ఇది ఫేస్‌బుక్‌లో నా మొట్టమొదటి తెలుగు పోస్ట్.
“ఏమేవ్! తోటకూరొచ్చింది. కావాల్నా?" వీధరుగుమీద విసనకర్రతో విశ్రాంతి తీసుకుంటున్న ఇంటాయన ఓ అరుపరిచాడు.
“గచ్చకాయలాడుకుందాం వస్తావా?" అడిగింది శ్రీదేవి.
“ఎక్కడా?" అన్నపూర్ణ సందేహం.
“కరణంగారి ఇంటి అరుగుమీద. నేను, విశాల, మరో ముగ్గురు!"
“పాపం! బీదవాడండీ! పెళ్ళికెదిగిన ఇద్దరు చెల్లెళ్ళున్నార్ట! మిషను పెట్టుకుంటానంటున్నాడు మనరుగు మీద!" ఎర్రటి ఎండలో గుమ్మంలో నిలబడ్డ పేద సాయిబుని ఉద్దేశించి భర్తకి చెబుతోంది తాయారు.
అసలు అరుగుల్లేని ఇల్లే వుండేది కాదు.
శుభానికీ, అశుభానికీ;
కబుర్లాడుకోడానికి, కలిసి వేరుశనక్కాయలు ఒలుచుకోడానికి;
దర్జాగా పడక్కుర్చీలో నడుంవాల్చాలన్నా,
దర్జీకి దయజూసి చోటివ్వాలన్నా....అన్నిటికీ అరుగే!
పెళ్లికి మూడ్రోజులు ముందే దిగబడే మేనత్త పిల్లలు, పిన్ని కొడుకులు...అంతా చేరి రాత్రి తెల్లార్లూ పేకాడుకోవాలంటే అరుగే రవీంద్రభారతి.
గాలిపటాలకి కొబ్బరీను పుల్లలు, తోకలు అంటించి ఫినిషింగ్ టచ్చిచ్చే అపర కర్మాగారాలు...అరుగులు.
మతాబాలు, జువ్వలు కుక్కడాలు..
మధ్యానంవేళ పేలు కుక్కుకోడాలు 😜
......అన్నిటికీ అరుగే ఆలంబన!
చింతగింజలు ఒలుచుకోవడం, ఒలిచినవాటితో అష్టాచెమ్మా ఆడుకోవడం....ఇవీ అరుగులమీదే!
మరింతలా మన ముందు తరాలని ఆకట్టుకున్న వీధరుగు ఎందుకిప్పుడు కనుమరుగు?
ఆమధ్య తూర్పుగోదావరి తిరగడానికెళితే ఇదిగో...ఈ అరుగులిల్లు అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళే దారిలో కనబడింది.
అక్కణ్ణించి రాబుద్ధెయ్యలేదంటే నమ్మండి.
టూ బీహెచ్ కే, త్రీ బీహెచ్ కే....
వాకింగ్ ట్రాక్స్, స్విమ్మింగ్ పూల్స్!
బయటికెళితే ఎక్కడ పరిచయాలైపోతాయోనని మనకి మనఁవే గేటొకటి పెట్టేసుకుంటే ఎవరితోనూ మాటాడక్కర్లా!
రావణాసురుడు కొంచెం ప్రయత్నించుంటే లక్ష్మణరేఖని దాటగలిగేసేవాడేమోగానీ... మనం మాత్రం పక్క కమ్యూనిటీకెళ్ళాలంటే చచ్చే చావే!
పేరు, నక్షత్రం, గోత్రం చెబితేగానీ వదలరు పెక్యూలియర్ సెక్యూరిటీ వాళ్ళు!
మరలాంటప్పుడు “రా రమ్మని రారా రమ్మని" పిలుస్తున్న ఇలాంటి అరుగులిల్లు చూస్తే ముచ్చటేస్తుందా వెయ్యదా? చెప్పండి!
..........జగదీశ్ కొచ్చెర్లకోట
No comments:
Post a Comment