*మైలలో పెండ్లి - పెండ్లిలో మైల -2*
🫠
రచన : మహాకవి, కళాప్రపూర్ణ శ్రీచిలకమర్తి లక్ష్మీనరసింహం
క్రమక్రమముగ రంగారావుగారికి తాలూకా స్తిరస్తదారు పనియు అటుపిమ్మట డిప్యూటీ తాహసిల్ దారుపనియు గొన్నా ళ్ళకు తహసిల్దారు పనియు నయ్యెమ. ఆయన కుమారుడు పదునెనిమిది సంవత్సరముల ప్రాయము గలవాడై తెలివిగా చదువుకొను చుండెను. ఆకారణమున అతనికి వివాహం నిమిత్త మెన్నియో మంచి సంబంధములు వచ్చుచుండెను. అత్తవారి నుండి ఏదైన స్థిరమైన ఆస్తి తమకు గలియుటకు వీలున్న సంబంధము కొఱకే రంగారావుగారు తీవ్ర ప్రయత్నము చేయుచుండిరి. మనసులో నట్టికోరిక బెట్టుకొని యతడు కుమారుని కెట్టిగొప్ప సంబంధము వచ్చినను అప్పటి కేదో వంకచెప్పి దానిని నిరాకరింపజొచ్చెను. ఈ విషయములో రంగారావుగారు భార్య యొక్క సలహామీదనే విశేషముగ నడచు చుండిరి. ఆయనకు భార్య ప్రత్యక్షదేవత. ఆమె మాట వేదాక్షరము. ఆమెయాజ్ఞ దాట శక్యముగానిది. ఆమె కోపించి కన్ను లెఱ్ఱ జేసిన పక్షమున తాలూకానంతను గడగడ వడకించునట్టి తహసీల్ దార్ రంగారావు గారు మిక్కిలి భయపడి సామవాక్యములతో నామెను బ్రతిమాలుచుండెను. ఆమె ఏ నగ చేయించుమని కొరిన యా నగను అతఁడు తప్పక చేయించవలసినదే. జీతముతెచ్చి ఆమె చేతికే యీయవలెను. దారిబత్తెము గూడ నతడామెకే సమర్పింపవలెను. సొమ్ము వ్యర్థముగ ఖర్చుపడునని యామె వంట బ్రాహ్మణుని గూడ పెట్టనివ్వలేదు. అజమాయిషీ నిమిత్తము రంగారావుగారు గ్రామాంతరము వెళ్ళవలసివచ్చినపుడు కరణముల యిండ్లలోనే భోజనములు చేయుచుండును. ఆ కరణములు లోలోపల దుఃఖపడుచు, విసుగుకొనుచు తమ తండ్రి తద్దినముల కైన ఖర్చు పెట్టనంత డబ్బు ఖర్చుపెట్టి పిండిపంటలతో పెద్ద విందులు చేయుచుందురు, పై యుద్యోగస్థుల రాకలు పల్లెటూళ్లలో నుండు మునసబు కరణముల కు వ్యయ ప్రయాసకరములై అమ్మవారి జాడ్యమువలె మిక్కిలి పీడించును.
ఈ సందర్భమున నొక కరణమన్న మాటలు జ్ఞప్తికి వచ్చుచున్నవి. "పితృశ్రాద్ధములవలెనే ఉద్యోగస్థుల శ్రాద్ధములు మూడువిధములు. అన్న శ్రాద్ధము, ఆమశ్రాద్ధము, హిరణ్య శ్రాద్ధము అనునవే ఆ మూడు విధములైన శ్రాద్ధములు”,
పితృకార్యము నాడు భోక్తలకు పెట్టినట్లే ఉద్యోగస్తునకు భక్ష్యపాయసము లతో శాకపాకముతో విందుచేయుట యన్న శ్రాద్ధము; బియ్యము పప్పు, కూరలు, నెయ్యి మొదలైనవి పొత్తరగా నిచ్చినట్లు కరణము గారి యింట భుజియింపని ఉద్యోగులకు బసకు సరకుల బంపుట యామశ్రాద్ధము. వారి అనుగ్రహము సంపాదించుటకై సొమ్ములంచమిచ్చుట హిరణ్య శ్రాద్ధము. పితృ దేవతలకు శ్రాద్ధము పెట్టకపోయినను, సంతతివారి నేమియు జేయలేరుగాని యీ అధికారదేవతలు పితృదేవతకంటె భీకరులై ఏదో శ్రాద్ధము చేయకపోయిన పక్షమున నానావిధముల బాధింతురు.
📖
రంగారావుగారు పై మూడు శ్రాద్ధములు గూడ గ్రహించుచుండిరి. హిరణ్యశ్రాద్దముల వలనవచ్చిన ధనమంతయు అతని భార్యకి సమర్పింపవలసినదే. వాడుకొను ఇత్తడి చెంబుపై గూడ సుభద్రమ్మ పేరేగాని రంగా రావుగారి పేరెక్కడను లేదు. తల్లికి ప్రాణము మీదికి వచ్చినదని జాబు వచ్చినను రంగా రావుగారు శలపు దొరకదని వంకబెట్టి ఆమె నొక్కసారియు జూడబోలేదు. అన్నగారికి వెన్నుమీద కురుపు వేసినందున అతనిని తండ్రిగారు కాకినాడలోనున్న దొరతనము వారి ఆసుపత్రికి తీసుకుపోయి వైద్యము చేయించిరి. అప్పుడక్కడ నున్న డాక్టరుగారు హిందువుడు; బ్రాహ్మణుడేగాని అతడు వజ్ర హృదయుడు, ఆసుపత్రిలో ధర్మవైద్యము చేయించుకొనుటకు వచ్చిన నిరుపేదల వద్ద కూడ కొంతసొమ్ము గుంజి పుచ్చుకొనక వైద్యము చేయడు. యేబదిరూపాయలు యిచ్చినగాని శస్త్రవైద్యము చేయనని ఆ డాక్టరు కఠినముగ జెప్పెను. ఆ సొమ్మడాక్టరు కీయవలసినదని శోభనాద్రిగారు రంగారావు గారిని కోరిరి. రంగారావుగారు పెదవి విఱచి తన దగ్గర నొక్కరూపాయియైన లేదని చెప్పెను.
“నెలకు మూడువందల రూపాయలు జీతము తెచ్చుకొనుచున్నావు, నీవద్ద యీ మాత్రమైనలేదా ?" అని తండ్రి అడగగా రంగారావుగారు కోపముతో "బాబయ్యా! కోడిగుడ్డంత బంగారము లేనివాడు గలడా? అని ఒకడన్నాడట. ఎంత చెట్టు కంతగాలి అన్న మాట నీ వెరుగవా? కోసి యిచ్చుటకు నావద్ద రూపాయలచెట్టు లేదు,” అని ప్రత్యుత్తరమిచ్చెను. తండ్రి ఆ మాటలు విని కన్నుల నీరు పెట్టుకొని అవలకుబోయెను.. ఆ కష్టసమయములో గూడ వాని జననీ జనకులు సత్రములో బసచేసి వేరే వంట చేసుకొని తినుచుండిరి కాని, కుమారుని యింటికి రాలేదు; రమ్మని రంగారావుగారు పిలువలేదు.
ఏలా-అనిన మున్ను ఒకనాడు రంగారావు గారు గ్రామాంతరము వెళ్ళినప్పుడు శోభనాద్రిగారు మార్గవశమున కుమారుని యింటికి బోయిరి. అప్పుడు కోడలు మామ గారిని జూచి మంచము మీద పండుకొని లేవకుండానే 'నాకు సుస్తీగనున్నది. నేను వంట చేయలేను,' అని చెప్పెను. వెంటనే శోభనాద్రిగారు గిరుక్కున తిరిగిపోయి మరియొక గృహస్థుని యింట భోజనము చేసిరి. నాటి నిరాదరణము ఆయన మనసు మీద ముద్రితమైయుండుట చేత ఈసారి పుత్రుని యింటికి పోలేదు. భార్య మెడలో నున్న పట్టెడ విక్రయించి శోభనాద్రిగారు డాక్టరు ముడుపుచెల్లించి జ్యేష్ఠకుమారుని ప్రాణము రక్షించుకొనిరి.
ఆ దినములలోనే భార్య సోదరునకు వివాహము తటస్తించెను. ఐదువందల రూపాయలు తమ్మునకు యియ్యవలసిన దని సుభద్రమ్మ పట్టుపట్టుటచే రంగారావు గారు విధిలేక ఆ సొమ్మిచ్చి ఆమె అనుగ్రహ మునకు పాత్రమయ్యెను. ఈ విషయము లన్నియు విన్న మిత్రులు కొందరు, రంగా రావుగారిని పిలిచి రహస్యముగ జనని - జనకుల నింత నిరాదరణ చేయరాదనియు, కష్టపడి కని పెంచిన - మాతాపితల నుసురు పెట్టగూడదనియు హితోపదేశము చేసిరి .. -
ఆ పలుకులు విని రంగారావుగారు తోక త్రొక్కిన త్రాచుపలె -లేచి వారిపై నలిగి యిట్లు బదులు చెప్పెను. "కని పెంచిన మాతాపితలని మీరు నొక్కినొక్కిపలుకుచు న్నారు. నన్ను కనవలసినదని వీరిని నేను యాచించినానా? కష్టపడి పెంచవలసినదని నేను వీరిని పాదములపైబడి వేడుకొన్నానా? నాకు వీరు చదువైన చెప్పించలేదు. రాజమ హేంద్రవరములో ఒక మహానుభావుడు న్యాయవాది చెప్పించినాడు. ఉన్న సొమ్ము వీరందరికీ-బెట్టి, నేను నా బిడ్డలు ముష్టి
ఎత్తుకొందుమా?" ఆ అసందర్భపు మాటలు విని మిత్రులు “ఛీ, వీనికి దేవుడునై, గురువు నై వీనితో మాట్లాడుట మనదే తప్పు" అని లేచిపోయిరి.
📖
తునిలో నొక గృహస్థుని యొద్ద నొక కుమార్తె యుండెను. ఆయన కాపుత్రికయే తప్ప యితర పుత్ర పుత్రికా సంతానము లేదు. ఆయనకు భూములవలన సంవత్సరము నకు ఐదు వేలరూపాయలు నిరాటంకముగ వచ్చుచుండును. ఇండ్ల అద్దెల వలన ఏడాది కి వెయ్యిరూపాయలు రాబడిగలదు. నివాసమునకు విశాలమై, సుందరమయిన మేడగలదు. దొడ్డిలో సకలఫలవృక్షము లుండెను. ఇదిగాక యంటుమామిళ్లు, బత్తాయి చెట్లు గల తోటగలదు. ఆ కుమార్తె వివాహము నిమిత్తమై ఆ గృహస్థుడు మంచి సంబంధము కొరకు వెదకుచుండెను.
ఆ వార్త ఎవరో రంగారావుగారి చెవిలో వేసిరి. అది మొదలుకొని ఆయనకు భార్యకు నిద్రాహారములులేవు. ఆ పిల్లను తమ కుమారునకు ఎట్లైన వివాహము చేయింప వలెనని వారు సంకల్పించుకొనిరి.
🫠
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment