Saturday, March 28, 2026

 'నా జ్ఞాపకాల పరిమళాలు'
                             -ద్విభాష్యం రాజేశ్వరరావు.
                    
               "చిన్న కథలో అనవసరపు వర్ణనలు విసుగు పుట్టిస్తాయిరా అబ్బాయ్!"
   -సాహితీ సామ్రాట్ శ్రీ మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి.

ఓసారి ఫోటోగ్రాఫర్ ఇంట్లో వెలుతురు చాలటం లేదని ఆయన్ని పెరట్లో గడ్డి మేటి దగ్గర నిలబెట్టి ఫోటో తీస్తే," ఈ రకంగానయినా నేను 'మేటికవి' అయ్యాను!" అంటూ తనమీద తానే హాస్యోక్తులు సంధించుకోగలిగిన మహా పురుషుడు ఆయన! తన కొడుకు కోడలతో కలిసి సినిమాకు బయలుదేరుతూ, జోడు( చెప్పు) కనపడక వెతుకుతూ చిరాకు పడుతూ ఉంటే, అతని భార్యను చూపిస్తూ," పక్కనే పెట్టుకొని జోడు కనబడటం లేదంటావేమిటిరా?" అంటూ నిత్యజీవితం లోనూ చమత్కారాలు గుప్పించగల చతురుడు ఆయన! అవసానదశ దగ్గర పడుతున్న  రోజుల్లో ఎవరో చూడటానికి వచ్చి," ఎలా ఉన్నారు?" అంటూ ప్రశ్నిస్తే;" కోడలు, గోడలు సాయంతో ఇలా ఉన్నాను!" అంటూ, అటువంటి ఆందోళన సమయంలోనూ హాస్యం గుప్పించగల దీరోధాత్తుడాన! ఆయనే ఆంధ్రకల్హణ ,సాహితీ సామ్రాట్ బిరుదాంకితులు, మహాకవి ,అజాతశత్రువు, మహామనీషి, ఆంధ్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన 'ఆంధ్ర పురాణం' గ్రంథకర్త , కళా ప్రపూర్ణ శ్రీ మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు.
                   1962 ప్రాంతంలో మా స్వగ్రామమైన చింతలూరు వెళ్ళినప్పుడు ఒక వివాహ సందర్భంగా శ్రీ మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారిని కలిసి వారితో కొంత సమయం గడిపే అదృష్టం నాకు లభించింది.నేను వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి, నన్ను నేను ఫలానా అంటూ పరిచయం చేసుకుంటే, "నువ్వు మా చిన్న వెంకటరావు కొడుకువా!... నేను నీకు బాబయ్య ని అవుతాను రా!" అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించే రాయన. ఇద్దరం కలిసి చింతలూరు లోని ధన్వంతరి ఆలయానికి వెళ్ళాం. ఆలయ ప్రాంగణంలోని అరుగు మీద సేద తీరుతూ, నా కోరికను మన్నించి, నేను అప్పట్లో వ్రాసిన కథను ఆయనకు చదివి వినిపించగా, ఎంతో ఓపిగ్గా విన్నారు. 
                        అప్పటికే చిన్న చిన్న పత్రికలలో నా కథలు కొన్ని అచ్చయ్యాయని విని ,ఎంతో సంతసించారు. చదవటం పూర్తయ్యాక కాస్త మెచ్చుకోలుగా నా వంక చూసి," నీకు కథ అల్లటం పట్టుబడింది రా. కానీ వాక్యాలు ఇంకా కుదురుగా ఉండాలి. అనవసరపు వర్ణనలు తగ్గించు! చిన్న కథలో అనవసరపు వర్ణనలు విసుగు పుట్టిస్తాయిరా అబ్బాయ్!" అంటూ చిన్న కథ రాయటానికి కావలసిన మెళకువలు కొన్ని వివరించారు. అలాగే నేను చదివి వినిపించిన కథలో కొన్ని మార్పులు సూచించారు. కథకు నేను పెట్టిన పేరు బాగులేదని అంటూ, 'ప్రారబ్ధం భోగతో నశ్యేత్!' అని మరో పేరు వారే సూచించారు. వారి ఆశీర్వాదంతో ఆ కథను ఆంధ్రప్రభ వారపత్రికకు పంపితే, 1964లో  ఆ కథ  ప్రచురించబడింది. ఆంధ్రప్రభ లో అచ్చయిన నా మొట్ట మొదటి కథ అదే!
              శ్రీ మధునా పంతుల వారు మార్చి 5, 1920 న ఐలాండ్ పోలవరంలో తన మాతామహులైన ఆకుండి రామ్మూర్తి శాస్త్రి గారి ఇంట జన్మించారు. తల్లి లచ్చమ్మ గారు, తండ్రి సత్యనారాయణ మూర్తి గారు. వీరి బాల్యం పల్లిపాలెం గ్రామంలో గడిచింది. శాస్త్రి గారు ఇంజరంలో సంస్కృత పాఠశాలలో వ్యాకరణాచార్య మహేంద్రవాడ సుబ్బరాయ శాస్త్రి గారి శిష్యరికంలో కావ్యాలు, వ్యాకరణం మొదలైనవి అభ్యసించారు 
                  1935లో విజయనగరం మహారాజా వారి సంస్కృత కళాశాలలో 'సాహిత్య ప్రవీణ' ఒక సంవత్సరం చదివేరు కానీ అనారోగ్యంతో అది పూర్తికాకుండానే ఇంటికి వచ్చేసారు. 1936- 39 మధ్య స్వయానా తన మేనత్త భర్త, ఆనాటి పిఠాపురం ఆస్థాన కవులలో ఒకరైన ఓలేటి వెంకటరామశాస్త్రి గారి వద్ద ఆంధ్ర సారస్వతం అధ్యయనం చేసి కవిత్వంలోని మెళకువలు గ్రహించారు. ఆంధ్ర భాష మీది అపారమైన ప్రేమతో 1939లో 'ఆంధ్రి' అనే మాస పత్రిక ఆరంభించారు శాస్త్రి గారు. అయితే 1941 నవంబర్లో అనివార్య కారణాల వలన ఆంధ్రి ప్రచురణ ఆగిపోయింది. ఆంధ్రి పత్రికలో శాస్త్రి గారు తాను రాసిన ఆంధ్ర రచయితలు జీవిత చరిత్రలు అన్నీ సమీకరించి ,1944లో ఒక అద్భుతమైన సంపుటిగా తీసుకు వచ్చారు.
                1940లో మద్రాసు విశ్వవిద్యాలయం విద్వాన్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు శాస్త్రి గారు. 1940- 44 మధ్య పిఠాపురం రాజా వారి సహకారంతో నిర్మాణంలో ఉన్న 'సూర్యరాయాంధ్ర నిఘంటువు' నిర్మాణ కార్యక్రమాలలో నిమగ్నులయ్యారు. 1947లో రాజమండ్రిలోని వీరేశలింగం పాఠశాలలో తెలుగు పండితునిగా చేరి, తన మకాం పల్లెపాలెం నుండి రాజమండ్రికి మార్చుకొని, 1974లో ఉద్యోగ విరమణ జరిగే వరకూ ఆ పాఠశాలలోనే పనిచేశారు. 
         మధునా పంతుల వారు రత్న పాంచాలిక, ధన్వంతరి చరిత్ర, కళ్యాణతార, స్వప్న వాసవ దత్త, శ్రీఖండము, చైత్ర రథము మొదలైన ఎన్నో కావ్యాలు రచించారు. రత్నావళి నాటకం రాశారు. 'బోధివృక్షం' అనే నవల రాశారు. అయితే 1954లో విశ్వనాథ సత్యనారాయణ గారి పీఠికతో తొలిసారిగా వెలువడిన' ఆంధ్ర పురాణం' వీరికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టింది.

మధునా పంతుల వారు సాంప్రదాయవాదే అయినా ఆధునిక కవుల యెడల, కవిత్వం ఎడల ఎంతో మర్యాదా మన్ననా చూపేవారు. విశ్వనాథ, కాటూరి, దేవులపల్లి వారి అభినందనలతో పాటు; సినారే, తిలక్, శేషాంద్ర శర్మ మున్నగు వారి అభిమానము కూడా చూరగొన్నారు. 
              శాస్త్రి గారు మృదుస్వభావులు !మచ్చుకైనా అహంకారం లేనివారు! అజాతశత్రువు! ఒక సందర్భంలో ఆంధ్ర విశ్వ విద్యాలయం వారు వీరికి 'కళాప్రపూర్ణ' ఇవ్వచూపేరు కానీ మధునా పంతుల వారు అందుకు అంగీకరించలేదు. 'నాకన్నా అన్ని విధాల, అన్ని కోణాల్లోనూ వెంపరాల సూర్యనారాయణశాస్త్రి గారు మహా విద్వాంసులు. ముందుగా వారికి మీరు 'కళా ప్రపూర్ణ' ఇచ్చిన తర్వాతే నా పేరు పరిశీలించండి!' అని నిర్మొగమాటంగా చెప్పి, దాన్ని అక్షరాల ఆచరించిన త్యాగమూర్తులు వారు!! విద్వాంసుల ఎడల వారు చూపే హృదయ వైశాల్యానికి, ఆదరానికి, ఇదొక నిదర్శనంగా నిలుస్తుంది!
         తమ ఆస్థాన కవి పట్టా ప్రదానోత్సవ సమయంలో శ్రీ చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు మధునా పంతుల వారితో అన్నారట!
" నాకు మరల యవ్వనమైన రావలయును లేదా ఆకొండి వెంకటరామశాస్త్రి బ్రతికియైననూ రావలయును! ఈ రెండునూ జరిగేటివి కావు కదా.... కథా సరిత్సాగరం రచన నీ వలన కాక ఇంకొకరి వలన నెరవేరదు!" అని.అప్పటికి ఆంధ్ర పురాణ రచన ప్రారంభమే కాలేదు! అయితే చెళ్ళ పిళ్ళవారు క్రాంత దర్శి! ఆంధ్ర పురాణం రచన రూపంలో మధునా పంతుల వారు  చెళ్ళ పిళ్ళవారి మాటలు నిజం చేశారు. 'ఆంధ్ర పురాణము' ఆంధ్ర వాంగ్మయ సరస్వతికి అనర్ఘమణిహారంగా నిలిచిపోయింది!!
      1992వ సంవత్సరము  మధునాపంతుల వారికి గడ్డుకాలంగా పరిణమించింది. నవంబర్ 7వ తేదీన వారు స్వర్గస్తులయ్యారు.
"ఆధునికత అంటే అక్షరాన్ని నడివీధిలో ఉరి తీయడం కాదు కనుక, అధ్యయనం చేసి శబ్దం మీద అధికారం సాధించిన వ్యక్తికి గాని శబ్దాన్ని సృజించే హక్కు ఉండదు కనుక,శబ్దశక్తిని గ్రహించిన ఒక మహనీయుడు అస్తమించిన ఈవేళ అక్షరానికి నమస్కారం అని మనవి చేయడానికే....." అంటూ ఆంధ్రప్రభ దినపత్రిక వారు తమ సంపాదకీయలో మధునా పంతుల వారికి నివాళులు అర్పించారు.
109.                       *****
(ఇవాళ శ్రీ మధనాపంతులు వారి జయంతి 
రవళి అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో) 

No comments:

Post a Comment