Thursday, September 26, 2024

 *ఆదిశక్తి యొక్క లీలాకథలు*
*1భాగము*


ఆదిశక్తి యొక్క లీలలను తెలియజేసే గాధలు చెప్పాలనే ఆలోచనలు హృదయంలో పరవళ్ళుతొక్కుతున్నాయి. 

ఆదిశక్తి యొక్క లీలాగాధలు సూత్రరూపంలో గాయత్రీమహా మంత్రంలోని 24 అక్షరాలలో నిక్షిప్తం చేయబడివున్నప్పటికీ, యుగయుగాలలో, 

ఈ తల్లియొక్క భక్తులు కన్నవి, విన్నవి అయిన ఎన్నో విశేషాలతో కూడిన విస్తృతమైన వివరణ 
శ్రీ దుర్గాసప్తశతిలో ఇవ్వబడింది. 

ఋగ్వేదం యొక్క ఋషి అయిన అంృణుడు చేసిన కన్యావాక్ అనే సాధనకు సిద్ధిరూపంలో ఈ కథలు ఉత్పన్నమైనట్లు చెప్పబడుతున్నది. 

'శ్రీదేవీసూక్తము' అనే రూపంలో కూడా ఇది వెల్లడిబడినది. ఐతే ఇవన్నీ చరిత్రకు చెందిన అంశాలు. భావనాలోకంలో, 
తల్లియైన భవాని భక్తుల హృదయాలలో నిత్యమూ విరాజమానమై ఉంటుంది. 

ఆమె ఏవిధంగా 'నిత్యమో' అదేవిధంగా ఆమె కథలు కూడా నిత్యమై విలసిల్లుతున్నాయి. అనంతకోటి బ్రహ్మాండ నాయిక, అఖిలాండేశ్వరి అయిన ఆ తల్లియొక్క లీలాచరిత్ర ఆమె వలే అనంతమైనది. 

దానిని సరియైన రీతిలో వర్ణించడం సహస్ర ఫణిఫణాలంకృతుడైన 
ఆ ఆదిశేషువునకు కూడా సాధ్యంకాదేమో! 

ఇప్పటికీ అమ్మను గురించి సరిగా ఉచ్చరించడం కూడా చేతకాని వ్యక్తులు ఇక ఆమె లీలాగాధలను ఏవిధంగా గానం చెయ్యగలరు?

అయినప్పటికీ ఆ తల్లిమీదనే నమ్మకం. ఆమె తన యొక్క 
ఈ చిన్నిబిడ్డ యొక్క పిలుపును విని తప్పకుండా సంతసిస్తుంది. 

కల్లాకపటమెఱుగని, చిన్నపిల్లల స్వచ్ఛమైన మాటలు విని తల్లి కిలకిలా నవ్వుతుంది. 

వారి చిలుకపలుకులను వింటుంటే ఆమెకు ఎంత ముద్దు వస్తుందంటే అమాంతం వారిని ఒడిలోకి తీసుకొని హృదయానికి హత్తుకుంటుందామె! 

వణుకుతున్న చేతివ్రేళ్ళమధ్య కలాన్ని అదిమిపెట్టి వ్రాస్తున్న ఈ అల్పమైన జీవునకు కూడా అదే నమ్మకం! 

గోస్వామి మహరాజ్, భగవంతుని చరిత్రను ప్రారంభించటానికి ముందుగా......

'జౌ బాలక కహ తోతబరితా సునహి ముదిత మన పితు అరుమాతా' అంటారు.

అనగా 'పిల్లవాడు చెప్పే మాటలు చిలుకపలుకుల వలె ఉంటాయి. వాని తల్లిదండ్రులు వాటిని ఎంతో సంతోషంతో వింటారు' అని అర్ధము. 

నాకైతే మా అమ్మే సమస్తమూ! నేను ఎన్నడూ ఎవ్వరివద్దకు వెళ్ళలేదు. మరిక ఎవ్వరిగురించి వినలేదు, ఆలోచించలేదు. 

నాకు తెలిసినదల్లా ఒక్కటే. 'సృష్టికర్త ఆమెయే! సృష్టిలో ఏర్పడే ప్రతివొక్క కదలిక కూడా ఆమెయే!'

ఆదిశక్తిని పరిచయం చేస్తూ మహాకవి తులసీదాసు, 'ఆదిశక్తి జెహి జగ ఉపజాయా' అంటారు. 

అనగా తన గర్భం నుండీ 
ఈ యావత్ప్రంచానికీ జన్మనిచ్చినటు వంటి, మన పాంచభౌతికమైన శరీరాలకేకాదు, మన ఆత్మలకు కూడా తల్లియైనటు వంటి ఆమెయే ఆదిశక్తి!' అని అర్థం. 

బిడ్డ తన తల్లియొక్క ఉదరంలోనే పోషింప బడతాడు. ఆమె యొక్క రక్తమాంసాల నుండి లభించిన ఒక అంశతోనే అతని అస్తిత్వం నిర్మించబడుతుంది. 

ఆమె శ్వాసనుండే అతని శ్వాస నడుస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు అతడు తల్లికన్నా అభిన్నంకాడు. గర్భంనుండీ వెలుపలకు వచ్చిన తరువాత అమ్మా! అని పిలవడంలో అతనికి ఆనందమూ, 

తల్లి తనను హృదయానికి హత్తుకున్నప్పుడు శాంతి లభిస్తాయి. తల్లి అతనికి స్తన్యమిచ్చి పెరిగి పెద్దయిన తర్వాత తన చేతితో ఆహారాన్ని తినిపిస్తుంది. తద్వారా అతడు సంతృప్తి చెందుతాడు.

'యస్యాః పరతరం నాస్తి' అని వేదవాక్కు అనగా 'ఆమెను మించి మరెవ్వరూ 'లేరు' అని అర్థం. ఇంకెవ్వరూ ఉండటానికి ఆస్కారం కూడా లేదు. 

ఆమెయే 'పరాపరాణం పరమా పరమేశ్వరీ' అని చెప్పబడింది. అనగా లౌకికమైన, అలౌకికమైన అన్నింటికన్నా ఆవలవుండే ఆమెయే పరమేశ్వరీ అని తెలుసుకోవాలి. 

ఆమెను గురించిన సరియైన, ఖచ్చితమైన జ్ఞానం ఎవ్వరికీ లేదు. అయితే ఆమెకు మటుకు అందరినీ గురించిన సంపూర్ణమైన జ్ఞానం ఉంది. 

ఇది యుక్తమే! ఎందుకంటే, అమాయకుడైన పసిబాలుడు తన తల్లి యొక్క సంపూర్ణత్వాన్ని గురించి ఎలా తెలుసుకొనగలడు? అయితే తల్లికిమాత్రం తన బిడ్డను గురించి సమగ్రంగా తెలుసు. 

బిడ్డను గురించి తల్లికి తెలియని విషయమేదీ ఉండదు. బిడ్డలు ఆమెతో చెప్పడం వల్ల, ఆమెకు 
ఈ జ్ఞానం రాదు.ఆమె అంతరంగంలో బిడ్డను గురించిన అనుభూతి వల్ల తెలసుకొనగలుగుతుంది.

ప్రజ్ఞావంతులు దీనిని అతిశయోక్తిగా భావించవచ్చునేమో గానీ, శ్రద్ధావంతులకు మాత్రం ఇది సంపూర్ణమైన సత్యం! 

వారి అనుభవం వారికి "ప్రతివొక్క తల్లీ అంతర్యామియై ఉంటుంది. తన గురించి తాను చెప్పుకొనలేని పిల్లల గురించికూడా ప్రతివొక్క విషయమూ ఆమె ఎంతో తేలికగా అర్థం చేసుకొనగలదు. 

చమత్కార పూర్వకమైన వాక్కులకన్నా, సరళతతో నిండిన మృదు భావాలే ఆమె హృదయాన్ని స్పృశిస్తాయి.ఆ మృదుభావాల్లోని ఆర్ద్రత ఆమె హృదయాన్ని తడిపివేస్తుంది. 

ఇవన్నీ ఈ ప్రపంచంలోని సర్వసాధారణమైన తల్లులకు సంబంధించిన విషయాలు. మరి జగద్ధాత్రియైన ఆదిశక్తి యొక్క అంతర్ జ్ఞానాన్ని గురించి ఏమని చెప్పగలం? 

ఆమె అంతర్ జ్ఞానం అనంతములకన్నా అనంతమైనది. ఆమెను పిలవటానికి కూడా సాధ్యంకాదనేది మాత్రం సత్యం! 

తన బిడ్డల యొక్క హృదయ స్పందనతోపాటే ఆమె హృదయం కూడా స్పందిస్తుంది!" అని తెలియజేస్తుంది.అమాయకులు, పసివారు అయిన తన సంతానాన్ని గురించి, తల్లికాకపోతే మరి ఎవరు ఆలోచిస్తారు? అనేది అంగీకరించబడే సత్యం. 

పిల్లవాడు పిల్లవాడిగానే ఉంటాడు. వాడు నిప్పులో చెయ్యిపెట్టవచ్చు లేదా పామును పట్టుకొనవచ్చు. ఫలితంగా అతడి చేతిని కాల్చవచ్చు లేదా పాము అతడిపై బుసకొట్టవచ్చు. 

ఏది జరిగినా అతడు కేవలం ఏడుస్తాడు తప్ప ఏమీ చెయ్యలేదు. వీటన్నింటిని గురించి తల్లే ఆలోచించవలసి ఉంటుంది. ఆమెయే ఉఱుకులు పరుగులు తీయవలసి ఉంటుంది. 

మన అమ్మయొక్క ఈ అలవాటును గురించి మనకు బాగా తెలుసు, అందువల్లనే మనం సంపూర్ణమైన నిశ్చింతతో ఉండ గలుగుతున్నాం. 

ఎందుకంటే మనం ఎంత అజ్ఞానులం, మూర్ఖులం అయినప్పటికీ మన తల్లి సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వ్యక్తి అన్న విషయం మనకు చక్కగా తెలుసుకాబట్టి.

ఆమెను గురించి వేదాలు 'యస్యాః స్వరూపం బ్రహ్మాదయో న జానంతి తస్మాదుచ్యతే అజ్ఞేయా' అని చెప్తున్నాయి. 

బ్రహ్మాదిదేవతలకు కూడా ఆమె స్వరూపాన్ని గురించిన జ్ఞానం లేదుకాబట్టి ఆమె 'అజ్ఞేయా!' అని పిలువబడుతున్నది.
ఈ దేవతల విషయం నాకు తెలియదు. 

వారి యొక్క జ్ఞానాన్ని గురించి కూడా నాకేమీ తెలియదు. ఆదిశక్తి అని పిలువబడే నా తల్లి 'మమతామూర్తి' అన్న విషయం మాత్రం నాకు తెలుసు. 

ఆమె తన బిడ్డలకు, మృదుహృదయులైన తన శిశువులకు, తనను గురించిన సమస్త విషయాలు తెలియజేస్తుంది. 

అందుచేత మూడు వ్రేళ్ళ మధ్య ఉన్న యీ కలం నుండి, ఆదిశక్తి యొక్క లీలలకు సంబంధించిన వేదాంతపరమైన, యోగ పరమైన, 

భక్తిమయమైన రహస్యాలు వెల్లడి అవుతున్నవంటే ఆశ్చర్యపడవలసినదేమున్నది? భక్తిపూరితమైన నా భావన కూడా 'అమ్మయే ఈ పని చేయిస్తున్నది' అని చెప్తున్నది.

ఆమె యొక్క అహేతుకమైన కృప ఉన్నట్లైతే మూగవాడు మాట్లాడగలడు, కుంటివాడు. కొండను కూడా దాటగలడు. 
'ఎట్లా? ఏ విధంగా?' అన్నది 
ఈ వ్యాసమాల చదివేవారు. 

క్రమంగా తెలుసుకొనగలరు. అమ్మ యొక్క ప్రేమ మీద ప్రగాఢమైన విశ్వాసం, ఆరాధ్య సద్గురువు యెడల నిశ్చలమైన నమ్మకం నాకు ఉన్నాయి.

1986 వ సంవత్సరంలో శాంతికుంజ్లోని ప్రవచన వేదికపై నుండి, సద్గురువైన ఆ ప్రభువు ఈవిధంగా చెప్పారు, 

'వందనీయ మాతాజీని చూసినవారు నన్ను చూసినట్లే! నన్ను చూసినవారు గాయత్రీమాతను చూసినట్లే!' 

అనగా పరమపూజ్య గురుదేవులు, వందనీయ మాతా భగవతీదేవి మరియు గాయత్రీమాత వీరు ముగ్గురూ తాత్వికంగా ఏకస్వరూపులు. 

వారిలో భేదం లేదు. ముందు ముందు ఒకరి లీలాగాధలో మిగిలిన ఇద్దరి యొక్క లీలాకథలు కూడా ఇమిడి ఉన్నాయి' అని కూడా చెప్పుకుంటాం.

శ్రీ దుర్గాసప్తశతి యొక్క ఋషి సుమేధుడు ఈ రహస్యాన్ని కొంత ఈ క్రింది విధంగా తెలియజేశాడు.

దేవానాం కార్య సిద్ధ్యర్థమావిర్భవతి నా యా  ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యావ్యభిధీయతే 

'ఆమె నిత్య, పుట్టుకలేనిది' అయినప్పటికీ, దేవతల యొక్క కార్యాలను సిద్ధింపజేయుటకు అప్పుడప్పుడూ ప్రకటీకృతమౌతుంది. 

అప్పుడు ఆమె లోకంలో ఉత్పన్నమైనట్లు చెప్పబడుతుంది. ఈవిధమైన ఋషి వాక్కు, 'వేదమాత అయిన గాయత్రీదేవియే అసురసంహారిణియైన దుర్గ' అనే సత్యాన్ని ధృవీకరిస్తున్నది. 

ఆమెయే సీత, రాధ, ఆమెయే శ్రీరామకృష్ణుల జీవనసహచరి శ్రీ శారదామాతా, ఆమెయే ప్రభు శ్రీరామశర్మ యొక్క జీవన సహధర్మచారిణియైన వందనీయ మాతా, 

భగవతీదేవి యొక్క స్వరూపంలో ఆవిర్భవించినది. 
ఆ ఆదిశక్తియే ప్రతి యుగంలోనూ యుగశక్తిగా అవతరిస్తున్నది.

శ్రీ దుర్గాసప్తశతి ఆమె యొక్క దార్శనిక, మాంత్రిక, యోగపరమైన లీలాగాధ. ఇప్పుడు మేం మా పాఠకుల చేత ఆ సప్తశతియొక్క శ్రవణం, పఠనం చేయించ బోతున్నాం. 

భక్తులైనవారు దీనిని చదివి తన్మయులౌతారు. దార్శనికులైన జిజ్ఞాసువులకు (వేదాంతపరమైన సంశయములున్నవారికి) ఇందులో సృష్టివిద్య, ఆత్మవిద్యలకు సంబంధించిన రహస్యాలు లభిస్తాయి. 

మంత్రవేత్తలైన వారికి ఈ లీలాగాధలు మంత్ర సాధనకు సంబంధించిన లెక్కలేనన్ని క్రొత్త కోణాలను ప్రసాదించ గలవు. యోగసాధకులు ఇందులోనుండి యోగం యొక్క వివిధ రహస్యాలను పొంద గలరు. 

సంతానం పట్ల వాత్సల్యం కల్గిన, పరమ దయా మూర్తియైన, అమ్మ యొక్క అభిమానం పిల్లలమైన మాకు లభించినది. 

అందువల్లనే మా చేతుల నుండి 'శ్రీ దుర్గాసప్తశతి యొక్క గాయత్రీమయ వ్యాఖ్య' వెలువడుచున్నది. పిల్లవాడికైతే క్షుధాతృష్ణార్తా జననీం స్మరన్తి అనేది సాధారణ విషయం. 

అంటే పిల్లలకు ఆకలి అయినప్పుడు, దాహం వేసినప్పుడు అమ్మను పిలవాలి అన్న విషయం మాత్రం తెలుసు. ఐతే జ్ఞానమూర్తియైన అమ్మ యొక్క జ్ఞానకోశం అక్షయమైనది. 

దానిలోనుండి ఒక చిన్న అంశం. 'శ్రీ దుర్గాసప్తశతి ఏవిధంగా గాయత్రీ మయమైనది' అనే విషయాన్ని పాఠకులు చదివిన తర్వాత తెలుసుకొనగలరు.


 *శ్రీ మాత్రే నమః*

No comments:

Post a Comment