Saturday, March 28, 2026

 *మారుతీయం*
(,శ్రీ గొల్లపూడి మారుతీరావు)
కవితలు. 

*******
*అప్పుడు*

ప్రాభాత మలయానిలం తన ముని వేళ్ళతో నీ చెక్కిలి మీటినప్పుడు

పూర్వజన్మ స్మృతిలాగ ధాత్రీ వదనం మీద చిక్కని చిరునవ్వుని తిలకించినప్పుడు

సంజె పెదవులు నీ గుండె లోపలి పొరల్లో నీ అనుభవంలోకి

తొంగి చూసిన పాత అనుభవాన్ని తట్టిలేపినప్పుడు

పట్టపగలే నీ హృదయాంబరంలో పట్టుదారాలు వేలాడదీసినట్టు

ఆశా తారకలు బారులు తీర్చినప్పుడు

ఒక్క కన్నీటి బొట్టు నీ కంటి కొనల్లో మణిదీపంలాగ వెలిగినప్పుడు 

కలలో - విస్మృతిలో నేను లేనన్న భయం నీ ప్రఫుల్ల మనః ఫలకాన్ని పిచ్చి గీతలతో కలవర పరిచినప్పుడు

రస హీనమయిన క్షణం దైనందిన జీవన యాత్రలో నిన్ను ఒరుసుకున్నప్పుడు 

చల్లని వెన్నెల్లాంటి ఆలోచనల్ని వర్షించే నీ చేతన చలిమంటముందు వణుకుతున్నప్పుడు

నేను లేని క్షణంలో నాగరకత నీ కళ్ళముందు

నగ్న సౌందర్యంలాగ దర్శనమిచ్చినప్పుడు

కడుపులో ఆకలి కరేల్మనిపించినప్పుడు

నీ ఊపిరి నీకే బరువయినప్పుడు

ఎదుర్కోవలసిన ప్రతి బాధ్యతా
కుబుసం విప్పిన త్రాచులాగ ఎదురుతిరిగినప్పుడు

ముప్ఫై శరత్తుల నీ యౌవనం మూగగా ఆక్రోశించినప్పుడు

అప్పుడు నన్ను గుర్తు చేసుకో

విధి నిర్దేశించిన ప్రవాసంలో

విధిగా నీకై నిరీక్షించే ఈ నేత్రాలు

పరస్పరానంద సందోహాన్ని

పట్టుదారాలతో బంధించిన సూత్రాలయి

నువ్వు ముడివిప్పుతావని ఎదురుచూస్తాయని గుర్తు చేసుకో..

********

No comments:

Post a Comment