*ప్రాణదీపం*
*సూర్యాస్తమయం అయింది. వెలుగు రేఖలు అంతరించాయి. చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. ఒక సాధువు ఆ చీకట్లో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆయన చేతిలో దీపం ఒకటుంది. అది గాలికి అప్పుడప్పుడూ అటు ఇటు కదలుతోంది.
*ఆ దారినపోతున్న యువకుడు సాధువును ఇలా ప్రశ్నించాడు- ‘స్వామీ! మీరు పట్టుకున్న దీపంలో వెలుగు ఎక్కడి నుంచి వస్తున్నదో చెప్పండి’. సాధువు సమాధానం చెప్పకుండా నిర్వికారంగా తన దారిన తాను పోతున్నాడు. యువకుడు మళ్ళీ అదే ప్రశ్న వేశాడు.
*ఇంతలో గాలి విసురుగా వచ్చింది. సాధువు చేతిలోని దీపం టపటప కొట్టుకొని పుటుక్కున ఆరిపోయింది. సాధువు ‘నాయనా! ఈ దీపం వెలుగు ఇప్పుడు ఎక్కడకు వెళ్లిందో చెప్పగలవా? అది నువ్వు చెప్పగలిగితే వెలుగు ఎక్కడ నుంచి ఎలా వచ్చిందో చెప్పగలుగుతా’ అని సమాధానమిచ్చాడు.
*దోసపాదు పెద్ద ఆకులతో పూలతో పిందెలతో ఎదుగుతుంది. ఒక పిందె అనతికాలంలోనే కాయగా మారుతుంది. మరికొంత కాలంలోనే ‘దోసపండు’ సిద్ధమవుతుంది. దోసపండును ఎవరూ తుంచనక్కరలేదు. చెట్టు నుంచి అదే ఊడిపోతుంది. ఈ క్రమం అంతా అత్యంత సహజంగా జరుగుతుంది. మానవుడికి మరణం అలా సిద్ధించాలని ఆధ్యాత్మికవేత్తలు భావిస్తారు. కాలం ప్రాణులను పక్వం చేస్తూ ఉంటుంది. కాలమే ప్రజలను సంహరిస్తూ ఉంటుంది. అందరూ నిద్రపోయేటప్పుడు సైతం కాలం మేలుకొనే ఉంటుంది. కాలమహిమను ఎవరూ అతిక్రమించలేరు.
*తెలుగులో ‘కాలం చేయడం’ ఒక జాతీయం. అర్థం ‘మరణించడం’. కాలాన్ని ఎవరూ దాటిపోలేరు. కాబట్టి మరణాన్నీ ఎవరూ తప్పించుకోలేరు. జీవన పోరాటంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ పడిపోతారో ఆ దేవుడికే తెలియాలి. ఆరాటమేతప్ప పోరాటం, ప్రయత్నం అసలు చేయని బలహీనులు; ఎంతో కాలం పోరాటం చేసి అలసిసొలసిన బలవంతులు... అందరూ కాలం చేయవలసిందే! చివరి క్షణాల్లోనైనా భగవంతుడు గుర్తుకు వస్తే అదృష్టవంతులే! ‘బలం కొంచెం కూడా లేదు, అవయవాలు పనిచేయడం లేదు,ప్రాణాలు ఉంటాయా ఊడతాయా అన్నట్లుంది. శరీరం పూర్తిగా అలసిపోయింది, ఇప్పుడు నా మనసునిండా దేవుడొక్కడే నిండి ఉన్నాడు. ఈ దీనుడిపై దయ చూపాలి! రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!’ అని గజేంద్రుడిలా ఆ జగద్రక్షకుని ప్రార్థించి మోక్షం పొందవచ్చు. ఆ జగద్రక్షకుడు ఎవరో, ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో ఊహకు అందవు. అయినా ఫరవాలేదు. ‘సర్వేశ్వరుడు భక్త రక్షకుడు.
*ఆపదుద్ధారకుడు, ఏం జరిగినా ఆయనే దిక్కు నాకు’ అనే భావన కలిగితే చాలు, వాళ్ళు అదృష్టవంతులే! ఇక మరణ భయం ఉండదు! హరి నామస్మరణ తప్పక ముక్తినిస్తుంది. పూర్వం ఖట్వాంగుడు అనే రాజు దేవతలను ‘నా ఆయువు ఎంత?’ అని అడిగాడు. ‘నీ ఆయుష్షు ఇంకా ఒక్క ముహూర్తకాలం మాత్రమే’ అన్నారు దేవతలు. వెంటనే రాజు తన సంపదను దానం చేసి, వైరాగ్యంతో శ్రీహరిని మనసులో నిలుపుకొని ముక్తిని పొందాడు.
*ప్రాణం ఒక దీపం. అది ఎప్పటికైనా ఆరిపోక తప్పదు. ఈ సంగతి మనసులో స్థిరంగా ఉంటే- లోకంలో ఇన్ని దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఉండవు. ఈ ఆరిన దీపం పోయి పరమేశ్వరుడి పాదాల దగ్గర వెలుగునిస్తుంది. తెలుగు భాగవతం పన్నెండో స్కంధంలో శుకయోగితో చెప్పించిన మాటలు- సర్వమానవాళికి సర్వకాలాలకు పనికివచ్చే రతనాల మూటలు...
*‘ఓ రాజా! మరణిస్తానేమో అనే భయాన్ని మనసులో నుంచి వదిలిపెట్టు! పుట్టుకగల మానవజాతికి చావూ తప్పదు.
కాబట్టి హరిని నిత్యమూ స్మరిస్తూ ఉండు. ఇక మళ్ళీ భూమిపై జన్మ అంటూ నీకు ఉండదు! వైకుంఠంలో సుఖంగా ఉంటావు!’
…సేకరణ
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏
*రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయతను కూడా నేర్పుదాం.
No comments:
Post a Comment