ఒక మధుర స్మృతి
వేసవికాలం సాయంకాలం నాలుగు గంటలు అయింది. అయినా ఇంకా ఎండ ప్రతాపం తగ్గలేదు. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులు మొదలయ్యాయి. గాలి దుమ్ము వచ్చేలా ఉంది.
“పిల్లలందరూ తోటలోకి వెళ్దాం పదండి… తట్టలు పట్టుకుని రండి. ఉన్న కాయలు రాలిపోతాయి కాబోలు!” అని చలపతిరావు గారు చెప్పగానే, పిల్లలతో సహా తోటలోకి పరిగెత్తారు.
బలంగా వీస్తున్న గాలులకు కొమ్మలు అటు ఇటు ఊగుతున్నాయి. అప్పటికే తోటలో కాయలు కొద్దికొద్దిగా కింద పడిపోయి ఉన్నాయి. పిల్లలందరూ మామిడికాయలు ఏరి తట్టల్లో వేసుకున్నారు. అలా తీసుకొచ్చిన కాయలు ముక్కలుగా మారి, కుండలో మరునాడు మాగాయిగా మారిపోయేవి. అది చిన్ననాటి మామిడి తోట అనుభవం.
ఆ మామిడి తోటకు అప్పటికి సుమారు అరవై సంవత్సరాల వయసు ఉంటుంది. ఎప్పుడో మా తాతగారు అన్నదమ్ములు కలిసి నాటిన మొక్కలు అవి. వాళ్లు బ్రతికున్న రోజుల్లో వాటి ఫలాలు తిన్నారా లేదా తెలియదు గాని, మనవలం మాత్రం ఆ తోటలో కాసిన మధుర ఫలాలు ఆనందంగా తిన్న వాళ్లమే.
ఆ తోట చూసినప్పుడల్లా “రాజుగారు – ముసలివాడు” కథ గుర్తుకొస్తుంది. ఆ తరం వాళ్లకి ఎంత ముందుచూపో! అంత పెద్ద తోటను పెంచడానికి వాళ్లు ఎంత కష్టపడి ఉంటారో అనిపిస్తుంది.
అందుకే ప్రతి వేసవికాలంలో మా నాన్నగారు పెద్దల పేర్లు చెప్పి బ్రాహ్మణులకు పండు పెట్టి నమస్కారం చేసేవారు. అంతవరకు ఆయన పండ్లు ముట్టుకునేవారు కాదు. అది కృతజ్ఞత భావమే.
ఆ తోటలో అన్ని రకాల మామిడికాయలు కాసేవి. ఆ కాలంనాటి రకాల పేర్లు ఈ కాలం పిల్లలకు తెలియవు—పాపయ్యరాజు గోవా, చిన్న రసం, పెద్ద రసం, చెరుకు రసం, బుడతల చెట్టు, కలెక్టర్ కాయలు, నీలం కాయలు, బంగినపల్లి, కొత్తపల్లి కొబ్బరి… ఇలా ఎన్నో. కొన్ని ఊరగాయలకు, మరికొన్ని పండ్లకు పనికొచ్చేవి.
అందంగా ఉన్న మనిషిని చూసి “పండులా ఉన్నాడు” అంటారు. మనుషులు పండ్లు తింటే పండులా అయిపోతారేమో! వేసవికాలానికి మామిడి పండే మహారాజు.
ఉగాది పచ్చడి తయారీలోనే మామిడికాయ వాడకం మొదలవుతుంది. చిన్న పిందెలు జీడి కారుతూనే ఉంటాయి. అయినా ఆ వగరు రుచి ఉగాది పచ్చడికి మరింత రుచిని ఇస్తుంది.
కాయ కొంచెం ముదిరితే మెంతి బద్దలు (పచ్చడి బద్దలు) చేస్తారు. ఆ రుచి తలుచుకుంటే ఇప్పటికీ నోరు ఊరిపోతుంది. ఇంకా కాస్త పెరిగితే—రోజూ మామిడికాయ పప్పు! అందులో వెల్లుల్లి పోపు వేస్తే కంచాలు ఖాళీ అవ్వడం ఖాయం. ఆ కాలం వంటలు వేరు… రుచులు వేరు.
కందిపప్పులో పుల్లగా ఉండే మామిడికాయ ముక్కలు వేసి చేసే పప్పు, పులుసు—అది ముక్కల పులుసు కాదు, మామిడికాయ ముక్కల పులుసే! ముక్కలు ఉడికించి, కొంచెం బెల్లం వేసి, ఇంగువ పోపు పెడితే గిన్నె ఖాళీ అవ్వడం సహజం. అలాగే రోటిలో నూరిన మామిడికాయ పచ్చడి—అబ్బో! మీరు చేసి చూడాల్సిందే.
ఇలా పప్పు, పులుసు, మెంతి బద్దలు అన్నీ అయ్యాక అసలు కథ మొదలవుతుంది—ఆవకాయ.
“బజార్లోకి వెళ్లి మంచి గొల్లప్రోలు మిరపకాయలు తీసుకురండి,” అంటూ అమ్మ నాన్నను సతాయించేది. మామిడికాయలు కొనాల్సిన పని లేదు కానీ మిగతా సరుకుల కోసం నాన్న గారు కష్టపడేవారు. ఏడాదంతా సరిపడేలా ఊరగాయ పెట్టుకోవాలి కదా!
రోళ్లు, రోకళ్ళతో కారం దంచడం ఒక పెద్ద పని. ఆ మండుటెండలో కారం కొట్టే వాళ్ల కష్టం చూస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చేవి.
మర్నాడు ఉదయమే ఆవకాయ కార్యక్రమం. తోటలోకి వెళ్లి కాయలు కోసి, నీటిలో కడిగి, గుడ్డలతో తుడిచి, కత్తిపీట మీద ముక్కలు చేయడం—ఇది పిల్లలందరికీ ఒక పండుగలాంటిది. జీడిని తీసి శుభ్రం చేయడం కూడా మా పని.
మా అమ్మగారు స్నానం చేసి, మడి కట్టుకుని, తూర్పు దిశగా తిరిగి దండం పెట్టి ఆవకాయ పెట్టేవారు. కారం, నూనె కలిపి కుండలో పెట్టి, గుడ్డ కట్టి దేవుడి గదిలో ఉంచేవారు. ఎంత శుచిత్వం, ఎంత నియమం!
మూడో రోజు నుంచే కాదు—మరునాడే కొత్త ఆవకాయ తినడం మొదలవుతుంది. రెండు రోజులు తిన్నాక “వేడి చేసింది” అంటూ ఒక రోజు ఆగి మళ్లీ మొదలుపెడతాం. అంత ప్రేమ ఆవకాయపై!
సాయంకాలం తోటలోకి వెళ్లి రాలిన కాయలను ఉప్పు, కారం నంజుకుని తినడం—అది చెప్పలేని ఆనందం. ఇంటికి వచ్చాక బెల్లం ఆవకాయతో అన్నం, పక్కన ఉల్లిపాయ—అది నిజమైన విందు.
మామిడిపండ్ల కాలం వచ్చిందంటే గదిలో గడ్డి వేసి, కాయలు పేర్చి, గోనె కప్పి ఉంచేవారు. నాలుగో రోజు గదిలో గుప్పుమని వాసన. ప్రతి ఒక్కరికీ వారి ఇష్టమైన రకం—పిల్లలకు బుడతల పండు, అన్నయ్యకు పాపయ్యరాజు, చెల్లికి చెరుకు రసం…
ఇలా మామిడికాయలు, మామిడిపండ్లు, ఊరగాయలతో వేసవి గడిచిపోయేది.
ఇప్పుడు కాలం మారిపోయింది. తుఫానులు, గాలిదుమ్ములు చెట్లను కొట్టేసాయి. కొన్ని మాత్రమే మిగిలి వృద్ధాప్యంతో నిలబడ్డాయి. అయినా అవే మధుర ఫలాలు ఇస్తూ పాత జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ తలపిస్తాయి.
ఈనాడు బజార్లో మందులతో మెరిసే కాయలను చూసి మనసు బాధపడుతుంది. అంత దూరదృష్టితో తోటలు పెంచిన ఆ పెద్దలందరికీ నమస్కారం చేయడం తప్ప ఇంకేమీ చేయలేము
రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
No comments:
Post a Comment