రామాయణానుభవం.....358
సీతాదేవి శ్రీ రాముని ముఖాన్ని పరిశీలించింది. అవే కళ్లు, అవేకురులు, అదే ముఖము.
హనుమ సీతాదేవితో, తాను వెళ్లిన వెంటనే సుగ్రీవ, వానరసేనా సమేతంగా శ్రీ రామ లక్ష్మణులను తప్పక తీసిక వస్తానని చెప్పాడు. కనుక "రామలక్ష్మణులు, వానరసేన సముద్ర తీరానికి చేరుకొని ఉంటారు. అలసి పోయిన రామలక్ష్మణులు నిద్రపోతు ఉంటారు. అదే అదనుగా భావించి ప్రహస్తుడు రాముని శిరస్సును ఖండించి ఉంటాడు". ఈ విధంగా సాగుతున్నాయి. ఆమె ఆలోచనా పరంపరలు. అన్నిటికంటే ముఖ్యంగా తాను హనుమతో పంపిన చూడామణి శ్రీరాముని కేశములను అలంకరించి ఉంది. ఇంతకంటే ప్రబలసాక్ష్యము ఇంకేమి కావాలి?
ఆమెభర్త ముఖాన్ని చూస్తూ "నాధా! సకల సద్గుణశాలివైన నీవు అర్ధాయుష్కుడవు అగుట నా పాపరాశి ఫలమే. ఒక్క మాయా లేడి కొరకు నిన్ను పోగొట్టుకొన్నాను. ఇన్ని రోజులు నీకు దూరమై భరింపరాని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను.
నాపై దయవలన నీవు దూతగా పంపిన హనుమ రాక వలన నాకు కొంత దుఃఖము తగ్గింది. కాని నా గురించి తెలిసి నన్ను రక్షించడానికి వచ్చిన నిన్ను మృత్యు దేవత మ్రింగి వేసింది.
ఇంతకంటే మించిన పాపము ఇంకేమి ఉంటుంది ? నా పాపము నిన్ను కలళించడమేకాదు. నిన్నుగన్న లోకమాత కౌసల్యాదేవి కడుపులో చిచ్చుపెట్టింది. ఇక ఆ తల్లి ఒకే పుత్రుడవు, దైవ ప్రసాదమైన నిన్ను పోగొట్టుకొని ఎక్కువ కాలము జీవింపజాలదు.
నేనెంతటి పాపాత్మురాలిని? ఎంతటి నష్టజాతకురాలిని ?
అయినా రామభద్రా! వివాహానికి పూర్వము జ్యోతిష్కులు నా జాతకాన్ని చూచి "నాభర్త దీర్ఘాయువుతో వేల సంవత్సరాలు రాజ్యమేలుతాడని నేను నాభర్తతో కలిసి మహారాణినవుతానని, నేను పుత్రసంతానవతినవుతానని చెప్పారే" ? వారంత తెలియని వారా? వారి మాటలు నీటిమూలేనా?
ప్రాణవల్లభా! నేను నీ పాలిటి కాళరాత్రిని ప్రభూ! నీవు ఏకపత్నీవ్రతుడవే! నన్ను వదలి భూదేవిని కౌగిలించుకొనుట నీకు తగునా ? ప్రాణముల కంటె ప్రియుడైన మీ తండ్రిని కలువడానికి పితృలోకానికి వెళ్లావా ?
పుణ్యశీలనగు నీ వంశానికి ధృవతారవై ఆకాశంలో వెలుగుతున్నావా?
జీవితేశ్వరా ! నావివాహ కాలములో ధర్మార్ధకామములను జీవితాంతము కలిసే అనుభవిస్తానని మాటిచ్చావే ? మధ్యలోనే నన్ను ఈ విధంగా వదిలి వెళ్లడం న్యాయమేనా?
మహాపరాక్రమశాలీ! ఇది నిజమా?నాపై ప్రేమతో మూడు గడియలలోపు పదునాలు వేల సేనతో కూడిన భయంకర పరాక్రములైన ఖరదూషణాదులను ఒంటరిగా సంహరించగలిగిన మహావీరుడవు. నీవు అల్బుడైన ప్రహస్తుని చేతిలో ప్రాణాలను కోల్పోవడమా ? ఇది సంభవమా?
నా వలన తమ వంశము విస్తరించునని అనుకొని మా మామగారు నన్ను తమ ఇంటి కోడలుగా చేసికొన్నారు. కాని ఆ అమాయకులు "తన కొడుకుకే నేను మృత్యువునవుతానని, పూలదండ రూపంలో కనబడిన మహాసర్పాన్ని" అని కలలో కూడ అనుకోలేదు". అని రాముని శిరస్సును చూస్తూ సీతాదేవి అమితంగా దుఃఖించింది.
వెంటనే రావణునివైపు చూచి "రాక్షస రాజా ! నేను రాముని శరీరంలో సగభాగాన్ని. శరీరములో సగము మాత్రమే కాలడం లోక విరుద్ధము కదా ! అందువలన నా నాధుని శిరస్సుతో పాటు నాశరీరానికి కూడ నిప్పు అంటించుమని" దుఃఖాతిరేకముతో మూర్ఛ
పోయింది.
అంతలో ద్వారపాలకుడు రావణుని సమీపించి "మహారాజా! మిమ్మల్ని చూడడానికి ప్రహస్తుడు మొదలైన మంత్రులందరు సభాభవనంలో ఎదురు చూస్తున్నారు. మీకు జయము జయము అని తెలిపాడు.
ఇక అశోకవనంలో చేయవలసిన పని ఏమిలేకపోవడం వలన రావణుడు మంత్రులతో యుద్ధాలోచన చేయడానికి సభాభవనానికి వెళ్లి పోయాడు. ఆయన అక్కడి నుండి వెళ్లిపోగానే ఆశ్చర్యంగా శ్రీ రాముని తెగిన శిరము, ధనుర్భాణాలు మాయమయ్యాయి.
.. ............సశేషం.........
Note."తన భర్త శిరస్సును చూచి, సీతాదేవి నిరాశతో తనను వరిస్తుందేమో ?" అని రావణుడు ఆశపడ్డాడు. కాని ఆయనకు అక్కడ కూడ నిరాశే ఎదురు అయింది. "తాను తన భర్త శరీరంతో పాటు కాలిపోవడానికి సిద్ధమైందేకాని ఆ మహాపతివ్రత రావణుని అంగీకరించ లేదు.
చక్కెర.తులసీ కృష్ణ
No comments:
Post a Comment