*రాజు - పేద - 3*
*(ప్రిన్స్ & పాపర్)*
👑
రచన : అమెరికన్ మహా రచయిత
మార్క్ ట్వెయిన్
అనువాదం : శ్రీ నండూరి రామమోహనరావు
కొన్ని గంటలసేపు జనం యువరాజుని హింసించి, బాధించి, వేధించి వినోదించారు. ఇక విసుగుపుట్టి అతని మానాన అతన్ని వదిలేసి పోయారు. ఓపిక వున్నంతవరకూ యువరాజు జనాన్ని రాజఠీవితో బెదిరించాడు. రాజ ఠీవితో ఆజ్ఞాపించాడు. తిట్టాడు, తన్నాడు. అంతవరకూ జనానికి సరదాగానే వుంది. కాని కొంతసేపటికి యువరాజు అలసిపోయాడు. ఇక ఏం చేయడానికి ఓపిక లేకపోయింది. కనుక అతనితో అవసరం తీరి పోయి జనులు ఎవరిదారిన వారువెళ్ళిపోయారు.
హోరుగాలి సాగింది. తల దాచుకొనడానికైనా దిక్కులేని వేల్సు యువరాజు దారిద్యం, మాలిన్యం గడ్డకట్టిన సందులగుండా తిరుగాడు తున్నాడు. ఇంతలో ఓ తాగుమోతు అతని మెడ పట్టుకున్నాడు.
"ఇంత రాత్రిదాకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావురా? ఏమన్నా డబ్బులు సంపాదిం చావా లేదా? చెప్పు, ఇవాళ నీ బొమికలన్నీ విరిచి పొయ్యిలో పెట్టకపోతే నా పేరు జాన్ కాంటీ కాదు."
యువరాజు పట్టు విడిపించుకుని అప్రయత్నంగా బుజాలు దులుపుకున్నాడు. పవిత్రమైన తన శరీరం మరినమైందనే చింతతో..
"నువ్వు అతని తండ్రివా? అయితే బతికిపోయా నన్నమాటే. నన్ను అక్కడికి తీసుకుపోయి, అతన్నిక్కడకు తీసుకురా" అని ఆదుర్దాగా అన్నాడు.
"అతని తండ్రినా? అతనెవరో నాకు తెలియదు. నేను నీ అబ్బనని మాత్రం తెలుసు. నీకా సంగతి ఇంకా తెలియకపోతే రెండు నిమిషాల్లో తెలుస్తుంది ఇంటికి పద.”
"ఇదుగో, ఇది వేళాకోళానికి సమయం కాదు. ఆలస్యం చెయ్యకు. నేనిప్పటికే చాలా బాధ అనుభవించాను. చాలా గాయాలు తగిలాయి. నా తండ్రిగారైన మహారాజు దగ్గరికి తీసుకుపో. ఆయన నిన్ను ఐశ్వర్యాలలో ముంచెత్తుతాడు. నా మాట నమ్ము. నేనబద్ధమాడడం లేదు. ఇది ముమ్మాటికీ నిజం. నీ చెయ్యి చాచు. నన్ను ఈ కష్టదశ నుంచి రక్షించు. నేను వేల్సు యువరాజుని”
జాన్ కాంటీ మంచులో ఇరుక్కుపోయినవాడిలా ఆశ్చర్యంతో కొరడుకట్టి నుంచుండిపోయాడు. ఎడ్వర్డు కేసి కొంతసేపు తేరి చూశాడు. తల అటూ ఇటూ ఊగించి ఇలా గొణిగాడు:
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
“పిచ్చెక్కింది ఈ వెధవకి” మళ్ళీ మెడ పట్టుకుని బూతుల వాన కురిపించాడు. “నీకు పిచ్చెక్కితే ఎవడిక్కావాలి. పిచ్చెక్కకపోతే ఎవడిక్కావాలి: నీ బొమికల్లో ఏది గట్టిదో, ఏది మెత్తదో ఇవ్వాళ పరీక్ష చెయ్యాలి. పద మీ బామ్మ దగ్గరికి, అది కూడా పరీక్షచేస్తుంది" అంటూ ఆ తాగుబోతు తప్పించు కోవాలని పెనుగులాడుతున్న యువరాజుని బరబర లాక్కుపోయాడు. వెనక తాచుపాము ల్లాగ విషపు నవ్వులు కక్కుతూ బిచ్చగాళ్ళ గుంపు అనుసరించింది.
📖
యువరాజు మందిరంలో టామ్ కాంటీ ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ అవకాశాన్ని అతడు బాగా ఉపయోగించుకున్నాడు. నిలువుటద్దం ముందు నుంచుని మెడ ఇటు తిప్పి, అటు తిప్పి చూసుకున్నాడు. తన అందమైన దుస్తుల్ని పదే పదే చూసి మురిసిపోయాడు. యువరాజు మోస్తరుగా రాజ ఠీవితో అటూ ఇటూ పచార్లు చేసి ఫలితాలెలా వున్నాయో అద్దంలో పరిశీలించాడు.
ఒక అరగంట అలా గడిచేసరికి టామ్ కి హఠాత్తు గా జ్ఞాపకం వచ్చింది. యువరాజు అవతలకు వెళ్ళి చాలాసేపైందని. ఇంతసేపూ బాగానే వున్న ఆ ఒంటరితనం ఈ జ్ఞాపకంతో బరువెక్కింది. యువరాజు త్వరగా వస్తే బాగుండుననిపించింది. ఏం చెయ్యడానికీ పాలు పోలేదు. ఇప్పుడెవరన్నా వచ్చి తనని యువరాజు దుస్తుల్లో చూసి పట్టుకుంటే ఇందులో తన తప్పేమీ లేదని చెప్పేందుకు యువరాజు కూడా దగ్గర్లో లేడు. రాజ భటులు పట్టుకుంటే ముందు ఉరి తీసేస్తారు. తరువాత తన విషయాన్ని సావధానంగా విచారణ చేస్తారు. వాళ్ళ పద్ధతి అంతే. ఇలాంటి చిన్న నేరాలు జరిగినప్పుడు అధికారులు ఖచ్చితంగా ప్రవర్తిస్తారని అతనికి తెలుసు.
గదిలో కాసేపు పచార్లు చేశాడు. అర్థం కాని భయాలు వేటకుక్కల మల్లే అతన్ని ముట్టడించాయి. చీమ చిటుక్కుమంటే ప్రాణాలెగిరిపోతున్నాయి. ఇంతలో తలుపు తెరుచుకుంది. సిల్క్ దుస్తుల్లో వున్న నౌకరు యువకుడు వచ్చి సెల్యూట్ చేసి,
"జేన్ గ్రే దొరసానమ్మగారు!" అని ప్రకటించాడు. షోకైన బట్టలు ధరించి, నాజూగ్గా వున్న ఓ రామ్ములక్కాయలాంటి పిల్ల గదిలో ప్రవేశించింది. ఆమె విసవిస నడుస్తూ టామ్ ని సమీపించి, ఆగిపోయింది. విచార కంఠంతో ఆడిగింది.
"ఏమిటిది ప్రభూ! వంట్లో కులాసాగా లేదా?”
టామ్ గుండెలు దిగజారిపోయాయి. భయం వల్ల, కంగారువల్ల కాసేపటిదాకా నోట మాట రాలేదు. ఎలాగో కష్టపడి ఈ మాటలు నత్తాడు: "నన్ను రక్షించండి అమ్మా! నేను ప్రభువును కాను. అఫల్ కోర్టులో బిచ్చమెత్తుకునే టామ్ కాంటివి. యువ రాజు ని కలుసుకోనివ్వండి. ఆయన నా పేలికలు నాకిచ్చేసి పంపిస్తారు. కనికరించండి అమ్మగారూ! కాపాడండి ఈ దిక్కుమాలినవాణ్ని."
టామ్ మోకాళ్ళమీదపడి చేతులు పిసుక్కుంటూ దీనంగా ఆ బాలికను ప్రార్థించాడు. ఆమె నెత్తిమీద పిడుగుపడిన దానివలె గుడ్లప్పగించి చూస్తోంది. చివరికన్నది: "ప్రభూ! ఏమిటిది? మీరు నాకు నమస్కరిస్తున్నారు? ఏమిటా మాటలు? లేవండి."
ఇలా అంటూనే ఆమె ముచ్చెమటలు కారుతుండ గా పారిపోయింది అవతలకి. టామ్ కి భయం పూర్తిగా తగ్గిపోయి, దాని స్థానంలో నిరాశ ఏర్పడింది. నేలమీద కూలబడ్డాడు.
"ఉరిశిక్ష తప్పదు. నన్నెవరూ రక్షించరు. ఇక వాళ్ళొస్తారు. టామ్ రేపటి సూర్యోదయాన్ని చూడడు" అని గొణుక్కుంటున్నాడు తనలో తాను.
ఈలోగా కోట అంతటా భూకంప తరంగాల మాదిరిగా వ్యాపిస్తోందొక భయంకర వార్త. ఈ రహస్య వార్త (ఇలాంటి వాటినెవరూ గట్టిగా ఉచ్చరించరు) నౌకరు నుంచి నౌకరుకు, ప్రభువు నుంచి ప్రభువుకి, మందిరం నుంచి మందిరానికి, అంతస్తు నుంచి అంతస్తుకి చావు కబురులా పాకిపోయింది. ఏనోట చూసినా ఇదే మాట. "అబ్బాయి గారికి పిచ్చెక్కింది! యువరాజుగారికి పిచ్చెక్కింది!"
పాపం టామ్ నీరసంగా నడిచి వస్తున్నాడు. అతడు సమీపిస్తుండడం చూసి అందరూ వంగి మర్యాద ప్రకటించారు. టామ్ కూడా అదే విధంగా వంగుతూ, తన అద్భుత పరిసరాలను బెరుకు బెరుకుగా చూసి తెల్లపోతూ వస్తున్నాడు. గొప్ప గొప్ప సామంతులు అతని కిరుప్రక్కలా నడుస్తూ, దాదాపు మోసుకెడుతున్నంత పని చేస్తున్నారు. వెనక రాజ వైద్యులు, సేవకులు వస్తున్నారు.
టామ్ ఒక విశాలమైన మందిరంలోకి వచ్చాడు. కూడా వచ్చినవాళ్ళు చేతులు కట్టుకు చుట్టూ నిలబడ్డారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఎదురుగా కొంత దూరాన ఒక మంచం వుంది. దాని మీద ఒకాయన పడుకుని వున్నాడు. చాలా పెద్ద విగ్రహం. లావుగా వున్నాడు. బుంగ మొహం, గంభీరమైన చూపులు, తల బాగా నెరిసింది. గడ్డం కూడా వెరిసింది. ఖరీదైన బట్టలేకాని, కొంచెం పాతవి లాగా, పొప్పర్లు లేచినట్లుగా కనిపిస్తున్నాయి. కాళ్ళు రెండూ ఉబ్బి వున్నాయి. ఒక దాని కింద మెత్తటి దిండు వుంది. నిశ్శబ్దమైన మందిరంలో ఈ ఒక్క మనిషి తలకాయ తప్ప అందరి తలలూ వినయంతో వంచబడి వున్నాయి. ఆయనెవరో కాదు, ఎవరి పేరు చెబితే ఆబాల గోపాలం భయంతో కంపించిపోతారో ఆ ఎనిమిదవ హెన్రీయే. ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. మొహంలో తీవ్రత తగ్గి మెత్తదనం కనబడింది.
'ఏమిటిది ఎడ్వర్డు ప్రభూ! యువరాజా! ఈ ముసలితనంలో నీ పిచ్చి తండ్రితో వేళాకోళం ఆడుతున్నావా? మహారాజునైన నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలియదా?"
టామ్ మనస్సు ఈ లోకంలో వుంటేగా ఈ మాటలు వినడానికి. "మహారాజునైన నేను" అనే మాటలు మాత్రం విన్నాడు. వినీ వినగానే తుపాకి దెబ్బ తిన్న పక్షివలె ఠకీమని మోకాళ్ళ మీద పడ్డాడు. చేతులెత్తి ఇలా గన్నాడు:
"తమరు మహారాజులా? ఇక నా ప్రాణాలు దక్కవు."
ఈ మాటలు రాజుగారిమీద కూడా తుపాకి దెబ్బలా పనిచేశాయి. అందరివంక చూసి తల పంకించాడు; మళ్ళీ టామ్ కేసి చూశాడు. నిరాశా సూచకమైన స్వరంతో ఇలా అన్నాడు-
"వట్టి పుకారేమో నని ఆశపడ్డాను. ఇది పుకారు కాదన్నమాట" ఒక పెద్ద నిట్టూర్పు విడిచి మృదు స్వరంతో పిలిచాడు, “రా నాయనా! నీ తండ్రి వద్దకు రా. నీకు ఆరోగ్యం చెడింది." టామ్ ని లేవదీశారు. వణుకుతూ వినయంగా, భయంగా సమీపించాడు ఇంగ్లండు రాజును. భయం ముప్పిరిగొన్న ఆ చిన్న ముఖాన్ని ఆయన తన రెండు చేతుల మధ్య తీసుకొని ప్రేమతో కళ్ళలోకి చూశాడు. పాడైపోయిన మనస్సు బాగుపడుతు న్న సూచనలేమైనా కనిపిస్తాయేమోనని చాలా సేపు అలాగే చూశాడు. టామ్ తలని తన రొమ్ముపై ఆనించి ఉంగరాల జుట్టను నిమిరాడు.
🙍🏽♂️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment