Sunday, March 29, 2026

 _(కవితా దినోత్సవం కోసం)_

*_ఏది కవిత.._*

నీలోని భావాన్ని
నీకు తోచిన రీతిలో
మంచిగా చెప్పగలిగితే..
*_అది కవితే..!_*

నీలోని వేదనను
అందరికీ అర్థమయ్యేలా
ఆర్ద్రంగా అక్షరీకరించగలిగితే..
*_అది కవితే..!_*

సమాజం పట్ల నీ ఆలోచనకు
నిక్కచ్చిగా అక్షరరూపం ఇవ్వగలిగితే..
*_అది కవితే..!_*

కళ్లెదుట జరుగుతున్న
అన్యాయాలను ఎత్తిచూపుతూ నిర్భయంగా
రుధిరాక్షరాలను పేర్చగలిగితే..
*_అది కవితే..!_*

కులాలు..మతాలు..
వాటి కారణంగా విబేధాలు..
మనుషుల మధ్య అంతరాలు..
ఇవి చూసి గుండె మండి
కలంతో అనలం సృష్టించగలిగితే..
*_అది కవితే..!_*

అంతేనా..
సమాజం..
ప్రకృతి.. ప్రాకృతి..ఆకృతి..
సమరం..సాగరం..నగరం..
శృంగారం..వెటకారం..

*_కాదేదీ కవితకు అనర్హం_*
అనుకున్నా..

అన్నిటినీ మించిన వస్తువు..
*_స్త్రీ.._*

ఆ స్త్రీకి దైవరూపమైన
*_అమ్మ..!_*

ఓ కవీ..
చివరగా విను ఈ మాట..

కాళిదాసు నుంచి
ప్రేమదాసు వరకు..
సముద్రాల నుంచి 
జంధ్యాల దాకా..
శ్రీరంగం నుంచి నీ వరకు
ఎవరు ఏం రాసినా అంతరంగమే..
కలమే ఆయుధమైతే
కాగితమే కార్యరంగం..

సమాసం..సంధి..
వ్యాకరణం..
వీటిని మించి
నీ అంతఃకరణం..
అదే కావాలి
*_ప్రతి కవికి వ్యాకరణం.._*
*_ప్రతి కవితకీ మూలకణం..!_*

✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
        9948546286
        7995666286

No comments:

Post a Comment