Saturday, March 28, 2026

 'శకార వచనాలు' అంటే ఏమిటి?
మృచ్ఛకటిక నాటకంలో ఒక పాత్ర శకారుడు. రాజస్యాలకుడు అతడు. (రాజుగారి బావమరది.)

మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేవాణ్ణి శకారుడులా ఉన్నాడు అంటారు.

పదవిని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలు చేసేవాడుగా శకారుడు ఈ నాటకంలో కనిపిస్తాడు. పనికిమాలిన వాడు అధికారంలో ఉంటే ఇలాంటి వాళ్ల ఆటలు సాగుతాయి.

శూద్రకుడి రచన మృచ్ఛకటికం. ఆయన రాజకవి. ఇందులో నిరపరాధియైన చారుదత్తుడిమీద హత్యానేరారోపణ జరుగుతుంది.

శకారుడు వసంత సేన తనను ఇష్టపడలేదని ఆమెను అపరాత్రివేళ గొంతు నులిమి చెత్తగుంటలో తోసేసి వెళ్లిపోతాడు. ఆ నింద చారుదత్తుడి మీద ఆరోపిస్తాడు.

ఇతడి చదువుతక్కువ మాటలు, వెకిలిచేష్టలు నవ్వుపుట్టిస్తాయి. రామాయణ భారతకథలు కలగాపులగం చేస్తూ తన తెలివికి తానే ఉబ్బిపోతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ల పరివారమూ ఇతడికి తోడుబోయినవాళ్ళే ఉంటారు ఎప్పుడూ.

వీటి వెనక ఉన్న క్రౌర్యం ఇతడిమీద అసహ్యం కలిగిస్తుంది.

ఇతడు తరుముకొని రావడం చూచి తప్పించుకుపోయే వసంతసేన వెంటబడే ఇతడి మాటలు:—

ఏల పోయెదు? పారిపోయెదవు తొట్రుపాటుతో — దయయుంచు. చంపము లతాంగి!

బొగ్గు నిప్పులలో బడ్డ పొలుసు వలెనె

కాల్చుచున్నాడు నామది కంజశరుడు.

నన్ను వదలి వెళ్ళిపోతున్నావే. నన్ను మన్మథబాణాల పాలు చేసి —

* దశకంథరునకు లోబడిన కుంతి పగిది* ఎటకేగెదే తొట్రుపడుచు పడుచు ?

గల్లురని నగలు మ్రోయగ వెళ్లెదేల?

రామునకు జంకి పరువెత్తు ద్రౌపది వలె .

హనుమ విశ్వావసుని చెల్లెలగు సుభద్ర

పగిది నిను బల్మి హరియించువాడ చూవె. (1వ అంకం)

వసంతసేనతో ఇతడి సరసవచనాలు :—

స్థూలలోచన! దశనఖా! శుద్ధదంతి!

చరణముల మీద బడుదు నంజలి ఘటింతు (8వ అంకంలో)

నాయికా వర్ణన— విశాలాక్షీ అనడానికి ' స్థూలలోచన'

పదిగోళ్ళు కలదానా! తెల్లటి పళ్ళు ఉన్నదానా ! — ఇది అతగాడి చదువు.

( తిరుపతి వేంకట కవుల అనువాదం నుండి)

No comments:

Post a Comment