ఎన్నికలే నాటికే బొమ్మ పడిపోతుంది..!
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
9948546286
7995666286
No comments:
Post a Comment