అంతర్గత శాంతీ, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటాయి?
ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలూ, డాబూ పెంచుకుంటే, ఏ నాటికైనా పతనం తప్పదు” అన్నది ఆర్యోక్తి.. ఉదాహరణకు, వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది. సమంగా ఉంటే బంగారం పండుతుంది. అదే అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది. ఇక్కడ నీటినే ధనం అనుకుని, వరిని మనిషి అనుకుంటే, తగినంత లేకుంటే కరవు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే తనను తాను నశింపచేసుకునే రాచ మార్గం! అదే అధికంగా ఉన్న ధనాన్ని, ఉదాహరణగా తీసుకున్న నీటిని తీసివేయడంలాగా ధనం దానం చేస్తే, తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు. ఇందుకు అద్భుతమైన ఉదాహరణ, ‘చక్వవేణుడి గాథ’. అసలు ఎవరీ చక్వవేణుడు? ఆయన ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటి?
ప్రస్తుత లోకం తీరు మారింది. ఉన్నది తినడం అటుంచి, తింటున్నది ఎదుటి వాడికి చూపిస్తూ గొప్పలు చెప్పుకునే దౌర్భాగ్యం పెరిగింది. తమదగ్గరున్న డబ్బు, బంగారం, కార్లూ, బంగళాలూ, విలాస వస్తువులూ, తిరిగిన ప్రాంతాలూ, అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా, లేదా స్టేటస్ లలో చూపాలి. చీరలూ, నగలూ ధరించి, షోకేసులలో బొమ్మల్లా ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపూ, నవ్వూ, ప్రదర్శన, అంతా పటాటోపమే. వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి ఇతరులు అనుకరించ కూడదు. మరి అంతర్గత శాంతీ, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటాయని అడిగేవారు, తప్పనిసరిగా చక్వవేణ మహారాజు గాధను తెలుసుకోవాలి, జీర్ణించుకోవాలి!
ఒకానొకప్పుడు చక్వవేణుడనే ధర్మాత్ముడూ, సదాచార పరాయణుడూ, సత్యవాదీ, దయామయుడూ, మహాజ్ఞానీ అయిన మహారాజుండేవాడు. తన మీద తాను ఆధారపడి, కష్టపడి, తనకు అవసరమైనది సంపాదించుకునే వాడు. త్యాగ శీలుడు, విరాగి, జ్ఞాని, భక్తుడు, తేజశ్శాలి, తపోమూర్తి, ఉన్నత శ్రేణికి చెందిన అనుభవశాలియైన మహాపురుషుడాయన. రాజ్య సంబంధమైన ద్రవ్యాన్ని తన కోసము, తన భార్య కోసము వినియోగించుకోవడం దోషంగా భావించి, దానిని ముట్టుకోకుండా, ఆ డబ్బుకు దూరంగా ఉండే వాడు.
పన్నుల రూపంలో ప్రజలనుండి వసూలు చేసిన ద్రవ్యాన్ని, వారి క్షేమం కోసమే వినియోగించే వాడు. అతడు రాజ్య కార్యాలను, ప్రతిఫలాపేక్షనూ, అభిమానాన్నీ వర్జించి, తనువునూ, మనస్సునూ లగ్నం చేసి నిర్వర్తించే వాడు. ప్రజలమీద అతని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. రామ రాజ్యంలో లాగా, అతని రాజ్యం లోని ప్రజలందరూ, దుఃఖమంటే ఏమిటో తెలియక, అన్ని రకాల సుఖ సంపదలతో ఎంతో సంతోషంగా ఉండే వారు.
మహారాజు తనూ, తన భార్యా జీవించడానికి, రాజ్యానికి సంబంధించిన డబ్బు ముట్టకుండా, ప్రత్యేకంగా వ్యవసాయం చేసుకునే వారు. ఆ వ్యవసాయానికి కూడా, ఎద్దులను ఉపయోగించే వారు కాదు. ఎద్దులకు బదులుగా, రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లే వాడు. తమ పొలంలో పండిన పత్తితో బట్టలు నేసుకుని, వాటినే ధరించే వారు. తమ పొలంలో పండిన ఆహారమే తినే వారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు. అతడు రాజ్య ద్రవ్యాన్ని వినియోగించి, ఆమెకు ఆభరణాలేవీ చేయించే వాడు కాదు.
వారి పొలంలో పండే పంట, వారికి సాధారణమైన అన్న వస్త్రాదులతో, కాలం గడపడానికి మాత్రమే సరిపోతూ ఉండేది. ఒక్క పొలం పనులకే కాక, ఆయన రాజ్య కార్యాల కోసం కూడా కాలాన్ని వినియోగిస్తూ ఉండేవాడు. ఆయన జీవనం, సదాచార సంపదతో, సాదాసీదాగా బ్రతికే ఒక రైతు జీవనాన్ని పోలి ఉండేది. ప్రతి దినమూ ఆరు గంటల కాలము నిద్రకు పోగా, మిగిలిన కాలమంతా అతడు దేవుడిని పూజించడం, ఇతరులకు సహాయం చేయడం, రాజ్య పనులు చూసుకోవడం, పొలం పనులు చేసుకోవడం వంటి వాటిలో, మునిగి తేలుతూ ఉండేవాడు.
అతడికి అన్ని జీవుల పట్లా సమానత్వ భావన ఉండేది. జంతువుల పట్ల దయ, ప్రేమ కలిగి ఉండే వాడు. అన్ని రకాల జీవులనూ, ప్రాణులనూ, పరమాత్మ స్వరూపములుగా భావించే వాడు. అందరికీ సమానమైన ప్రేమాభిమానాలతో సేవలు చేసే వాడు. అతడికి ఏదైనా అవసరం ఏర్పడినా, ఎవ్వరినీ ఏదీ అడిగే వాడు కాదు. సహజంగానే అతడిలో దేని మీదా వ్యామోహం ఉండేది కాదు. సేవకుల చేత కానీ, రాజ్య సంబంధమైన పనులు చేసే వారి చేత కానీ, తాను ఏ పనీ చేయించుకునే వాడు కాడు. అతడు ఏ పని చేసినా, ఆసక్తినీ, అహంకారాన్నీ విడిచిపెట్టి, ఎంతో ఉత్సాహంతోనూ, ధైర్యంతోనూ చేస్తూ ఉండేవాడు.
ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్ధానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది. రాజు బాగా ఆలోచించాడు. తాను రాజద్రవ్యాన్ని ముట్టడు. కానీ, తను సామ్రాట్టుగనుక, దుష్టులూ, బలవంతులూ, అత్యాచారులూ అయిన రాజుల దగ్గర నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు కదా! అని అనుకున్నాడు. తన మంత్రిని పిలిపించి, రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, తాను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని ఆజ్ఞాపించినట్లుగా చెప్పి తీసుకురమ్మని, అనుజ్ఞ ఇచ్చాడు.
మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు, అతడిని పరిహాసం చేసి పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా ఆమె, ‘స్వామీ! మీరు పొరపాటు చేశారు. వారు అడిగిన బంగారాన్ని ఇచ్చి వేయ వలసింది. చక్వవేణుడి మహిమను మీకు చూపుతాను..’ అని అన్నది. ఆమె పక్షులకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, ‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి’ అని అన్నది. అవి ఎంతమాత్రం లెక్క చెయ్యక తిన సాగాయి. వెంటనే ఆమె, ‘చక్వవేణుడిపై ఆన.. ఇక గింజలు ముట్టకండి’ అని అన్న వెంటనే, పావురాలన్నీ ఎగిరిపోయాయి. ఒక్క చెవిటి పావురం మాత్రం, ఆమె అన్నది వినబడక గింజ తినగానే, తల తెగి క్రింద పడింది. కొద్దిసేపు ఆగిన రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను. గింజలు తినండి’ అన్న మరు నిముషం, పక్షులు మళ్ళీ వాలి, గింజలు తిన సాగాయి. ‘చూసారా స్వామీ! ఇదీ చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ’ అని అన్నది మండోదరి. అయినా పక్షులను అల్ప జీవులుగా, తేలికగా కొట్టి పారేశాడు రావణుడు.
చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, ఇసుకతో లంకా నగర నమూనాను చేసి, ఒక వినోదం చూపుతానని రావణుడిని పిలుచుకువచ్చాడు. ‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపున్న బురుజులూ, ప్రాకారాలనూ పడగొట్టాడు. వెంటనే లంకలో నిజంగా అమరి ఉన్న తూర్పు వైపు బురుజూ, ప్రాకారం కూలి పోయాయి. అది చూసి హతాశుడయ్యాడు రావణుడు. ఆ తరువాత మంత్రి, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, నమూనాలోని తూర్పువైపు స్థూపాలను పడగొట్టగానే, నిజ లంకాపురి స్థూపాలు కూలి పోయాయి. ఇదంతా చూసి బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి పంపాడు.
మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వబోగా, అతడు అది ఎలా తెచ్చాడో చెప్పమని అడిగాడు. మంత్రి చెప్పినది విన్న రాణి ఆశ్చర్యచకితురాలయ్యింది. తన భర్త పవిత్ర వర్తనం యొక్క మహిమ తెలుసుకున్న ఆమె, బంగారం వద్దన్నది. ఆ బంగారం తిరిగి రావణుడికి పంపివేయ బడింది. అన్ని లోకాలనూ ప్రభావితం చేయగల చక్వవేణుడి త్యాగ బుద్ధిని తెలుసుకుని, రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది, మంత్రిని ఆదరించి పంపి వేశాడు.
ఈ కథలో మనం తెలుసుకోవలసిన నీతి.. క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలుగజేస్తుంది. అందుకే దురభ్యాసాలూ, మత్తు పదార్ధాలూ, క్రీడా వినోదాలూ, ఖరీదైన ఆడంబరాలతో గడిపే వారి సాంగత్యానికి దూరంగా ఉండాలి. మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విష తుల్యమే. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించే పిడికెడు అన్నమైనా అమృత తుల్యమే. దానం, దయ, ప్రేమతో అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే పాదాక్రాంతమవుతుంది!
No comments:
Post a Comment