#మనకథలు_మనభావాలు #వార్షిక_కథలపోటీ_2026
*గొడవలు-నానమ్మ-మనవడి ముచ్చట్లు!*
"నీ లీల పాడెద దేవా..
మనవి ఆలించ వేడెద దేవా..
నను లాలించు మా ముద్దు దేవా..
నీ లీల పాడెద దేవా..
నీ లీల పాడెద దేవా ...."
తనకిష్టమైన సావిత్రి పాట పాడుకుంటూ తన రూములోకి వచ్చింది సుగుణమ్మ. రాత్రి ఎనిమిది గంటలకల్లా భోజనం చేయడం అలవాటు. దేవుడి దయవల్ల తనకు ఎలాంటి వ్యాధులు లేవు. వచ్చి రాగానే మంచంపై కూర్చుని, పాన్ డబ్బా తీసుకుని, తమలపాకులు తొడిమె తీసి, ఆకు వెనక కాస్త సున్నం రాసి, కత్తెర తీసుకొని, వక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసి, కొంచెం కాసు రాసి, వాటితో పాటు చిటికెడు జర్థా వేసుకుంది. తమలపాకు చుట్టి నోట్లో పెట్టుకోవాలనుకుంది కానీ ఇంతలోనే పక్కనే ఉన్న మనవడు ఏమీ మాట్లాడకపోయేసరికి కాస్త ఆలోచనలో పడింది. రోజూ తమలపాకు వేసుకునేటప్పుడు మనవడు ఊరికే ఉండడు.
"ఎందుకు నానమ్మ ఈ తమలపాకు వేసుకుంటావు. డాక్టర్ ఎన్నిసార్లు చెప్పాడు, నీ పళ్ళు పాడైపోతున్నాయి, వేసుకోవడం ఆపేయమని. కానీ అసలు వినవే నువ్వు." అంటూ గొడవ చేస్తాడు.
"పోనీలేరా.. పాడైపోతే మాత్రం ఏంటి? ఇప్పుడు నేనేమన్నా అందాల పోటీలకు వెళ్తున్నానా! నా అందమైన చిరునవ్వు ఎవరికి కావాలి?" తాను కూడా ఊరికే ఉండకుండా మనవడికి ఏదో ఒక సమాధానం చెప్పి దాటవేస్తుంది.
అలాంటిది, పక్కనే కూర్చుని కూడా ఏమీ అనకపోయేసరికి, తనే మనవడిని పలకరించింది.
"ఆకాష్! ఏమైంది? ఎందుకంత ముభావంగా ఉన్నావు. ఏంటి నీ సమస్య?" అడిగింది సుగుణమ్మ.
"ఏమీ లేదులే నానమ్మ!" అన్నాడు ఆకాష్.
హోంవర్క్ చేయడానికి కూర్చుని, చేయకుండా, టేబులుపై పుస్తకం ముందర వేసుకుని, పెన్ను పట్టుకుని పైకి చూస్తూ, ఏదో ఆలోచిస్తున్నాడు పదమూడేళ్ళ ఆకాష్.
"నా దగ్గర దాయటం ఎందుకురా! చెప్పు. ఏమిటి నీ సమస్య?" గదమాయిస్తూ అడిగింది సుగుణమ్మ మనవడిని.
"చెప్పినా నువ్వు తీర్చే సమస్య కాదులే నానమ్మ! నువ్వు ఆ భక్తి ఛానల్ చూసుకో." అన్నాడు కాస్త వెటకారంగా ఆకాష్.
"ఏమిట్రా అంత బెట్టు చేస్తున్నావు? తీరుస్తానో, తీర్చనో! అది తర్వాత సంగతి. నువ్వు చెప్పి చూడు. మనసులో ఉన్న బాధ చెప్పుకుంటే పోతుంది." అంది సుగుణమ్మ.
ఇక ఈ ముసలమ్మ వదిలేలా లేదు అనుకుని, మెల్లిగా తన మనసులో బాధ చెప్పుకోవటం మొదలుపెట్టాడు ఆకాష్.
"పొద్దుటి నుంచీ నాకు ఎంత స్ట్రెస్ తెలుసా నానమ్మ. స్కూలుకు వెళ్ళి, ఎన్నో క్లాసులు విని, అన్నీ బుర్రకెక్కించుకొని, కష్టపడి గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇంటికి వచ్చి, స్కూల్లో టీచర్స్ ఇచ్చిన హోంవర్క్ చేసుకోవాలి. టెస్టులు ఉంటే వాటికోసం ప్రిపేర్ అవ్వాలి. కానీ ఈ ఇంట్లో అసలు ప్రశాంతత లేదు. ఎప్పుడు చూసినా, అమ్మానాన్న ఏదో ఒక కీచులాట, గొడవ, వాగ్ వివాదం. అలాగే పిన్ని, బాబాయ్ కూడా అంతే. లేదంటే వాళ్ళ పిల్లలను తిట్టడం. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. ఇంటికి రావాలనిపించట్లేదు. ఇన్ని గొడవల్లో ఎలా చదువుకుంటాం?" గుక్క తిప్పుకోకుండా చెప్పిన ఆకాష్ వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఇంత చిన్న పిల్లాడికి ఇన్ని ఆలోచనలా అనుకుంటూ నివ్వరపోయింది సుగుణమ్మ.
"ఏంటి నానమ్మ, ఏం మాట్లాడవు?" విసుకున్నాడు ఆకాష్.
"ఆ నాన్న, వింటున్నా..వింటున్నా! చెప్పు." అంది వెంటనే తేరుకుని సుగుణమ్మ.
"నీకు తెలుసా, మా ఫ్రెండ్ సాకేత్ వాళ్ళ ఇంట్లో, అసలు ఇలా గొడవలే జరగవట. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారట ఇంట్లో అందరూ." ఆశ్చర్యంగా చెప్పాడు ఆకాష్.
కాస్త బరువెక్కిన మనసుతో ఆలోచిస్తూ, ఎలాగైనా తన మనవడి బాధని తీర్చాలి అనుకుంది సుగుణమ్మ. "చూడు ఆకాష్, మన ఇంట్లో ఈ గొడవలు జరిగే మాట నిజమే. నువ్వు చిన్నపిల్లాడివి. ఇంత చిన్న వయసులో ఈ గొడవల గురించి ఆలోచించొద్దు. నీకు ప్రశాంతత కావాలంటే నా రూము ఉంది కదా. ఇక్కడకు వచ్చి కూర్చుంటున్నావు కదా, తలుపులేసుకుని చదువుకో. నిన్ను ఎవరూ ఇబ్బంది పెట్టరు కదా." సమాధానపరిచే ఉద్దేశంతో చెప్పింది సుగుణమ్మ.
"నీ రూములోకి వస్తే తలుపులేసుకుని చదువుకోవచ్చు కానీ ఇంట్లోకి రాగానే వంట ఇంట్లో నుంచి వినిపించే గొడవలు, బెడ్ రూములలో నుంచి వినిపించే గొడవలు, డైనింగ్ టేబుల్ దగ్గర వినిపించే గొడవలు, ఇవన్నీ నాకు తలనొప్పిగా మారాయి. రూములోకి వచ్చి చదువుకుంటున్నా, అవన్నీ వినపడుతున్నట్టుగా అనిపిస్తాయి. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నా నానమ్మ. సాకేత్ వాళ్ళింట్లో జరగని గొడవలు, మన ఇంట్లోనే ఎందుకు జరుగుతాయి?" కాస్త బాధగా అన్నాడు ఆకాష్.
సుగుణమ్మకి విషయం అర్థమైంది. ఇంట్లో జరిగే గొడవల కన్నా, సాకేత్ వాళ్ళ ఇంట్లో జరగట్లేదు, మన ఇంట్లో జరుగుతున్నాయి అనే బాధ ఆకాష్‌ని వెంటాడుతుంది. ఈ విషయంలో ఆకాష్ మనసు మార్చాలి అనుకుంది సుగుణమ్మ.
"సాకేత్ వాళ్ళ ఇంట్లో గొడవలు జరగట్లేదు అని నీకెలా తెలుసు?" అడిగింది సుగుణమ్మ.
"నేను సాకేత్‌ని అడిగాను, ఎప్పుడు అడిగినా, మా ఇంట్లో ఏం గొడవలు జరగవు అంటాడు." కాస్త నిరుత్సాహంగా చెప్పాడు.
"చూడు ఆకాష్, సాకేత్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మానాన్న గొడవ పడరేమో కానీ సాకేత్ లేనప్పుడు గొడవ పడొచ్చు కదా. అప్పుడు ఆ గొడవ సాకేత్‌కి తెలీదు." ఆలోచిస్తూ చెప్పింది సుగుణమ్మ.
"ఏమో నానమ్మ! ఆ విషయం నాకు తెలియదు." అన్నాడు కాస్త అసహనంగా ఆకాష్.
"సరే ఆకాష్! నేను ఒకటి అడుగుతాను చెప్పు. మీ క్లాసులో టీచర్ లేనప్పుడు గొడవలు జరగవా?" అడిగింది సుగుణమ్మ.
"ఎందుకు జరగవు! మా వెనుక బెంచిలో ఇద్దరు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. 'ఈ పెన్ను నాది', 'ఈ పెన్సిల్ నాది', 'రబ్బర్ నాది', 'ఈ బల్లపై బొమ్మలు గీయొద్దు', 'ఏయ్ నువ్వు నా కాలు తొక్కావు, నా షూస్ మొత్తం పాడైపోయింది', 'ఇది నా ప్లేస్, నువ్వెందుకు కూర్చున్నావు?' ఇలా రకరకాలుగా గొడవ పడుతూ ఉంటారు. నిన్న అయితే మా అవతల బెంచిలో కూర్చున్న వాళ్ళు ఒకరి మీద ఒకరు ఇంకు పోసుకున్నారు. ఇక ఇద్దరమ్మాయిలు అయితే జుట్లు జుట్లు పట్టుకొని గొడవ కూడా పడ్డారు. క్లాస్ అంతా ఒకటే నవ్వులు. నాకు అసలు నచ్చలేదు కానీ టీచర్ రాగానే సైలెంట్ అయిపోయారు. ఇక మా క్లాసులో రాము అనే వాడు, వాడికి మార్క్స్ ఎక్కువ వచ్చాయి అని బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అందరి దగ్గరికి వెళ్ళి 'చూసావా నాకు మీకంటే మార్క్స్ ఎక్కువ వచ్చాయి, మీకు రావు. నేనే ఎప్పుడూ క్లాస్ ఫస్ట్' అని చెప్తూ అందరిని తక్కువ చేసి మాట్లాడుతాడు. వాడంటే క్లాసులో ఎవరికీ ఇష్టం ఉండదు. వాడు ఎప్పుడూ అందరితో ఇలా మాట్లాడే గొడవలు పడుతూ ఉంటాడు." మొహంలో కాస్త నవ్వు, మాటల్లో చలాకితనం, ఉత్సాహం కనిపిస్తుండగా, చెప్పాడు ఆకాష్.
"చూసావా మరి. టీచర్ రాగానే నిశ్శబ్దంగా ఉండిపోతారు. మీరు ఇలా గొడవలు పడుతున్నట్టు మీ టీచరుకి కూడా తెలియదు కదా! అలాగే సాకేత్‌కి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గొడవలు పడుతున్నట్టు తెలిసుండకపోవచ్చు. క్లాసులో 30 మంది ఉన్నప్పుడు, ఎవరికి నచ్చింది వాళ్ళు చెబుతూ, వాళ్ళు చెప్పింది నిజమని నమ్మించడానికి కొందరు, నాది, నీది అనే స్వార్థంతో కొందరు, తమ ఆధిపత్యం చూపించుకోవడానికి కొందరు గొడవ పడుతూ ఉంటారు. గిన్నెలు ఎక్కువగా ఎక్కడ ఉంటే అక్కడ లొల్లి కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఆ గిన్నెలు ఖాళీగా ఉన్నప్పుడు రెండింతలు ఎక్కువ శబ్దం వస్తుంది. ఇల్లు కూడా అంతే. మనుషులు ఎక్కువగా ఉంటే ఇలాగే గొడవ పడుతూ ఉంటారు, దాని అర్థం తప్పు అని కాదు. చాలామంది ఇళ్ళల్లో ఈ గొడవలు అన్నీ ఆపలేవు. నలుగురు మనుషులు కలిసి ఉన్నప్పుడు, అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ప్రతి మనిషి ఆలోచన వేరుగా ఉంటుంది, పద్ధతులు వేరుగా ఉంటాయి, నచ్చ చెప్పే విధానం వేరుగా ఉంటుంది. అంతమాత్రాన వాళ్ళ మధ్యన ప్రేమాభిమానాలు లేవని కాదు. మనం నమ్మే దానికోసం నిలబడాలి. అవతలి వారిని నమ్మించడానికి, ఒప్పించడానికి గట్టిగా మాట్లాడాల్సిందే. అవసరమైతే గొడవ పడాల్సిందే! మరి నీ స్నేహితుడితో నువ్వు ఎప్పుడూ గొడవ పడలేదా? నీకు ఏదైనా నచ్చలేదంటే, లేదా నువ్వు చెప్పేది నిజమే అని నీ స్నేహితులని కానీ లేదా క్లాస్మేట్‌ని కానీ నమ్మించాలంటే నువ్వేం చేస్తావు?" ఆకాష్‌కి అర్థమయ్యేలా గొడవల గురించి వివరణ ఇస్తూ అడిగింది సుగుణమ్మ.
"ఎందుకు పడలేదు! నేను చెప్పింది వాడు ఒప్పుకోనప్పుడు తప్పకుండా గొడవ పడతా. ఒకసారి క్రికెట్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ కొట్టాడు. ఇండియాని గెలిపించాడు. అయితే 'ఇంకా ఒక్క రన్ను కొట్టి ఉంటే, కోహ్లీ వన్ ఫిఫ్టీ కొట్టేవాడు' అని నేను అన్నాను. అప్పుడు సాకేత్ 'కాదు కాదు, కోహ్లీ ఇంకొక ఎయిట్ రన్స్ కొడితేనే 150 కొట్టేవాడు, టోటల్ అతను కొట్టింది 142' అన్నాడు. నేను అన్నాను 'కాదు అతను కొట్టింది 149' అని. ఈ విషయంలో ఇద్దరం కొంచెం గట్టిగా వాదించుకున్నాము. ఇంక ఆ రోజంతా మాట్లాడుకోలేదు. తెల్లారి స్కూల్‌కి వచ్చిన తర్వాత సాకేత్, 'నేను పేపర్లో చూశాను, నువ్వు చెప్పింది నిజమే. కోహ్లీ 149 కొట్టి అవుట్ అయ్యాడు.' అని చెప్పి తన తప్పు ఒప్పుకున్నాడు. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. తరువాత మేము ఎప్పటిలాగే మళ్ళీ కలిసిపోయాం." ఆనందంగా చెప్పాడు ఆకాష్.
"కదా మరి. నీ మీద నీకున్న నమ్మకంతో, క్రికెట్ మ్యాచ్ చూసినందువల్ల నీకున్న జ్ఞానంతో, క్లాసులో నీ స్నేహితుడితో ఎలా అయితే గొడవపడి తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు, అలాగే ఇంట్లో కూడా మీ అమ్మానాన్న, మీ పిన్ని, బాబాయ్ వారి అవసరాల కోసం, వారికున్న మంచి పద్ధతులు నేర్పిస్తూ, క్రమశిక్షణ ఇంట్లో అందరూ పాటించాలి అనే మంచి ఉద్దేశంతో, కాస్త గట్టిగా మాట్లాడి, గొడవ పడతారు. తర్వాత మళ్ళీ యధావిధిగా కలిసిపోతారు. జీవితం అంటేనే ఇంతే. కుటుంబం అన్నాక కలహాలు ఉంటాయి, సంబరాలు ఉంటాయి. ఆ గొడవ సమయంలో కాస్త మనసు బాధపడినా, 'ఏది జరిగినా మన మంచికే' అనే విషయాన్ని మర్చిపోకూడదు. అలా అని చిన్న చిన్న వాటికి గొడవ పడుతూ, అనవసరంగా నెగిటివ్ ఎనర్జీని కూడా పెంచుకోకూడదు. మనసు ఎప్పుడూ 'మన జీవితాశయాలు ఏమిటి? వాటిని ఎలా మనం సాధించాలి?, మన చుట్టూ ఉన్న వారిని ఎలా సంతోషంగా ఉంచాలి?' అనే వాటి మీద దృష్టి పెట్టాలి తప్ప, ఇంట్లో జరిగే గొడవల మీద కాదు. అవన్నీ వాటికవే సర్దుకుంటాయి, సమసి పోతాయి. నీ వయసులో ఈ గొడవల గురించి ఆలోచించాల్సిన పనిలేదు. నీ బాధ్యత బుద్ధిగా చదువుకోవటం. నువ్వు ఆ పనిలో ఉండు చాలు." శ్రద్ధగా వింటున్న ఆకాష్‌ని చూస్తూ చెప్పింది సుగుణమ్మ.
ఆకాష్ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా కూర్చున్నాడు.
తన సమాధానం ఆకాష్‌కి అర్థమైందో లేదో అన్నట్టుగా చూస్తూ..
"అవునూ.. మీ క్లాసులో ఈ గొడవలు ఇప్పుడే చూస్తున్నావా? చిన్నప్పటినుంచీ చూస్తున్నావా?" ఇంకా తెలుసుకుందామనే జిజ్ఞాసతో అడిగింది సుగుణమ్మ.
"అలా ఏం లేదు నానమ్మ, చిన్నప్పటి నుంచీ చూస్తూనే ఉన్నా. కాస్త సమయం దొరికితే చాలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటారు. క్లాసులోనే కాదు, మాకు గేమ్స్ పీరియడ్ కూడా ఉంటుంది కదా, అందులో అయితే మరీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎవరినైనా గేములో అవుట్ చేస్తే అస్సలు ఒప్పుకోరు, 'మేము అవుట్ కాలేదు, అవుట్ కాలేదు' అంటారు, ఇక క్రికేట్‌లో అయితే ఎవరైనా ఫోర్ కొట్టినా కూడా ఒప్పుకోరు, సిక్స్ కొడితే ఒప్పుకోరు, క్యాచ్ పడితే అస్సలు ఒప్పుకోరు. ఇలా ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. డ్రాయింగ్ పీరియడ్లో అయితే నా డ్రాయింగ్ బాగుందని ఎవరైనా చెప్పారనుకో సాకేత్ అసలు ఒప్పుకోడు, 'వాడి డ్రాయింగ్ కన్నా, నా డ్రాయింగ్ బాగుంది, చూడండి' అని చూపిస్తూ ఉంటాడు. అలాగే మిగతా వాళ్ళు కూడా అంతే. ఇక 'అన్యువల్ డే' లాంటి ఫంక్షన్ జరిగినప్పుడు అయితే సింగింగ్, డాన్సింగ్ పోటీలలో 'మేము అంటే మేము' అని పోటీ పడుతూ ఉంటారు. చివరికి టీచర్ ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళే పాల్గొంటారు కానీ సెలెక్ట్ కాని వారు, సెలెక్ట్ అయిన వాళ్ళని చూస్తే చాలా కోపంగా ఉంటారు." క్లాసులో చిన్న చిన్న వాటికి జరిగే పోటాపోటీ తత్వాన్ని, ఉడుకు మోతుతనాన్ని చకచకా చెప్పేస్తున్నాడు ఆకాష్.
"చూసావా ఆకాష్! మీ స్కూల్‌లో, క్లాసులో కూడా ఈ గొడవలు మామూలేగా. అలాగే ఇంట్లో కూడా మామూలే." ఆకాష్ వంక తీక్షణంగా చూస్తూ చెప్పింది సుగుణమ్మ.
"సరే నానమ్మ. కానీ మేం పిల్లలం కదా! మేము గొడవ పడతాం, కొట్టుకుంటాం, కానీ పెద్దవాళ్ళు కూడా అంతేనా, ఏంటో!" కాస్త సంశయంగా అడిగాడు ఆకాష్.
"మన గొంతు వినిపించాలంటే ఏ వయసులోనైనా తప్పదు నాన్న. మీరు పిల్లలు కాబట్టి చిన్న చిన్న విషయాలకి గొడవపడతారు. పెద్దవాళ్ళు, వాళ్ళ సమస్యలు పెద్దవి, వాటికోసం గొడవ పడతారు. నీకు తెలుసా! నా పదవ క్లాసులో, ఇలాగే స్కూల్‌లో లెక్కల పరీక్షలో, నేను సరైన సమాధానం రాస్తే కూడా, మా లెక్కల మాస్టారు అది కొట్టివేసి, దానికి మార్కులు వేయలేదు. నేను వెళ్ళి, 'నేను రాసిన జవాబు సరైనదే కదా, ఎందుకు కొట్టి వేశారు, మార్కులు ఎందుకు వేయలేదు' అని మాస్టారుని అడిగాను. అప్పుడు మాస్టారు, 'నీ జవాబు సరైనదే, కానీ నేను చెప్పిన పద్ధతిలో నువ్వు లెక్కని పూర్తి చేయలేదు' అన్నారు. నాకు చాలా కోపం వచ్చింది. నేను చిన్నపిల్లను, మరి మాస్టారు ఏమో వయసులో పెద్ద, కానీ నేనేమీ ఊరుకోలేదు. ఆ ప్రశ్నకి జవాబు ఉన్న పుస్తకం మాస్టారుకి చూపించి, 'ఇందులో రెండు, మూడు రకాల పద్ధతులు సూచించారు. ఏ పద్ధతిలోనైనా లెక్క పూర్తి చేయొచ్చని, సమాధానం ఒకటే వస్తుందని ఉంది చూడండి. నాకు సులభంగా అర్థమైన పద్ధతిలో లెక్క నేర్చుకున్నాను, అదే రాసాను, కాబట్టి మీరు నాకు మార్కులు వేయాల్సిందే' అని గట్టిగా పోట్లాడాను. అప్పుడు లెక్కల మాస్టారు నవ్వుతూ.. 'నువ్వు చాలా గట్టి దానివే, భయం లేకుండా, నీకు సరైనది అనిపించిన పద్ధతిలో పోట్లాడుతున్నావు. నీ 'ఫైటింగ్ స్పిరిట్' నాకు బాగా నచ్చింది. అందుకోసం మార్కులు వేస్తున్న' అని వేశారు.
ఈ గొడవలు అనేవి అంత తొందరగా మన జీవితంలోంచి వెళ్ళవు నాన్న. కష్టాలు, కన్నీళ్లు జీవితంలో ఒక భాగం. గాలి దుమారం వచ్చిందని భయపడి పారిపోతామా? కాసేపు ఓ పక్కన దాక్కుంటాం, మళ్ళీ స్వచ్ఛమైన గాలి వీచినప్పుడు బయటికి వచ్చి ఆనందిస్తాము. నువ్వెప్పుడూ ఇంట్లో గొడవల గురించి ఆలోచిస్తున్నావు కానీ ఆ తర్వాత కొద్దిసేపటికి గాని ఒక రోజు తర్వాత కానీ అవన్నీ మర్చిపోయి ఇంట్లో అందరూ పని చేసుకుంటున్నారు, సంతోషంగా కలిసి భోజనం చేస్తున్నారు, కలిసి టీవీ చూస్తున్నారు. సరదాగా షికారికి వెళ్తున్నారు. మిమ్మల్ని సినిమాలకి తీసుకెళ్తున్నారు, మీరు అడిగింది కొనిపెడుతున్నారు. వీటి మీద కూడా కాస్త దృష్టి పెట్టు. గొడవలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఏ అనుబంధంలోనైనా అది సహజమే. స్నేహితులైనా, విద్యార్థి-మాస్టారు అయినా, భార్య-భర్త అయినా, తండ్రి-కొడుకులైనా, తల్లి-కూతుర్లైనా, చివరికి అత్తా-కోడలు అయినా, ఏ బంధమైనా సరే, అభిప్రాయ భేదాలు, వాదనలు తప్పకుండా ఉంటాయి. కోపం వచ్చినప్పుడు అందరూ ఒకేలా ప్రవర్తించరు. ప్రేమ ఉన్న చోటే గొడవ కూడా ఉంటుంది. కాబట్టి ఆ గొడవల గురించి నువ్వు అసలు ఆలోచించొద్దు. వాటి నుంచి అనుభవ పూర్వకంగా నేర్చుకున్న మంచిని మనతో ఉంచుకొని మిగతావి వదిలేయాలి. అనవసరంగా వాటి మీద ధ్యాస పెట్టొద్దు. చదువు మీద ధ్యాస పెట్టు. ఇంకెప్పుడూ మన ఇంట్లో జరిగే గొడవల గురించి ఆలోచించనని, మనసు పాడు చేసుకోనని నాకు మాట ఇవ్వు." చేయి ముందుకు చాచుతూ అడిగింది సుగుణమ్మ.
ఒక పది సెకండ్లు ఆలోచించి, నానమ్మ చెప్పింది అర్థమైనట్టుగా తల ఊపుతూ, చేతిలో చెయ్యేసి "సరే నానమ్మ! ఇంకెప్పుడూ గొడవల గురించి అంత సీరీయస్‌గా ఆలోచించను." అని మాట ఇచ్చాడు ఆకాష్.
"అయితే ఇంకె, త్వరగా చదువుకోవాల్సింది చదువుకొని, సంతోషంగా పడుకో. మళ్ళీ పొద్దున్నే స్కూల్‌కి వెళ్ళాలి కదా." అంటూ తను కట్టి పెట్టుకున్న తమలపాకుని నోట్లో వేసుకుంది సుగుణమ్మ.
"ఓకే నానమ్మ!" అంటూ సంతోషంగా చదువుకోవటంలో నిమగ్నం అయిపోయాడు ఆకాష్.
తర్వాత తను కూడా ఒక పుస్తకం తీసుకొని చదువుకుంటూ నిద్రకి ఉపక్రమించింది సుగుణమ్మ.
***
ఉదయం లేవగానే స్నానం చేయడం, తన దగ్గర ఉన్న పాత పట్టు చీరల్లోంచి ఒక చీర కట్టుకుని, దేవుడికి దీపం పెట్టుకుని, తర్వాత ఇంటి ముందర ఉన్న తులసి చెట్టుకి పూజ చేసి, తన రోజువారి కార్యక్రమం మొదలు పెడుతుంది సుగుణమ్మ.
పిల్లలు అందరూ స్కూలుకు వెళ్ళగానే, ఇద్దరు కొడుకులని, ఇద్దరు కోడళ్ళని కూర్చోబెట్టి గట్టిగా హెచ్చరించింది సుగుణమ్మ. పిల్లలు ఉన్నప్పుడు వారి ముందు చిన్నపిల్లల్లా కొట్లాడుకోకుండా, ఏదైనా ఉంటే వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవాలని, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు భావావేషాలని, కోపతాపాలని నిగ్రహించుకోవాలని, వాళ్ళు చేసే ఈ గొడవల వల్ల, పిల్లల మనసులో నెగటివ్ ఎనర్జీని మనం నింపినట్టుగా అవుతుందని, వారి ఎదుగుదలకి అది ఆటంకంగా మారుతుందని, ఇంకెప్పుడూ అలా జరగకుండా చూసుకోవాలని వారికి నచ్చ చెప్పింది.
"పిల్లలు స్కూల్‌కి వెళ్ళే సమయం, మీ అబ్బాయిలు ఆఫీసుకి వెళ్ళే సమయం ఇంచుమించు ఒక్కటే! ఈ కాలంలో పిల్లలు ఎవరూ త్వరగా నిద్రపోవట్లేదు. ఇక మేము ఎప్పుడు భర్తతో మనసులో విషయాలు చెప్పుకోవాలి? మాకు కావాల్సిన వాటికోసం గట్టిగా ఎప్పుడు మాట్లాడగలం? చెప్పండి అత్తయ్య." వెంటనే పెద్ద కోడలు ఉష ప్రశ్నించింది.
"నువ్వు చెప్పేది నిజమే! నేను కాదనటం లేదు కానీ కనీసం పిల్లలు హాలులో ఉన్నప్పుడు, కాస్త పద్ధతిగా, చిన్నగా, పోట్లాటలా కనిపించకుండా మాట్లాడుకోండి. ఇంత చిన్న వయసులోనే వాడి మనసులో, 'మా ఇంట్లో ఎప్పుడూ గొడవలు' అనే విషయం పాతుకు పోతే, అది ఎదిగే కొద్దీ విషవృక్షంలా మారుతుంది. అంతేకాదు, మీరు ఎప్పుడూ ఇలా గొడవ పడుతూ ఉంటే, ఇక మీ మీద వాడికి గౌరవం ఎలా ఉంటుంది? మీ మాటని ఎలా వింటాడు? కాబట్టి కాస్త సంయమనం పాటిస్తూ, పిల్లలకు మీ గొడవల గురించి తెలియకుండా చూసుకోండి. ఇది చాలా అత్యవసరం! ఈ మార్పు అవసరం! ఇది మీ కర్తవ్యం!" దృఢంగా చెప్పింది సుగుణమ్మ.
సరేనంటూ కోడళ్ళు ఇద్దరూ వెళ్ళిపోయారు. కొడుకులు మాత్రం 'క్షమించమ్మా.. ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటాం' అని చెప్పి ఆఫీసుకి వెళ్ళిపోయారు.
అటు ఆకాష్‌కి, ఇటు పెద్ద వాళ్ళకి కూడా, ఎవరికి చెప్పాల్సిన రీతిలో వాళ్ళకు నచ్చ చెప్పిన తర్వాత, నిజంగానే ఇంట్లో కాస్త ప్రశాంతత అలుముకుంది. ఆకాష్ కూడా సంతోషంగా స్కూలుకు వెళ్ళి, వస్తూ, బాగా చదువుకుంటున్నాడు.
"నువ్వు హాయిగా వెళ్ళిపోయావు! నాకేమో ఇంకా ఈ బరువు బాధ్యతలు వెంటాడుతున్నాయి. నాకు విముక్తి ఎప్పుడు..!" అంటూ గోడకి ఉన్న భర్త గోపాల్ రావు ఫోటోకి దీపం పెట్టుకుంటూ, ఎప్పటిలాగే తన బాధ చెప్పుకుంది సుగుణమ్మ.
-సమాప్తం-
No comments:
Post a Comment