కథ పేరు:
*శెలవు లేని ఉద్యోగిని*
రచన : కోడూరి తిరుమల మాధవి.
ఉదయం ఆరు గంటలకు అలారం మ్రోగడంతో బద్దకంగా లేచాను, వాన పడుతున్నట్లు చప్పుడు వినపడుతోంది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వల్ల రెండు రోజులుగా ఒకటే వాన, ముసురు పట్టినట్టుగా పడుతూనే వుంది.
ఎవరూ లేచినట్టు లేదు, మామూలు రోజుల్లోనే ఎవరూ త్వరగా లేవరు ఇంక ఇప్పుడు వేరే చెప్పాలా!
వాన వల్ల పిల్లలకు స్కూళ్ళకు లీవ్ ఇచ్చారు, మా వారికి కూడా వానల వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కావడం వల్ల అందరూ ఇంట్లోనే వున్నారు.
మంచం వైపు చూశాను మావారు ముసుగు తన్ని పడుకుని వున్నారు. పిల్లల బెడ్ రూమ్ కి వెళ్ళి చూశా, అత్తయ్య, మామయ్య పడుకున్న రూమ్ లోకి వెళ్ళి చూశా అందరూ ముసుగులు తన్ని మంచి నిద్రలో వున్నారు. అదృష్టవంతులు అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి బాత్రూం వైపు కదిలాను.
మొహం కడుక్కుని, ఫ్రిజ్ లోంచి పాల పాకట్లు తీసి గిన్నెలో పోసి స్టవ్ పైన పెట్టాను, ఇంకో వైపు కాఫీ డికేషన్ పెట్టి కిటికీలో నుండి వానను చూస్తూ నిలుచున్నాను.
వాన ఇంకా మూడు రోజులు వుంటుంది అంటున్నారు, గాలి లేదు కాబట్టి ఈ రెండు రోజులు కరెంటు పోలేదు, రేపు ఎల్లుండి వర్షం భారీగా కురిసే అవకాశం వుందని, గాలి కూడా తీవ్రంగా వీస్తుంది అని న్యూస్ లో చెప్తున్నారు అలా అయితే కరెంట్ కూడా తీసేస్తారు. అమ్మో కావలసిన వస్తువులు పాలు, కూరగాయలు తెచ్చి పెట్టుకోవాలి అనుకుంటూ చేతిలో వున్న కాఫీ పూర్తి చేశాను.
ఈ వాన ఏమో గానీ అందరూ హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు, నా పరిస్థితే దారుణంగా వుంది. అందరూ ఆలస్యంగా లేస్తున్నారు. పిల్లలు ఫోన్ లకు అతుక్కుని పోతున్నారు, ఇంక మా వారు సరేసరి లేవగానే లాప్టాప్ కు అంకితం, అరగంటలో నాలుగు సార్లు "ఏమోయ్ కాస్త కాఫీ ఇస్తావా" అంటూ మావారు, "అమ్మా ఏమైనా స్నాక్స్ వుంటే పెడతావా" అంటూ పిల్లలు, ఇంక మా అత్తయ్యగారు మావయ్యగారు "అమ్మాయ్ కాస్త వేడి నీళ్ళు పెట్టీ ఇస్తావా "! "అల్లం టీ ఇస్తావా" అంటూ ఆర్డర్లు, వీళ్ళకు కావలసినవి అందించలేక విసుగు వస్తోంది, వంట పనే తెమలకపోతే ఇంక పై పనులు ఎప్పుడు చేసేది ?
మామూలు రోజుల్లో ఏదో టైమ్ కి టిఫెన్, లంచ్ కట్టిస్తే తీసుకుని పిల్లలు స్కూల్ కి, ఈయన ఆఫీస్ కి వెళ్ళిపోతే కాస్త తీరిక అయినా దొరికేది ఇప్పుడు అది కూడా లేదు, "అమ్మాయ్ వాన పడుతోంది కాస్త అల్లం పచ్చడి చేయి" అని అత్తగారు ఆర్డర్ ఇస్తే అదే చేత్తో కాస్త వేడిగా, ఘాటుగా మిరియాల రసం పెట్టు అని మామగారి దరఖాస్తు, ఇంక సాయంత్రం అయితే "శ్యామూ బజ్జీలు వేస్తావా" అని మావారు అడిగితే "వద్దమ్మా పకోడా వేయి"అని పిల్లలు గోల, ఇలా ఇంట్లో నా పరిస్థితి హోటల్ లోని చెఫ్ కంటే అధ్వాన్నం అయిపోయింది.
న్యూస్ లో చెప్పినట్టుగానే వర్షాలు పెరగడం దానికి తోడు గాలి తీవ్రంగా వీచడం తో కరెంట్ తీసేసారు. దీనితో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయింది నా పరిస్థితి, కరెంట్ లేకపోవడం వల్ల ఫోన్లు, లాప్టాప్ లకు కూడా శెలవు దొరికింది,
ఏమీ తోచక పోవడంతో ఇల్లు కిష్కింధకాండ లాగా వుంది. ఏ మూలనో వున్న కేరంబోర్డు, చెస్, పరమపద సోపానం అన్నీ కిందకు దిగాయి. వీళ్ళు ఆడుతుంటే
వీళ్ళకు కాఫీలు, టీలు, వేడినీళ్ళు, స్నాక్స్ లు అందించలేక నా కాళ్ళు పడిపోతున్నాయి.
ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎవరికి శెలవులు దొరికినా ఇంటి ఇల్లాలికి శెలవు దొరకదు కదా అనుకుని అదే మాట మా వాళ్ళతో అంటే
అదేంటే అమ్మాయ్ అలా అంటావు ? ఏదో వానలు పడుతుండడం వల్ల పిల్లలు, వాడు ఇంట్లో వున్నారు గానీ, లేదంటే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళి పోతారుగా. చూడు ఇల్లు ఎంత సందడిగా వుందో అని మా అత్తగారు అంటుంటే ఆవిడ పాజిటివ్ థింకింగ్ కి ఆశ్చర్యపోయి ఏం మాట్లాడాలో తెలియక వచ్చే ఏడుపు ఆపుకుంటూ ఒక వెర్రి నవ్వు నవ్వాను.
సమాప్తం🌹
No comments:
Post a Comment