Sunday, April 23, 2023

****కర్మ సిద్ధాంతం - 20 (విదురుని ధర్మసూక్ష్మాలు)

 కర్మ సిద్ధాంతం - 20 (విదురుని ధర్మసూక్ష్మాలు)
ఇంతకుముందు యమస్మృతిలో యమధర్మరాజు చెప్పింది తెలుసుకున్నాము. అదే యముడు శాపకారణంగా విదురునిగా జన్మించాడు. ఆయన మనకు విదురనీతి అనే గొప్ప ధర్మ శాస్త్రాన్ని అందించారు. అందులో చాలా గొప్ప ధర్మాలు ఉన్నాయి.
విదురుడు అందులో ఇలా అన్నాడు. "వాక్కు నిజమైన ఆభరణం వంటిది. నిత్యం ఉద్వేగం కలిగించకుండా సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడటం ముఖ్యం. వాక్పారుష్యము (కఠినమైన వాక్కులు) మహాదారుణమైన విషము కంటే, అగ్ని కంటే ప్రమాదమైనది. ఆ వాక్ సంయమనం లేకనే దుర్యోధనుడు సభలో మహర్షులను అవమానించి శాపం పొందాడు. శరీరంలో నాటిన తీవ్ర శరాలను పెరికి పారవెయ్యవచ్చును. కాని, పరుషభాషణలు మాత్రం గుండెలో నుండి పైకి తియ్యలేము. అందుచేతనే విద్వాంసులు కటువుగా భాషించరు. దేవతలు ఎవరికి పరాజయం కోరుతారో వారి బుధ్ధిని ముందుగా హరిస్తారు. అంతటితో వాడు దుష్కర్మ రతుడవుతాడు. వినాశకాలం సమీపించినప్పుడే బుధ్ధి నశిస్తుంది. అన్యాయం ప్రవేశిస్తుంది.
మానవుడు తన్ను ఇతరులు తిడుతున్నా సరే తిరిగి శపించరాదు. దానిని సహించినచో తిట్టువానిని వానికోపమే కాల్చివేస్తుంది. తిట్టువాని పుణ్యము సహించినవానిని చేరుతుంది. ఇతరులను నిందింపరాదు. అవమానింపరాదు. మిత్రులకు ద్రోహము చేయరాదు. తనను తాను గొప్పవాడని భావించుకొనరాదు. నీచమైన నడవడి పనికిరాదు. క్రోధముతో కూడిన పరుషపు మాటను పలుకరాదు."
ఎవరి మీదనైన మనం కోపం పెట్టుకుని, రగిలిపోయినా కూడా అతని పాపకర్మ మనకు చుట్టుకుంటుంది. ఇక లేనిపోని మాటలతో దూషిస్తే, వాని ఘోరమైన పాపాలు మనకు సంక్రమిస్తాయి. శాస్త్రం తెలియక చాలామంది మేము మంచి పనులే చేస్తున్నామంటూ; పూజలు, వ్రతాలు చేస్తూ ఇతరులను ధూషిస్తారు, నిందారోపణలు చేస్తారు. తద్వారా వారు చేసిన పుణ్యకర్మలు దూషించబడినవారికి బదిలీ అవుతాయి. వాళ్ళ పాపకర్మ వీళ్ళను చేరుతుంది. కనుక మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి. ఇంకా ఉంది..

No comments:

Post a Comment