Saturday, March 28, 2026

 కష్టార్జితం:

కాట్రేనికోన లో కామయ్య అనే ఒక కమ్మరి ఉండేవాడు. అతడు కత్తులు, కొడపళ్ళు, గునపాలూ, పారలూ మొదలయిన ఇనుప సామగ్రి అంతా తన దుకాణంలో తయారు చేసేవాడు.

ఇనుముతో సామగ్రి తయారు చెయ్యట మంటే సులభం కాదు. మండే కొలిమిని గాలితిత్తులతో ఊదాలి. ఇనుమును బాగా ఎర్రగా కాల్చాలి. అలా కాలినదాన్ని చల్లారి పోకుండా దిమ్మ మీద పెట్టి, సమ్మెటతో బాదాలి. సమ్మెటతో బాదటానికి మాంచి జబ్బపుష్టి కావాలి. కామయ్యకి జబ్బపుష్టి ఉంది: చెమటోడ్చి పని చేసి డబ్బు సంపాదించుకోవాలన్న ఆసక్తి వుంది.

కామయ్య కొడుకు సోమయ్య ఉత్త సోమరిపోతుగా తయారయాడు. ఇందుకు కారణం వాడి తల్లి శేషమ్మే. శేషమ్మకి కొడుకు కొలిమి ముందు
కూర్చుని కష్టపడటం ఇష్టం లేదు. మేనమామకి మల్లేనే తన కుమారుడు కూడా యేదైనా ఒక ఉద్యోగం చెయ్యాలిగాని కొలిమి దగ్గిరికే పోకూడదని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతో పలకా పుస్తకాలూ కొనిచ్చి, వాడిని బళ్ళోకి పంపించింది.

కామయ్యకి ఇదేమీ నచ్చలేదు. కుల వృత్తి చెయ్యకపోవటం తనకూ, లోకానికి కూడా చెరుపేనని అతడి ఉద్దేశం. ఐనా భార్య మాటకు యెదురాడలేదు.

సోమయ్య బళ్ళోకయితే వెళ్ళివచ్చే వాడు గాని, వాడికి చదువేమీ అబ్బలేదు. "పోనీ, కొలిమి తిత్తివద్ద కూచుని గాలయినా పొయ్యరాదురా" అని మంద లించేవాడు కామయ్య. కాని కూచుని పని చేయటం కన్న వీధులవెంట తిరగటమే సరదాగా కనపడి, సోమయ్య తండ్రి' కంటపడడమే మానివేశాడు. కామయ్య క్రమంగా పెద్దవాడైనాడు జవసత్తువలు ఉడిగినై.  నా తర్వాత ఈ దుకాణం మూసెయ్యవలసిందేనా అనిపించి ఎంతో చింతించాడు. నేను సంపాదించినదంతా నా కొడుకు మూడు పూటల్లో తగలబెట్టేస్తాడు, తర్వాత అడుక్కు తినటమే నా గతి అని తరచూ వాపోసాగాడు. భార్యను పిలిచి మనవాడిని రెంటికీ చెడ్డ రేవడుగా చేశావు,ఇప్పటీకైనా బుద్ధి తెచ్చుకోమను, కులవృత్తి నేర్చుకోమను అని మళ్ళీ చెప్పి చూశాడు. తొందరపడకయ్యా వాడూ ఊరికే ఉండలేదు,ఏదో ఉద్యోగం కోసం వెతుకులాడుతూనే వున్నాడు." అంది శేషమ్మ కొడుకు మీది గారం కొద్దీ.

కామయ్యకి వెళ్ళు మండింది. "ఏమిటి ఉద్యోగమా! వాడికి నీకూ కూడా కష్టార్జితం అంటే ఏమిటో తెలియకుండా పోతోంది. నేను సంపాదించిన దానితో తర్వాత కులుకుదామనుకుంటున్నాడు కామోసు! నా స్వార్జితంలో చిల్లిగవ్వ కూడా వాడికి ముట్టనివ్వను. యేమనుకున్నావో! పని నేర్చింది మొదలు ఈనాటి వరకూ నేను రోజూ మూడు రూపాయిలైనా కళ్ళ చూడందీ దుకాణం ముయ్యలేదే. వీణ్ణి. మూడు రూపాయలు కాదు. మూడు పావ లాలు సంపాదించమను చూద్దాం!"అన్నాడు ఆవేశంతో.

'అంతట్లోకి సోమయ్య వచ్చాడు. వాడితో శేషమ్మ. ఏమిరా నానిగా! మీ బాబు నిన్ను ఉత్త చవటగా కట్టేశాడు. చూశావట్రా మూడు పావలాలైనా సంపాదించ లేవుట నువ్వు!" అంది.

సోమయ్య, "ఓస్, అదెంత! చిటికెలో గడించుకొస్తా"నన్నాడు.

సోమయ్య వెళ్ళేడు. సంపాదనంటే యేదో తెలిస్తేగా? పాపలా కాసులు చెట్టుకి కాస్తాయా యేమన్నానా. కోసుకు చక్కా రావటానికి ? మూడు ఝాములదాకా అక్కడా అక్కడా తిరిగి వచ్చి, ''అమ్మా, తల నొప్పిగా వుందే ఎండనబడి తిరిగొ స్తేను." అన్నాడు.

"ఏమైనా గడించావుట్రా బాబిగా?" అంది శేషమ్మ.

"లేదు. భోంచేసి వెడతాలే మళ్ళీ." అప్పడు సోమయ్య.

సోమయ్య భోజనం చేసి పడుకుని సాయంత్రం దాకా నిద్రపోయాడు. తండ్రి దుకాణం నుంచి వచ్చి. "మూడు పావలాలు ఏవిరా?" అంటే యేమిటి చెప్పడం? వాడికి తటాల్ని ఒక ఆలోచన తట్టింది. " అమ్మా. రేపు సంపాదిస్తాను. ఇవేళ మట్టుకి నా మూడు పావలాలూ నువ్వియ్యవే." అన్నాడు.

తండ్రి ముందు, కొడుకు నవ్వులపాలు కాకుండా శేషమ్మ గదులపెట్టెలోంచి మూడు పావలా కాసులు తెచ్చియిచ్చింది.

కామయ్య చీకటిపడే వరకూ దుకాణంలో పనిచేసి ఇంటికొచ్చాడు. సోమయ్య డాబుగా జేబులోంచి మూడు పావులాలూ తీసి తండ్రి చేతిలో పడేసి, "చూడు!" అన్నాడు. కామయ్య. ఆ మూడు పావలా కాసుల్నీ ఒకమాటు అటూ ఇటూ తిర గేసి, " ఎక్కడివిరా అబ్బీ ఇవీ?" అని అడిగాడు.. " ఎక్కడి వేమిటి? పొద్దస్త మానం ఎద్దులా  పనిచేసి సంపాదిస్తేను?" అని దబాయించాడు సోమయ్య.

" ఇది నీ కష్టార్జితం కాదు!'' అంటూ ఆ మూడు పాపలాలూ మండుతోన్న పొయ్యిలోకి విసిరేశాడు కామయ్య.

మర్నాడు శేషమ్మ సోమయ్యతో, "ఇవాలైనా గడించుకు రారా" అంది. వాడా నాడు తల్లికి తెలవకుండానే గదుల పెట్టెలోంచి ఒక రూపాయి తీసుకుపోయి మిఠాయి దుకాణం మీద మార్చి, పావలా పకోడీలకి జీడిపప్పు పాకానికి ఖర్చుపెట్టి, మిగతా ముప్పావులా తెచ్చి, సంపాదించా నంటూ రాత్రి తండ్రి చేతిలో పడేశాడు. క్రిందటి రోజుకు మల్లేనే తండ్రి ఆ మూడు పావలా కాసులూ తిరగేసి మరగేసి "ఇదీ నీ కష్టార్జితం కాదు. నన్ను మోసగించబోకు," అంటూ వాటిని కూడా పొయ్యి లోకి విసిరేశాడు.

మూడోనాడు సోమయ్యకి గదుల పెట్టెలో ఏమీ చిక్కలేదు.

అంతేకాకుండా తనది కష్టార్జితం కాదని తండ్రికి తెలిసి పోతోంది కూడాను. నిజంగా గడించి తేవాలని వాడు నిశ్చయించాడు. కాట్రేని కోనలో శనివారం సంత. వాడు సంతకు పోయి, మూటా ముల్లే మోసి కూలి డబ్బులు ఆర్జించటం ప్రారంభించాడు. చీకటి పడేదాకా మోసినా పావలా పోగవ లేదు. మర్నాడు బళ్లమాటి వద్దకు పోయి పెట్టే బేడా ఊళ్ళోకి మోసుకుపోవటానికి ఒప్పుకొని డబ్బు గడించాడు. బలమైన వాడే ఐనా సోమయ్యకి శ్రమపడటం అలవాటులేదు గనక పెట్టెలు మొయ్యట మంటే కష్టమే అనిపించింది. కాని పట్టు దలతో పనిచేశాడు. ఐతేం. రోజంతా మోస్తే ఆరణాల కన్న ఎక్కువ కిట్టలేదు. మర్నాడు కూడా మోస్తేగాని ముప్పావలా కూడ లేదు.

ముప్పావలా పోగవటంతోనే సోమయ్య ఇంటికి వచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. కామయ్య యథాప్రకారం "ఇది నీ కష్టా ర్జితం కాదంటూ పొయ్యిలోకి విసిరేశాడు. కాని ఈమాటు సోమయ్య ఇదివరలో మోస్తరుగా చూస్తూ ఊరుకోక పరుగెత్తి వెళ్ళి పొయ్యిలోంచి పావలాకాసుల్ని గబగబా పైకి లాగేడు.

కామయ్య చిరునవ్వుతో " అబ్బాయీ ! ఇది నీ కష్టార్జితం. ఇంతకుముందు రెండు సార్లు సొమ్ము పోయ్యిలో పారేస్తే నిన్ను రవంతైనా బాధించలేదు. ఎంచేత? అది నీ కష్టార్జితం కాదు గనక! కష్టార్జితమైన సొమ్ము మీద ఇలాగే మమకారం వుంటుంది. ఎవడో గడించి ఇస్తే దాని విలువ తెలీదు. కనుక యెవడికి  వాడు కష్టపడి గడించుకోవాలి." అన్నాడు.

"నిజమే నాన్నా." అన్నాడు సోమయ్య. ఆర్జన విలువ తెలిసిన సోమయ్య కష్టపడి ప్రయోజకుడై, తలిదండ్రులను సంతోష పెట్టి, తనూ సుఖపడ్డాడు.

అయిపోయింది 
🙏🙏🙏🙏🙏🙏
యెనుముల 
🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment