Friday, June 28, 2024

 సక్సెస్ అయ్యాక మనం రేంజ్ రోవర్ కార్ లో తిరిగినంత మాత్రాన కొత్తగా పెరిగే గౌరవం ఏమీ ఉండదు, నడుచుకుంటూ వెళ్ళినంత మాత్రాన తగ్గే మర్యాద ఏమీ ఉండదు. సక్సెస్ కావటం ముఖ్యం అది ఏ రంగం అయినా.   

చలి దేశాల్లో ఆ వాతావరణాన్ని తట్టుకోటానికి కోట్లు వేసుకుంటారు. ఎండలు ఎక్కువ ఉండే శీతోష్ణ దేశాల్లో కూడా టైట్ జీన్స్, కోట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆనందం గా ఉంటే చెప్పులు లేకుండా రోహిణీ కార్తెలో ఎండల్లో నడుస్తున్నా బాధ గా ఉండదు. ఆనందం లేకపోతే అర్మనీ సూట్ వేసుకొని సెంట్రల్ ఏసీ గది లో కూర్చొని యాపిల్ జ్యూస్ తాగుతున్నా ఏదో బాధ గా ఉంటుంది.

అయితే ఈ ఫోటో చదువు గొప్పతనం గురించి. చదువుకుంటే గొప్ప స్థాయికి వెళ్తారు, విజయం సాధిస్తారు అని ఉద్దేశ్యం కావొచ్చు. నిజమే, మన లాంటి దేశం లో చదువు కోవటం వలన మాత్రమే అభివ్రుద్ధి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న ఒక రోజు నా స్నేహితుడితో మాట్లాడుతూ చదువు చాలా ముఖ్యం అని అని నేను అంటే రామోజీ రావు ఏమి చదువుకున్నాడు, పచ్చళ్ళు పెట్టి కోట్లు సంపాదించలేదా అన్నాడు. నిజానికి రామోజీ రావు పచ్చళ్ళు పెట్టి కోట్లు సంపాదించలేదు, కోట్లు సంపాదించాక పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభించాడు. అతను 1960/70 లోనే డిగ్రీ చదివాడు. ఆ తర్వాత ఆ రోజుల్లోనే ఢిల్లీ వెళ్ళి కొంతకాలం ఉద్యోగం చేశాడు. అక్కడ చిట్ ఫండ్స్ లాంటి వ్యాపారం చూసి హైదరాబాద్ తిరిగి వచ్చి మొదట చిట్ ఫండ్ వ్యాపారం పెట్టి బాగా సంపాదించి, మ్యాగజైన్స్ పెట్టి,  ఆ తర్వాత కోట్లు గడించి పేపర్ స్థాపించి మరిన్ని కోట్లు సంపాదించి 2 వేల ఎకరాలు కొని 1993 లో పచ్చళ్ళ వ్యాపారం పెట్టాడు. అంతే కానీ పచ్చళ్ళ వ్యాపారం తో అతని ప్రస్థానం ప్రారంభం కాలేదు. చదువుకొని ఉద్యోగం చేయటం వలనే అతను అభివ్రుద్ది చెందాడు.

మామూలు స్కూల్స్, కాలేజీలకి IIT/IIM లకి ఇంకా గొప్ప పేరు ఉన్న యూనివర్శిటీలకి తేడా సిలబస్, అక్కడ చదువు చెప్పే పంతుళ్ళు కాదు. అక్కడ ఉండే కల్చర్ (Exposure), బోధనా పద్దతులు. 

మన దేశం లో ఎక్కువ మంది చదువుకునేది డబ్బు సంపాదించి తమ తమ జీవితాలని మెరుగుపరచుకోటానికే. అయితే డబ్బు బాగా ఉన్న కుటుంభాల్లో చదువుకోకపోయినా వ్యాపారం చేసి లేదా ఏదో ఒకటి చేసి విజయ సాధిస్తారు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు.

అయితే చదువు మాత్రమే పరిజ్ఞానాన్ని ఇస్తుంది అనేది తప్పు. పాత కాలం లో చదువు కోకపోయినా ఏ నేలలో ఏ పంట వేయాలి, ఎప్పుడు వేయాలి అనేది మన వ్యవసాయదారులకి తెలుసు. ఎప్పుడు అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి, ఎక్కడ అమ్మాలి, ఎవరికి అమ్మాలి అనేది కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఈ కాలం లో కొంతమంది పిల్లలకి ఇంటర్ అయ్యాక ఏ కోర్స్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనేది ఎంత మందికి తెలుసు..? ఎందుకు చదువుతున్నారు, ఏమి చేయాలి అనుకుంటున్నారు అనేది ఎంతమందికి అవగాహన ఉంది..? 

ఒకప్పుడు ఎక్కువ భూమి ఉండి వ్యవసాయం చేసే వాళ్ళు డబ్బు సంపాదించి జీవితాన్ని అనుభవించేవాళ్ళు. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చాక పరిశ్రమల్లో పని చేసి బాగా సంపాదించి జీవితాన్ని ఆస్వాదించేవాళ్ళు. ప్రస్తుతం మాత్రం మనలో ఉన్న ఏ ప్రత్యేకతని అయినా ఉపయోగించి జీవితాన్ని అనుభవించవచ్చు, ఆస్వాదించవచ్చు. ఎవడ్నో కాపీ కొట్టి వాడిలానే ఉండాల్సిన అవసరం లేదు, మనం మనలాగే ఉండి మెరుగు పరచుకొని విజయం సాధించవచ్చు. 

మనిషి ని మనిషి గా చూసేదే నిజమైన విధ్య. బయట నుంచి Exposure వస్తుంది కానీ నేర్చుకునేది ఏమీ ఉండదు, మనిషి తన లోపల నుంచే నేర్చుకోవాలి. అందుకే "ది ఆర్ట్ ఆఫ్ వార్" పుస్తకం రాచిన చైనీస్ తత్వవేత్త "సన్ ట్జూ" ఒక మాట అంటాడు " నిన్ను నీవు తెలుసుకుంటే ఈ ప్రపంచం లోని ఏ యుద్ధాన్ని అయినా జయించవచ్చు"  అని.

No comments:

Post a Comment