Sunday, March 29, 2026

 అంతా దైవ ప్రసాదమే!

అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోవడానికి కారణం మన ఆలోచనా విధానంలో లోపం కాదు. అటు ఇటుగా కొన్ని మార్పులతో తలపెట్టిన పనులు జరుగుతుంటాయి. ప్రకృతి నూటికి నూరుపాళ్లు వ్యక్తిగత మేధస్సుకు దారి ఇవ్వదు. సమూహ ప్రయోజనం కోసం ఆలోచిస్తుంది. మనిషి తన అహంతో ఇలాగే జరగాలని ఆశిస్తాడు. అలా జరగనప్పుడు, ఎందుకిలా జరిగిందని ఆలోచిస్తాడు. ఏది ఏమైనా ప్రసాదభావంతో స్వీకరించినప్పుడు నిరాశ, నిస్పృహ ఉండవు.

దైవానికి ఇష్టమైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఆయన లక్షణాలు తెలుసుకో వాలి. ఆయన పోకడలు పసిగట్టాలి. దైవానికి నిత్యం దగ్గరగా ఉన్నవాళ్లకి ఆయన ఆదేశాలు అర్థం అవుతాయి. తల్లిదండ్రులను కనిపెట్టుకుని ఉండే పిల్లలే వారి బాధలను అర్థం చేసుకోగలరు. అలాగే, విశ్వానికి తల్లీ తండ్రీ అయిన ఆ అంతర్యామి గురించి మనకి అవగాహన ఉండాలి. ఆ అవగాహన కోసమే వేదాలు, ఉపనిషత్తులు, ముందు యుగాల చరిత్ర ఉన్నాయి. పుణ్యపురుషులు ఉన్నారు. అవతారాలున్నాయి. లోకాన్ని నడిపిస్తున్న యోగులు, జ్ఞానులు ఉన్నారు. ముఖ్యంగా మనల్ని సత్యమార్గంలో నడిపించే హృదయం ఉంది. దాని మాట వినాలి. తప్పుదారి పట్టించే మనసును ప్రయత్నపూర్వకంగా పక్కకు తప్పించాలి. పూర్తి ప్రణాళికతో ఏ పనినైనా ముందుకు నడిపించాలి. ఫలితాలు ఎలా వచ్చినా స్వీకరించడానికి సిద్ధపడాలి. హనుమంతుడు సీతాన్వేషణకు బయల్దేరిన ప్పుడు ఎన్నో రకాలుగా సాయం లభించింది. కానీ భారతయుద్ధంలో కర్ణుడికి అన్నిచోట్లా పరిస్థితులు ఎదురుతిరిగాయి. అయినా వాళ్లు ముందుకే వెళ్లారు, అదే ధర్మం.
ఎక్కడా ఆగకూడదు. అలసిపోకూడదు. ఆందోళన చెందకూడదు. భగవంతుడి చేయి వదలకూడదు. పూర్తి శక్తియుక్తులతో పని చెయ్యాలి. అప్పుడే జన్మ సార్థకమవుతుంది. అనుకున్న దానికి భిన్నంగా అయితే మరోవిధంగా జరిగినా వెయ్యి ఫలాలు లభించవచ్చు. ఇది చరిత్రలో జరిగింది. దైవానుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్నవి జరుగుతాయి. మనిషి అనుగ్రహంతో అలా జరగడం అన్నివేళలా సాధ్యం కాదు. వసంతం కోసం కోయిల ఎదురుచూడాలి. తానే వసంతాన్ని సృష్టించి చెట్టు మీద కూర్చుని కూయాలని అనుకోకూడదు. ఉదయం సూర్యుడు వచ్చేవరకు ఎదురు చూడాలి. ఎన్ని దీపాలు తెచ్చి వెలిగించినా భానుడి తేజం సృష్టించగలమా? మనం ఎన్ని అనుకున్నా మన ఆలోచనలకు ఒక హద్దుంటుంది. గొప్పగా ఊహించడం కూడా సరిగ్గా చెయ్యలేం. అంతా నేననుకున్నట్లుగా జరగాలని దేవుణ్ని ప్రార్థించిన ప్పుడు బహుశా ఆయన నవ్వుకుంటాడు. ఎవరికి ఎప్పుడు, ఎలా ఏది, ఎక్కడ ఇవ్వాలో, ఎందుకు ఇవ్వకూడదో తెలిసింది ఆ భగవంతుడు ఒక్కడికే.

అందుకే... అనుకోవాలి. గట్టిగా అనుకోవాలి. దైవం ఏం అనుకుంటున్నాడో నీకు తెలిసేంతవరకు అనుకోవాలి. ఆ తరవాత ఎదురు చూడాలి. శరణాగతితో ముందుకు వెళ్తే మనం అనుకున్నది ఎంత పెద్దదైనా దేవుడు చేసి పెడతాడు. ఇది సత్యం.

ఆనందసాయి స్వామి

No comments:

Post a Comment