Saturday, March 28, 2026

 దూరపుకొండలు

ఆకర్షణలకు లొంగడం మానవ నైజం. కంటికి రమణీయంగా కనబడే దృశ్యానికి మనిషి ఆకర్షితుడు అవుతాడు. ఆకర్షించే దృశ్యాలు దగ్గరగా ఉన్నప్పుడు వాటి నైజం తెలుస్తుంది. దూరంగా ఉండే దృశ్యాల్లోని వాస్తవం ఏంటో తెలియదు. అందుకే 'దూర పుకొండలు నునుపు' అనే సామెత వచ్చింది. దూరంగా ఉన్న వస్తువు ఏదైనా రమణీ యంగా కనబడుతుంది. వాస్తవాన్ని మరుగునపరచే స్వభావం అందులో ఎక్కువ. దూరంగా నున్నగా కనిపించిన కొండలకు దగ్గరగా వెళ్తున్నకొద్దీ ఇంత గరుకుగా, కఠి నంగా ఉన్నాయేంటి... అని ఆశ్చర్యం కలుగుతుంది. దూరం నుంచి కనబడిన దంతా నిజం కాదని, కళ్లు మోసం చేశాయనీ తెలుస్తుంది.

ఆకాశవీధిలోకి దృష్టి సారించినప్పుడు కనబడే సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు వింతగొలుపుతాయి. వెన్నెల రేయి ఆకాశంలోకి చూస్తుంటే, ఆ చందమామను చేరుకొని, ఇల్లు కట్టు కొని ఉండిపోవాలనిపిస్తుంది. గ్రహాల పైకి వ్యోమనౌకల్లో వెళ్లి రావాలని మనసు ఉరకలు వేస్తుంది. ఇవన్నీ దూరం నుంచి చూసి మైమరచే విష యాలే కానీ, అసలు నిజాలు కావని మనిషికి తెలియాలంటే వాటి దగ్గరకు వెళ్లి చూడాల్సిందే. మనిషి ఊహలన్నీ అభూతకల్పనలేననీ, అసలు విషయాలు కావనీ శాస్త్రవేత్తల పరిశోధనలు చాటాయి. ఇక్కడ కూడా 'దూరపుకొం డలు నునుపు' అనే సామెత వర్తిస్తుంది. బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ తల్లి పాడే 'చందమామ రావే జాబిల్లి రావే!' అనే పాట ఎలాంటిదో మనిషి ఊహ అలాంటిదే. ఊహలన్నీ అనుభూతికి మాత్రమే పరి మితాలు. వాటికి వాస్తవికత శూన్యమే.
ఒక మనిషి మరొక మనిషిని అర్ధం చేసుకోవడానికి కూడా ఈ సామెత వర్తిస్తుంది. చలనచిత్రాలను చూస్తున్నప్పుడు కనబడే రమణీయ దృశ్యాలలో వాస్తవాలు వేరే విధంగా ఉంటాయి. దృశ్యం ఎప్పుడైనా మనిషిని మైమరపిస్తుంది. ఆ దృశ్యాలన్నీ నిజాలే అనుకుంటే పొరపాటే. మనిషి ఎప్పుడూ భ్రాంతికి లోనవుతాడనీ, వాస్తవాన్ని గ్రహించలేడనీ వేదాంతుల మాట. ఈ భ్రాంతి ఎలా ఉంటుందో తెలియడానికి 'తాడును చూసి పాము అనుకుని భయపడటం', 'గాజు ముక్కను చూసి స్పటికం అని నమ్మడం' వంటి విషయాలు తోడ్పడతాయి. మెరుస్తూ కనిపించేదంతా బంగారం కాక పోవచ్చు. రాళ్లన్నీ రత్నాలు కాకపోవచ్చు. దేనికైనా 'సమ్యక్ (లోతైన) పరీక్ష జరగాలి. అప్పుడే అసలు స్వరూపం బయటపడుతుంది.

మనిషిని కూడా దూరం నుంచి చూసి, అతడి నిజస్వరూప స్వభావాలను అంచనా వేయడం సాధ్యం కాదు. ఆ మనిషితో కొంతకాలం సాహచర్యం చేసినప్పుడే అతడి నైజం తెలుస్తుంది. అందం అనేది గుణాత్మకం కాకపోవచ్చు. అందంగా లేనంత మాత్రాన గుణం లేదని నిర్ధారించడం సరైన విషయం కాదు. దేనికైనా పరీక్ష ముఖ్యం. శోధన ముఖ్యం.

మనిషి భ్రాంతికి లోనవుతుంటాడు. దీనికి కారణం అతడి మనోదౌర్బల్యమే. మనసు దృఢంగా ఉంటే భ్రాంతికి లోనుకాకుండా, నిజాన్ని తెలుసుకోగల శక్తి అలవడుతుంది. అదే మనిషిని కాపాడుతుంది. వేదాంతులు కూడా ఈ కనబడే జగత్తు అంతా ఒక భ్రాంతి అని, లేనిది ఉన్నట్లుగా కనబడుతోందని అంటారు. కనబడుతున్న ప్రపంచాన్ని 'భ్రాంతి' అని ఎలా అనుకుంటాం... వేదాంతుల పరిభాషలో ఇప్పుడు ఈ ప్రపంచం కనబడవచ్చు కాని, ఇది కాలాంతరంలో ఇలాగే ఉంటుందని చెప్పలేం కనుక ఇదంతా అశాశ్వతం. 'సృష్టి ఆరంభంలో ప్రపంచం ఇలా లేదు, ప్రళయకాలంలో ఇలా ఉండదు' కనుక ఇదంతా దృశ్యభ్రాంతి. ఇది తాత్కాలికం అన్న సత్యాన్ని తెలుసుకుని, భ్రాంతిని వదిలేయాలన్నదే ఈ సామెతలోని పరమార్ధం.

డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ

No comments:

Post a Comment