Saturday, March 28, 2026

 *“బెంచ్ మీద నిలబెట్టిన రోజు”*
_(చిన్న కథ, రచయిత: —డి శ్యామ్)_
================= 
*ఒక చిన్న మారుమూల గ్రామంలో స్కూల్‌లో రాజు అనే బాలుడు చదివేవాడు.*

*రాజు చిన్నప్పటి నుండి లావుగా ఉండేవాడు… చదువులో అద్భుతం కాదు… యావరేజ్...* 
 
*కానీ, అసలు చెడ్డ విద్యార్థి కూడా కాదు. అతను సాధారణమైన పిల్లవాడు— కానీ, హృదయం చాలా మృదువైనది.*

*ఒక రోజు రాజు మావయ్య స్కూల్‌కి వచ్చి టీచర్‌ని... _“రాజు ఎలా చదువుతున్నాడు సార్?”_ అనిఅడిగాడు.*

*టీచర్ చిరునవ్వు నవ్వి, _“అతను చదువులో యావరేజ్… కానీ, విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి.”_ అంటూ అతని బాడీని షేమింగ్ చేశారు.*

*ఆ మాటలో ఉన్న వ్యంగ్యం రాజు చెవుల్లో పడింది. అతను ఏమీ మాట్లాడలేదు…*

*కానీ ఆ రోజు అతని చిన్న హృదయంలో ఒక నిశ్శబ్ద గాయం పడింది. కాలం గడిచింది.*

*ఇంటర్‌లో రాజుకు ఇష్టం లేని సైన్స్ గ్రూపులో బలవంతంగా ఇంట్లో వాళ్లు జాయిన్ చేశారు.*

*అతని మనసు వేరే దారిలో ఉండగా... సమీకరణాలు, ఫార్ములాలు అతనికి భారంగా అనిపించాయి.*

*ఒక రోజు పరీక్ష సరిగా రాయలేకపోయాడు.*

*లెక్చరర్ కోపంతో... _“రేయ్!లేచి బెంచ్ మీద నిలబడు!”_ అన్నాడు...* 

*అందరి ముందు రాజు బెంచ్ మీద నిలబడ్డాడు.*

*క్లాస్‌లో కొందరు నవ్వారు… కొంతమంది చూసి చులకనగా మాట్లాడారు.*

*ఆ రోజు బెంచ్ మీద నిలబెట్టింది అతని శరీరాన్ని మాత్రమే కాదు… అతని ఆత్మగౌరవాన్ని కూడా... రాజు తల వంచి నిలబడ్డాడు.*

*కానీ అతని మనసులో ఒక మాట పుట్టింది—*

*_“ఒక రోజు నేను గనక టీచర్ అయితే… ఎప్పుడూ ఒక విద్యార్థిని ఇలా అవమానించను.”_ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.*

*సంవత్సరాలు గడిచాయి. జీవితం తనదైన మార్గంలో నడిచింది.*

*ఒక రోజు… రానే వచ్చింది... రాజు కాస్త రాజు మాస్టారు అయ్యారు. ఆయన జీవితంలో ఊహించని మలుపు తిరిగింది.*

 *క్లాస్‌రూమ్‌లో పిల్లలు కూర్చున్నారు. బ్లాక్‌బోర్డ్ ముందు నిలబడి పాఠం చెప్పేది రాజు సార్.*

*అతని కళ్ళలో కాఠిన్యత లేదు… అతని మాటల్లో అవమానం లేదు…*
.................. 
*అతని హృదయంలో మాత్రం ఒక పాత జ్ఞాపకం అలాగే ఉంది—*

*_బెంచ్ మీద నిలబెట్టిన రోజు...._*

*అందుకే రాజు సార్ ప్రతి విద్యార్థినీ ప్రేమతో గౌరవంగా చూసేవాడు.*

*ఎవరైనా తప్పు చేస్తే, అతను అవమానించలేదు…*

*అర్థం చేసుకునేలా చెప్పేవాడు.*

*ఎవరైనా చదువులో వెనుకబడి ఉంటే, అతను ఎగతాళిగా నవ్వలేదు…*

*వారి చేతిని పట్టుకొని ముందుకు నడిపేవాడు.*

*ఎందుకంటే రాజు సార్‌కు తెలుసు—*
*ఒక మంచి టీచర్ అంటే… విద్యార్థి మార్కులను మాత్రమే కాదు.*

*అతని మనసును కూడా అర్థం చేసుకునే వాడు.*

*విద్యార్థి శరీరాన్ని ఎగతాళి చేయకుండా, అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచే వాడు.*

*అవమానం కాదు…ఆత్మవిశ్వాసం ఇచ్చే వాడు.*

*శిక్షించడం కాదు… ప్రేరణ ఇచ్చే వాడు.*

*ఎందుకంటే... ఒక టీచర్ మాట విద్యార్థి జీవితాన్ని గాయపరచవచ్చు…*

*లేదా గొప్పగా మార్చవచ్చు.*

*అందుకే రాజు సార్ ఎప్పుడూ తనను తానే గుర్తు చేసుకునేవాడు—*

*_“గురువు అంటే పాఠాలు చెప్పేవాడు మాత్రమే కాదు…జీవితాలను మలిచేవాడు కూడా.”_*
-----------------------
*_-•{ఇది కె. సత్యనారాయణ SA-PS గారు సేకరించి ఒక వాట్సప్ గ్రుపులో పెట్టారు. మంచి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో తెలిపిన ఈ కథ నన్ను బాగా కదిలించింది. అందుకే మరింత అర్థవంతంగా మలచి, ఒక చిత్రాన్ని జతచేసి.. మీలాంటి మరికొందరికి షేర్ చేయాలనిపించింది.: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు & స్టూడెంట్ మోటివేటర్, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}•-_*

No comments:

Post a Comment