Sunday, March 29, 2026

 ఎదుటి మనిషిలోని మంచితనాన్ని గుర్తించాలంటే మనం ఏ దృష్టికోణంలో చూడాలి? పలకరింపు ఎలా ఉండాలి? వాళ్ల హృదయాలను ఎలా చదివి తెలుసుకోవాలి... వంటి సందేహాలు చాలామందికి వస్తుంటాయి. ఒకసారి అష్టావక్ర మహర్షి జనక మహారాజు సభకు వెళ్లినప్పుడు, ఆయన రూపం చూసి సభలోని పండితులు నవ్వారు. అయితే ఆ మహర్షి జ్ఞానాన్ని పరీక్షించిన తరువాత, వారు సిగ్గుపడి తమ అజ్ఞానాన్ని అంగీకరిం చారు. గొప్పతనం రూపంలో ఉండదు, జ్ఞానంలో ఉంటుందని అష్టావక్రుడు నిరూపిం చాడు. ఆయన రచించిన అష్టావక్ర గీత గొప్ప తత్వజ్ఞాన, మోక్ష గ్రంథం. అటువంటి మహనీయుల గురించి తెలుసుకుంటే తత్వం కొంత బోధపడుతుంది.

ఒకరోజు తెనాలి రామకృష్ణుడు విందుకు వెళ్లాడు. చిరునవ్వుతో అందరినీ పలకరిం చినా, నిర్లక్ష్యపు చూపులే ఎదురయ్యాయి. నిరాడంబరంగా ఉన్న తన వేషధారణే అందుకు కారణమని తెలుసుకున్నాడు. మరుసటి రోజు ఖరీదైన దుస్తులు ధరించి వెళ్లాడు. ఈసారి తాను తినకుండా దుస్తులకు అన్నం తినిపించడం ప్రారంభించాడు. 'అదేం పని?' అని ప్రశ్నించినవారికి, ఆయన చిరునవ్వుతో 'ఈ దుస్తులను చూసే నాకు గౌరవం ఇస్తున్నారు కాబట్టి భోజనం కూడా అవే తినాలి' అని చెప్పడంతో అవతలి వాళ్లంతా సిగ్గుతో తలవంచుకున్నారు.

సౌందర్యం అంటే కేవలం బాహ్య రూపం కాదు. ఈ నిత్యసత్యాన్ని ఎందరో మహానుభావులు చాటి చెప్పారు. అడ విలో నివసించే ఆదివాసి వృద్ధ మహిళ శబరి... తన స్వచ్ఛమైన భక్తితో రాముడి హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదిం చుకుంది. భక్తి తత్వాన్ని భగవంతుడు తీపి ఫలంగా స్వీకరిస్తాడని ఆమె చాటింది. క్రీడాకారిణులను ఆకృతి కార ణంగా అవహేళన చేయడం చూస్తూనే ఉంటాం. జెండర్ వెరిఫికేషన్ పరీక్షలకు సైతం నిలిచి వారు ఆటలో తమ సత్తా చూపి పతకాలు గెలుచుకున్న సందర్భాల్లో విమర్శించిన నోళ్లే ప్రశంసించడమూ చూస్తుంటాం. రూపానికి విలువ తాత్కాలికమే. మంచి మనసు మన్ననలు పొందు తుంది. మార్గదర్శకంగా నిలుస్తుంది.

మోహన్ ఖరీదైన హోటల్ కు వెళ్లాడు. పక్కనే ఉన్న చిన్న హోటల్లో యాభై ఏళ్ల మహిళ వీధి బాలలకు బ్రెడ్, టీ అందజేస్తూ కనిపించింది. పరీక్షగా చూసి ఆమె తన కంపెనీ యజమానురాలని గుర్తుపట్టి ఆశ్చర్యపోయాడు! నేటి తన హోదా ఆమె చలవే. కానీ ఆమె మాత్రం నిరాడంబరంగా, వీధి బాలలతో కలిసి వారి సంతోషాన్ని పంచుకుంటూ ఎంతో తృప్తిగా ఉంది. ఈ సంఘటన మోహన్కు గొప్ప గుణపాఠం నేర్పింది. మంచితనం, జ్ఞానం, దయ మనిషికి వన్నె తరగని అలంకారాలు. వాటిని సాధన చేయాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేమతో నిండిన హృదయం కన్నా అందమైంది ఏదీ లేదన్నారు. మదినిండా విశ్వప్రేమ నిండిన మనిషి రూపం ఎప్పుడూ అందంగా, ఆహ్లాదంగా కనబడుతుంది. అతని మనసులో భగవంతుడు ఉంటాడు. అలాంటివారి ఉనికి, చుట్టూ ఉన్నవాళ్లకి తరగని ప్రశాంతతను పంచిపెడుతుంది.

గొర్తి వాణి శ్రీనివాస్

No comments:

Post a Comment