Tuesday, September 24, 2024

 Vedantha panchadasi:
బంధశ్చేన్మానసం ద్వైతం తన్నిరోధేన శామ్యతి ౹
అభ్యసేద్యోగమేవాతో బ్రహ్మజ్ఞానేన కిం వద ౹౹38౹౹

38.మానసికమైన ద్వైతమే బంధకారణమైనచో యోగమే అభ్యసింపుము.చిత్త నిరోధముచే ప్రపంచముపశమించూను.బ్రహ్మజ్ఞానముతో ఏమి పని ?

తాత్కాలికద్వైతశాంతావప్యాగామిజనిక్షయః ౹
బ్రహ్మజ్ఞానం వినా న స్యాదితి వేదాంత డిండిమః ౹౹39౹౹

39.యోగముచే ద్వైతము తత్కాలమున,చిత్తము నిరుద్ధమై ఉన్నంత కాలమున,శాంతించినను రాబోవు జన్మమృత్యువులు మానస ప్రపంచము బ్రహ్మజ్ఞానము లేనిదే నశింపదని వేదాంత నిర్ఘోషము.

వాఖ్య: ప్రపంచము అవిద్యా కార్యము.బ్రహ్మజ్ఞానముచే అవిద్య నశింపనంత వరకు అవిద్యాకామ కర్మ సుఖదుఃఖాత్మకమైన ప్రపంచము శాశ్వతముగ నశించు ఆశయే లేదు.

వాస్తవముగా సృష్టి సత్యమయినచో దాని నివృత్తి అసాధ్యము.ఎందుకనగా,అసత్యమయిన దానికి నిజమయిన అస్తిత్వము లేదనియు, సత్యమయిన దానికి నాశము లేదనియు అన్నది మార్చుటకు వీలుగాని నియమము.కావున తపస్సు,ధ్యానము మొదలగు అభ్యాసములు దాని నాశనముగానీ,జ్ఞానముగానీ కలిగింపజాలవు.

సృష్టిభావన ఉన్నంతకాలము ఆలోచనా వ్యాపారములేని నిర్వికల్ప సమాధి సైతము సాధ్యముగాదు.అది సాధ్యమయినప్పటికి,వ్యక్తి అట్టి సమాధినుండి తిరిగి వచ్చిన క్షణమున దుఃఖసహితమయిన సృష్టి మనస్సులో ఆవిర్భవించును. ఆలోచనా వ్యాపారము విషయభావనను కల్పించును.

మనస్సనుభూతమును ఆక్రమించిన వ్యక్తిని శాస్త్రములుగానీ, గురువులుగనీ,బంధువులుగానీ రక్షింపజాలరు.

దీనికి భిన్నముగా,వ్యక్తి భూతమును పాతిపెట్టినచో,మానవుడు బురదగుంట నుండి తేలికగా పశువును కాపాడగల్గునట్లే,అతనికి గురువులు,శాస్త్రములు,బంధువులు తేలికగా సాయము చేయగలరు.ఈ పిశాచమును పాతిపెట్టినవారే సజ్జనులు.వారు  ప్రపంచమునకు కొంత సేవ చేయగలరు.

కావున ఈ అహంకారమను పిశాచమును పాతిపెట్టి వ్యక్తి ఈ అజ్ఞానమునుండి తనను ఉద్ధరించుకొనవలయును.
అశాశ్వతమగు ఈ దేహముకొరకు
ప్రాపంచికజీవితమను ఈ అడవిలో పరిభ్రమింపకుము.

దేహము ఒకానొకనివలన పుట్టినది,దానిని అహంకారము రక్షించును,
దానిలో సుఖదుఃఖములను మరియొకడెవడో అనుభవగోచరము గావించుకొనును.ఇది వాస్తవముగా గొప్ప రహస్యము.

కుండయొక్క ముఖ్యస్వభావము,గుడ్డముక్కయొక్క ముఖ్యస్వభావము అభిన్నములైనట్లే మనస్సుయొక్క ప్రధానస్వభావము,అపరిచ్ఛిన్న చైతన్యము యొక్క ప్రధాన స్వభావముగూడ అభిన్నములే.        

No comments:

Post a Comment