సినిమా షూటింగ్
“అమ్మా! ఎందుకే గుడిసె దులుపుతున్నావ్? ఇప్పుడు ఏ పండగ లేదు కదా! అమ్మవారి పండగ మొన్ననే అయిపోయింది కదా!”
అని ఆశ్చర్యంగా అడిగాడు రాము.
ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్న కాంతమ్మ ముఖంలో చిరునవ్వు మెరిసింది.
“ఈ నెలాఖరికి మన ఊర్లో సినిమా షూటింగ్ జరుగుతుందట రా… వాళ్లకి మనలాంటి గుడిసె అవసరం ఉంటుందట. సినిమాల్లో పని చేసే మన ఊరి అప్పారావు చెప్పాడు. మన గుడిసెను రికమెండ్ చేస్తానని డబ్బులు కూడా తీసుకుని వెళ్లాడు.”
రాము కళ్లలో అనుమానం, మాటల్లో అసహనం—
“నువ్వు వాడికి ఎందుకు డబ్బులు ఇచ్చావే! సినిమాలో వాడికే దిక్కులేదు. అయినా వాడు చెప్తే వినే వాళ్లు ఎవరు?”
కాంతమ్మ చేతులు కాసేపు ఆగిపోయాయి.
సదరు అప్పారావు సినిమాలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తున్నానని అందరికీ చెప్పుకుంటాడు. కానీ షూటింగ్లో లైట్లు మోసుకెళ్తూ కనపడ్డాడట ఆ ఊరి వాళ్ళకి. అలాంటి వాడిని నమ్మింది కాంతమ్మ.
“అది కాదురా… గోదావరి పుష్కరాలకి మన ఊరి గుడికి రంగులు వేసి సినిమా తీశారు కదా! గత ఏడాది కరణం గారి మండువా ఇల్లు సినిమాలో ఎంత బాగుందనుకున్నావ్! ఆ రంగులు చూస్తే కళ్ళు చెదిరిపోయేవి. అలాగే మన గుడిసెను కూడా బాగు చేసి సినిమాల్లో చూపిస్తారేమో అనిపించి…” అని మృదువుగా చెప్పింది.
పాడుపడిన గుడిసె బాగు చేయించుకోవడం కొద్దిగా కలగానే ఉండిపోయింది కాంతమ్మకి ఎన్నో ఏళ్ల నుంచి
గోదావరి ఒడ్డున ఉన్న ఆ కోనసీమ గ్రామం ప్రతి ఏటా ఒకసారి అయినా సినిమాల సందడిని చూసేది.పెద్ద మర్రిచెట్టు కింద, గోదావరి గట్టుపై, ఊరిలోని పెద్ద ఇళ్ల అరుగుల మీద—ఎన్ని సినిమాలు తీశారో ఎవరూ లెక్కలేదు.
సినిమా వాళ్లు ఊర్లో ఉన్నంతసేపు, ఊరు తన పనులన్నీ మరిచిపోయేది.
కాంతమ్మ కాఫీ హోటల్ మాత్రం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది.
“ఇక్కడి ఉప్మా, పెసరట్టు రుచి వేరేలా ఉంటుంది” అనే యూట్యూబ్ వీడియోతో పక్కటౌన్ నుంచీ కూడా సినిమా వాళ్లు అక్కడికే వచ్చి తినేవారు.
పండగ రోజుల్లో తప్ప గుడి మొహం చూడని జనాలు కూడా షూటింగ్ రోజుల్లో గుడి దగ్గర గుమికూడేవారు.
దేవుడు కూడా బిజీ అయిపోయేవాడు!
పూజారి గారు అయితే గర్వంతో ఉప్పొంగేవారు. ఏళ్ల క్రితం తన మీద తీసిన ఒక చిన్న సీన్ గురించి ఇప్పటికీ అడిగినా, అడగకపోయినా చెప్పుకుంటూనే ఉండేవారు.
ఊరి బడిని కూడా ఒకసారి సినిమాకోసం రంగులు వేసి శుభ్రం చేశారు.“ఇదే మా క్లాస్ రూమ్!” అంటూ తెరపై కనిపించే చోట వేలు చూపిస్తూ, ఊరి వాళ్లు ఇప్పటికీ ఆనందంగా చెప్పుకుంటారు.
సినిమా షూటింగ్ అంటే కరణం గారి ఇంట్లో ప్రతిరోజూ విందులే.
“కోనసీమ రుచులన్నీ సినిమా వాళ్లకు చూపించేశాను!” అని మీసాలు మెలేస్తూ గర్వంగా చెప్పుకునేవాడు. డైరెక్టర్ గారితో చెప్పి సినిమా వేషాలు ఇప్పిస్తానని కుర్ర కారుకి కబుర్లు చెప్పి సొమ్ము జేబులో వేసుకునేవాడు. ఇదో రకం సంపాదన
కుర్రాళ్లకి అయితే సినిమా అంటే అదో రకమైన మాయ.ఒక సీన్‌లో అయినా కనిపించాలని ఆశతో తిరిగేవారు. తనని చూసి హీరో నవ్వేడని, హీరోయిన్ అచ్చు పల్లెటూరి అమ్మాయిల ఉందని—అంటూ ఎన్నో కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు.
కాంతమ్మ ప్రపంచం మాత్రం ఒకే కల చుట్టూ తిరిగేది—
తన గుడిసె రంగులద్దుకుని మెరిసిపోవాలి…
తాను వాకిట్లో నిలబడి ఉండగా కెమెరా తనవైపు తిరగాలి…
చివరికి తన చేతిలో కొంత డబ్బు పెట్టాలి.
ఆ కల కోసం ఆమె ప్రతిరోజూ చెరువు గట్టుపై ఉన్న అమ్మవారి గుడికి వెళ్లి ప్రార్థించేది—
“సినిమా వాళ్లు త్వరగా రావాలి” అని.
రోజులు గడిచాయి.
కానీ అప్పారావు నుంచి ఎలాంటి కబురు రాలేదు.
ఒక రోజు హైదరాబాద్ వెళ్లి వచ్చిన ఊరి యువకుడు ఒక వార్త తీసుకొచ్చాడు.
ఆ వార్త—ఆ ఊరి కలలన్నింటినీ ఒక్కసారిగా ఆపేసింది.
డైరెక్టర్ చెప్పిన మాటలు అతని మనసులో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి—
“ఇంత దూరం గ్రామాలకు రావడం మాకు కష్టం. బడ్జెట్ సరిపోదు. ఇప్పుడు పల్లెటూరి సెట్టింగ్స్ అన్నీ మా పట్టణంలోనే దొరుకుతున్నాయి. అక్కడికి వస్తే జనాలు గుమికూడుతారు, సెక్యూరిటీ సమస్యలు వస్తాయి. గోదావరి మీద పాట తీయాలంటే తప్ప మేము రావడం సాధ్యం కాదు.”
ఆ మాటలు ఊర్లో చక్కర్లు కొట్టేసరికి—
ఆశలు మెల్లగా మసకబారిపోయాయి.
ఆ తర్వాత ఆ ఊరికి సినిమా వాళ్లు మళ్లీ రాలేదు.
అప్పారావు కూడా తిరిగి కనిపించలేదు.
కొంతకాలానికి తెలిసింది—
కాంతమ్మ దగ్గరే కాదు…
ఇంకెన్నో గుడిసెల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడని.
సినిమా మోజులో ఉన్న ఆ యువకుడి దగ్గర కూడా.
ఒక ఉదయం…
కాంతమ్మ మళ్లీ తన గుడిసె ముందు ఊడ్చింది.
ఈసారి మాత్రం సినిమా కోసం కాదు.
వాకిట్లో నిలబడి గోదావరి వైపు చూసింది.
ఎప్పుడో తన కలల్లో మెరిసిన రంగులు—ఇప్పుడు గాలిలో కలిసిపోయాయి.
రాము నిశ్శబ్దంగా ఆమెను చూసాడు.
కాంతమ్మ నెమ్మదిగా అనుకుంది—
“సినిమాల్లో కనిపించే రంగులు… నిజ జీవితంలో అంత సులభంగా రావు రా…”
ఆ గుడిసెకి రంగులు రాలేదు…
కానీ ఒక పాఠం మాత్రం బోధపడింది
కలలు కనడం తప్పు కాదు…
కానీ మోసపు మాటలపై ఆశలు కట్టడం మాత్రం జీవితాన్నే మసకబారుస్తుంది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
No comments:
Post a Comment