నాలో మరో నేను
సలీమ్...🌹
తన్ని చంపాలన్నంత కోపంగా ఉంది. కసిదీరా కత్తితో కసకసా పొడిచి చంపాలన్నంత కోపం. అతను నా ఎదురుగానే ఉన్నాడు. నేను వండిపెట్టిన పదార్థాల్ని వంకలు పెడుతూ తిడుతూ తింటున్నాడు. శారీరకంగా నాకన్నా బలవంతుడు కదా... కలబడి, కదలకుండా చేసి, చంపలేను. రాత్రి నిద్రపోతున్నప్పుడు మొహం మీద దిండుపెట్టి, ఊపిరాడకుండా చేసి చంపేయాలనుకున్నాను. అతనిది కోడినిద్ర... చిన్న అలికిడి అయినా మెలకువ వచ్చేస్తుంది. పొరపాటు జరక్కూడదు. వారంలో రెండు మూడుసార్లు పార్టీలకు వెళ్ళి తాగొచ్చి పడుకుంటాడు. అప్పుడు మత్తులో ఉంటాడుగా, నేరం చేసినట్టు ఏ ఆధారమూ దొరక్కుండా పక్కా ప్లాన్‌తో చంపేయాలి.
ఎన్నేళ్ళ కసిని గుండెల్లో రాచపుండులా మోస్తున్నానో... దాదాపు ముప్ఫై ఏళ్ళనుంచి ఇతను పెట్టే హింసను మౌనంగా భరిస్తూ వచ్చాను. ‘అటువంటి రాక్షసుడితో ఇంకా ఎందుకు కాపురం చేస్తున్నావో అర్థం కావడం లేదు. నీకు ఉద్యోగం ఉందిగా, అతన్ని వదిలించుకుని హాయిగా స్వేచ్ఛగా బతకొచ్చుగా. నీలో నాకు మాసోచిస్టిక్ లక్షణాలు కనిపిస్తున్నాయే. అతను పెట్టే హింసకు అలవాటుపడ్డావో, లేకపోతే ఆ హింసలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నావో అర్థం కావడం లేదు’ అంది నా స్నేహితురాలు శరణ్య.
హింసను భరించాలని ఏ ఆడదానికైనా ఎందుకుంటుంది? నేను తిరగబడాలనే అనుకున్నాను. కసితీరా తిట్టేసి, అతన్ని వదిలి వెళ్ళాలనే అనుకున్నాను. కానీ, అప్పటికే నా కాళ్ళకు సంకెళ్ళలా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ‘నువ్వు మొగుడ్ని వదిలేసి వెళ్తే నలుగురూ ఏమనుకుంటారు? అసలే ఆడపిల్లలు. వాళ్ళకు పెళ్ళిళ్ళెలా అవుతాయి?’ అంటూ నాలో పిరికి రసాన్ని నూరిపోశారు అందరూ. అప్పుడే తెగించి బయటికి వచ్చేయాల్సింది. అప్పుడు పెద్దపిల్లకు మూడేళ్ళ వయసుంటుంది. చిన్నదానికి ఏడాదిన్నర. మరో ఇరవై పాతికేళ్ళు దాటితే కదా తెలిసొచ్చేది- తండ్రిలేని ఆడపిల్లలకు పెళ్ళవుతుందో లేదో... ఎందుకో అంత ధైర్యం చేయలేకపోయాను.
‘తండ్రి లేని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళవుతాయే. కానీ మొగుడ్ని వదిలేసి వెళ్ళిన ఆడదాని పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం కష్టం’ అంది అమ్మ. ‘ఎందుకు కష్టం? అటువంటి పిల్లలకు ఎంతమందికి పెళ్ళిళ్ళు కావడం లేదూ’ అన్నాను.
‘నేను చెప్పేది నీకర్థం కావడం లేదు. నీకిప్పుడు ఇరవైఆరేళ్ళు. భర్తను వదిలేసి ఒంటరిగా బతకడం కత్తుల వంతెన మీద నడకలాంటిది. సమాజం నీ పైన బురద చల్లుతుంది. ఎవర్తోనో సంబంధం ఉండబట్టే మొగుడ్ని వదిలేసింది అనుకుంటారు’ అంది. ‘తప్పేముంది, అనుకోనీ. నాకేం నష్టం? నా బతుకు నేను బతుకుతాను’ అన్నాను.
‘ఏంటే, కొంపదీసి ఎవరైనా నిజంగానే ఉన్నారా, చెప్పవే’ అంది అమ్మ కంగారుగా. ‘ప్రస్తుతానికి ఎవ్వరూ లేరు లేమ్మా. కానీ ఇతన్ని వదిలి వెళ్ళిపోయాక నా జీవితంలోకి మరో మగాడు రావచ్చుగా. నా మనసు తెలిసిన మగాడు, నన్ను ప్రేమగా చూసుకునే మగవాడు. అటువంటి అవకాశమే వస్తే వదులుకోను, ముందే చెప్తున్నా’ అన్నాను.
‘నోర్ముయ్యవే. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా? నువ్వలా చేస్తే దాని ప్రభావం ఆడపిల్లల మీద పడదనుకుంటున్నావా? ఆ వచ్చేవాడు నీ పిల్లల్ని తన సొంత కూతుళ్ళలా చూస్తాడని గ్యారంటీ ఇవ్వగలవా?’ అంది.
ఆ విషయం నాకు తెలుసు. సమాజం ఏమనుకున్నా తట్టుకోగలను కానీ, నా ఇద్దరు పిల్లలు నా గురించి తప్పుగా అనుకోవడమో, నా నిర్ణయం వాళ్ళ భవిష్యత్తుకు శాపంగా మారడమో నేను భరించలేను. నా మొగుడి మీద ఉన్న కసి కొద్దీ అమ్మతో అలా అన్నానే కానీ నాకంత ధైర్యం లేదు. నా పిల్లల జీవితంతో ఆడుకునే అధికారం నాకెక్కడుంది? వాళ్ళ కోసమే ఇతని అఘాయిత్యాల్ని భరిస్తూ వచ్చాను. ఇప్పుడు నా వయసు యాభైనాలుగేళ్ళు. అమ్మాయిలిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. కూతుళ్ళూ అల్లుళ్ళూ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. ఇప్పుడు నా కాళ్ళకు నిగళాలేవీ అడ్డుగా లేవు. అందుకే నా మొగుడ్ని చంపడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది.
చారులోనో కూరలోనో విషం పెట్టి చంపాలన్న ఆలోచన చాలాసార్లు వచ్చింది. వెంటనే భయమేసేది. పోలీసులకు సులభంగా దొరికిపోయి, జైలుకెళ్తే నా ఇద్దరు పిల్లలు సమాజంలో తలదించుకుని బతకాల్సి వస్తుందన్న ఆలోచన రావడంతో దాన్ని విరమించుకున్నాను.
అతను భోజనం చేయడం పూర్తి చేసి, డైనింగ్ టేబుల్ దగ్గరనుంచి లేచి వెళ్ళి, సింక్‌లో చేయి కడుక్కున్నాడు. వెంటనే జేబులోంచి సిగరెట్ పాకెట్ బయటికి తీసి, సిగరెట్ వెలిగించుకుని, టీవీ ఆన్ చేసి, సోఫాలో కూర్చుని, వార్తలు చూడసాగాడు.
నాకు సిగరెట్ వాసన పడదు. వాంతొస్తుంది. పెళ్ళయిన కొత్తలో ఎన్నిసార్లు చెప్పానో ఈ విషయం... నవ్వి ఊరుకున్నాడు తప్ప, ఆ అలవాటు మానలేదు. ఏ అలవాట్లు మానాడని ఈ అలవాటు మానుకోడానికి? అతను తిన్న ప్లేట్ తీసి, కిచెన్ సింక్‌లో పడేశాను.
నాకు ఆకలిగా అన్పించలేదు. ఓ గ్లాస్ నిండా చల్లటి మంచినీళ్ళు తాగి, బెడ్‌రూమ్‌లోకెళ్ళి పడుకున్నాను. ఎప్పటివో ఙ్ఞాపకాలు...డిగ్రీ పాసయ్యాక, బ్యాంక్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న రోజులు... అప్పుడొచ్చింది ఇతని సంబంధం. పేరు రామకృష్ణ అని చెప్పారు. సివిల్ కాంట్రాక్టర్‌గా చేస్తున్నాడట. బాగా సంపాదిస్తున్నాడని కూడా చెప్పారు. మొదట అతని ఫొటో చూపించారు.
బాగానే ఉన్నాడనిపించింది. పెళ్ళి చూపుల సమయంలో తలెత్తి అతని వైపు చూసిన క్షణం సమ్మోహనంగా నవ్వాడు. ఫొటోలోకన్నా అందంగా కన్పించాడు.
నాకంటే ఐదారేళ్ళు పెద్ద... మరో ఆర్నెల్లలోపలే మా పెళ్ళి జరిగిపోయింది. పెళ్ళయిన నాలుగు నెలల వరకు సంసారం సజావుగానే సాగింది. నేను కడుపుతో ఉన్న విషయం చెప్పిన రోజు అతని మొహంలో సంతోషం బదులు ఓ నిశ్చింత కన్పించింది.
ఆరోజు- రాత్రి పదిన్నరకు ఇంటికొచ్చాడు. బాగా తాగినట్టున్నాడు. తూలుతున్నాడు. పడిపోకుండా పట్టుకుని లోపలికి తీసుకెళ్ళాను. నాకు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు ధారాపాతంగా కారుతున్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అన్నం పెట్టాను. నాలుగు ముద్దలు తిని, మంచం మీద స్పృహలేకుండా పడిపోయాడు.
రాత్రంతా కన్నీళ్ళ వరదలో కొట్టుకుపోతూ జాగారం చేశాను. ఎంత మోసం చేశాడో... పెళ్ళికి ముందు ‘నాకేమీ చెడు అలవాట్లు లేవు. స్మోకింగ్, డ్రింకింగ్‌లాంటి దురలవాట్ల జోలికి కూడా పోను. బుద్ధిమంతుణ్ణి తెలుసా’ అంటూ నవ్వితే నమ్మేశాను.ఉదయం అతను టిఫిన్ చేశాక, కాఫీ తాగుతున్నప్పుడు అడిగాను.
ఆ నిత్యాన్నదానానికి... రెండొందల ఏళ్లు!
‘మీరు తాగుతారా? పెళ్ళికి ముందు నాకెందుకు అబద్ధం చెప్పారు?’ అని నిలదీశాను.
‘నిజాలు చెప్తే నువ్వు పెళ్ళికి ఒప్పుకుని ఉండేదానివి కాదుగా’ అంటూ నవ్వాడు. ఇప్పుడైనా మీకు విడాకులివ్వనని గ్యారంటీ ఏమిటి?’ కోపంతో రగిలిపోతూ అడిగాను.
‘నువ్వు కడుపుతో ఉన్నావు కదా, నన్ను వదిలి వెళ్ళలేవు.’ ‘ఎందుకు వెళ్ళలేను, వెళ్తాను.’
‘నీకు పిల్లలంటే ఎంతిష్టమో నాకు తెలుసు. వాళ్ళకోసం దేవుడినైనా ఎదిరిస్తానని నాతో చాలాసార్లు అన్నావు గుర్తుందా? కడుపుతో ఉన్న నిన్ను ఎవరూ పెళ్ళి చేసుకోరు. నువ్వు అబార్షన్ చేయించుకోవు. నీకు పుట్టబోయే బిడ్డని తండ్రి లేనివాడిగా చేయడం కూడా నీకిష్టముండదని నాకు తెలుసు’ అన్నాడు.
నా కాళ్ళని గొడ్డలితో నేనే నరుక్కున్నానని అర్థమైంది. పెళ్ళయిన కొత్తలో నేనే ఇవన్నీ చెప్పాను. నా మనసు విప్పి అతని ముందు పరిచాను. దాన్లో ఇప్పుడతను విషం చిమ్ముతున్నాడు. నాకున్న బలమైన ఇష్టాల్ని సంకెళ్ళుగా మార్చి నాకే తొడిగాడు.‘తాగడం ఒక్కటేనా, ఇంకేమైనా దురలవాట్లు ఉన్నాయా?’ అని అడిగాను.
‘అన్నీ చెప్పి, నీ అనుమతి తీసుకోవాలా? నోరు మూసుకుని పడుండు’ అంటూ కోపంగా బైటికెళ్ళిపోయాడు.అతనలా కోపంగా, అవమానకరంగా మాట్లాడటం అదే మొదటిసారి.
ఆ తర్వాత అది దినచర్యలో ఓ భాగమైపోయింది. సిగరెట్లు విపరీతంగా కాల్చేవాడు. నాకా వాసన పడదని చెప్పినపుడల్లా ‘కొన్ని రోజులు భరించావనుకో, అదే అలవాటైపోతుంది’ అనేవాడు. ఇప్పటికీ నాకా వాసన పడదు. వాంతొస్తుంది.
మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. దానికి శ్రీజ అని పేరు పెట్టాం. నా మనసుకు ఊరట నా కూతురే. దాని ముద్దుమాటల్లో అల్లరి చేష్టల్లో మునిగిపోయి నా భర్త పెడుతున్న మానసిక హింసను లోపలి పొరల్లోకి నెట్టేసేదాన్ని. రెండో కాన్పు కూడా ఆడపిల్లే. క్షితిజ... దానికి ఏడాది నిండింది. ఓ రోజు టాయిలెట్‌కి వెళ్తుంటే కణకణమండే నిప్పు కణికలు కదులుతున్నట్టు మంట. నాకు యూరిన్ ఇన్‌ఫెక్షన్ ఎందుకొచ్చిందో అర్థం కాలేదు.
ఎవరినుంచి వచ్చిందో తెలుసు కాబట్టి రాత్రి అతన్ని నిలదీశాను. వంకరగా నవ్వుతూ ‘ఓ... నీక్కూడా వచ్చిందన్నమాట. రేపు డాక్టర్ దగ్గరకు వెళ్ళు. యాంటిబయాటిక్స్ రాసిస్తారు. ఐదు రోజులు వాడితే అదే తగ్గిపోతుంది’ అన్నాడు.‘అది సరే, మీకెలా వచ్చింది?’ అని అడిగాను.
‘పదిమందితో సంబంధం ఉన్నప్పుడు రాకుండా ఎలా ఉంటుంది?’ అన్నాడు అదేదో చాలా సాధారణమైన విషయంలా.
నాకు వాసన పడదని తెలిసినా అతను సిగరెట్లు కాలిస్తే భరించాను. తాగొచ్చి, నోటికొచ్చినట్టు తిట్టినా సహించాను. కానీ ఇలా పరాయి స్త్రీలతో అనైతిక సంబంధాలు పెట్టుకోవడాన్ని తట్టుకోలేక పోయాను. పెద్ద గొడవైంది. కోపం పట్టలేక పెద్దపెద్దగా అరిచాను.
‘నా పదిహేడో ఏట మొదలైన అలవాటు... ఇప్పుడు నువ్వున్నావు కాబట్టి పొమ్మంటే ఎలా పోతుంది? దీనికెందుకింత రాద్ధాంతం చేస్తున్నావు?’ అన్నాడు.‘ఎవరామె? ఎప్పటినుంచి పరిచయం? పెళ్ళయిందా? పిల్లలున్నారా’ అంటూ రకరకాల ప్రశ్నలు వేశాను.
‘ఒకరైతే ఫలానా అని పేరు చెప్పగలను. చాలామంది ఉన్నారు. వారంలో రెండు మూడుసార్లు కాల్‌గాళ్స్‌తో గడపడం నా అలవాటు. దాన్ని మానుకోలేను. నన్నొదిలి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు... నీ ఇష్టం. నేను ఆపను’ అన్నాడు.నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది.
ఇతని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నా ఇద్దరు పిల్లల్ని పోషించుకోగలను, చదివించుకోగలను. అతన్ని వదిలేసి వెళ్దామనే అనుకున్నాను. కానీ శ్రీజ గుర్తుకు రాగానే ఆవేశమంతా చప్పగా చల్లారిపోయింది.శ్రీజకు వాళ్ళ నాన్నంటే వల్లమాలిన ఇష్టం. చిన్నప్పటినుంచీ అది అతనివైపే మొగ్గేది. దానికి ఏడాదిన్నరకే మాటలొచ్చాయి. ‘నీకెవరిష్టం?’ అని అడిగితే ‘నాన్న’ అంటూ బుల్లెట్‌లా సమాధానం దూసుకొచ్చేది. అతను ఇంట్లో ఉంటే ఇది అతని చుట్టే తిరుగుతూ ఉండేది. వాళ్ళ నాన్న తినిపిస్తేనే అన్నం తింటానని మారాం చేసేది. అతని స్కూటర్ శబ్దం వినిపిస్తే చాలు ‘నాన్నొచ్చాడు’ అంటూ తలుపు తీసుకుని అతని దగ్గరకు పరుగెత్తేది.
అతనిక్కూడా శ్రీజ అంటే ఎంతిష్టమో... ఏ మాట కామాటే చెప్పుకోవాలి. పిల్లలంటే ప్రాణం పెట్టేవాడు. చెడ్డ భర్త కానీ, మంచి తండ్రి. పిల్లలిద్దర్నీ అల్లారుముద్దుగా చూసుకునేవాడు. నేనతనికి విడాకులిచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే, శ్రీజ మానసికంగా తట్టుకోలేదని నాకర్థమైంది. తండ్రిని అంతగా ప్రేమించే కూతుర్ని అతన్నుంచి విడదీయడం దుర్మార్గమనిపించింది. అందుకే ఆ ఆలోచనని విరమించుకుని, అతను పెట్టే కష్టాల్ని పంటి బిగువున భరించాను.
క్షితిజ పెద్దయ్యేకొద్దీ నేనంటేనే ఎక్కువ ఇష్టపడేది. వాళ్ళ నాన్న చేస్తున్న పనుల్ని చూసి, గొడవకు దిగేది. శ్రీజ ఎప్పుడూ వాళ్ళ నాన్న తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడేది. అతని తాగుడు గురించి అడిగితే ‘కాంట్రాక్టర్‌గా పని చేయడమంటే ఆషామాషీ వ్యవహారం అనుకున్నావా? ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయో, రిలాక్సేషన్ కావొద్దా? అలజడిగా ఉన్న మనసుకి ఊరట కోసం తాగితే తప్పేంటి?’ అని వాదించేది. ‘మరి పరాయి స్త్రీలతో సంబంధాల మాటేమిటి?’ అని క్షితిజ కోపగించుకుంటే, ‘కొందరికి కొన్ని బలహీనతలుంటాయి. అలా తిరగడం తప్పే. కానీ అది నాన్న బలహీనత.
ఎదుటి వ్యక్తిలోని బలహీనతల్ని క్షమించి అక్కున చేర్చుకునేదే కదా నిజమైన ప్రేమంటే. నాకు మా నాన్నంటే ప్రేమ’ అంటూ మా నోళ్ళు మూయించేది. అతని బలహీనతల్ని క్షమించేంత ప్రేమ నాకు లేదనుకుంటా. అసలెప్పుడతన్ని ప్రేమించానని? అతనంటే నాకు అసహ్యం, కోపం, పగ. నన్ను చాలాసార్లు మానసికంగా పొడిచిపొడిచి చంపాడు. అందుకే ప్రతీకారం తీర్చుకోడానికి సమయం కోసం ఎదురుచూస్తున్నా.
మరునాడు రాత్రి బాగా పొద్దుపోయాక తూలుకుంటూ వచ్చాడు. నాకు తెలుసు- ఈ రోజు తప్పకుండా తాగి వస్తాడని. మజ్జిగన్నం పెడితే నానా బూతులు తిడ్తూ, తినేసి, మంచం మీద స్పృహ లేకుండా పడుకున్నాడు. నేను ఎదురుచూస్తున్న అవకాశం అదే.ఊపిరాడకుండా మొహం మీద దిండుతో అదిమిపెడ్తే సరి, చచ్చూరుకుంటాడు.
అతనికి ఎప్పటినుంచో డయాబెటిస్ ఉంది. ఐదారేళ్ళ క్రితం హై బీపీ కూడా ఉందని తెలియడంతో రెండింటికీ మందులు వేసుకుంటున్నాడు. అందుకే హార్ట్ అటాక్‌తో చనిపోయాడని నమ్మించడం సులభం.బెడ్‌రూమ్‌లోకి మెల్లగా అడుగుపెట్టాను. అతను పెద్దగా గురకపెడ్తున్నాడు. అది జంతువు అరుపులా విన్పిస్తోంది. నా గుండెల్ని ముక్కలు ముక్కలుగా చీల్చి తిన్న జంతువు.
దిండు చేతిలోకి తీసుకున్నాను. అతని మొహంలోకి దీర్ఘంగా చూశాను. ఎంత క్రూరంగా కన్పిస్తున్నాడో. ‘చంపేయాలి... చంపేయాలి’ అనుకుంటూ వణుకుతున్న నా చేతుల వైపు చూశాను. చేతులే కాదు, శరీరమంతా భయంతో వణుకుతోంది. చంపాలని మనసులో చాలాసార్లు అనుకున్నానుగానీ, నిజంగా చంపలేనని అర్థమైంది. దొరికిపోతే శిక్ష పడ్తుందన్న భయం కాదు... మరో మనిషిని చంపలేని మంచితనం. హత్య చేయాలంటే మనసెంత కఠినంగా ఉండాలో కదా... బండరాయికన్నా కఠినంగా... నా మనసునిండా ఉన్నది మెత్తదనమేగా. ఎదుటి వ్యక్తిని మాటల్తోనో చేతల్తోనో హింస పెట్టడమే రాని నేను, ఓ మనిషి ప్రాణాల్ని తీయగలనా... లేదు.
దిండుని మంచం మీదకి విసిరేసి, హాల్లోకొచ్చి సోఫాలో డస్సిపోయినట్టు వాలిపోయాను. నాకిప్పుడో విషయం అర్థమైంది. కొంతమంది మనసులోనే పరపురుషుల్ని ఊహించుకుంటారని ఎక్కడో చదివాను. కానీ తీరా అటువంటి అవకాశమే లభిస్తే ధైర్యం చేయలేరు. అక్కడినుంచి పారిపోతారు. నేనూ అంతే అనుకుంటా. అతన్ని చంపాలన్న కోరికతో ఎలా చంపాలో మనసులో ఊహించుకున్న ప్రతిసారీ మనసుకెంత హాయిగా అన్పించేదో... థ్రిల్ ఫీలింగ్ కలిగేది.
ఊహల్లో చంపినా, నిజంగా చంపిన తర్వాత లభించే అనంతమైన మనశ్శాంతిని అనుభవించేదాన్ని. కానీ, నా పగ, ప్రతీకారం ఆలోచనలకే పరిమితం. ఆచరణలో ఏమీ చేయలేని అశక్తురాలిని. మానసికంగా బలహీనురాలిని. మంచితనం, దయ, కరుణ... ఇవి కూడా బలహీనతలేగా!
* * *
ఓ రోజు బయటికెళ్ళబోతూ దబ్బున కిందపడిపోయాడు. అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారు. ఇస్కీమిక్ స్ట్రోక్... మెదడులోని నరాలు బలహీనపడటం వల్ల రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడి, మెదడు కణాలకు ఆక్సిజన్ అందకపోవడంతో మెదడులోని భాగాలు దెబ్బతింటాయట. అతని కుడిచేయి, కుడికాలు పక్షవాతానికి లోనయ్యాయి. నోరు ఓ పక్కకు తిరిగిపోవడం వల్ల మాటల్లో అస్పష్టత... ఓ పట్టాన అర్థం కావడం లేదు.
మందులు రాసిచ్చారు. ఇంటికి తీసుకొచ్చాను. శ్రీజ అమెరికా నుంచి వచ్చి రెండు వారాలు ఉంది. వెళ్ళేముందు ‘నాన్నని బాగా చూస్కో మమ్మీ’ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. అతను మంచంలోనే పడి ఉంటున్నాడు. దీనంగా... నిస్సహాయంగా... జాలి గొలిపేలా...నాకు మాత్రం జాలనిపించడం లేదు.
ఏదో సంతృప్తి... ఇన్నాళ్ళుగా కోరుకుంటున్నదేదో దొరికిన ఆనందం...అన్నీ మంచంలోనే... ఆరు నెలలు అతనికి ఊడిగం చేశాను. నన్ను ఇన్నాళ్ళూ హింస పెట్టిన వ్యక్తికి సపర్యలు చేయాల్సి రావడం మనసుని మరింత కష్టపెడుతోంది.
ఓ రోజు ఉదయం అతని ఒంటిని సబ్బునీళ్ళతో శుభ్రం చేసి, రెండు ఇడ్లీలు తినిపించాక, సూట్‌కేస్‌లో నా బట్టలు సర్దుకుని, ‘‘నేను వెళ్తున్నాను, గుడ్ బై’’ అనేసి బైటికొచ్చేశాను. అతను ఏదేదో అన్నాడు. ఏమంటున్నాడో అర్థం కాలేదు.
‘‘ఎప్పుడో చేసి ఉండాల్సిన పని మమ్మీ. అప్పుడే చేసి ఉంటే తప్పకుండా సమర్థించేదాన్ని. కానీ ఇప్పుడు చేయడమే సరికాదు. పక్షవాతంతో బాధపడ్తున్న వ్యక్తిని నిర్దయగా వదిలి వెళ్ళడం తప్పనిపిస్తోంది’’ అంది క్షితిజ. ‘‘ఈ సమయంలో భార్యగా నాన్నకు సేవలు చేయడం నీ బాధ్యత కాదా? అలా దుర్మార్గంగా వదిలేసి వస్తే ఆయన్ని ఎవరు చూసుకుంటారు?’’ అంది శ్రీజ.
‘‘నేనెప్పుడూ ఆయన్ని భర్తగా గౌరవించలేదు. నా ఇద్దరు పిల్లలకు తండ్రిగానే భావించాను. నేను వదిలి రావడం వల్ల అతనికేమీ ఇబ్బంది ఉండదు. బాగానే సంపాయించాడుగా. వంట చేయడానికి ఓ మనిషినీ, దగ్గరుండి చూసుకోడానికి ఓ నర్సునీ పెట్టుకుంటే చాలు. రోజులు హాయిగా గడిచిపోతాయి’’ అన్నాను.
శ్రీజ కోపం పట్టలేక నోటికొచ్చినట్టు తిట్టింది. నవ్వి ఊరుకున్నాను.అతని అనారోగ్యం గురించి తెలిసిన చుట్టుపక్కలవాళ్ళూ స్నేహితులూ బంధువులూ నన్ను దయలేని దుర్మార్గురాలిగానే భావించారు. కక్ష తీర్చుకుందని కొందరూ సరైన సమయం చూసి శిక్ష వేసిందని మరికొందరూ అనుకున్నారు.కానీ నిజం ఏమిటో నాకు మాత్రమే తెలుసు.
పెళ్ళి కాకముందు వరకూ ఎవరైనా బాధపడ్తుంటే సాయం చేయడానికి పరుగెత్తేదాన్ని. ఎంత జాలి పడిపోయేదాన్నో. గుండె నిండా కరుణ... ప్రేమకు మారుపేరులా ఉండేదాన్ని. అతని మీద ఎంత కసిగా ఉన్నా, అతన్ని హింస పెట్టినట్టు, హత్య చేసినట్టు ఊహించుకుని తృప్తిపడేదాన్ని తప్ప, అతనికి హాని తలపెట్టడానికి మనసు ఒప్పుకునేది కాదు.
కానీ అతను పక్షవాతంతో మంచం పట్టినప్పటినుంచీ నా మనస్తత్వంలో ఏదో మార్పు రాసాగింది. అతను బాధపడ్తుంటే చూసి జాలి పడాల్సింది పోయి ‘బాగైంది... ఇలానే కావాలి వీడికి’ అని లోపల్లోపల సంతోషపడసాగాను. శాడిస్టిక్ ప్లెజర్ని అనుభవించసాగాను.
నేను స్వతహాగా మంచిదాన్నే. డాక్టర్ జెకిల్ లాంటిదాన్ని. కానీ అతనికి పక్షవాతం వచ్చినప్పటినుంచీ నాలో దాక్కుని ఉన్న హైడ్ బైటికి రాసాగాడు. అతని దుర్భర స్థితిని చూసి సంతృప్తిగా నవ్వుకోవడం... క్రూరమైన ఆలోచనలు... మాటలతో హింసించాలనిపించడం... పెరిగింది. మరికొద్ది రోజులుంటే తప్పకుండా హింస పెట్టి ఉండేదాన్ని. అతన్ని కత్తితో కసకసా పొడిచి చంపినట్టు ఇన్నాళ్ళూ ఊహించుకుని తృప్తిపడిన నాకు, ఇప్పుడతన్ని నిజంగానే చంపాలనే కోరిక ఉద్ధృతం కాసాగింది. మరి కొద్ది రోజులు నేనక్కడే ఉండి ఉంటే అతన్ని చంపేసి ఉండేదాన్ని.
నాలో మేల్కొన్న హైడ్ నుంచి అతన్ని రక్షించటానికే కాదు, నన్ను నేను కాపాడుకోడానికి కూడా అతన్ని వదిలి వచ్చేశాను. అక్కడున్నది నేను కాదు. ప్రేమ, దయ, జాలి, కరుణ నిండిన ఈ నేనే అసలైన నేను.
నేనిప్పుడు పూర్తి జెకిల్‌ని. హైడ్‌ని చంపి, మనసు పొరల్లో లోతుగా పాతేశాను. నిజంగానే చంపేశానా? ఏమో చెప్పలేను. అదునుచూసుకుని ఫీనిక్స్‌లా హైడ్ మళ్ళీ బతికి రావచ్చునేమో కూడా. ఏమైనా- ఈ నిమిషానికి నాకు సరి అనిపించింది నేను చేశాను... అంతే!
Collected by : @Sairam
Credits: Eenadu
🌹🌹🌹
No comments:
Post a Comment