*బాల శబరి..! - భక్త శబరి..!!*
*’శబరి’ ఒక కోయజాతి పిల్ల. వయసు ఎనిమిది సంవత్సరాలు. అడవిలో నివాసం.*
*అంత చిన్న వయసు పిల్లకు పెళ్ళిచేయదలిచాడు ఆమె తండ్రి. ఆ సందర్భంగా పెళ్ళివారికి విందు చేయడంకోసం సజీవంగా ఉన్న వంద మేకలను ఇంటి చుట్టూ కట్టివుంచాడు.*
*వాటిని చూసి శబరి తండ్రిని ఆడిగింది… "రేపు నీకు పెళ్ళి! వచ్చే అతిధులకు విందు చేయడానికే యీ మేకలు!" అని చెప్పిన తండ్రి అది విని శబరి భయాందోళనకు గురియైంది.*
*తమ సంతోషంకోసం, ఆకలి తీర్చుకోవడం కోసం జీవహింస తగదని వాటిని చంపవద్దన్న శబరి మాటలను, చిన్న పిల్ల మాటలుగా జమకట్టి, ఆమెను లెక్క చేయకుండా తండ్రి అక్కడనుండి వెళ్ళి పోయాడు.*
*రేపు తన పెళ్ళికోసం చావబోతున్న ఆ అమాయక జీవాలను చూస్తూ వుంటే బాల శబరి మనసు ద్రవించి పోయినది. ‘ఏం చేస్తే ఈ మేకల ప్రాణాలు దక్కుతాయా?’ అని ఆలోచిస్తూ, ఎవరి కంటపడకుండా వెంటనే ఇల్లు వదలి వెళ్ళి పోయింది.*
*అలా ఎంతో దూరం నడచి నడచి అలసి పోయింది. పూర్తిగా డస్సిపోయి గంగాతీరానికి వచ్చిన శబరి దోసెడు గంగాజలం త్రాగింది.*
*సమీపమున మతంగ మహర్షి ఆశ్రమం వున్నది. శబరికి అది ముని ఆశ్రమమని తెలియదు. అలసిపోయి కాళ్ళు ముందుకు సాగక ఆశ్రమ వాకిలిలో పడుకుని నిద్రపోయింది.*
*సూర్యోదయానికి ముందే లేచి తాను ముందు రోజు నీళ్ళు త్రాగిన గంగ వద్దకు స్నానానికి వెళ్ళింది.*
*మార్గం అంతా అడవి ముళ్ళు , డొంకలతో నిండి వుంది.*
*అరుణోదయకిరణాల వెలుగులో దోవలోని ముళ్ళను తొలగించుకుంటూ , మార్గాన్ని శుభ్రపరుస్తూ గంగా తీరం చేరుకుంది.*
*ఆశ్రమంలోని మతంగ మహర్షి ప్రాతఃకాలమున లేచి, గంగలో స్నానం చేయడానికి బయలు దేరి వెళ్ళాడు. మార్గమంతా చెత్తా, చెదారం లేకుండా శుభ్రంగా వుండడం చూసి శిష్యులను అడిగాడు.*
*అప్పుడు ఒక శిష్యుడు… "ఆచార్యా! నిన్న సాయంకాలం ఒక బాలిక మన ఆశ్రమ వాకిలి వద్దకు వచ్చి నిద్ర పోయినది. ఉదయాన లేచి మార్గాన్ని శుభ్రపరచి ఇప్పుడు గంగలో స్నానం చేస్తున్నది.” అని తెలిపాడు.*
*గంగ ఒడ్డుకి వెళ్ళిన మహర్షి, ఆ బాలికను చూడగానే విస్మయం చెందాడు. భవిష్యత్ లో ఆ బాలికకు కలగబోయే అదృష్టానికి అబ్బురపడ్డాడు.*
*జ్ఞానదృష్టి గల మతంగముని, మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని దర్శనం చేసుకొనే భాగ్యశాలియని అని తెలుసుకున్నాడు.*
*శిష్యులను పంపి ఆ బాలికను పిలిపించాడు. తాను నిద్రించిన ఆశ్రమం మతంగ మునిదని తెలుసుకున్నది బాలిక.*
*భయభక్తులతో మహర్షి దగ్గరకు వెళ్ళి కాళ్ళమీద పడి… "ఆచార్యా! ఇది
మీ ఆశ్రమమని తెలియక నిద్ర పోయాను మన్నించండి. ఈ దాసురాలి పేరు శబరి.
నా తండ్రి నాకు పెళ్ళి చేయదలచి విందు కోసం వంద మేకలను చంపాలని నిశ్చయించాడు. జీవహింస మహా పాపం. నా తండ్రి ఆ పాపం చేయడం నాకు ఇష్టము లేదు. అందు వలన నేను ఇల్లు వదలివచ్చేశాను. ఇంక నేను వెడతాను ఆచార్యా!" అని బయలుదేరుతున్న ఆమెను ఆపుచేశాడు మహర్షి.*
*”బాలా..శబరీ ! నీవు నా ఆశ్రమానికి రావడం నా భాగ్యం. చాలా కాలం తర్వాత శ్రీ మహావిష్ణువు ఇక్ష్వాకుల వంశంలో శ్రీ రామునిగా అవతరించబోతున్నాడు. ఆ అవతార పురుషుని దర్శనంతో నీ జన్మ పునీతమవుతుంది. అంతవరకు
నీవు నా ఆశ్రమంలోనే నివసించు. ఈనాటి నుండి సదా శ్రీ రామనామాన్ని జపించు. అవతార పురుషుడైన
శ్రీరాముడే ఈ ఆశ్రమానికి వచ్చి నీకు దర్శన భాగ్యం కలిగిస్తాడు." అని అన్నాడు మహర్షి.*
*ఆచార్యుని దివ్యవాక్కులకు బాల శబరి పులకించిపోయింది.*
*ముని పాదాలకి భక్తితో వందనం చేసినది. ఆనాటినుండి శబరి ముని వాటికలోనే పరమ పవిత్రంగా శ్రీరామ నామాన్నే జపిస్తూ శ్రీరాముని దర్శనానికై ఎదురు చూసింది.*
*శబరి కోరిక నెరవేరింది. శ్రీరాముడు, లక్ష్మణ సమేతుడై తన ఆశ్రమానికి వచ్చాడు.*
*ఎప్పుడు వచ్చాడు?*
*బాల శబరి, కన్యయై, యువతిగా మారి, ప్రౌఢ వయసుదాటి, వృధ్ధాప్యం మీదపడి ఒడలంతా ముడతలుపడి , తలముగ్గుబుట్టగా మారి, దృష్టి క్షీణించి లేచి నడవలేని స్థితిలో వున్నప్పుడు శ్రీరాముడు శబరికి దర్శనభాగ్యం కలిగించాడు. ప్రేమతో, భక్తితో ఆమె రుచి చూసి పెట్టిన ఎంగిలి పండ్లను భుజించి శబరిని ధన్యురాలిని చేశాడు.*
*వృధ్ధ శబరి భక్తి తత్పరతను లోకానికి విదితం చేశాడు శ్రీరాముడు.*
*శ్రీరాముని దర్శనంతో, స్పర్శతో వృధ్ధశబరి తన యావజ్జీవ కష్టాలు, వేదన , ఎదురు చూపులు అన్ని మరచిపోయి రాముని సన్నిధిలో పునీతురాలయింది.*.
No comments:
Post a Comment