పరిస్థితులు వింతగా, విచిత్రంగా మారిపోతుంటాయి. అంతవరకు నిర్మలంగా ఉన్న ఆకాశం మబ్బులతో దట్టంగా నిండిపోయి వర్షం కురిపిస్తుంది.
ఒక్కోసారి తుపానే కొన్నిరోజులు మనల్ని ఇంటి నుంచి కదలనివ్వకుండా, భయభ్రాంతులకు గురిచేస్తుంది.
ఏమైనా ఎలాగైనా జరగవచ్చు. ప్రకృతి తన పంథా మార్చుకోవచ్చు. బీభత్సంగా మీదకు విరుచుకుడనూవచ్చు. ఇదంతా ఎవరి మనుగడను వాళ్ల సమతుల్యం చేసుకోవడానికి చేసే ఒక గట్టి ప్రయత్నమే. ఇటువంటి ప్రయత్నాలు కొన్ని మనకు మంచిగా, మరికొన్ని చెడ్డగా అనిపిస్తాయి. పెద్దలు అంతా మన మంచికే అనుకొమ్మన్నారు. చూపు మార్చుకుంటే రూపు మారిపోతుందన్నారు.
కొందరు సౌమ్యంగా బోధిస్తారు. కొందరు కఠినంగా బోధిస్తారు. చెప్పే విషయాన్ని బట్టి, నేర్చుకునే వ్యక్తులనుబట్టి బోధ మారిపోతూ ఉంటుంది.
శిశువుగా నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. వృద్ధుడిగా ఆకళింపు చేసుకునేవి కొన్ని ఉంటాయి. పరిస్థితులు ఎదురు తిరిగినా, ఎవరి ఆత్మశక్తి వాళ్లను తప్పక కాపాడుతుంది.
బలం బయట ఉండదు. లోపల ఉంటుంది. ఆలోచన, శక్తిపుంజుకొనే కొద్దీ ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది.
పరిస్థితులు వాటికవి రూపు దాల్చవు. ఎక్కడో మనం పెట్టిన నిప్పే ఈరోజు కార్చిచ్చుగా మన ఇంటిని కాల్చడానికి సిద్ధపడవచ్చు. ఏం చేశాం, ఎలా చేశాం, ఎందుకు చేశాం అని ఆత్మావలోకనం చేసుకుంటే- పరిస్థితులు మారిపోవడానికి మనవంతు పాత్ర ఎంతనేది తెలుస్తుంది. వేప విత్తనం నాటితే వేప చెట్టు వస్తుంది. ఆరోగ్యం ఇస్తుంది. విషపు మొక్కను నాటితే అది చివరికి విషాన్నే చిమ్ముతుంది.
ప్రకృతికి ధర్మానికి సంబంధం ఉంది. ధర్మానికి మనిషికి సంబంధం ఉంది. ధర్మాన్ని మనిషి రక్షిస్తే, మనిషిని ధర్మం రక్షిస్తుంది.
పరిస్థితులు పాములై కోరసాచినప్పుడు మన ధర్మ అధర్మాల చిట్టా తీసి ఒకసారి క్షుణ్నంగా చదువుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి.
మంచికో చెడుకో మనిషి ఎన్నడూ భయపడకూడదు. మంచివాళ్ళు అసలు భయపడకూడదు. ఎంతటి విషమ పరిస్థితినైనా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కోవాలి.
యుద్ధం చెయ్యడం మనిషికి కొత్తకాదు. గెలవడమూ మనిషికి కొత్త కాదు.
కోటిమంది అర్జునులను తయారుచెయ్యగలడు శ్రీకృష్ణుడు. శతకోటి మంది మనషుల మనసులలో ధైర్యాన్ని నింపగలడు దేవదేవుడు.
బుద్ధిని సరిచేసుకుని, శ్రీకృష్ణబోధను సరిగ్గా అర్థంచేసుకుంటే- యుద్ధం చెయ్యడం చాలా సులువు. కొన్ని సందర్భాల్లో యుద్ధం చెయ్యకపోతే బతకలేం. యుద్ధమే బతుకు. గెలిచి తీరతాం.
చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చెయ్యకపోతే, పరిస్థితులు మనకు అనుకూలంగా మారిపోతాయి. ఎవరి ప్రదేశంలో వాళ్లు హాయిగా బతకాలి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. పరుగులు తీసి పాలు తాగాలనుకున్నప్పుడు అవి ఒక్కోసారి విషంగా మారిపోతాయి. నిలబడి నీళ్లు తాగి, కాసేపు సేదతీర్చుకుని నిదానంగా పనిచేసే విధానమే గొప్పదని తెలుసుకోవాలి.
ఆగి ఒక దగ్గర కూర్చున్నప్పుడు చక్కగా శ్వాస గమనం మనకు తెలుస్తుంది. దాన్ని పరిశీలిస్తూ మన లోపల ప్రకృతితో అనుసంధానమైతే ‘ధ్యానం’ అనే ఒక స్థితి అనుభూతిలోకి వస్తుంది.
నిలకడే మనిషికి అన్నీ నేర్పిస్తుంది. పరిస్థితులు అనూహ్యంగా, అంతుబట్టకుండా మారిపోతుంటే ప్రకృతి మనతో మాట్లాడుతోందని, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోందని గమనించాలి. ధైర్యంగా ముందుకు సాగాలి! విజయం మనదే!!
No comments:
Post a Comment