💦 *మరిచిపోయిన కృతజ్ఞత – మసకబారుతున్న దాంపత్యం*
🍥*మనుషుల మూర్ఖత్వం గురించి మాట్లాడాల్సి వస్తే, లైబ్రరీలకి లైబ్రరీలు రాసినా సరిపోవు. కానీ, పెళ్లి అనే వ్యవస్థలో ఈ మూర్ఖత్వం ఒక ప్రత్యేకమైన రంగు పులుముకుంటుంది. మొదట్లో ఒకరి కోసం ఒకరు నక్షత్రాలను తెస్తామన్న వాళ్లే, కాలక్రమేణా ఒక గ్లాసు మంచినీళ్లు ఇస్తే థాంక్స్ చెప్పడం కూడా మర్చిపోతారు. దీన్నే మనం The Couple Who Forgot Gratitude అనుకోవచ్చు. అంటే, ఒకరి కష్టాన్ని మరొకరు 'హక్కు'గా భావించే జంటలు.*
------------
*భూమి మీద అత్యంత దారుణమైన శిక్ష ఏమిటో తెలుసా? ఉరి శిక్ష కాదు, జైలు శిక్ష కాదు. ఎదుటివాడి కోసం ప్రాణం పెట్టి పని చేస్తుంటే, వాడు దాన్ని 'గాలి' లాగా ఫీలవ్వడం. గాలి ఉంటేనే మనం బతుకుతాం, కానీ దాని గురించి ఎప్పుడైనా పట్టించుకుంటామా? పీలుస్తాం, వదులుతాం. అలాగే ఈ జంటల పరిస్థితి కూడా.*
*ఆమె తెల్లవారుజామునే లేచి ఇల్లు సర్ది, బాక్సులు పెట్టి, అలసిపోయి కూర్చుంటే... అతను వచ్చి "ఉప్పు తక్కువైంది" అంటాడు! అలాగే అతను ఆఫీసులో బాస్ దగ్గర తిట్లు తిని, ట్రాఫిక్‌లో నలిగి, ఇంటికి డబ్బులు తెచ్చి ఇస్తే... ఆమె "పక్కోడు కారు కొన్నాడు, మనం ఎప్పుడు కొంటాం?" అని అడుగుతుంది.*
*ఇక్కడ సమస్య ఏమిటంటే, ఎఫర్ట్ ఉంది, కానీ దానికి విలువ లేదు. ఒకరి కష్టం మరొకరికి 'నీ బాధ్యతే కదా' అన్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు మీ భాగస్వామి కష్టాన్ని మీ హక్కుగా భావిస్తారో, అప్పుడే ఆ బంధంలో చెదలు పట్టడం మొదలవుతుంది.*
*ఒకప్పుడు ఆమె కోసం తలుపు తీసినా, అతను అడిగింది వండి పెట్టినా "థాంక్యూ సో మచ్" అనేవాళ్లు. ఇప్పుడది 'ఎక్స్‌పెక్టెడ్' అంటే, ఆమె కాఫీ ఇస్తే అది ఆమె డ్యూటీ. అతను బయట సామాన్లు తెస్తే అది అతని డ్యూటీ.*
*మనుషులు కుక్కలకి బిస్కెట్ వేసి ప్రేమగా తల నిమురుతారు, కానీ తమ జీవిత భాగస్వామి చేసిన సహాయానికి మాత్రం కనీసం తల కూడా ఊపరు. Kindness అనేది సహజంగా రావాలి. కానీ కృతజ్ఞత లేని చోట, అది ఒక మెకానికల్ పనిలా మారిపోతుంది. ఒకరి పట్ల ఒకరికి సానుభూతి లేని ఇల్లు... కేవలం గోడలున్న గది మాత్రమే!*
*ప్రేమ అనేది ఐస్‌క్రీమ్ లాంటిది కాదు, అది నిప్పు లాంటిది. దానికి కృతజ్ఞత అనే ఇంధనం వేస్తూ ఉండాలి. లేకపోతే ఆ నిప్పు ఆరిపోయి, కేవలం బూడిద మిగులుతుంది. అదే ఆ 'వెచ్చదనం తగ్గిపోవడం'.*
*ఒకప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్న వాళ్ళు, ఇప్పుడు ఒకరికొకరు తారసపడితే "గ్యాస్ సిలిండర్ అయిపోయింది", "పిల్లల ఫీజు కట్టాలి" అన్న మాటలు తప్ప వేరే మాట్లాడరు. ఎందుకంటే వాళ్ల మధ్య కృతజ్ఞత లేదు. ఒకరి ఉనికిని ఒకరు ఆస్వాదించడం మర్చిపోయారు.*
*నిజం చెప్పనా?*
*కృతజ్ఞత లేని చోట వెచ్చదనం ఉండదు, Complaints మాత్రమే ఉంటాయి. ఆ ఇల్లు ఒక అకౌంటెంట్ ఆఫీసులా మారుతుంది. "నేను ఇది చేశాను, నువ్వు అది చేయలేదు" అనే లెక్కల మధ్య ప్రేమ ప్రాణాలు వదులుతుంది.*
*మీ భాగస్వామి మీ కోసం చేస్తున్న చిన్న చిన్న పనులను కూడా "అది వారి బాధ్యత" అని కొట్టిపారేయకండి. బాధ్యతలే అయితే రోబోలు కూడా చేస్తాయి. కానీ మనిషి చేస్తున్నాడంటే, దాని వెనుక ఒక ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను గుర్తించకపోవడం మనుషులకే చెల్లిన అతిపెద్ద నేరం.*
*కృతజ్ఞత అనేది కేవలం "థాంక్స్" చెప్పడం కాదు. అది మీ భాగస్వామి శ్రమను గుర్తించడం. వారి ఉనికిని గౌరవించడం. లేకపోతే, మీరు ఒకరికొకరు తెలియని వ్యక్తుల లాగా ఒకే ఇంట్లో కాలం గడిపేయాల్సి వస్తుంది. లైఫ్ అతి చిన్నది, ఒకరికొకరు ప్రేమని పంచుకుంటూ హాపీగా ఉంటే ప్రతీ క్షణం చాలా బాగుంటుంది.*
* 🐥
No comments:
Post a Comment