Sunday, March 29, 2026

 *సీతారామకల్యాణం*

హిందూ వివాహ వ్యవస్థకు
పట్టుగొమ్మలు సీతారాములు.
సీతారాముల్లా అనురాగంతో
వర్ధిల్లమని దీవిస్తారు. సీత సాక్షాత్తూ
శ్రీ మహాలక్ష్మి. రాముడు దశరథ రాజు
కుమారుడు. కారణ జన్ముడుగా
అవతారమెత్తిన వాడు. తెలుగు నేల మీద సీతారాముల కల్యాణం అయితే గాని తమ ఇంటిల్లి తలపెట్టరు. పెళ్లి కాగోరు వారికి రామ కళ్యాణం చూస్తే శుభప్రదం అవుతాయని నమ్ముతారు.

రాముడు ఏకపత్నీవ్రతుడు.
బహుభార్యాత్వం రాజమార్గంగా సాగుతున్నరోజుల్లో ఒకే భార్యకి అంకితమైనవాడు. సీతారాముడు సీతాపతిగా జగద్విఖ్యాతి
పొందాడు. సకల గుణాభిరాముడు
ఆదర్శమూర్తిగా ఖ్యాతి చెందాడు.

పెళ్లున విల్లు విరిగింది. వరమాల
వేసేందుకు ఎదురు చూస్తున్న మైధిలి ఆత్రుత పడింది. నాలుగు అడుగుల్లో తండ్రి జనకునిదగ్గర నుంచి నీలమేఘశ్యాముడు, అరవింద దళాయతాక్షుడు, వీరశృంగారమూర్తిగా నిలిచిన రాముని వద్దకు వడివడిగా వెల్లింది. సిగ్గులో తలమునకలవుతూ వరమాలను రెండు చేతులతో పైకెత్తింది.

రాముని శిరసు అందితేనా? నవవధువు
పారాణి పాదాలు మునివేళ్లపై నిలిచాయి..
వరుడు ఆజానుబాహుడు అలవోకగా అందేనా? అప్పటిదాకా అన్నగారి పరాక్రమ క్రమంలో మైమరచిపోయిన లక్ష్మణస్వామి
ఒక్కసారి స్వయంవర వేడుకలోకి వచ్చాడు.
సీతమ్మ సమస్య అర్ధమైంది. అన్నగారి పాదపద్మాలకు నమస్కరించాడు.

అన్న రామయ్య తటాలున ఒంగి
అపేక్షగా తమ్ముణ్ణి లేపబోయాడు. అదే
అదనుగా సీతాదేవి వరమాల శ్రీరాముని
మెడలో అలంకరింపచేసింది. 

సభ కరతాళ ధ్వనులతో మార్మోగింది. సీతమ్మ లక్ష్మణస్వామిని చల్లని చూపుతో దీవించింది.

మహాసభకు అంతా సందర్భోచితంగానే
అనిపించింది. ఇలాంటి కథలెన్నింటినో
అల్లుకుని, ఆలకించి జానపదులు
మురిసిపోతుంటారు. రాముడంటే అందరికీ
ఇష్టం. తెలుగువారికి మరీ ఇష్టం. రాముడు.
దేవుడే అయినా మనవాళ్లకి ఆయనంటే
చనువు, కష్టసుఖాలు తెలిసిన మనిషి
అనుకుంటారు. రాముడిమీద ఈగవాలితే
సహించరు. రామకథని మహాప్రసాదంగా
కళ్లకద్దుకుంటారు. సీతారామ కల్యాణాన్ని
లోకకల్యాణంగా భావిస్తారు.
*ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 

No comments:

Post a Comment