Sunday, March 29, 2026

 #మనకథలు_మనభావాలు 

#వార్షిక_కథల_పోటీ_2026
#శీర్షిక:ఎవరు చెప్పాలి?*
#రచన: అడపా పద్మ!

“విష్ యూ హ్యాపీ  వెడ్డింగ్  యానివర్సరీ “… డాలస్ లో ఉన్న కూతురికి, అల్లుడికి ఫోన్ చేసి పెళ్ళి రోజు శుభాకాంక్షలు అందజేశారు మాధవ్  దంపతులు 

 తండ్రి మాట్లాడటం పూర్తి అయ్యాక ఫోన్ పట్టుకుని తల్లితో మాట్లాడుతూ కిచెన్ లోకి అడుగుపెట్టింది కీర్తి.

“అమ్మలూ… అప్పుడే మూడో  యానివర్సరీ కూడా వచ్చేసింది ఇప్పటికైనా పిల్లల్ని ప్లాన్ చేస్తున్నారా లేదా?” అడిగింది రుక్మిణి.

“ మమ్మీ రోజూ ఇదే గొడవా?… నాకు కిడ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అసలు  పిల్లల్ని కనకూడదు అని అనుకొన్నాను ఈ టాపిక్ ఇంతటితో వదిలేయ్”

“ ఏంటీ? పిల్లల్ని కనవా!? “  బిత్తరపోతూ అడిగిన తల్లితో 

“అవును వద్దనుకొన్నాను”

“ఎందుకు?” అర్థం కాక అయోమయంగా అడిగింది రుక్మిణి!

“అబ్బా నీకేం తెలియదు మమ్మీ నా పరిస్థితి అస్సలు ఆలోచించవు… పెళ్ళి అయి ఇప్పటికి మూడేళ్ళు మాత్రమే  అయింది అప్పుడే రాకేష్ గురించి ఎలా తెలుస్తుంది…పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొంత టైం కావాలి అతని మీద పూర్తి నమ్మకం కలిగాలి.  పిల్లల్ని పెంచే ఓపిక, తీరిక రెండూ లేవు నాకు.” 

“అదేంటే?… బంగారం లాంటి పిల్లాడు, మర్యాదస్తుడు, నిన్ను అంత ప్రేమగా చూసుకుంటాడు మాకే అతనేంటో అర్థం అవుతుంటే నువ్వు ఇంకా అతన్ని అర్థం చేసుకోకపోవటమేంటీ!?.”

“ఇప్పటికి ప్రేమగా నే ఉన్నాడు కానీ పిల్లలు పుట్టిన తర్వాత మారిపోతే!?… ఏ కారణం చేతనైనా విడిపోవాల్సి వస్తే  నా పరిస్థితి ఏంటి?…కిడ్స్ ని సింగిల్ పేరెంట్ గా నేను హ్యాండిల్ చేయలేను మమ్మీ! ఇక్కడ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, పైగా ఇప్పడు   ‘ఆటిజం’ భయం ఒకటి,  జాబ్ చేసుకుంటూ నేను పెంచలేను” విసుగ్గా చెప్పింది 

“అతని మీద విశ్వాసం పెరిగే సరికే నీ వయసు కూడా పెరిగి పిల్లల్ని కనే వయసు దాటిపోతుంది. అప్పుడేడ్చి ఏం లాభం…!?” కోపంగా అంది రుక్మిణి 

“అందుకేగా ఈ లంపటం నాకు వద్దు అనేది   మా ఫ్రెండ్స్  కొంతమంది కి ఇంకా పెళ్ళిళ్ళే కాలేదు, పెళ్ళి చేసుకునే వరకు పెళ్ళి,పెళ్ళి అని నా ప్రాణాలు తీశారు,ఇప్పుడు మళ్ళీ పిల్లలని మొదలు పెట్టారు” అంతే కోపంగా బదులిచ్చిన కూతురి మాటలకి  విస్తుపోయింది  ఆమె

“పిల్లలు లేకుండా ఎలాగే బ్రతకటం? కుటుంబం పెరగాలి, వంశం వృద్ధి చెందవద్దా?…మీ అత్తగారు వాళ్ళకి తెలిస్తే ఊరుకొంటారా? అయినా నేనూ, మీ అత్తగారు ఉన్నాం కదా నీకు పురుడొస్తే హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాం…!” బాధగా ఏదో అనబోతున్న తల్లితో 

“ ఇప్పుడు మళ్ళీ ఉపన్యాసం మొదలెట్టకు బ్రతకటానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి లే మమ్మీ పిల్లలే కావాలా ఏంటీ? అయినా ఇది నా పర్సనల్ విషయం మా అత్తగారు వాళ్ళకి ‘అనవసరం’ పెడసరంగా అని ‘ నైట్ పార్టీ’ ఉంది పని లో వున్నాను బై”  ఫోన్ పెట్టేసింది.

పర్సనల్ విషయమా… అంటే  నన్ను కూడా నీకు అనవసరం అని ఇన్ డైరెక్టుగా చెప్పిందా? నిర్ఘాంతపోతూ ఈ విషయం భర్తకెలా చెప్పాలి!? ఆలోచనలో పడింది.

**************

    మాధవ్, రుక్మిణి లది ముచ్చటైన సంసారం మాధవ్ చేసేది ప్రవేట్ కంపెనీ లో జాబ్ అయినా మంచి శాలరీ అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ…కూతురు కీర్తీని అమెరికా పంపించి ఎమ్మెస్ చదివించారు చదువు పూర్తి కాగానే జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన వెంటనే  అక్కడే జాబ్ చేస్తున్న రాకేష్ సంబంధం రావటం, పెళ్ళి కావటం  అంతా వెంట వెంటనే జరిగిపోయింది. కొడుకు తేజ  కూడా కెనడా లో ఎమ్మెస్ పూర్తి చేసి ప్రస్తుతం “టొరెంటో” లో జాబ్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం పెళ్ళి సంబంధాలు మొదలు పెట్టాలని అనుకొన్నారు మాధవ్, రుక్మిణీలు!

 ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగినట్టు సరైన టైంకి  పిల్ల పెళ్ళి జరిగిందని సంతోష పడుతుంటే కీర్తి పిల్లలు వద్దు అనటం రుక్మిణి కి మింగుడు పడటం లేదు! 

తను కూడా అత్తమామలని, ఆడపడుచులని ఆదరంగానే చూసింది నానమ్మ, తాతయ్య లతో మంచి అనుబంధం ఉంది కీర్తికి. మేనత్తలంటే వల్లమాలిన అభిమానం కూడా! ఇలాంటి ఫ్యామిలీ లో పెరిగి ఎప్పుడో రాకేష్ తో విడిపోతే ఒంటరిగా ఎలా బ్రతాకాలి అని ముందుగానే  ఎందుకు ఫ్లాన్ చేసుకొంటుంది?…ఏమిటి ఈ పిల్ల మనస్తత్వం, ఎందుకు ఈ అభద్రతా భావం, ఎక్కడ నుంచి వచ్చాయి  ఇలాంటి అర్ధం లేని భయాలు? చిన్నప్పటి నుంచి సంస్కారవంతంగానే పెంచాం కదా!?.  ఆ మాటే అడిగితే

  “నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నాను నీ కంటూ ఒక లైఫ్ ఉందా మమ్మీ…?? ఎప్పుడూ ఇంటికే అంకితమై పోయావు నీలాగా ఉండటం నా వల్ల కాదు నాకు ఫ్రీడమ్ కావాలి” అనే కూతురిని చూస్తే భయంగా ఉంది రుక్మిణికి!.  

విషయం తెలుసుకున్న మాధవ్ భార్యకి ధైర్యం చెప్పాడు

“దాని మొహం ఎవరినో చూసి ప్రభావితమై 

అదే కరెక్ట్ అనుకొంటుంది నిదానంగా నచ్చచెబుదాంలే” అనేసరికి కాస్త ఊరట గా అనిపించింది ఆమెకి.

మరుసటి రోజు మధ్యాహ్నం తీరుబడిగా ఏదో ప్రోగ్రాం టీ.వీ లో చూస్తూ కూర్చున్న రుక్మిణికి ప్రాణస్నేహితురాలు సుమిత్ర వద్ద నుండి ఫోన్ కాల్ రావడంతో …

“హాయ్ మిత్రా ఎలా ఉన్నావు?” హుషారుగా పలకరించింది.

“ఏదో ఉన్నానులేవే” నీరసంగా జవాబిచ్చింది సుమిత్ర 

“ ఏమైందే?” ప్రశ్నించింది రుక్మిణి 

“నందినీ వరుణ్ తో గొడవ పడి వచ్చేసింది”

“ ఎందుకు?”

“పిచ్చి డ్రెస్సు లు వేసుకుని సోషల్ మీడియా లో పోస్ట్ చేయవద్దు అన్నాడట” 

“తప్పేముంది?”

“ఏమోనే నేను ఎటూ చెప్పలేకపోతున్నా.. . దాని వాదన దానిది” 

ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేసింది!. అసలే కూతురు నందినీ గురించి బాధలో ఉన్న సుమిత్రకు కీర్తి సంగతి చెప్పలేదు. 

‘ఏం… పిల్లలో ఏమిటో!… అమ్మానాన్నలు చెప్పినా వినే స్థితిలో లేరు’  అనుకొని గాఢంగా నిర్టూర్చింది రుక్మిణి।

**********

 “తేజా!  మంచి మ్యాచ్ ఒకటి వచ్చిందిరా అమ్మాయి అక్కడే కెనడా లో మాస్టర్స్ చేస్తుంది మంచి కుటుంబం, పిల్ల కూడా అందంగానే ఉంది వాట్సాప్ లో ఫోటోలు పంపించాను కుదిరితే అమ్మాయిని ఒకసారి కలిసి మాట్లాడు  లొకేషన్ పెడతాను” తండ్రి చెప్పగానే

“ లేదు డాడీ నాకు ఇష్టం లేదు”

“ఎందుకు!?…ఎవరినీ లవ్ చేయలేదన్నావుగా”

“లేదు”

“మరి”

   “నాకు  పెళ్ళంటేనే ఇష్టం లేదు  నేను  చేసుకోదలుచుకోలేదు డాడీ…నాకు అసలు పెళ్ళే వద్దు”

“కారణం!” ఆశ్చర్య పోతూ అడిగాడు మాధవ్ 

   “ పెళ్ళి చేసుకొన్నా ఎన్నాళ్ళు కలిసి ఉంటామో తెలియదు…ప్రతి దానికి గొడవలు పడి, డైవర్స్ తీసుకొంటున్నారు మా ఫ్రెండ్స్ చాలామంది…ఆడంబరంగా  పెళ్ళి చేసుకుని ముచ్చట తీరకముందే  కోర్టు, కేసులు, డైవర్స్, మనోవర్తి లాంటివి నేను భరించలేను హాయిగా  ఒంటరిగా ఉంటే ఏ గోలా లేదు. పెళ్ళి ప్రయత్నాలు మానుకోండి డాడీ” స్థిరంగా ఉంది తేజ గొంతు।

కొడుకు సమాధానం విని తలపట్టుకుని కూర్చున్నాడు మాధవ్!

**********

కూతురు చూస్తే పిల్లలు కననని, కొడుకు చూస్తే పెళ్ళి చేసుకోనని  మొండికేయటంతో ‘ఇదేం ఖర్మో’ అర్థం కాక డీలా పడిపోయారు మాధవ్, రుక్మిణిలిరువురూ! 

      కొడుక్కి ఎన్నో రకాలుగా నచ్చచెప్పాలని ప్రయత్నించింది రుక్మిణీ. భార్య భర్తలు ఒకరికొకరు తోడు గా ఉండాలని, ఒక కుటుంబం అండ కావాలని, అది పెళ్ళి అనే బంధం తోనే ముడిపడుతుందని, కలిసి కాపురం చేసే వాళ్ళు ఎంతమంది లేరూ? వాళ్ళని చూడు!.. అంటూ ఎన్నో రకాలుగా చెప్పి శతవిధాలా ప్రయత్నించినా తేజ ఏ మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు! 

“మాది ముప్పై ఐదేళ్ళ వైవాహిక బంధంరా మేము సంతోషంగానే ఉన్నాం కదా” అని మాధవ్  అంటే 

“మీ రోజులు వేరు, మా రోజులు వేరు”  అని తేలికగా కొట్టిపారేశాడు!

   కొడుకు పెళ్ళి మానుకొని ఎక్కడ ‘లివింగ్ రిలేషన్స్’ పెట్టుకుంటాడో  అని మధనపడి పోసాగారు భార్యా భర్తలు!.

   కీర్తీ ధోరణిలో కొంచెం  కూడా మార్పు రాలేదు…లో లోపల బాధ పడుతున్నా  రాకేష్ ఒక్కమాట  కూడా కీర్తీ గురించి అత్తమామల దగ్గర కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ కంప్లైంట్ చేసే విధంగా మాట్లాడలేదు. అది మరింత వేదనగా మారింది రుక్మిణి కి. ఇంత మంచి భర్తని ఎందుకు అర్థం చేసుకోదు కీర్తి అని!.

    రోజులు భారంగా గడుస్తున్నాయి . రుక్మిణి దిగులు కాస్తా అనారోగ్యం గా మారింది మనిషి లో మునుపటి ఉత్సాహం ఏ కోశానా లేదు!. పిల్లల్తో కూడా మాట్లాడటం తగ్గించేసింది. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు పొడి పొడిగా సమాధానం చెప్పి పెట్టేస్తుంది.

   ఎంత పద్దతిగా పెంచింది? వీళ్ళకోసమే బ్రతికింది ఇప్పటివరకు…వాళ్ళ భవిష్యత్తు గురించేగా తన ఆరాటం। ఇన్ని రోజుల నుండి దేనికీ ఎదురు చెప్పని పిల్లలు ఇప్పుడు ఇలా తయారయ్యారు ఏంటో!?. ఊట బావిలో ఊరినట్టు కళ్ళలో నీరు ఊరుతుంటే పదే,పదే కళ్ళు తుడుచుకొంటూ తిండి మీద శ్రద్ధ లేకుండా మంచానికి అతుక్కు పోయింది. 

రుక్మిణి మానసిక స్థితి అర్థం చేసుకున్న మాధవ్ ఆందోళన పడసాగాడు.

  “ రుక్కూ …ఇప్పటి యువత వైఖరి ఇలానే ఉంది.  పెళ్ళి వద్దని, పిల్లలు వద్దని పేరెంట్స్ కి కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నారు. ఇంతకు ముందు పెళ్ళిళ్ళు లేట్ గా  చేసుకుంటున్నారు అని బాధ. ఇప్పుడు ఏకంగా పెళ్ళిళ్ళే వద్దంటున్నారు! నీకో సంగతి చెప్పనా! 

కొత్తగా…‘డ్యూయల్ ఇన్ కమ్ నో కిడ్స్’ అంటూ మొదలు పెట్టి  యూ.ఎస్  లో పిల్లల్ని కనకూడదనుకొన్న  వారంతా  సెపరేట్ గా ఒక కమ్యూనిటీ లో ఉంటున్నారు ‘డిన్ కర్స్’ కాలనీ అంటూ!… పక్కింటి పిల్లల వలన కూడా డిస్ట్రబెన్స్ ఉండకూడదని వీరంతా ఒకచోట చేరుతున్నారు… అందులో మన తెలుగు జంటల సంఖ్య కూడా క్రమేణా పెరుగుతోంది! ఇది మన ఒక్కరి సమస్య కాదు చాపకింద నీరులా సమాజం లో వ్యాపిస్తున్న జాడ్యం.”

“ఎందుకండీ  డ్యూయల్ ఇన్ కమ్ ఎవరి కోసం? ఏం చేసుకుంటారు పిల్లలు లేనప్పుడు?” బాధగా అంది.

 “పిల్లలు ప్రతిబంధకంగా మారకూడదని తెలివైన ఈ తరం వారి ముందు జాగ్రత్త మరి” అంటూనే 

“వాళ్ళు అలా మారటానికి మనం… అంటే తల్లిదండ్రులు కూడా కారణమే రుక్కూ! చిన్నప్పుడు హాస్టల్ చదువులు, పెద్దైయ్యాక ఫారిన్ ఎడ్యుకేషన్ అంటూ ఎప్పుడూ కుటుంబానికి దూరంగా ఉంచటంతో స్వేచ్చకి అలవాటు పడిపోతున్నారు.! 

పైకి విముఖత చూపినా తెలియకుండానే మన సంస్కృతి ఆచరిస్తారనే ఆశ, మన కుటుంబ వ్యవస్థ నిలబడుతుందనే  నమ్మకం బలంగా ఉన్నాయి నాకు!  ఎందుకంటే విదేశాల్లో ఉన్న యువత ఇండియా వచ్చి వివాహాలు చేసుకొంటున్నారంటే మన వివాహ వ్యవస్థ ని నమ్ముతున్నారనేగా…! ఇప్పుడేదో కొత్త ట్రెండ్ వచ్చిందని మనం కంగారు  పడకుండా కాస్త …ఓపిక పట్టాలి అంతే” అనునయంగా చెప్పాడు.

  “ పై చదువుల కోసం ఫారిన్ పంపించి తప్పు చేశామంటారా? మన సంస్కృతి, సంప్రదాయాలు పూర్తిగా మర్చిపోయారంటారా?…మన పిల్లలు “ బేలగా అడిగింది

  “ఏ దేశమేగినా మన జాతి ఔన్నత్యం చాటి చెప్తూ విదేశాల్లో ఉంటూనే ఎంతో కృషి చేస్తున్న మహానుభావులూ ఉన్నారు, ఇలా కొత్త పోకడలు పోయే వారూ ఉన్నారు…ఇక్కడే ఉంటూ వారిని అనుసరించే వాళ్ళూ ఉన్నారు ఎక్కువగా ఆలోచించికు”  

**************

ఏ మార్పూ లేకుండానే సంవత్సర కాలం గిర్రున తిరిగి పోయింది…

  ఒకరోజు చెప్పాపెట్టకుండా ‘ కీర్తి’ ఇండియా వచ్చేసింది. రుక్మిణీకి ఆందోళన మొదలైంది. భర్త ఇప్పుడే ఏమీ అడగవద్దు అన్నాడని కూతురిని కదిలించలేదు।

వారం  రోజుల తర్వాత తనే చెప్పింది 

  “మమ్మీ…! రాకేష్ చాలా మారిపోయాడు ఇంతకు ముందు లా ప్రేమగా ఉండటం లేదు, లేట్ నైట్ ఇంటికి వస్తాడు, ఏమీ పట్టించుకోడు, తన వర్క్, తన స్నేహితులు అంతే!  ఎప్పుడూ బయటకి వెళుతుంటాడు . చాలా లోన్లీ గా, దిగులుగా, బోరింగ్ గా ఉంది లైఫ్! నేను అతనితో కలిసి ఉండలేననిపిస్తుంది” చెప్తుంటే కళ్ళలో సన్నటి నీటి పొర తళుక్కుమంది.

  కూతురిని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు రుక్మిణికి. ప్రతిది ‘నా పర్సనల్ ‘ అని మాట్లాడే   యువత చిన్న బాధ కలిగితే దాన్ని  ఫేస్ చేయలేక గిలగిలలాడతారు సెన్సిటివ్ గా ఆలోచిస్తారు జాలిగా అనుకొంది ఆమె.

  రాకేష్ కి ఫోన్ చేశాడు మాధవ్ విషయం ఏమిటో కనుక్కుందామని. అందరూ వినాలనే  స్పీకర్ ఆన్ చేశాడు.

  “మీరే చెప్పండి అంకుల్ ‘ఒన్ మిలియన్ ‘ పెట్టి కొనుక్కున్న ఆ ఇంట్లో నేను ఒక రూమ్ లో, కీర్తీ ఒక రూమ్ లో వర్క్ చేసుకొంటూ ఉంటాం వర్క్ అయిపోయాక అంతా నిశ్శబ్దం… ఇంట్లో అల్లరి, సందడి ఉండవు షోకేస్ లో బొమ్మల్లా అంతా నిశ్శబ్దం…వీకెండ్స్ మాత్రమే ఫ్రెండ్స్ కలుస్తారు?…ఎంత సేపు టీ.వీ చూస్తూ గడుపుతాం! అందుకే బయట పార్క్ ల్లో, బీచ్ లో  పిల్లల అల్లరి చూడటం కోసం వెళుతున్నాను. అయినా కీర్తి కోరుకున్నది ఈ లైఫే గా మరి ఎందుకు బోర్ గా ఫీలవుతుందో నా కర్థం కావటం లేదు”

  రాకేష్ చెప్పింది అక్షరాలా నిజం! ఇంట్లో రొటీన్ గా జరిగేది అదే తన గురించే తను ఆలోచించింది ఇన్నాళ్ళూ. కాని రాకేష్  గురించి  ఏరోజైనా ఆలోచించిందా? అతని మాటలతో గుండెల్లో ఏదో కదలిక!. ఆత్మవిమర్శ మొదలైంది కీర్తి లో!

ఇనుము వేడి మీదన్నప్పుడే సుత్తితో  కొట్టాలి…కీర్తి అంతర్మథనం గుర్తించి మాధవ్ చెప్పాడు

  “ చూడు తల్లీ… పిల్లలెప్పుడూ  ప్రతిబంధకాలు కారు అమ్మానాన్నల్ని కలిపే వారధులే అవుతారు. ఎంతో మంది భార్యాభర్తలు పిల్లలకోసం రాజీపడుతూ కుటుంబాన్ని నిలబెట్టుకొంటున్నారు.. పెళ్ళి కుదిరిన దగ్గర నుండి ప్రతిక్షణం విడిపోవటం గురించే ఎందుకు ఆలోచన చేయాలి  ‘పాజిటివ్’ దృక్పథం ఉండాలి కాని!  

మన  సంస్కృతి గురించి నీకు చెప్పక్కర్లేదు, అలాగే  మాతృత్వం గురించి కూడా!…అంతా చూస్తూ పెరిగిన దానివి… నా  సలహా పాటించమని కూడా చెప్పను. మంచి నిర్ణయం తీసుకొని నీ జీవితాన్ని చక్కగా మార్చుకోగల ‘జ్ఞానం’  నువ్వు  పెరిగిన వాతావరణం, చదువు నీకిచ్చిందనే అనుకుంటాను.”

  మరో వారం రోజులు ఉండి కీర్తీ డాలస్ తిరిగి వెళ్ళిపోయింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు మాధవ్ దంపతులు!

*************

   తేజ కి ఫ్లూ ఎటాక్ అయ్యింది  ఎమర్జెన్సీ కి వెళ్ళవలసి వచ్చింది బాగా నీరసించిపోయాడు. అమ్మ బాగా గుర్తుకొచ్చింది అతనికి. చిన్న జ్వరమే!  చెబితే తల్లిదండ్రులు కంగారు పడతారని ఇంట్లో చెప్పలేదు. ఫ్రెండ్స్ హెల్ప్ తో మానేజ్ చేశాడు కానీ విపరీతమైన నీరసం, కళ్ళు తిరుగుతుండటం తో ఆఫీస్ కి లీవ్ పెట్టాడు.

  టాబ్లెట్స్ మత్తుగా ఉండటంతో నిద్రలోకి జారుకున్నాడు! రూమ్ మేట్స్ ఆఫీస్ లకి వెళ్ళిపోయారు. కాసేపటికి ఒక చల్లని చెయ్యి… నుదుటి మీద…అచ్చం అమ్మ చేతి స్పర్శలా అనిపించింది.అమ్మ… అమ్మ వచ్ఛిందా? కలా…నిజమా…ఇది! కళ్ళు తెరవ లేకపోయాడు. 

తేజా, తేజా… ఎవరో తట్టి లేపుతుంటే మెలకువ వచ్చింది ఎదురుగా ‘అర్పిత’ తన కొలిగ్ …

“నువ్వేంటి ఇక్కడ” నీరసంగా అడిగాడు

“ ముందు జావ తాగు.”  జావ తాగటానికి సహాయం చేసింది. అంటే ఇంతకు ముందు   ఆ…చల్లని స్పర్శ!…ఈమె చేతిదా?.

  అర్పిత రాజస్థానీ అమ్మాయి ఒకే ఆఫీస్ కావటంతో ఫ్రెండ్లీ గా ఉంటుంది. తేజా రూమ్ మేట్ సందీప్ తేజ కి జ్వరం అని చెప్పటంతో ఆఫీస్ లో పర్మిషన్ తీసుకొని తేజా ప్లాట్ కి వచ్చి అక్కడ నుండే వర్క్ చేసుకొంటూ అతనికి టైంకి పథ్యం భోజనం, మెడిసిన్స్ ఇస్తూ సందీప్ వాళ్ళు వచ్చేవరకు ఉండి వెళ్ళిపోయింది। అలా మూడు రోజులు తేజ కోలుకునే వరకు శ్రద్ధ తీసుకొంది అర్పిత।

అమ్మ నీకొక తోడు కావాలి అని ఎందుకు హితబోధ చేసిందో అర్థం అవుతుంది తేజకి.

   అర్పిత మీద మంచి అభిప్రాయం ఏర్పడి ఆమెని నిశితంగా గమనించ సాగాడు తేజ! మంచి భావాలు కల అమ్మాయి. హెల్పింగ్ నేచర్,   సర్దుకుపోయే గుణం, ఎవరితో గొడవలు పెట్టుకోకపోవడం చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయని గ్రహించాడు.చిరునవ్వుతో, చక్కటి హిందీ లో మాట్లాడుతుంది !…ఆమె సమక్షంలో తను చాలా హాయిగా ఉంటున్నాడు. 

  చిత్రంగా పెళ్ళే వద్దనుకొన్న అతనికి అర్పితని పెళ్ళిచేసుకుంటే?!.. ఆమె ఒప్పుకుంటుందా? అని ఆలోచించసాగాడు.

***********

  ఆరు నెలల తర్వాత అర్పిత ఆమోదం తెలిపిన మరుక్షణం తల్లిదండ్రులకి  ‘శుభవార్త’ చెప్పాడు తేజ. ఎప్పుడెప్పుడు వెళ్ళి కాబోయే కోడల్ని చూస్తామా  అని తహతహలాడి పోయారు మాధవ్, రుక్మిణి. వెంటనే కెనడా కి టికెట్స్ బుక్ చేసుకొన్నారు.

కీర్తి కి ఈ సంగతి చెప్పగానే…  

“మీరు కెనడా నుండి అమెరికా  వచ్చేయండి మమ్మీ… రాబోయే మీ ‘గ్రాండ్ కిడ్’…కోసం”

“ఏమన్నావ్ …కీర్తీ!…నిజమా?” ఆనందంతో కళ్ళు తడిసిపోతున్నాయి రుక్మిణి కి.

  “నిజమే… నాకు రాకేష్ కావాలి మమ్మీ! ఇండియా వచ్చినప్పుడే అర్థం అయ్యింది అతను లేకుండా  నేను ఉండలేనని. తన అభిప్రాయం గౌరవించటం నా ధర్మం  అని కూడా తెలుసుకొన్నాను ! ఈ ‘గుడ్ న్యూస్’ విన్నప్పటి  నుండి రాకేష్ ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసా, నా చుట్టూ తిరుగుతూ నన్ను అపురూపంగా చూసుకుంటున్నాడు!”  కీర్తి చెబుతుండగానే  సుమిత్ర నుండి పదే పదే మిస్డ్   కాల్స్ రావటంతో ఫోన్ పెట్టేసి సుమిత్ర కి చేసింది.

“నందినీ హాస్పిటల్ లో వుంది త్వరగా రా” అంటూ లొకేషన్ షేర్ చేసింది.

రుక్మిణి, మాధవ్ లు హాస్పిటల్  రూమ్ లోకి అడుగు పెట్టగానే స్నేహితురాల్ని చుట్టేసి బావురుమంది సుమిత్ర.

“ఏం జరిగింది?”  సుమిత్ర వీపుపై నిమురుతూ ఓదార్పు గా అడిగింది 

  “నందినీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి  హాస్టల్లో ఉంటుందని, మా ఇద్దరి మాట కూడా వినకుండా డైవర్స్  తీసుకొందని నీకు తెలుసు కదా?…

ఇప్పుడు ఆత్మ హత్యా ప్రయత్నం ఎందుకు చేసిందో మాత్రం తెలియటం లేదు” అని బాధపడింది!  

  స్పృహలోకి వచ్చిన తర్వాత నందినీ చెప్పింది  తనని ‘సోషల్ మీడియా’ లో విపరీతంగా ‘ట్రోల్ ‘ చేస్తున్నారని తనకి తెలిసిన వాళ్ళే ఫేక్ ఐడీలతో పిచ్చి కామెంట్స్ పెడుతున్నారని, బయట కనబడినా ఏదో ఒకటి అంటున్నారని భరించలేక ‘చచ్చి పోదామనుకొన్నా’ అని చెప్పింది.

  “సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టటానికి ఉన్న ధైర్యం తర్వాత పర్యవసానాలు ఫేస్ చేయటానికి లేకపోతే ఎలా?. అలాంటప్పుడు ‘లో ప్రొఫైల్’ మెయిన్ టైన్  చేయాలి”  కొంచెం కఠినంగా అన్నాడు మాధవ్

  “నిజమే అంకుల్…నేనొక స్టుపిడ్ ని వరుణ్ చెప్పింది ఆరోజు వినలేదు చివరికి డాడీ చెప్పినా వినిపించుకోలేదు. అతన్ని పోగొట్టుకొన్నాకే ఎందుకు చెప్పాడో, అతని విలువేంటో  తెలిసి వచ్చింది.” పెద్దగా ఏడుస్తూ అంది.

  “చూడు నందూ…జరిగి పోయిందేది తిరిగి రాదు  అలాగే వరుణ్  ని కూడా తిరిగి పొందలేవు!.  ఒక మార్గం మూసుకుపోతే మరో మార్గం ఆహ్వానం పలుకుతుంది. ఇక్కడితో నీ జీవితం ఆగిపోలేదు. మానవ జన్మ ఉన్నతమైనది అల్పమైన విషయాల కోసం అంతం చేసుకోకూడదు నీలో ఆత్మవిశ్వాసం పెంచుకో. నీకు సపోర్ట్  గా మేమంతా ఉన్నాం!.   ఏ కష్టమొచ్చినా పెద్దవాళ్ళకి దాచకుండా చెబితేనేగా మేమేదైనా చేయగలిగేది ఆప్యాయంగా ఆమె తలనిమురుతూ చెప్పాడు మాధవ్!

  “తప్పకుండా మీ సలహా పాటిస్తాను అంకుల్…ఇంకెప్పుడూ ఇలా పిరికిదానిలా బిహేవ్ చేయను” అతని చేతిని పట్టుకొని  ప్రామిస్ చేస్తున్నట్టుగా  చెప్పింది”.ఆ మాటతో 

అందరి కళ్ళల్లో నిశ్చింత కనిపించింది.

***********

ఇగో లతో చిన్న విషయాలని పెద్ద సమస్యలుగా భావిస్తూ నిజమైన కష్టం వచ్చినప్పుడు నిలబడలేక పారిపోతున్న ఈ జనరేషన్ ని ఎలా కాపాడుకోవాలి?.

అమ్మాయిల్లారా…ఎక్కడ, ఎలా ఉండాలో !?

వివేకంతో మసలుకోండి…అబ్బాయిల్లారా బుద్ది తెలుసుకొని నడవడిక మార్చుకోండి. మీరు చేసే పనులకి తల్లిదండ్రుల పెంపకాలనే ఆక్షేపించేలా,  కుటుంబాలని సైతం అభాసుపాలుకి గురి చేయకండి!…అని ఎంతమంది పెద్దలు ‘ఎలుగెత్తి’  అరిచినా వినరే  “ఈ కాలపు పిల్లలు…చెప్పటానికి  మీకేం అధికారం ఉంది” అని ప్రశ్నిస్తున్నారు!  మరి ఎవరు…ఎవరు?…చెప్పాలి! కాలమే చెప్పాలి…అవును కాలానికి  మాత్రమే అంత శక్తి ఉంది!

అడపా పద్మ.
                   *
“సమాప్తం*

No comments:

Post a Comment