Saturday, March 28, 2026

 ఫిల్టర్ కాఫీ అంత చక్కని కథ 
కాఫీ షాప్ 
ఈమధ్యన మా ఇంటి దగ్గర ఒక అరవాయన ఒక కాఫీ షాప్ ప్రారంభించారు. ఆ చిన్న షాప్ ప్రత్యేకత ఏమిటంటే అక్కడ ఉదయం ఐదు నుంచి తొమ్మిది దాకా సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది దాకా  ఘమఘమ లాడే  సువాసన వేసే కాఫీ తప్పితే ఇంకేమీ అమ్మరు ఆయన. తరుచూ వచ్చే కొందరు స్నాక్స్ ఏవైనా పెట్టండి అంటే సాల్ట్ బిస్కట్స్ తెచ్చిపెట్టారాయన.
నేను అప్పుడప్పుడు నడకనుంచి వస్తూ అక్కడ ఆగి కాఫీ తాగేవాడిని. నాపేరు తెలుసుకుని నేను వాళ్ళ వాడినే అనుకున్నారు ఆయన. కారణం నేను వాళ్ళ భాష మాట్లాడడమే. ఇద్దరం అరవకుండా అరవంలో మాట్లాడుకుంటాం.
మా ఇంటి చుట్టుప్రక్కల సివిల్స్ పరీక్షలకు, గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలకు చదువుకునే అబ్బాయిలు , అమ్మాయిలు ఎక్కువ .  అధిక శాతం మంది కష్టపడి చదివేవారే.
అరవాయన ఎదో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసి ఈ కాఫీ కొట్టు మొదలెట్టారు కాలక్షేపానికి. ఆర్ధికంగా బాగా ఉన్నాయనే. అంత పెద్ద ప్రభుత్వ ఉద్యోగం చేసినా మృదుస్వభావి. మొహంలో ఎప్పుడూ చెదరని చిరునవ్వు. అన్నీ పనులు ఆయనే చేసుకుంటారు.తాగిన ఇత్తడి గిన్నె, గ్లాసులు ఒక ట్రే లో పెడితే ఆయన డిష్ వాషర్లో క్లీన్ చేస్తాడు. అన్నిటికీ ఫిల్టర్ చేసిన నీళ్లే వాడతారు.
ఆయన దగ్గర మంచి కాఫీ దొరుకుతుందని అతికొద్ది కాలంలోనే అందరికీ తెలిసిపోయింది ఆయన కాఫీ గురించి. ఉదయం పూట చాలా రద్దీగా ఉండేది ఆయన షాప్ ముందు. ఆయన కాఫీ కోసం కాలనీలో ఉండే వృద్ధ జంటలు ఎక్కువగా ఉదయం , సాయంత్రం రావడం మొదలెట్టారు కాఫీ చాలా బాగుండడంతో.
కాఫీ తయారుచేసే ప్రక్రియలో కాఫీ డికాక్షన్ ను మరిగించకూడదు, అలా మరిగిస్తే కాఫీ సువాసన అవిరైపోయి మాడు వాసన వస్తుంది , కాఫీ రుచి అడుగంటిపోతుంది.
ఆయన ఫిల్టర్ లో వేడి వేడి నీటిలో కాఫీ పొడి వేసి , డికాక్షన్ దిగిన తరువాత మరుగుతున్న పాలల్లో కాఫీ డికాక్షన్ కలపడం వల్ల కాఫీ రుచిగా , కమ్మగా కాఫీ పొడి వాసనతో తగు మోతాదులో వేసిన చక్కెర వల్ల చిరుచేదుతో అద్భుతంగా ఉంటుంది. తాగిన చాలాసేపు కాఫీ సువాసన వస్తూనే ఉంటుంది నోట్లో.
చాలా హోటల్లలో కాఫీ డికాక్షన్లో పంచదార ముందే కలపడం, డెకాక్షన్ మరిగించడం , చాలా ఎక్కువగా పంచదార కలిపి పానకంలా కాఫీ చేయడంతో కాఫీ తాగాలంటే విరక్తి కలుగుతుంది. అలాంటి వారికి ఈయన చేసే కాఫీ అమృతమే.
ఉదయం పూట రష్ పెరిగిన కొద్దీ కుర్రాళ్ల హడావుడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ వచ్చిన వెంటనే కాఫీ కావాలి. కొన్నిసార్లు అమ్మాయిలతో కలిసి వచ్చిన కుర్రాళ్ళ హడావుడి చూస్తే నవ్వొస్తుంది. వెంటవచ్చిన అమ్మాయిల ముందు పోజు కొడుతూ కాఫీ షాప్ ఆయన్ను ఏకవచనంతో సంబోదిస్తూ చీప్ గా ప్రవర్తించడం ప్రారంభించారు. అలా మాట్లాడేవారిలో అత్యధికులు బాగా చదువుకున్న వారే.  నాతో చెప్పుకుని చాలా బాధ పడ్డారు , పాపం అనిపించింది. ఓదార్పు మాటలు తప్పితే నేను చేయగలిగింది లేదు.
అలా పలకరించిన వారికి సాధ్యమైనంత ఆలస్యంగా కాఫీ ఇచ్చేవారాయన. ఆయన చాలాసార్లు అలా అమర్యాదగా మాట్లాడకండి అన్నా వినిపించుకునే వాళ్ళు కరువయ్యారు. కొన్నిసార్లు ఆ కుర్రాళ్లతో వాగ్వాదం చోటుచేసుకునేది. ఆయన కాఫీ ఇవ్వను పోండి అనేవారు.  చేసేదిలేక నోరువాపు తగ్గించుకుని కాఫీ తాగేసి గొణుక్కుంటూ వెళ్లేవారు. అలాంటి కాఫీ ఆ ధరకు ఆ చుట్టుపక్కల ఎక్కడా దొరకదు. ఆయనతో పెట్టుకుంటే ఆ కుర్రాళ్లకే నష్టం. పైగా ఉదయం ఐదు గంటలకు ఆ ప్రాంతంలో ఎక్కడా కాఫీ అన్నది దొరకదు టీ తప్పితే. ఆయన ఎన్నిసార్లు ఎంతమందికి ఎంత సౌమ్యంగా చెప్పినా వాళ్ళ పద్ధతి మార్చుకోక అదే విధంగా తలబిరుసుగా ప్రవర్తిస్తుండడంతో ఆయన విసిగిపోయారు పాపం.
ఇలా అయితే లాభం లేదని కొన్ని సూక్తులు బోర్డుల మీద రాసి పెట్టారు. నాకు అనిపించింది మా చిన్నప్పుడు మోరల్ సైన్స్ క్లాసులు ఉండడంతో బయట ప్రపంచంలో వ్యవహరించిండం వచ్చింది. ఎదిగిన వ్యక్తులకు మోరల్స్ నేర్పించడం ఏమిటో అని నవ్వుకున్నాను. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం అనే విషయం ఒకరు నేర్పించేది కాదు అని నా స్థిరభిప్రాయం. నాకన్నా చిన్నవారైనా నేను ఏకవచనంతో మాట్లాడి ఎరుగను.
ఒకరోజు ఉదయం వెళ్లేసరికి పెద్ద బోర్డులో కాఫీ ధరల పట్టీ తాటికాయంత అక్షరాలతో మూడు భాషల్లో రాసి దూరం నుంచే కనిపించింది.
తెలుగులో మొదటి పంక్తి , తరువాత ఆంగ్లం, ఆ తరువాత ఉర్దూలలో
ఈ క్రింద విధంగా రాసి ఉందా బోర్డులో.
కాఫీ / Coffee.  Rs 25.
కాఫీ ప్లీస్ / Coffee Please. Rs 20.
హలో ఒక కాఫీ ఇవ్వండి ప్లీస్ / Hello , Give me one Coffee Please . Rs 15.
కాఫీ కోసం వచ్చే అందరూ చదుకున్నవారే. ఆయన అంతకుముందు రోజూ కాఫీకి రూ.15 తీసుకునేవారు. ఇప్పుడూ అదే ధర కానీ గౌరవంగా అడగడాన్ని బట్టి ధర నిర్ణయించాడు ఆయన. అంత పెద్ద బోర్డు చదివి అందరూ మూడో వరసలో రాసిన భాష వాడుతూ ఆ  కాఫీనే ఆడగడం మొదలెట్టారు . పొరపాటున ఎవరైనా బోర్డు చూడకుండా ఇంకో రకంగా కాఫీ అడిగితే పెరిగిన ధర ఇవ్వాల్సిందే, లేకపోతే వాళ్ళు ఎంత బ్రతిమాలినా జవాబు ఉండదు, కాఫీ దొరకదు.
అధికంగా వసూలు చేసే ప్రతి రూపాయి బీద విద్యార్థుల ఫీజు కోసం అని బోర్డు మీద రాసిఉంది. ఏ రోజు ఎంత అధికంగా వసులయ్యింది కూడా మర్నాడు ఉదయం బోర్డుమీద రాసి ఉండేది.
ఇప్పుడు రోజూ ఏడెనిమిది వందల కాఫీలు అమ్ముతున్నారాయన. ఖర్చులన్నీ పొగా నెలకు లక్షన్నరకు పైగా లాభం కళ్ళచూస్తున్నారు .
స్టార్ బక్స్, కేఫ్ కాఫీ డే లాంటి చోట్ల అధికధరకు తాగే కాఫీ కన్నా చాలా బాగుంటుంది కాఫీ మా అరవాయన కోట్లో.
అన్నట్టు అచ్చ తెలుగులో నిశివర్ణోష్టోదకం అనగా Coffee 🤣🤪😛
సుబ్రహ్మణ్యం వల్లూరి.

No comments:

Post a Comment